నర్సంపేట, జనవరి 2: టిఆర్‌ఎస్ పార్టీ వీధి రౌడీల పార్టీ అని, తెలంగాణ విషయంలో త్వరలోనే దొంగలు ఎవరో, దోషులెవరో తేలిపోతుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభలో ముందు వరుసలో కూర్చున్న తిమ్మంపేటకు చెందిన టిఆర్‌ఎస్వీ కార్యకర్తలు సాగర్, అనీల్, మైసంపల్లికి చెందిన వేముల రఘవీర్, నగేష్ లేచి జైతెలంగాణ అంటూ నినందించారు. ఒక చెప్పును చంద్రబాబు కాన్వాయిపైకి విసరగా అది కాస్తా పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో దేశం కార్యకర్తలు టిఆర్‌ఎస్వీ కార్యకర్తలను చితకబాదారు. వెంటనే పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు టిఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీటింగ్‌లకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వీధి రౌడీల్లా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తాము కనె్నర్ర చేస్తే టిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణపై టిడిపి వైఖరిని ఇటీవల అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా వెల్లడించడంతో టిఆర్‌ఎస్ పునాదులు కదులుతున్నాయని, కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా భవిష్యతులో కూడా మాట్లాడమని చెప్పారు. ఆల్‌పార్టీ మీటింగ్‌లో తెలుగుదేశం వైఖరిని అన్ని పార్టీలు చూసి అభినంధిస్తున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను టిడిపి ఆదుకుంటుందని చంద్రబాబు ఈసందర్భంగా వెల్లడించారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న సందర్భంలో 45 సీట్లు ఇస్తే కనీసం పది సీట్లు కూడా గెలుచుకోలేదంటే వీరి పరిస్థితి ఎంటో ప్రజలంతా గమనించాలన్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం టిఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. భవిష్యత్తులో తమ మీటింగ్‌లకు వచ్చి ఇలా గలాటా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
వెయ్యి లారీల డబ్బును దోచుకున్న జగన్
వైఎస్ అవినీతికి కేంద్ర బిందువు అని, ఆయన తనయుడు వెయ్యి లారీల ప్రజాధనాన్ని లూటి చేశాడని చంద్రబాబు ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలను జగన్ దోచుకున్నాడని, ఆ డబ్బుతో రాష్ట్రంలో కోటి ఇళ్లను నిర్మించవచ్చని, ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలను ఇచ్చి ఆదుకోవచ్చని చెప్పారు. జగన్ జైలు నుండి బయటకు రావాలని కోరుతూ సంతకాలు చేపడుతున్నారంటే రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయాయో గమనించాల్సిందిగా కోరారు. జగన్ ప్రజాధనాన్ని కొల్లగొట్టి జైలు పాలు అయ్యాడని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 500 జనాభా గల తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిసామని, చట్ట సభల్లో బిసిలకు వంద సీట్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వారికి పెద్దన్నగా ఉంటానని చెప్పారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం * కేంద్ర సహాయ మంత్రి బలరాం నాయక్
మహబూబాబాద్, జనవరి 2: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చి తీరుతుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్లు, రూపాయికి కిలోబియ్యం, వికలాంగ, వృద్ధాప్య పెన్షన్లు, దీపం కనెక్షన్లు, ఆరోగ్యశ్రీ, నిరుద్యోగులకు రాజీవ్ యువకిరణాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని అన్నారు. గడిచిన 2008 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు కూడా బ్రేక్ కాలేదని, పేదల కోసమే నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆశీస్సులతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలో ఒక మహోత్తర కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు. తొమ్మిది కోట్లతో 13 తండాలకు మహార్ధత వచ్చిందని అన్నారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలను మన పార్లమెంట్ స్థానానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అలాగే 40కోట్లతో వికలాంగులకు ట్రైసైకిళ్లు త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.7లక్షలతో వినికిడి శక్తి లోపం ఉన్న వారికి మిషన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మండలానికొక హాస్టల్‌ను కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండలానికో బాలుర హాస్టల్, బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయుటకు సిఎంతో మాట్లాడినట్లు తెలిపారు. దీనిపై సిఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇటీవల జరిగిన గ్యాంగ్‌రేప్‌కు గురైన నిర్భయ మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి కామాంధులకు ప్రత్యేకమైన జైళ్లను ఏర్పాటు చేయుటకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గతంలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ఒక ట్రైన్ హాల్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన తరువాత రైల్వేమంత్రితో మాట్లాడి మహబూబాబాద్‌లో మరో రెండు, మూడు ట్రైన్లు హాల్టింగ్ గురించి మాట్లాడనున్నట్లు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలోని ఇల్లందుకు గతంలో నడిచిన ప్యాసింజర్ రైలును నడిపేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కవిత మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 5,128 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. రేషన్‌కార్డు కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. దీపం కనెక్షన్ల మంజూరుకు కృషిచేస్తున్నామని అన్నారు. త్వరలో వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని రూ.150 కోట్లు కావాలని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, సుధాఅర్జున్‌రెడ్డి, ముత్యం వెంకన్న, శశివర్థన్‌రెడ్డి, హారున్, ఇక్బాల్, దండెం వెంకన్న, గిరిధర్‌గుప్తా, మెడికల్‌బాబు, కాట భాస్కర్, నారోజు సత్యమనోరమ పాల్గొన్నారు.
