Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఈడెన్‌లో ఎదురులేని పాక్!

$
0
0

కోల్‌కతా, జనవరి 1: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో గురువారం భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరగనున్న రెండో వన్‌డే మ్యాచ్‌లో గణాంకాలన్నీ కూడా పాక్‌కే అనుకూలంగా ఉండడడంతో ధోనీ సేన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈడెన్ గార్డెన్‌లో ఇప్పటివరకు భారత్‌తో ఇక్కడ ఆడిన మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఒక్కసారి కూడాఓడిపోలేదు. 1987లో తొలిసారిగా ఇక్కడ ఆడినప్పటినుంచి కూడా భారత జట్టుపై పాక్‌దే పైచేయిగా ఉంటోంది. నిజానికి 1997లో జరిన ఇండిపెండెన్స్ కప్ ఫైనల్‌లో మాత్రమే విదేశీ జట్టు అది కూడా శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది.
ఎనిమిదేళ్ల క్రితం రెండు జట్లు చివరి ఆసరిగా ఇక్కడ తలపడ్డాయి.అయితే అప్పటికీ, ఇప్పటికీ రెండు జట్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు జట్లలోను సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లకు స్థానం దక్కింది. అయితే ఇప్పుడు సైతం మిస్బావుల్ హక్ నేతృత్వంలోని పాక్ జట్టు అదృష్టం తమవైపే ఉంటుందని ఆశపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌ని గెలుచుకున్న ఆ జట్టు ఈడెన్ గార్డెన్‌లో కూడా గెలుపొందితే సిరీస్‌ను దక్కించుకుని చాలా ఏళ్ల తర్వాత సొంత గడ్డపైనే భారత్‌ను ఓడించామన్న గర్వంతో స్వదేశానికి తిరుగుప్రయాణం కావచ్చు. కాగా, ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయి చావుదెబ్బ తిన్న ధోనీ సేన అన్ని వైపులనుంచి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో మరో ఓటమిని మూటగట్టుకొంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే.
గత ఏనిమిదేళ్ల కాలంలో భారత్, పాకిస్తాన్‌లు ఈడెన్ గార్డెన్‌లో ఒక్కసారి మాత్రమే పరస్పరం తలపడ్డాయి. 2004 నవంబర్ 13న బిసిసిఐ ప్లాటినం జూబిలీ వేడుకల సందర్భంగా ఈడెన్ గార్డెన్‌లో తలపడిన తర్వాత దాయాది జట్లు మళ్లీ ఇక్కడ ఢీకొంటుండడం ఇదే మొదటిసారి. అప్పటికీ ఇప్పటికీ రెండు జట్లలోను సమూల మార్పులు వచ్చాయి. పాకిస్తాన్ జట్టులో అప్పుడు ఆడిన వారిలో యూనస్ ఖాన్, సలీమ్ మాలిక్, కమ్రాన్ అక్మల్ మాత్రమే ఇప్పుడు కూడా ఆడుతుండగా, భారత జట్టులో వీరేంద్ర సెవాగ్, యువరాజ్ సింగ్ మాత్రమే ఇప్పటికీ జట్టులో కొనసాగుతున్నారు. అయితే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లలో సహజంగా ఉండే ఉత్సాహం, ఉద్వేగాలకు మాత్రం ఇప్పటికీ కొదువ లేదు. ఈడెన్ గార్డెన్‌లో పాక్‌పై భారత జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవకపోయినప్పటికీ ఈ మైదానంలో దాని రికార్డు మాత్రం గొప్పగానే ఉంది. ఈ మైదానంలో భారత జట్టు ఆడిన 16 మ్యాచ్‌లలో పది మ్యాచ్‌లలో గెలుపొందింది. అదొక్కటే భారత్‌కు అనుకూలించే అంశం.
క్రిక్కిరిసి పోనున్న స్టేడియం
కాగా, గురువారం జరిగే మ్యాచ్‌కి స్టేడియం అభిమానులతో క్రిక్కిరిసి పోవడం మాత్రం ఖాయం. ఇప్పటికే మొత్తం టికెట్లన్నీ అమ్ముడు పోయాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఒకప్పుడు లక్ష మందిదాకా ప్రేక్షకులు ఉండే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కెపాసిటీ మరమ్మతుల తర్వాత 66 వేలకు తగ్గిపోయింది.
