నల్లగొండ టౌన్, జనవరి 2: ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నిమాథ్యూ ఆయా జిల్లా కలెక్టర్‌లను సంబంధిత అధికారులను కోరారు. బుధవారం సాధరణ పరిపాలన భవనం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా గర్భిణి స్ర్తిలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో రూపొందించారని తెలిపారు. పథకం అమలుకు గ్రామ కమిటీల ద్వారా గర్భిణి స్ర్తిలకు నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని సూచించారు. పథకానికి సంబందించి వివిధ కమిటీలను సత్వరమే నియమించాలని ఆదేశించారు. భోననానికి అయ్యే ఖర్చు సరుకుల ధరలను జిల్లా స్థాయి కమిటీల ద్వారా నిర్దారించాలన్నారు. ఈ పథకం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గించడానికి అవకాశం ఉండడంతో పథకంపై విస్తృతంగా ప్రచారం సాగించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సాధరణ పరిపాలన భవనం నుండి స్ర్తి శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని, రాజశేఖర్‌లు పాల్గొన్నారు. జిల్లా నుండి కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు, జెసి హరిజవహర్‌లాల్, ఎ జెసి నీలకంఠం, డి ఆర్ డి ఎ పిడి రాజేశ్వర్‌రెడ్డి, ఐసిడి ఎస్ పిడి ఉమాదేవి, అధికారులు పద్మనాభరెడ్డి, ఆమోస్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోరైటప్ 2నాల్ 9జెపిజి: వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి మిన్నిమాథ్యూ, పాల్గొన్న కలెక్టర్.
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
* జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ టౌన్, జనవరి 2: భూసార పరీక్షల ఆధారంగా రైతులు సేంద్రీయ రసాయనిక ఎరువులను వాడి ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. బుధవారం పట్టణంలోని రత్న ఫంక్షన్‌హల్‌లో కోరమాండల్ ఫర్టిలేజర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవాలలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూసార పరీక్షలు జిల్లాలోని అన్ని గ్రామాలలో నిర్వహించాలని సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి భూగర్భ జల వనరుల, భూసారంపై కరపత్రాలను తీసుకురావాలని సూచించారు. అనంతరం కోరమాండల్ ఆధ్వర్యంలో రైతులు గెలుచుకున్న వాహనాలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ జె ఎం సుబ్బారెడ్డి, ప్రతినిధులు కార్తికేయ, శివారెడ్డి, వ్యవసాయ శాఖ ఎడి ఎ సిద్దిక్, లక్ష్మినారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
2నాల్ 16జెపిజి: రైతులకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు.
టిఆర్‌ఎస్ ఉద్యమ షెడ్యూల్ ప్రకటించిన బండా
నల్లగొండ టౌన్, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నట్లు టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28వరకు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉద్యమ షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈనెల 4న జిల్లాలోని నియోజకవర్గాలలో వెయ్యిమోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించి, ప్రజలకు తెలంగాణ వ్యతిరేకుల వైఖరిని వెల్లడించాలని, 9న మండల కేంద్రాలలో కాగడాల ప్రదర్శనలు, 17న నియోజకవర్గంలో 5వేల మందికి తగ్గకుండా ఒకరోజు దీక్షలు, 23న జిల్లా కేంద్రంలో కవాత్తు, కలెక్టరేట్ వరకు ర్యాలీ, 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాలని కోరారు. 30న మహాబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో జరిగే బహిరంగసభకు వేలాదిమంది తెలంగాణవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎస్సీ సెల్, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షులు రేకల భద్రాద్రి, ఫరీదొద్దీన్, మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యరెడ్డి, నాయకులు అభిమన్యు శ్రీనివాస్, గుంటోజు వెంకటాచారి, పున్న గణేష్, కట్టశ్రీను, రవినాయక్, సురేందర్, బక్క పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై ఉత్తమ్ వైఖరి వెల్లడించాలి
తెలంగాణ ఏర్పాటుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో 610 జీవో చైర్మన్‌గా ఉన్నప్పటికి ఏమిచేయలేదని బండా నరేందర్‌రెడ్డి అన్నారు. ఉత్తమ్ పార్టీకి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నడని రాజీనామా చేయకుంటే తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోతారన్నారు. గుత్తా, కోమటిరెడ్డి, మంత్రులు జానా, ఉత్తమ్‌లతోపాటు ప్రజాప్రతినిధులకు ప్రజలు గుణపాఠం చేప్తారన్నారు. ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును వెల్లడించకపోతే జెఎసి ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు.
