హైదరాబాద్, జనవరి 1: పోలీసు వ్యవస్థ ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పోలీసు క్రీడల విభాగం అదనపు డిజి రాజీవ్ త్రివేదీ చేపట్టిన ‘పోలీసు ట్రయథ్లాన్’ విజయవంతంగా ముగిసింది. దీనికి నేతృత్వం వహించిన త్రివేదీ బృందాన్ని పోలీసు అధికారులు అభినందనలతో ముంచెత్తారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్ల మెస్‌లో మంగళవారం అభినందన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైన పోలీసు ట్రయథ్లాన్ డిసెంబర్ 31 నాటికి మాసబ్‌ట్యాంక్‌కు చేరుకోవడం ద్వారా విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రివేదీ మాట్లాడుతూ భారత దేశంలో పోలీసు వ్యవస్థ ఏర్పాటై 150 ఏళ్లయిన సందర్భంగా తోటి సిబ్బందిలో క్రీడాస్ఫూర్తిని నింపడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రకమైన కార్యక్రమాలు ఎంత దోహదపడతాయే వివరించేందుకు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందుకు జిల్లాల్లో సహకరించిన సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులకు త్రివేదీ కృతజ్ఞతలు తెలిపారు. తన వెంట ఈ కార్యక్రమంలో పాల్గొని సైక్లింగ్‌ను విజయవంతం చేసిన వారిని కూడా అభినందించారు. ముఖ్యంగా డిజిపి వి.దినేశ్‌రెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ట్రయథ్లాన్‌లో పాల్గొన్న వారికి ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. పోలీసు ఆఫీసర్ల మెస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పిఅండ్‌ఎల్ అదనపు డిజి విఎస్‌కె కౌముది, అదనపు డిజి సంతోష్ మెహ్రా, పలువురు కింది స్థాయి అధికారులు హాజరయ్యారు.
త్రివేదీని అభినందిస్తున్న పోలీసు అధికారులు
బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్..
రెండో రౌండ్‌లోనే క్విటోవా ఔట్
క్వార్టర్స్‌కు సెరెనా.. వైదొలిగిన షరపోవా
బ్రిస్బేన్, జనవరి 1: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్‌తో పాటు అన్ సీడెడ్ క్రీడాకారిణులు అనస్తాసియా పవ్‌లుచెంకోవా (రష్యా), కజకిస్థాన్‌కు చెందిన మరో అన్ సీడెడ్ క్రీడాకారిణి సెనియా పెర్వక్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఆరో సీడ్ పెట్రా క్విటోవా అనూహ్య ఓటమితో ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పవ్‌లుచెంకోవా 6-4, 7-5 వరుస సెట్ల తేడాతో క్విటోవాను మట్టికరిపించగా, ఈ టోర్నమెంట్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ 6-2, 6-2 వరుస సెట్ల తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి అలీజ్ కార్నెట్‌పై సునాయాసంగా విజయం సాధించింది. అలాగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో సెనియా పెర్వక్ 3-6, 6-2, 7-6 తేడాతో మరో అన్ సీడెడ్ క్రీడాకారిణి ఉర్సులా రద్వాన్‌స్కా (పోలెండ్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.ఇదిలావుంటే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న రష్యా అందాల భామ మరియా షరపోవా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మెడ ఎముకకు తగిలిన గాయం వేధిస్తుండటంతో ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించింది.
మెల్జెర్ శుభారంభం
కాగా, ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రియాకు చెందిన ఏడో సీడ్ ఆటగాడు జుర్గెన్ మెల్జెర్, అన్ సీడెడ్ ఆటగాళ్లు గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), డేవిడ్ గోఫిన్ (బెల్జియం), లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లలో మెల్జెర్ 2-6, 6-4, 6-4 తేడాతో అమెరికాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు డెనిస్ కుద్లాను ఓడించగా, దిమిత్రోవ్ 6-3, 7-6 వరుస సెట్ల తేడాతో అమెరికాకు చెందిన మరో అన్ సీడెడ్ ఆటగాడు బ్రియాన్ బాకర్‌ను చిత్తు చేశాడు. అలాగే డేవిడ్ గోఫిన్ 6-2, 6-2 వరుస సెట్ల తేడాతో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై సునాయసంగా విజయం సాధించగా, లీటన్ హెవిట్ 6-3, 4-6, 6-2 సెట్ల తేడాతో ఇగర్ కునిత్సిన్ (రష్యా)పై చెమటోడ్చి గెలిచాడు.
పవ్‌లుచెంకోవా చేతిలో
చిత్తయన పెట్రా క్విటోవా
డేవిస్ కప్ బరిలో దిగుతా : భూపతి
చెన్నై, జనవరి 1: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా ఫిబ్రవరిలో కొరియాతో జరుగనున్న పోరులో భారత్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు అందుబాటులో ఉంటానని సీనియర్ ఆటగాడు మహేష్ భూపతి ప్రకటించాడు. గత ఏడాది లండన్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో స్టార్ ఆటగాడు లియాండర్ పేస్‌తో కలసి ఆడేందుకు నిరాకరించిన మహేష్ భూపతి, రోహన్ బొపన్నలను అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) జాతీయ జట్టు నుంచి నిషేధించిన విషయం విదితమే. అయితే ఎఐటిఎతో తలెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించుకున్నానని, డేవిస్ కప్‌లో కొరియాతో జరిగే పోరులో భారత్ తరఫున బరిలోకి దిగేందుకు అందుబాటులో ఉంటానని భూపతి తెలిపాడు.