బాబును కలసిన కుటుంబ సభ్యులు
* మోకాలి నొప్పిపై ఆరా
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 2: పాదయాత్ర చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడును ఆయన కుటుంబీకులు బుధవారం వరంగల్ జిల్లాలో కలిశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి వచ్చి బాబు బస చేసిన పరకాల నియోజకవర్గంలోని కామారం గ్రామంలో ఉదయమే కలుసుకున్నారు. బాబు వారితో సుమారు గంటన్నర మాట్లాడారు. వందల కిలోమీటర్ల కొద్ది పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తీవ్రమైన కాలినొప్పితో బాధపడుతూనే గత ఐదురోజులుగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తుస్తుండగా, మంగళవారం నొప్పిని పంటిబిగువున భరిస్తూ చంద్రబాబు పాదయాత్ర చేసిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు ఆయనను కలిశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని వారు సూచించినట్లు సమాచారం. బాబు వెంట ఉన్న పార్టీ జిల్లా నాయకులు ఆయన కుటుంబీకులను కలసి మాట్లాడారు. లోకేష్‌ను కలసి ఆయనతో కరచాలనం చేసేందుకు యువకులు పోటీపడ్డారు.
అధికారంలోకి వచ్చాక తెలంగాణ మృతుల కుటుంబాలకు అండగా ఉంటా
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు * కాంగ్రెస్‌వి హత్యా రాజకీయాలని మండిపాటు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 2: అధికారంలోకి వచ్చాక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణ ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాలో తన ఐదవరోజు మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా బుధవారం దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువకులు ప్రాణత్యాగం చేసుకుని విలువైన జీవితాలను కోల్పోవద్దని, కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిడిపి తెలంగాణపై అనుకూల వాదన వినిపించిన క్షణం నుండి టిఆర్‌ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ఇక్కడి సమస్యలు పట్టవని.. తమ కుటుంబాన్ని ఎలా బాగుచేసుకోవాలో అనే విషయాన్ని కెసిఆర్ ఆలోశిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని పదేపదే చెబుతున్నా టిఆర్‌ఎస్ తమనే నిందిస్తోందని, చివరకు తమ బహిరంగ సభల్లో కూడా అల్లరిచేసేందుకు చూడటం గర్హణీయమని ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్ చిల్లరమల్లర పార్టీ అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతిపై ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఆయనను వెనకేసుకు వస్తూ మరోవైపు టిడిపి నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. మొన్న మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావుపై, ఇప్పుడు పరిటాల రవి కుమారుడు శ్రీరామ్‌పై (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)తప్పుడు నేరాలు మోపుతూ కేసులు నమోదు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు సూట్‌కేసు బాంబు కేసులో వైఎస్ జగన్ ప్రమేయం ఉందని పోలీసులు నిర్థారించినప్పటికీ తాను నిజాయితీగా విచారణ జరిపించానని అన్నారు. అలాగే వరంగల్‌కు చెందిన అప్పటి ఒక కాంగ్రెస్ నాయకుడికి ప్రాణభిక్ష పెట్టాలని నాడు అసెంబ్లీలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోరిన మేరకు తాను ఊరుకుంటే ఆ తరువాత ఆ కాంగ్రెస్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నేత హత్యకు కారకుడయ్యాడని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ హత్యా రాజకీయాలే కొనసాగిస్తోందని, కాంగ్రెస్ ఖబర్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షసపాలన సాగుతోందని, ఈ ప్రభుత్వానికి ముగింపు పలకవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమం మళ్లీ గాడిన పడుతుందని, రైతులు, యువకులు, మహిళలు సహా అన్నివర్గాలకు వారి కుటుంబసభ్యునివలే అండగా ఉంటానని చెప్పారు. ఐదవరోజు చంద్రబాబు పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లోని పెంచికలపేట, దుగ్గొండి, కేశవాపూర్, లక్ష్మిపురం, పొనకల్, నాచినపల్లి, గిర్నిబావి ప్రాంతాలలో 16.5కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
