నిజామాబాద్ టౌన్, జనవరి 2: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ ప్రాంతంలోని విద్యార్థులంతా పరీక్షలకు దూరంగా ఉండాలని పిడిఎస్‌యు డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద పిడిఎస్‌యు ఆధ్వర్యంలో పిజి సెమిస్టర్ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పిడిఎస్‌యు నాయకులను, విద్యార్థులను చెదరగొట్టేందుకు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల దుశ్చర్యను ఖండిస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిడిఎస్‌యు నగర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించడం అమానుషమన్నారు. విద్యార్థులకు రక్తం వచ్చేలా పిడిగుద్దులు గుద్దడం దారుణమని, దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల పట్ల ఈ విధంగా వ్యవహరించడాన్ని తెలంగాణవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన కోరారు. పోలీసుల నిర్బంధాలతో ప్రభుత్వం ఉద్యమాలను అడ్డుకోలేదని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెలువడే వరకు పరీక్షలు రాసేది లేదని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలను వాయిదా వేయాలని గత మూడు రోజులుగా విసికి విన్నవించిన పరీక్షలను నిర్వహించడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగిఉందన్నారు. ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకు పరీక్షలను నిర్వహిస్తున్న పాలకులు మరోసారి తమ సీమాంధ్ర పాలనను చాటుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం అరెస్టు చేసిన 23 మంది ఉద్యమకారులను ఐదవటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో పిడిఎస్‌యు నాయకులు కల్పన, ప్రశాంత్, రమ, సంగీత, నవీణ, లావణ్య, సంధ్యతో పాటు పిజి విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిఫ్ కోర్టు మంజూరు చేయాలని వినతి
భీమ్‌గల్, జనవరి 2: మారుమూల ప్రాంతమైన భీమ్‌గల్‌కు మున్సిఫ్ కోర్టును మంజూరు చేయించాలని కోరుతూ ప్రభుత్వ విప్, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు బుధవారం యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్ధన్ వినతిపత్రం అందజేశారు. భీమ్‌గల్‌లో మున్సిఫ్ కోర్టు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో భీమ్‌గల్‌కు ప్రభుత్వం మున్సిఫ్ కోర్టును మంజూరు చేసినప్పటికీ, ఇక్కడ కావాల్సిన స్థలం లేకపోవడం వల్ల ఆర్మూర్‌కు తరలించడం జరిగిందన్నారు. అందువల్ల ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా భీమ్‌గల్ మండలానికి మున్సిఫ్ కోర్టును మంజూరు చేయించాలని అనిల్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నట్లు మల్క జనార్ధన్ తెలిపారు.
పేదల అభివృద్ధికే సంక్షేమ పథకాలు
ప్రభుత్వ విప్ అనిల్
భీమ్‌గల్, జనవరి 2: పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ అన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ అమృతహస్తం, మార్పు, నగదు బదిలీ పథకం వంటివి పేదలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి చేరే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. బుధవారం తహశీల్ కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలను చైతన్యపర్చాలని స్థానిక అధికారులకు సూచించారు. అమృతహస్తం, మార్పు పథకాలపై అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ప్రజలను చైతన్యపర్చాలని అన్నారు. భీమ్‌గల్ మండలానికి 2,361 రేషన్‌కార్డులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందని అనిల్ తెలిపారు. అదేవిధంగా భీమ్‌గల్ మండలంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు త్వరలో నిధులను మంజూరు చేయించేందుకు పాటుపడతానని అన్నారు. భీమ్‌గల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చి ఆదర్శ మండలంగా చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవీందర్, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకెట రవి, కాంగ్రెస్ నాయకులు ముసావీర్, శ్రీకాంత్, అశోక్, దత్తు, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో
విద్యార్థుల పాత్ర కీలకం
భద్రతా వారోత్సవాల్లో ఎస్పీ దుగ్గల్