విద్యార్థి, ప్రజాపోరాటాలతోనే తెలంగాణ సాధ్యం
* టివివి జిల్లా మహాసభల్లో వేదకుమార్
నల్లగొండ టౌన్, జనవరి 2: విద్యార్థి, ప్రజాపోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని కమిటీలతో, అఖిలపక్షాలతో రాష్ట్రం ఏర్పాటుకాదని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వేదకుమార్ స్పష్టంచేశారు. బుధవారం నాగార్జున కళాశాలలో నిర్వహించిన తెలంగాణ విద్యార్థి వేదిక (టివివి) జిల్లా ప్రథమ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీ కృష్ణకమిటీ ఎనిమిదవ అధ్యయంలో తెలంగాణ ఉద్యమం అణిచి వేయడానికి, అనేకమంది విద్యార్థులపై అక్రమకేసులు పెట్టి భయాందోళలనలకు గురిచేసిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నిన రాష్ట్రం సాధించే వరకు ఉద్యమం ఆగదన్నారు. ప్రముఖ ఉస్మానియా ప్రోఫెసర్ డాక్టర్ ఖాసీం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే ముందుండి పోరాటాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ ఉద్యమాలలో తెలంగాణ విద్యార్థుల పాత్ర చాలా గొప్పదన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సీమాంధ్ర పాలకులకు కనువిప్పు కలుగడం లేదన్నారు. తెలంగాణలోని భాషా, సంస్కృతిని అనుగతొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాల చరిత్రను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా జె ఎసి చైర్మన్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుండి కాంగ్రెస్, టిడిపిలు మోసం చేస్తున్నాయన్నారు. సమైక్యవాద పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. టివివి రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు మెంచు రమేష్, డి.విజయ్‌లు మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రైవేటీ కరణ, కార్పోరేటీకరణ చేస్తూ ప్రభుత్వాలు పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కళాకారుల ఆటా - పాటలు ఆకట్టుకున్నాయి. మహాసభల ప్రారంభానికి ముందు పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి ఎన్‌జి కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టివివి జిల్లా అధ్యక్షుడు వేముల అనుదీప్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలలో తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్టక్రార్యదర్శి నల్లమాస కృష్ణ, టివివి జిల్లా కార్యదర్శి నూకల మహేష్, ప్రజానాట్య మండలి రాష్టక్రార్యదర్శి కోటి, రాజనర్సు, తెలంగాణ లాయర్స్ ఫోరం జిల్లాఅధ్యక్షుడు ఎన్.్భమార్జున్‌రెడ్డి, ఎన్‌జి కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్‌రెడ్డి, అధ్యాపకులు కట్ట్భాగవంతరెడ్డి, కేశవరెడ్డి, టఫ్ నాయకులు అనంతరెడ్డి, ఉపేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్యాకేజీలతో సరిపెట్టేందుకు సీమాంధ్రుల కుట్ర
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి ధ్వజం
చౌటుప్పల్, జనవరి 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోని ప్యాకేజీలతో సరిపెట్టేందుకు సీమాంధ్ర నేతలు అధిష్ఠానంపై వత్తిడి తెస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యాకేజీలతో తెలంగాణకు ఒరిగేది ఏమిలేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం అధిష్ఠానంపై వత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 4న హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్యులు పాల్గొంటారన్నారు. సమావేశంలో తెలంగాణ ఏర్పాటు కోసం అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహన్ని