కళాశాల బస్‌ను ఢీకొన్న లారీ
* ఒక విద్యార్థిని, బస్‌డ్రైవర్ దుర్మరణం
* 11మందికి తీవ్రగాయాలు..నలుగురి పరిస్థితి విషమం
ఆంధ్రభూమిబ్యూరో
వరంగల్, జనవరి 2: లారీ కళాశాల బస్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒక డిగ్రీవిద్యార్థినితోపాటు బస్ డ్రైవర్ మృత్యువాత పడ్డ ఘటన వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం మైలారం వద్ద బుధవారం జరిగింది. ఈ దుర్ఘటనలో మరో పదకొండు మంది గాయపడగా..నలుగురి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... భూపాల్‌పల్లి సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో చదువుతున్న పరిసర గ్రామాలకు చెందిన 30 మంది విద్యార్థులు కాలేజి ముగిశాక మినీ బస్సులో ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైలారం వద్ద కొందరు విద్యార్థులు దిగుతుండగా, ఆగివున్న మినీ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొంది. ఆ వేగానికి బస్సు నుజ్జునుజ్జయింది. ప్రమాదంతో అందులో ఉన్న విద్యార్థులంతా తీవ్ర గాయాలపాలు కావడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని హుటాహుటిన పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొందరిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలోనే బస్ డ్రైవర్ అమరేందర్ (30) ప్రాణాలు కోల్పోయాడు. ఎంజిఎంలో చేర్చాక చికిత్సపొందుతూ డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థిని బండి వౌనిక(19) మృతిచెందింది. తీవ్రగాయాలైన మరో నలుగురు విద్యార్థినులు సునిత, ప్రనూష, బొలుగూరి నవత, బండి సంధ్య పరిస్థితి విషమంగా మారింది. మిగతా విద్యార్థులు రాజు, బుదారపు క్రాంతి, నిరోష, తాళ్లపెల్లి రాజేష్, గళ్లపల్లి రాజు, కనితల రాజేశ్వరి, అంజలి కాళ్లు, చేతులు విరిగి, తలకు బలమైన గాయాలతో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టిఆర్‌ఎస్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి విజయరామారావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చందులాల్, టిడిపి భూపాల్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావులు ఎంజిఎం ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందించాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాద ఘటనతో
ఆసపత్రికి తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు
పరకాల టౌన్, జనవరి 2: కళాశాల బస్సును లారీ ఢీ కొట్టడంతో డ్రైవర్‌తో పాటు ఒక విద్యార్థిని మృతి చెందగా మరో 11 మంది విద్యార్థులు తీవ్ర గాయాలు కావడంతో వీరందరిని పరకాల సివిల్ ఆసుపత్రికి తరలిం చగా, విషయం తెలుసుకున్న విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలి వచ్చారు. ఆసుపత్రి సూపరిండెంట్ ఆకుల సంజీవయ్య ఆధ్వర్యంలో డాక్టర్లు రాజేందర్‌రెడ్డి, వెంకటలక్ష్మీ, లలితాదేవి, శ్రీకాంత్, ప్రభుదాస్ విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. తీవ్ర గాయాలైన వారిని 108 ద్వారా కొంత మంది విద్యార్థులను ఎంజిఎంకు తరలించారు. మిగతా వారిని తరలించడానికి వాహనాలు లేకపోవడంతో పరకాల ఎస్సై వెంకట్ ఆసుపత్రికి వచ్చి టాటా ఎసీలను సమకూర్చి అత్యవసర వైద్య సేవల కోసం ఎంజిఎంకి పంపించారు. విషయం తెలుసుకున్న బాగిర్తిపేట, రంగయ్యపల్లి, కోటంచ లింగాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పట్టణ ప్రజలు పరకాల సివిల్ ఆసుపత్రికి తరలివచ్చారు. తమ బిడ్డల దెబ్బలను చూసి తల్లడిల్లారు. వైద్యులను తమ బిడ్డల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.సంఘట స్థలానికి నాన్‌పొలిటికల్ జెఎసి చైర్మన్ సిరికొండ శ్రీనివాసాచారి తరలి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మోటర్ సైకిల్‌ను ఢీకొట్టి...