2011 నవంబర్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరిగిన టెస్టు మ్యాచ్‌లో 86 వేల మంది ప్రేక్షకులు పట్టే స్టేడియంలో పట్టుమని వెయ్యి మంది కూడా ప్రేక్షకులు లేకపోవడంతో అప్పుడు కామెంటేటర్‌గా ఉండిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ గ్రెగ్ ఈడెన్ గార్డెన్‌ను శవాల గది’తో పోల్చాడు. ఆయన చనిపోయిన వారం రోజులకు జరగనున్న మ్యాచ్‌లో స్టేడియం అభిమానులతో కిటకిటలాడుతూ కనిపించి, తనపై పడ్డ మచ్చను తుడిచివేసుకోనుంది.
ఇదిలా ఉండగా, ఈడెన్ గార్డెన్స్ పిచ్ అటు బౌలర్లకు, ఇటు బ్యాట్స్‌మెన్‌కు సమానంగా అనుకూలిస్తుందని పిచ్ క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీ అంటున్నాడు. వన్‌డేలలో సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లే ఉంటాయని అతను అంటున్నాడు. అంతేకాదు తొలుత బ్యాట్ చేసే జట్టుది పైచేయి అయ్యే అవకాశం ఉందని, ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ మంచు కురిసే అవకాశాలున్నాయని కూడా ముఖర్జీ అంటున్నాడు. ఏది ఏమయినా గురువారం మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన టెస్ట్‌మ్యాచ్ సందర్భంగా ధోనీ కోరినట్లుగా స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ను రూపొందించక పోవడం ద్వారా ముఖర్జీ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ధోనీ మాట విననందుకు ముఖర్జీని ఉద్యోగంనుంచి తొలగించాలని బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ను కోరడం కూడా తెలిసిందే. అయితే తాను జీవించి ఉన్నంత కాలం ఈ చరిత్రాత్మక మైదానంతో తన అనుబంధం కొనసాగుతుందని ముఖర్జీ అంటుండడం గమనార్హం.
చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ..
సోమ్‌దేవ్, అమృత్‌రాజ్ శుభారంభం
చెన్నై, జనవరి 1: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన వర్థమాన ఆటగాళ్లు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, ప్రకాష్ అమృత్‌రాజ్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 6-3, 6-3 వరుస సెట్ల తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ హాజెక్‌ను సునాయాసంగా మట్టికరిపించగా, ప్రకాష్ అమృత్‌రాజ్ 6-7, 6-2, 6-3 సెట్ల తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు గుల్యూమ్ రఫిన్‌ను చిత్తు చేశాడు. సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో సెడ్రిక్ మార్సెల్ స్టేబ్ (జర్మనీ), ఐదో సీడ్ ఆటగాడు బెనోయిట్ పైర్ (ఫ్రాన్స్), మథియాస్ బచింగర్ (జర్మనీ), రాబెర్టో బటిస్టా అగ్ట్ (స్పెయిన్) తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మార్సెల్ స్టేబ్ 6-4, 6-4 వరుస సెట్ల తేడాతో ఇగర్ సిజ్లింగ్ (నెదర్లాండ్స్)ను, రాబెర్టో బటిస్టా అగ్ట్ 7-6, 6-2 తేడాతో బ్లాజ్ కావ్సిక్ (స్లొవేనియా)ను, బెనోయిట్ పైర్ 6-3, 6-4 తేడాతో ఫ్లావియా సిపొల్లా (ఇటలీ)ను సునాయాసంగా ఓడించగా, మథియాస్ బచింగర్ 6-4, 3-6, 6-4 సెట్ల తేడాతో చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ ఆటగాడు యెన్ హున్ లుకు షాక్ ఇచ్చాడు.