రూపొందించడం జరుగుతుందన్నారు. పోలవరం నిర్మిస్తే మూడు వందల గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతాయని నాలుగేళ్ల కిందట హైకోర్టులో కేసు వేస్తే నిర్మించవద్దని తీర్పు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోమటిరెడ్డి విమర్శించడం సరికాదన్నారు. వైయస్‌ఆర్, టిఆర్‌ఎస్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్‌ను విమర్శించే అర్హతలేదన్నారు. తెలంగాణ ద్రోహులా, తెలంగాణ ద్రోహులా కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుగా తేల్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తాటి రామచంద్రం, గుండు మల్లయ్యగౌడ్, పాశం సంజయ్‌బాబు, ముప్పిడి సైదులుగౌడ్, చింతల దామోదర్‌రెడప్డి, జె.కె.దశరథ, రాములు, పెద్దగోని రమేష్, బి.పి.రాములు, నల్ల నరేందర్‌రెడ్డి, శామకూర రాజయ్య, మల్కాపురం నరసింహా తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందిండచమే ధ్యేయం
* గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్
మేళ్లచెర్వు, జనవరి 2: నియోజకవర్గంలోని ప్రతిఎకరాకు సాగునీరు అందించడమే తన ధ్యేయమని గృహనిర్మాణ శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటీవల మంజూరుచేసిన ఎత్తిపోతల పథకాల వివరాలు తెలిపారు. పవర్ పాయింట్ ద్వారా ఎత్తిపోతల కింద లబ్ధిపొందే గ్రామాలు, ఎకరాలు, ప్రతి ఎకరానికి ప్రభుత్వం చేసే వ్యయం తదితర విషయాలపై ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు రూ.147కోట్లతో మండలంలోని రేవూరు, బుగ్గమాధవరం, చింతలపాలెం, మఠంపల్లి మండలం నుండి అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు మంజూరయ్యాయని టెండర్ల ప్రక్రియ కూడా జరిగిందని 17నెలల వ్యవదిలో ఎత్తిపోతలు పూర్తిచేస్తామని చెప్పారు. రేవూరు ఎత్తిపోతల పథకం కింద రేవూరు, మేళ్లచెర్వు గ్రామాలకు చెందిన 3690 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని ఈ ఎత్తిపోతలకు రూ.35.64 కోట్లు మంజూరయ్యాయన్నారు. బుగ్గమాధవరం ఎత్తిపోతల కింద చింతలపాలెం, మేళ్లచెర్వు, గుడిమల్కాపురం, దొండపాడు గ్రామాలకు చెందిన 4,900 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఈ ఎత్తిపోతలకు రూ.31.97కోట్లు మంజూరీ అయ్యాయని మంత్రి తెలిపారు. అదేవిధంగా చింతలపాలెం ఎత్తిపోతల కింద చింతలపాలెం, వేపల మాధవరం, రఘునాధపాలెం, తమ్మారం గ్రామాలకు చెందిన 4,800 ఎకరాలకు సాగునీరు అందుతుందని రూ.31.32కోట్లు మంజూరీ అయ్యాయని, అమరవరం ఎత్తిపోతల పతకానికి అమరవరం, అల్లిపురం గ్రామాలకు చెందిన 4,910 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని దీనికిగాను రూ.48.17కోట్లు మంజూరీ అయ్యాయని చెప్పారు. నియోజకవర్గంలోని నాలుగు ఎత్తిపోతల పతకాలకు రూ.147కోట్లు ఖర్చుచేస్తున్నామని వీటి ద్వారా మొత్తం 18,300 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు లభిస్తుందని 11,170 రైతు కుటుంబాలు సాగునీరు ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటాయని ఈ భగీరధ ప్రక్రియ తనకు ఆత్మతృప్తినిచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున మైనర్ ఇరిగేషన్ కార్యక్రమాలు చేపట్టడం ఇదే ప్రధమమన్నారు. అనంతరం దొండపాడు ఎత్తిపోతల పతకాన్ని సందర్శించి పనితీరును పరిశీలించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పథకాలకు 1.5టిఎంసి నీటిని ప్రెషర్ మెయిన్‌లైన్‌ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐడిసి అధికారులు, కాంగ్రెస్ నాయకులు వేములూరి రంగాచారి, మదీన్, రైతులు పాల్గొన్నారు.