నిజామాబాద్ టౌన్, జనవరి 2: రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా బుధవారం నగర శివారులోని విజయ్ పబ్లిక్ స్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇలాంటి ప్రమాదాల ద్వారా అనేకమంది మృత్యువాత పడుతున్నారని, చాలామంది క్షతగాత్రులవుతున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలలో పెద్ద దిక్కును కోల్పోయి అనేక కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నం అవుతోందన్నారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు కండిషన్‌లో ఉన్నాయా లేవా అనే దానిపై ఎప్పటికప్పుడు స్కూలు యాజమాన్యం పరిశీలించాలని సూచించారు. అదే విధంగా విద్యార్థులు తమవంతు బాధ్యతలో భాగంగా డ్రైవర్లకు, తమ తల్లిదండ్రులకు సురక్షిత డ్రైవింగ్‌పై సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ఇటీవల కాలంలో పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురై విద్యార్థులు అసువులు బాశారని, మరికొందరు క్షతగాత్రులుగా మారి విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రతరం అవుతోందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతుందని, ట్రాఫిక్ అంక్షలు ఉల్లంఘించడం, రాంగ్‌పార్కింగ్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు స్వస్ఛంద కార్యక్రమాల పట్ల తగిన చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా నగరంలో తీవ్రతరం అవుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు విద్యార్థులు, వివిధ వాహనాల డ్రైవర్లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఐక్యమత్యంగా ప్రతి ఒక్కరు తమ సహాయ, సహకారాలు అందిస్తే ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన చిత్రాలను, దృశ్యాలను విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ జహంగీర్, పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల కోసం
నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి
నిజామాబాద్ టౌన్, జనవరి 2: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల అనుమతి కోసం భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కలిసి మెడికల్ కళాశాల గురించి సీరియస్‌గా చర్చించనున్నారు. ఇప్పటికే కళాశాల భవనం మొదటి అంతస్తు నిర్మాణపు పనులు తుదిదశకు చేరుకోవడంతో ఈ ఏడాది తరగతులను ప్రారంభించాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎంసిఐ బృందం మెడికల్ కళాశాలను సందర్శించే విధంగా మంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. మంత్రి సూచన మేరకు జిల్లాను సందర్శించిన ఎంసిఐ బృందం కళాశాల నిర్మాణంపై పలు అంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది మార్చిలో తరగతులు ప్రారంభం అవుతాయనుకున్న ఆశలు నీరుగారిట్లేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మంత్రి సుదర్శన్‌రెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మెడికల్ కళాశాల మొదటి తరగతులను ఈ ఏడాది ప్రారంభించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంసిఐ చైర్మన్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, మంత్రికి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సమయం ఇచ్చారు. దీంతో మంత్రి జిల్లా పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. బుధవారం జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా అన్నింటిని రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. గురువారం ఉదయం అక్కడినుండి ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మంత్రి ఆకస్మిక తనిఖీలు
పారిశుద్ధ్య నిర్వహణాలోపంపై పెదవి విరుపు
మున్సిపల్ కమిషనర్‌పై మండిపాటు
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 2: జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలను బుధవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ఆయా కాలనీల్లో రోడ్డు వసతి అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావుపై ఆగ్రహం ప్రదర్శించారు. గత నెల రోజుల క్రితం తాను నగరంలో పర్యటించిన సందర్భంగా సానిటేషన్‌ను చక్కదిద్దాలని, ప్రజలకు వౌలిక వసతులు కల్పించాలని ఆదేశించినప్పటికీ, ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. తన ఆదేశాల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు. పని చేయడం ఇష్టం లేకపోతే బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలంటూ ఘాటుగానే మందలించారు. కమిషనర్‌తో పాటు మున్సిపల్ ఎఇలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పనితీరును ఆక్షేపించారు. ప్రజారోగ్యం పట్ల అలసత్వ ధోరణితో వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్‌చార్జి కలెక్టర్ కె.హర్షవర్ధన్, అదనపు జెసి శ్రీరాంరెడ్డి, ఇతర మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకుని మంత్రి సుదర్శన్‌రెడ్డి నగరంలోని ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు. సుభాష్‌నగర్, నాందేవ్‌వాడ, దుబ్బ, గంజ్ రోడ్డు, పెద్దబజార్, కోటగల్లి, జెండాగల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేకమంది మురికి కాల్వలను సక్రమంగా శుభ్రపర్చడం లేదని, చెత్తను తరలించడం లేదని, తాగునీటి సరఫరా సైతం అంతంతమాత్రంగానే ఉందని సమస్యలను ఏకరువు పెట్టారు.