హాకీ ఇండియా లీగ్..
కీలక మ్యాచ్‌లన్నీ రాంచీలోనే!
న్యూఢిల్లీ/కోల్‌కతా, జనవరి 1: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్ తొలి ఎడిషన్‌లో ఫైనల్, సెమీఫైనల్స్‌తో పాటు మూడు, నాలుగు స్థానాల కోసం నిర్వహించే మ్యాచ్‌లకు రాంచీ ఆతిథ్యమిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌ను ఈ నెల 14వ తేదీ ఫిబ్రవరి 10వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ చివర్లో ఐదు జట్ల మధ్య జరిగే నిర్ణాయక మ్యాచ్‌లన్నీ రాంచీలోని బిర్సా ముండా హాకీ స్టేడియంలోనే జరగవచ్చని హాకీ ఇండియా వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీలో ఫైనల్, రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లను నిర్వహించేందుకు రాంచీని ఎంపిక చేశారని, ఈ మ్యాచ్‌లను సజావుగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని రాంచీ రైనోస్ జట్టు సిఇఓ బంతీ సింగ్ కూడా ధృవీకరించారు. హెచ్‌ఐఎల్‌లో చివరి కీలక మ్యాచ్‌లను రాంచీలో నిర్వహించే విషయమై ఈ టోర్నమెంట్ నిర్వాహకులు జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండాతో ఇప్పటికే చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. ‘హెచ్‌ఐఎల్‌లో ఫైనల్, సెమీఫైనల్స్, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లను రాంచీలో నిర్వహిస్తామని ఈ టోర్నీ నిర్వాహకులు మాకు వౌఖికంగా హామీ ఇచ్చారు. ఈ విషయమై వారు జార్ఖండ్ ముఖ్యమంత్రితో ఇప్పటికే చర్చలు కూడా జరిపారు’ అని బంతీ సింగ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇదే గనుక జరిగితే హాకీ ఇండియా లీగ్ టోర్నమెంట్ తొలి ఎడిషనల్‌లో 10 మ్యాచ్‌లు రాంచీలోనే జరుగతాయి.
టైటిల్ స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్
ఇదిలావుంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థగా పేరు పొందిన ‘హీరో మోటోకార్ప్’ ఈ టోర్నమెంట్‌కు టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు హాకీ ఇండియా లీగ్ నిర్వాహకులు ఆ సంస్థతో బహు వార్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో ఈ టోర్నమెంట్‌ను ‘హీరో హాకీ ఇండియా లీగ్’గా పిలువనున్నారు. హాకీ ఇండియా (హెచ్‌ఐ), హాకీ ఇండియ లీగ్ ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్ర మంగళవారం న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్ టోర్నమెంట్‌కు హీరో మోటోకార్ప్ సంస్థ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుండటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.