కాగా బొగ్గు లారీ డ్రైవర్ మొదట చెన్నాపూర్ సమీపంలో మోటర్ సైకిల్‌ను ఢీ కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే అక్కడ ఉన్న వారు డ్రైవర్‌ను పట్టుకొవడానికి లారీ వెనుక వస్తుండగా వారికి అందకుండా లారీ డ్రైవర్ వేగం పెంచాడని ఈ దరిమిలా గణపురం స్టేజీ వద్ద లారీ అదుపు తప్పి ఆగి ఉన్న స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టినట్లు వారు తెలిపారు. లారీ వేగంగా ఉండడంతో స్కూల్ బస్సును కనీసం కొంత దూరం తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు. లారీ వేగంగా వచ్చి కాలేజీ బస్సు ముందు భాగంలో గుద్దడంతో ముందు వరసలో ఉన్న విద్యార్థినులకు గాయాలైనట్లు వారు తెలిపారు. ప్రనిష, సునిత, అనూష, సంద్య, నవతకు తీవ్ర గాయాలైనట్లు వారు తెలిపారు. రాజేష్, సిద్ద కుమార్, కట్ల జగన్, ఆకుల ప్రతాప్, సంతోష్, క్రాంతి, వెంకటేష్, స్వాతి, దివ్య, అశ్విని, మమత, స్వామి, స్రవంతి, కుమారస్వామి, దేవేందర్, రాజయ్య, రాజు, నిరోష, ప్రశాంతి తదితర విద్యార్థులకు గాయాలైనట్లు వారు తెలిపారు. కాగా విద్యార్థిని మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ పరకాల డివిజన్ కార్యదర్శి పసుల వినయ్‌కుమార్ డిమాండ్ చేశారు. చనిపోయిన వారికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్య సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు.
తల్లిదండ్రుల రోదనలతో
మిన్నంటిన ఎంజిఎం
వరంగల్ బల్దియా: భూపాలపల్లి మండలం మైలారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తీసుకురాగా క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగింది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స జరిపి వైద్యులు మెరుగైన వైద్యం కోసం 108 వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాలలో ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి ఆర్‌ఎంఓతోపాటు డిఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు ఎక్కువ సంఖ్యలో వైద్యులు, సిబ్బందిని పిలిపించి వైద్య సేవలు అందించారు. క్షతగాత్రులను ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు.