మంత్రి పదవి నా బిక్షనే..
ఇసుక మాఫియా..క్లబ్బుల దందాలో ఉత్తమ్‌కు వాటా
చిరంజీవి అవినీతి చరిత్రను బయటపెడతా
కేంద్ర నిర్ణయానికి కట్టుబడకపోతే తరిమికొడతాం
ఇరిగేషన్ అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతా
చిరు..ఉత్తమ్‌ల విమర్శలపై కోమటిరెడ్డి కౌంటర్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జనవరి 2: హుజూర్‌నగర్ బహిరంగ సభలో కేంద్రమంత్రి చిరంజీవి, రాష్టమ్రంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు తనపై చేసిన విమర్శలపై నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థుల బలిదానాలు చూసి చలించి సకలజనుల సమ్మెకు మద్ధతుగా తాను మంత్రి పదవిని త్యజించడంతోనే ఉత్తమ్‌కు మంత్రి పదవి వచ్చిందని మూమ్మాటికి ఉత్తమ్ మంత్రి పదవి తన భిక్షేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవికి రాజీనామాచేస్తే తెలంగాణవాదాన్ని తాకట్టుపెట్టుకుని సోనియా, కిరణ్‌ల చుట్టు తిరిగి మంత్రి పదవిని తెచ్చుకున్న ఉత్తమ్ తెలంగాణ ద్రోహియేనన్నారు. మిలటరీ అధికారినంటు క్రమశిక్షణాబద్దుడినంటునే బహిరంగ సభలో ఉత్తమ్ సంస్కార రహితంగా తనను విమర్శించడం ఆయన మతిభ్రమణకు నిదర్శనమన్నారు. తాను రాజకీయాలకు రాకముందే తన సోదరుడు కాంట్రాక్టర్‌గా ఉన్నాడని, తాను ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉత్తమ్ కంటే ముందుగానే మంత్రినయ్యానన్నారు. ఉత్తమ్ ఆరోపించినట్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తమ కాంట్రాక్టు కంపెనీ ఎలాంటి అవినీతి చేయలేదని, దీనిపై మా నిజాయితీని నిరూపించుకునేందుకు చంద్రబాబు హాయం నుండి నేటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, పనులపై సిబిఐ విచారణ కోరుతు సిఎంను గురువారం కలుస్తానన్నారు. విచారణకు సిఎం ఆదేశించకపోతే ఢిల్లీలో సిబిఐ డైరక్టర్‌ను కలుస్తానని లేదంటే హైకోర్టు ద్వారా ప్రయత్నిస్తానన్నారు. తనను అవినీతి పరుడినంటు విమర్శించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఇసుక మాఫియాను నడుపుతూ, క్లబ్బుల నిర్వహణలో లక్షల వాటాలు పొందుతున్నాడన్నారు. నార్కట్‌పల్లిలో పవర్ ప్రాజెక్టుపెట్టి యూనిట్ 17రూపాయలకు విక్రయిస్తున్నాడని, 10ఏళ్ల కింద దివాళలో ఉన్న పొటాన్ కంపెనీ ఇప్పుడు లాభాల్లోకి ఏలా వచ్చిందని కోమటిరెడ్డి నిలదీశారు. ఉత్తమ్ తనపై చేసిన విమర్శలతో ఏకీభవిస్తున్నానన్న చిరంజీవి అవినీతి చరిత్ర