బిపిఎల్‌కు పాక్ ఆటగాళ్లు దూరం

కరాచీ, జనవరి 1: భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాకిస్తాన్‌లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఏడాది జరుగనున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌కు తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచబోమని పిసిబి సూచనప్రాయంగా తెలిపింది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపేందుకు ఆ దేశం నిరాకరించడం ఉభయ దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలను దెబ్బతీసిందని పిసిబి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ‘బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2013 ఎడిషన్‌కు మా ఆటగాళ్లను అందుబాటులో ఉంచడానికి ముందు వారి ముందస్తు షెడ్యూళ్లను మేము పరిశీలించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా మా ఆటగాళ్లను బంగ్లాదేశ్ పర్యటనకు అందుబాటులో ఉంచడం సహేతుకం కాబోదు’ అని పిసిబి ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు (బిసిబి) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ చేసిన ప్రకటనపై పిసిబి చైర్మన్ జకా అషఫ్ అంతకుముందు తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘పాకిస్తాన్ పర్యటనకు బంగ్లాదేశ్ ఆటగాళ్లను పంపరాదని ఆ దేశ క్రికెట్ బోర్డు భావించడం వారి సొంత నిర్ణయం. ఉభయ దేశాల క్రికెట్ బోర్డుల ద్వైపాక్షిక సంబంధాలను వారు గౌరవించకపోతే మేము కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తాం’ అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ విషయంలో తాము సూత్రబద్ధమైన వైఖరిని అవలంబిస్తామని, ఏది ఏమైనప్పటికీ ఈ నూతన సంవత్సరం నుంచి సొంత ఏర్పాట్లలో నిమగ్నం కావాలని తాము నిశ్చయించుకున్నందున తమ ఆటగాళ్లు బిపిఎల్ టోర్నీకి అంత సులువుగా అందుబాటులో ఉండకపోవచ్చని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ పర్యటనకు తమ క్రికెట్ జట్టును పంపుతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించి ఆ తర్వాత దానిని విరమించుకోవడం గత తొమ్మిది నెలల్లో ఇది రెండోసారి. భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ క్రికెటర్లను పాకిస్తాన్ పర్యటనకు పపంవద్దని ఢాకా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కారణంగా చూపుతూ బిసిబి గత ఏప్రిల్‌లో ఒకసారి పాక్ పర్యటనను ఉపసంహరించుకున్న విషయం విదితమే. బంగ్లా క్రికెట్ బోర్డు ఇప్పుడు కూడా ఇదే కారణాన్ని చూపుతూ మరోసారి పాకిస్తాన్‌లో పర్యటించరాదని నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే పాకిస్తాన్‌లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉంటుందని బిసిబి చీఫ్ నజ్ముల్ హసన్ పేర్కొనడం సముచితంగా లేదని పిసిబి పేర్కొంది. ‘పాకిస్తాన్‌లో పర్యటించాలా? వద్దా? అనేది పూర్తిగా వారి విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులను సాకుగా చూపి మా దేశంలో పర్యటించేందుకు నిరాకరిస్తున్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్పడం ఎంతమాత్ర సమంజసంగా లేదు. పైగా బిసిబి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక బృందం పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులను పరిశీలించి సంతృప్తితో స్వదేశానికి వెళ్లిన తర్వాత కూడా బిసిబి ఇలాంటి ప్రకటనలు చేయడం సబబుగా లేదు’ అని పిసిబి ఆ ప్రకటనలో విమర్శించింది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు బంగార్ గుడ్‌బై
కోల్‌కతా, జనవరి 1: భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, రైల్వేస్ జట్టు కెప్టెన్ సంజయ్ బంగార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. రంజీ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా జెయు (సాల్ట్ లేక్) గ్రౌండ్‌లో బెంగాల్ జట్టుతో జరిగిన చివరి గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో రైల్వేస్ జట్టుకు 122 పరుగుల తేడాతో విజయాన్ని అందించిన అనంతరం బంగార్ మంగళవారం నాడు ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. రంజీ ట్రోఫీ సిరీస్‌లో రైల్వేస్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంటుందని భావించానని, అయితే అలా జరగకపోవడంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని బంగార్ తెలిపాడు. భారత్ తరపున 12 టెస్టుల్లో ఆడి 470 పరుగులు, మరో 7 వికెట్లు సాధించిన బంగార్ 15 అంతర్జాతీయ వనే్డల్లోనూ ఆడి జింబాబ్వేపై ఒక సెంచరీ నమోదు చేశాడు. అయితే 2002లో ఇంగ్లాండ్ జట్టుతో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో బంగార్ సాధించిన 68 పరుగుల స్కోరు చిరస్మరణీయమైనదిగా నిలిచింది.

గణాంకాలు దాయాదులకే అనుకూలం
english title: 
e

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>