బిందెలో ఇరుక్కుపోయిన బాలిక తల
* మూడు గంటల పాటు నరకయాతన
నర్సింహులపేట, జనవరి 2: తాత మరణించడంతో కర్మలు చేయడం కోసం తల్లిదండ్రులు వెళ్లడంతో వారితో పాటు వెళ్లిన ఐదు సంవత్సరాల పాప చుక్క స్పందన ఆడుకుంటూ బిందెలో తల ఇరుక్కుపోయిన సంఘటన నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు చుక్క వెంకన్న రామక్క కథనం ప్రకారం.. వెంకన్న తండ్రి చుక్క వీరయ్య మరణించి మూడు రోజులు అవుతుండగా అతనికి కర్మలు చేయడం కోసం ఊరిచివర చెరువు దగ్గరికి బంధువులు, కుటుంబ సభ్యులు వెళ్లారు. వారితో పాటు వెంకన్నరామక్క కర్మలు జరుపుతుండగా కూతురు స్పందన పక్కకు బిందెతో ఆడుకుంటూ బిందెలో తల పెట్టడంతో ఇరుక్కుపోయింది. దీంతో మూడు గంటల పాటు నరకయాతన పడింది. నర్సింహులపేటకు తీసుకురావడంతో అంతలోనే చుంచు లింగయ్య అనే వ్యక్తి వెళుతుండగా గమనించి ద్విచక్ర వాహనంపై స్పందనను వారి తండ్రి వెంకన్నను నర్సింహులపేటకు తీసుకువచ్చి వడ్రంగి వృత్తి చేసేవారు సోమనాథం, అనంతంకు తెలియజేయడంతో వారు బిందెను పగలగొట్టి బయటకి తీశారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు టిడిపితోనే సాధ్యం
* బాబు సిఎం అయితే అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం * ఎర్రబెల్లి
పాలకుర్తి, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే, టి.టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెఎసి టిఆర్‌ఎస్ పార్టీని వదిలి బయటకు వస్తే బాబు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం చేస్తామన్నారు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాసిన మినిట్స్‌ను బయటపెట్టాలని సవాల్ విసిరారు. నెలరోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రకటన చెయ్యకపోతే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై కెసి ఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని నిలదీయాలని డిమాండ్ చేశారు. అధికారులపై దౌర్జన్యాలు చేసిన కెటిఆర్, హరీష్‌రావు, కవితపై కేసు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విమలక్కపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకునే వారు టిడిపికి మద్దతివ్వాలని కోరారు. చంద్రబాబు చేపట్టిన మీకోసం వస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, నాయకులు నెహ్రునాయక్, బీమానాయక్, బాలునాయక్, పద్మ, కొంరయ్య, నాగన్న, అబ్బాస్ అలీ, అశోక్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా నిర్వహించాలి
సహకార ఎన్నికలపై రెవెన్యూ, సహకార, పోలీసు అధికార్లకు కలెక్టర్ వాణీమోహన్ పిలుపు
ఏలూరు, జనవరి 2 : జిల్లాలో సహకార ఎన్నికలు సందర్భంగా ప్రతీ అధికారి పూర్తి అవగాహనతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక డిసిసిబి సమావేశ మందిరంలో బుధవారం సహకార ఎన్నికల ఏర్పాట్లపై రెవిన్యూ, సహకార, పోలీసు అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సహకార ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ఎన్నికల అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఏదైనా సమాచారం ఎవరైనా అడిగితే నాకు తెలియదు అనే సమాధానం రాకూడదని అవసరమైతే క్షుణ్ణంగా తెలుసుకుని వ్యవహరించాలే తప్ప నిర్లక్ష్య వైఖరిని సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో 254 ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీలకు వచ్చే ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 4వ తేదీల్లో నిర్వహించే ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణపై వచ్చే నెలలో డివిజనల్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల రోజు 144 సెక్షన్ అమలు చేయాలని అవసరం అయితే ఆయా రూట్లలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. తప్పులు లేని విధంగా ఓటర్ల జాబితాలను రూపొందించుకోవాలన్నారు. సహకార ఎన్నికల్లో పోటీ చేసే ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు నామినేషన్ పత్రాలకు వంద రూపాయలు చొప్పున, బిసి అభ్యర్ధులు 200 రూపాయలు, ఇతర కులస్థులు 400 రూపాయలు నామినేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుందన్నారు. జనవరి 4వ తేదీ నాటికి సభ్యుల జాబితాను అందజేయవలసి వుంటుందని చెప్పారు. జనవరి 8వ తేదీన ఓటర్ల జాబితా స్క్రూట్నీ, పరిశీలనా కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి పరిశీలించాలన్నారు. జనవరి 21వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవలసి వుంటుందన్నారు. మొదటి దశలో ఎన్నికలు నిర్వహించే సొసైటీలకు జనవరి 24న నామినేషన్ స్వీకరించి, 25వ తేదీన పరిశీలన చేయాలన్నారు. 