త్వరలోనే బయటపెడతానన్నారు. పిఆర్పీ అధ్యక్షుడిగా టికెట్లు అమ్ముకుని, కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనంచేసి భవానీ ద్వీపాన్ని, కేంద్రమంత్రి పదవిని పొందిన చిరంజీవి తెలంగాణ కోసం పదవీని తృణప్రాయంగా వదిలేసిన తనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి డిసెంబర్ 9పిదప సమైక్యవాదం వినిపించాడని, ఇప్పుడు కూడా కేంద్ర నిర్ణయానికి కట్టుబడుతానంటునే మంత్రి గంటా శ్రీనివాస్‌తో రాజీనామా ప్రకటన చేయించి దొంగడైలాగ్‌లు చెబుతు రాజకీయాల్లో విలన్‌లా జీవిస్తున్నాడన్నారు. నెలాఖారులో కాంగ్రెస్ ఒకవేళ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసినట్లయితే చిరంజీవి వ్యతిరేకంగా మాటామారిస్తే లక్షలాదిమంది తెలంగాణవాదులతో హైద్రాబాద్‌లో ఆయన ఇంటిని ముట్టడించి చెన్నై తరిమికొడతామని హెచ్చరికలు చేశాడు. ఉత్తమ్‌కు దమ్ముంటే జిల్లా కేంద్రానికి వస్తే తెలంగాణవాదుల సత్తా ఏమిటో చూపుతారన్నారు. అప్పుడప్పుడు తెలంగాణ అంటున్న జిల్లా మంత్రి జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, కెకెలు నెలాఖరులోగా కేంద్రం తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ను వీడి ఉద్యమం సాగించాలని లేనిపక్షంలో ఎవరిని కూడా భవిష్యత్‌లో ప్రజలు తెలంగాణలో తిరుగనివ్వరన్నారు. జిల్లాలో తనకు రాజకీయ శత్రువులుగా వ్యవహరిస్తున్న ఉత్తమ్, దామోదర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, జానారెడ్డిలంతా ఏకమయ్యారని జిల్లా ప్రజలు, తెలంగాణవాదుల అండతో వారిని ధీటుగా ఎదుర్కోంటానన్నారు. హుజూర్‌నగర్, కోదాడలలో ఎక్కడా కూడా ఉత్తమ్ గెలువలేడని ఆయన సవాల్ విసిరారు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని, అంత మాత్రాన తాను జగన్ పార్టీలో చేరుతానంటు ఉత్తమ్ విమర్శించంలో సత్యదూరమన్నారు. నెలఖారులోగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కొండా లక్ష్మణ్ తరహాలో పదవులన్ని వదిలి తెలంగాణ సాధనకు టిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తానన్నారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఉత్తమ్, చిరంజీవిలపై విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తన ఒత్తిడితోనే సాధ్యమైందని చిరంజీవి వాఖ్యలు హాస్యాస్పదమని కేవలం డిప్యూటీ సిఎం చొరవ, సిఎం సహకారంతోనే చట్టబద్ధత దక్కిందని ఇందులో సోనియా, చిరంజీవిల ఘనత ఏమిలేదన్నారు.
కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
ముదిరిన ఉత్తమ్..కోమటిరెడ్డిల విమర్శల యుద్ధం
పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనాలు
రోడ్డున పడ్డ ఇరువర్గాలు
ఫలించని బొత్స శాంతి మంత్రం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జనవరి 2: జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య ఇంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న వర్గపోరు తాజాగా వారి మధ్య సాగుతున్న పరస్పర విమర్శల యుద్ధంతో వీధిన పడింది. నువ్వే అవినీతి పరుడంటే.. కాదు నువ్వే అంటు.. నీ తెలంగాణవాదమే బోగస్ అంటే కాదు నీదే అంటూ ఉత్తమ్, కోమటిరెడ్డిలు కొనసాగిస్తున్న మాటల యుద్ధం అసలే తెలంగాణ సమస్యతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను మరింత డామేజ్ చేసే దిశగా సాగుతుంది. ఇరువురు నేతల మధ్య సాగుతున్న విమర్శల పర్వానికి తెరదించేందుకు స్వయంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి పఠించిన శాంతిమంత్రం ఫలితమివ్వడం లేదు. ఉత్తమ్, కోమటిరెడ్డిలు బహిరంగంగా చేసుకుంటున్న విమర్శలు రాజకీయాల్లో మంచి సాంప్రదాయంకాదన్న బొత్స వారిద్ధరితో మాట్లాడి విమర్శలు ఆపాలంటు కోరుతూ సయోధ్యకై సాగించిన యత్నాలకు రెండు వర్గాల నుండి సానుకూల స్పందన కనిపించలేదు. కోమటిరెడ్డి-ఉత్తమ్‌ల విమర్శల యుద్ధంతో రాజుకున్న వర్గపోరు కుంపటి కార్చిచ్చుగా మారి పార్టీని కమ్మేస్తుండగా ఉత్తమ్ వర్గీయులు కోమటిరెడ్డి దిష్టిబొమ్మను, కోమటిరెడ్డి వర్గీయులు ఉత్తమ్, చిరంజీవిల దిష్టిబొమ్మలను బుధవారం జిల్లాలో పోటాపోటీగా దహనం చేస్తు అంతటా నిరసనలతో వీధిపోరుకు దిగారు. భువనగిరి, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఉత్తమ్ వర్గీయులు కోమటిరెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయగా, భువనగిరి, నల్లగొండలో కోమటిరెడ్డి వర్గీయులు ఉత్తమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల పరస్పర విమర్శల పర్వంతో జిల్లా కాంగ్రెస్ నిట్టనిలువునా చీలినట్లయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వీడే ఆలోచనతోనే కాంగ్రెస్‌లోని తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆపార్టీ వర్గాలు భావిస్తుండగా తమను బలవంతంగా పార్టీ నుండి బయటకు పంపించేందుకు సీనియర్లు కుట్ర చేస్తున్నారంటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో టిఆర్‌ఎస్ ఉత్తమ్‌ను విమర్శిస్తు పరోక్షంగా కోమటిరెడ్డికి మద్దతు పలికిన తీరు త్వరలో ఆయన గులాబీ దండుతో కలువవచ్చన్న సంకేతాలు చాటుతుందంటున్నారు. ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి ఎపిసోడ్‌లో జిల్లా కాంగ్రెస్‌లోని సీనియర్లు పాల్వాయి, జానా, దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌లు ఒకవైపుగా ఏకమైనట్లుగా కనిపిస్తుండగా, ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ వారినే అనుసరించనున్నారు. అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు మరోవర్గంగా మిగిలినట్లుగా తేలిపోతుంది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సీనియర్లనే అనుసరించే అవకాశం లేకపోలేదు. ఎటోచ్చి నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను దూరం చేసుకోలేక ఇటు సీనియర్లతో నడవలేక సతమతమవుతున్నట్లుగా కనిపిస్తుంది. తెలంగాణవాదంతో కూడిన రాజకీయాలు ప్రస్తుతానికి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కొండంత బలంగా ఉన్నా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే మాత్రం వారి రాజకీయాలకు ఇబ్బందికరంగా మారవచ్చు. మొత్తం మీద జిల్లా కాంగ్రెస్‌లో ఉత్తమ్-కోమటిరెడ్డిల మధ్య ఉద్దృతమైన వర్గపోరు మునుముందు మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండగా ఈ పరిణామాల నుండి రాజకీయలబ్ధికై టిడిపి, వైకాపా, టిఆర్‌ఎస్‌లు కాచుకు చూస్తుండటం విశేషం.