26వ తేదీ 5 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పారు. జనవరి 31వ తేదీన సంబంధిత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా రెండవ విడతలో ఎన్నికల నిర్వాహణకు జనవరి 28న నామినేషన్లు స్వీకరించి, 29న పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు నిర్వహించబడతాయన్నారు. డి ఆర్‌వో ఎం మోహనరాజు మాట్లాడుతూ సహకార సొసైటీల ఎన్నికల నిర్వహణలో జాగురూకతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహన్, ఆర్‌డివో కె నాగేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్ట్రారు రవికుమార్ తదితరులతో పాటు పలువురు తహశీల్దార్లు, సహకార శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
రసాభాసగా చిన్నారిచూపు
భీమడోలు, జనవరి 2 : భీమడోలు మండల వనరుల కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన చిన్నారి చూపు రెండవ విడత వైద్య పరీక్షలు రసాభాసగా మారాయి. అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో అభ్యర్ధులు ఇబ్బందులకు గురయ్యారు. వివిధ సర్వేల అనంతరం మండలంలో 1,043 మందికి నేత్ర సంబంధిత లోపాలు ఉన్నట్లుగా గుర్తించబడి పరీక్షలకు ఎంపికయ్యారు. మొదటి విడత పరీక్షలు జరిగిన సమయంలో రాజీవ్ విద్యా మిషన్ పిఒ రామ్మోహనరావు సందర్శించి ఏర్పాట్లపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండవ విడత బుధవారం జరిగినప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన 800 మందికి తగు ఏర్పాట్లు లేకపోవడంతో పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమం వద్ద తొక్కిసలాట జరిగింది. భోజనం కూపన్ల జారీ విషయంలో కూడా తొక్కిసలాట జరిగింది. భోజనం పెట్టే సమయం ఒంటి గంట దాటినప్పటికీ ఇంకా పేర్లు నమోదు చేసుకునే అవకాశం లేక కొందరు అభ్యర్ధులు వెనుతిరిగి వెళ్లారు. అభ్యర్ధులతోపాటు వారికి సహాయకులుగా వచ్చిన వారికి కూడా భోజనం ఏర్పాట్లు చేయాల్సి ఉండగా తక్కువ మందికి ఏర్పాటు చేయడంతో అభ్యర్ధులు వారితో వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు పేర్లు నమోదు కార్యక్రమం, భోజనం పూర్తయిందనిపించారు.
చిల్లర కష్టాలు
చిన్నారి చూపు రెండవ విడత కార్యక్రమానికి వచ్చిన విద్యార్ధులకు దారిఖర్చులుగా ఒక్కొక్కరికి 50 రూపాయలు ఇవ్వాల్సి వుంది. ఈ మేరకు ముందస్తుగా కార్యక్రమ నిర్వాహకులైన విద్యాశాఖ సిబ్బంది చిల్లర ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుంది. అయితే విద్యార్ధులకు 50 రూపాయలు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి తిరిగి చిల్లర ఇవ్వాలంటూ కోరడంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. విద్యార్ధులే చిల్లర కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.
వైభవంగా దీపోత్సవం
భీమవరం, జనవరి 2: ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా స్థానిక జెపి రోడ్డులో వేంచేసియున్న శ్రీపద్మావతీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు, దాతల సహకారంతో సుమారు 10వేల దీపాలతో బుధవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి సహస్రనామార్చన, ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారిని, అమ్మవార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇఒ ఆర్ గంగాశ్రీదేవి, చైర్మన్ మంతెన రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి జెసిల కాన్ఫరెన్స్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 2 : రాజధానిలో గురు, శుక్రవారాల్లో జాయింట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు బుధవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా కొత్త రేషన్ విధానంపై ఈ చర్చ జరగనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ బోగస్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బోగస్ కార్డులు వెలుగు చూసాయి. వీటిని ఇప్పటికే ఆయా జిల్లాల స్థాయిలో ఉన్నతాధికారులు రద్దు చేశారు. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కొన్ని జిల్లాల్లో బోగస్ రేషన్‌కార్డులు బయటపడలేదు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల బోగస్ కార్డులను వెలికితీయగా, జిల్లాలో మాత్రం ఆ సంఖ్య పది వేలలోపే ఉండటం గమనార్హం. జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా బోగస్ కార్డులను ఏరివేసే ప్రక్రియలో మండలస్థాయి అధికారులు సమర్ధంగా వ్యవహరించలేకపోయారు. డీలర్లకు వత్తాసు పలుకుతూ ఎక్కడా భారీ సంఖ్యలో బోగస్‌లు బయటపడకుండా కొంతమంది రాజకీయ నాయకులు తెరవెనుక బాగోతం నడిపారు. ఉన్నతాధికారులు తహశీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటింటికీ సర్వే నిర్వహించడం ద్వారా బోగస్ కార్డులను వెలికితీయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఆ ఆదేశాలు అమలు జరగకుండా చేయగలిగారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ఒక తహశీల్దార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే చేపట్టి బోగస్‌లను ఏరివేయాలని ప్రయత్నించడం, వెనువెంటనే ఒక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపానికి గురైన ఆ తహశీల్దార్ సెలవులో వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తం మీద జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం తూతూమంత్రంగానే సాగిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ముక్కుసూటిగా వ్యవహరించే జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు గురు, శుక్రవారాల నాటి భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించి బోగస్‌ల బెడదను తొలగించేందుకు రాజకీయ జోక్యం లేకుండా చూడాలని రెవిన్యూ మంత్రిని కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అర్హులైన వారు ఎంతో మంది కొత్త రేషన్‌కార్డుల కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తూనే వస్తున్నారు. ప్రభుత్వం బోగస్‌ల ఏరివేత అనంతరం కొత్తకార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో జెసిల కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై క్షుణ్ణంగా చర్చించి కొత్తకార్డుల మంజూరుకు మార్గదర్శకాలు విడుదల చేస్తారని భావిస్తున్నారు.
అదే విధంగా నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు, వాటి పరిధిలో భూసేకరణ అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. అలాగే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ పధకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆధార్ కార్డుల అంశంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఆ లోగా ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే జెసిల కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై ప్రధాన చర్చ జరగనుంది. వీటితోపాటు త్వరలో చేపట్టనున్న ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమంపై సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అయిదు విడతల భూ పంపిణీ కార్యక్రమం విజయవంతమైనట్లు కాగితాలపై కనిపిస్తున్నా వాస్తవానికి లబ్ధిదారులకు చాలాచోట్ల భూ పంపిణీ జరగలేదనే చెప్పవచ్చు. పైకి పట్టాలు ఇచ్చినా ఎక్కడ భూమి వుందో చెప్పే నాధుడు లేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరవ విడత చేపట్టే భూ పంపిణీ కార్యక్రమమైనా సక్రమంగా జరిగేలా చూసేందుకు ఈ కాన్ఫరెన్స్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. రెవిన్యూ, పౌర సరఫరాలుతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
నేడు విధుల్లో చేరనున్న అడిషినల్ జెసి
జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు గురువారం తిరిగి విధుల్లో చేరనున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు ఐ ఎ ఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏజెసి గురువారం జిల్లాలో బాధ్యతలు చేపట్టి త్వరలోనే జాయింట్ కలెక్టర్‌గా మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌ఎం సస్పెన్షన్‌లో నాటకీయ పరిణామాలు
అత్తిలి, జనవరి 2: అత్తిలి మండలం వరిఘేడు నెం.1 పాఠశాల ప్రధానోపాధ్యాయిని సస్పెన్షన్‌పై బుధవారం ఆ గ్రామంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాఠశాలలో గల ముగ్గురు ఉపాధ్యాయులు నిర్ణీత వేళలకు పాఠశాలకు వెళ్ళారు. విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చారు. పాఠశాల తాళాలు సస్పెన్షన్‌కు గురైన ప్రధానోపాధ్యాయిని వద్ద ఉండడంతో ఉపాధ్యాయులు ఎంఇఒకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై డిఇఒ ఇచ్చిన సూచనల మేరకు గ్రామ రెవెన్యూ అధికారి నాగభూషణం, పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావుముగ్గురు ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల తాళాలను బద్దలకొట్టించి పాఠశాలను నిర్వహించారు. పాఠశాలలో గల రికార్డులను నమోదు చేశారు. ఉన్నత పాఠశాల నుండి బియ్యం తెప్పించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. ప్రధానోపాధ్యాయని సస్పెన్షన్ తగదంటూ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు వేరే చోట ప్రధానోపాధ్యాయని తరగతులు నిర్వహించింది. ఆమె సస్పెన్షన్ ర