ఏలూరు, జనవరి 2 : జిల్లాలో సహకార ఎన్నికలు సందర్భంగా ప్రతీ అధికారి పూర్తి అవగాహనతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక డిసిసిబి సమావేశ మందిరంలో బుధవారం సహకార ఎన్నికల ఏర్పాట్లపై రెవిన్యూ, సహకార, పోలీసు అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సహకార ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ఎన్నికల అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఏదైనా సమాచారం ఎవరైనా అడిగితే నాకు తెలియదు అనే సమాధానం రాకూడదని అవసరమైతే క్షుణ్ణంగా తెలుసుకుని వ్యవహరించాలే తప్ప నిర్లక్ష్య వైఖరిని సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో 254 ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీలకు వచ్చే ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 4వ తేదీల్లో నిర్వహించే ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణపై వచ్చే నెలలో డివిజనల్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల రోజు 144 సెక్షన్ అమలు చేయాలని అవసరం అయితే ఆయా రూట్లలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. తప్పులు లేని విధంగా ఓటర్ల జాబితాలను రూపొందించుకోవాలన్నారు. సహకార ఎన్నికల్లో పోటీ చేసే ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు నామినేషన్ పత్రాలకు వంద రూపాయలు చొప్పున, బిసి అభ్యర్ధులు 200 రూపాయలు, ఇతర కులస్థులు 400 రూపాయలు నామినేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుందన్నారు. జనవరి 4వ తేదీ నాటికి సభ్యుల జాబితాను అందజేయవలసి వుంటుందని చెప్పారు. జనవరి 8వ తేదీన ఓటర్ల జాబితా స్క్రూట్నీ, పరిశీలనా కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి పరిశీలించాలన్నారు. జనవరి 21వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవలసి వుంటుందన్నారు. మొదటి దశలో ఎన్నికలు నిర్వహించే సొసైటీలకు జనవరి 24న నామినేషన్ స్వీకరించి, 25వ తేదీన పరిశీలన చేయాలన్నారు. 26వ తేదీ 5 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పారు. జనవరి 31వ తేదీన సంబంధిత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా రెండవ విడతలో ఎన్నికల నిర్వాహణకు జనవరి 28న నామినేషన్లు స్వీకరించి, 29న పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు నిర్వహించబడతాయన్నారు. డి ఆర్‌వో ఎం మోహనరాజు మాట్లాడుతూ సహకార సొసైటీల ఎన్నికల నిర్వహణలో జాగురూకతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహన్, ఆర్‌డివో కె నాగేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్ట్రారు రవికుమార్ తదితరులతో పాటు పలువురు తహశీల్దార్లు, సహకార శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
రసాభాసగా చిన్నారిచూపు
భీమడోలు, జనవరి 2 : భీమడోలు మండల వనరుల కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన చిన్నారి చూపు రెండవ విడత వైద్య పరీక్షలు రసాభాసగా మారాయి. అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో అభ్యర్ధులు ఇబ్బందులకు గురయ్యారు. వివిధ సర్వేల అనంతరం మండలంలో 1,043 మందికి నేత్ర సంబంధిత లోపాలు ఉన్నట్లుగా గుర్తించబడి పరీక్షలకు ఎంపికయ్యారు. మొదటి విడత పరీక్షలు జరిగిన సమయంలో రాజీవ్ విద్యా మిషన్ పిఒ రామ్మోహనరావు సందర్శించి ఏర్పాట్లపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండవ విడత బుధవారం జరిగినప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన 800 మందికి తగు ఏర్పాట్లు లేకపోవడంతో పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమం వద్ద తొక్కిసలాట జరిగింది. భోజనం కూపన్ల జారీ విషయంలో కూడా తొక్కిసలాట జరిగింది. భోజనం పెట్టే సమయం ఒంటి గంట దాటినప్పటికీ ఇంకా పేర్లు నమోదు చేసుకునే అవకాశం లేక కొందరు అభ్యర్ధులు వెనుతిరిగి వెళ్లారు. అభ్యర్ధులతోపాటు వారికి సహాయకులుగా వచ్చిన వారికి కూడా భోజనం ఏర్పాట్లు చేయాల్సి ఉండగా తక్కువ మందికి ఏర్పాటు చేయడంతో అభ్యర్ధులు వారితో వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు పేర్లు నమోదు కార్యక్రమం, భోజనం పూర్తయిందనిపించారు.
చిల్లర కష్టాలు
చిన్నారి చూపు రెండవ విడత కార్యక్రమానికి వచ్చిన విద్యార్ధులకు దారిఖర్చులుగా ఒక్కొక్కరికి 50 రూపాయలు ఇవ్వాల్సి వుంది. ఈ మేరకు ముందస్తుగా కార్యక్రమ నిర్వాహకులైన విద్యాశాఖ సిబ్బంది చిల్లర ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుంది. అయితే విద్యార్ధులకు 50 రూపాయలు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి తిరిగి చిల్లర ఇవ్వాలంటూ కోరడంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. విద్యార్ధులే చిల్లర కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.
వైభవంగా దీపోత్సవం
భీమవరం, జనవరి 2: ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా స్థానిక జెపి రోడ్డులో వేంచేసియున్న శ్రీపద్మావతీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు, దాతల సహకారంతో సుమారు 10వేల దీపాలతో బుధవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి సహస్రనామార్చన, ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారిని, అమ్మవార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇఒ ఆర్ గంగాశ్రీదేవి, చైర్మన్ మంతెన రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి జెసిల కాన్ఫరెన్స్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 2 : రాజధానిలో గురు, శుక్రవారాల్లో జాయింట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు బుధవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా కొత్త రేషన్ విధానంపై ఈ చర్చ జరగనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ బోగస్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బోగస్ కార్డులు వెలుగు చూసాయి. వీటిని ఇప్పటికే ఆయా జిల్లాల స్థాయిలో ఉన్నతాధికారులు రద్దు చేశారు. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కొన్ని జిల్లాల్లో బోగస్ రేషన్‌కార్డులు బయటపడలేదు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల బోగస్ కార్డులను వెలికితీయగా, జిల్లాలో మాత్రం ఆ సంఖ్య పది వేలలోపే ఉండటం గమనార్హం. జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా బోగస్ కార్డులను ఏరివేసే ప్రక్రియలో మండలస్థాయి అధికారులు సమర్ధంగా వ్యవహరించలేకపోయారు. డీలర్లకు వత్తాసు పలుకుతూ ఎక్కడా భారీ సంఖ్యలో బోగస్‌లు బయటపడకుండా కొంతమంది రాజకీయ నాయకులు తెరవెనుక బాగోతం నడిపారు. ఉన్నతాధికారులు తహశీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటింటికీ సర్వే నిర్వహించడం ద్వారా బోగస్ కార్డులను వెలికితీయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఆ ఆదేశాలు అమలు జరగకుండా చేయగలిగారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ఒక తహశీల్దార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే చేపట్టి బోగస్‌లను ఏరివేయాలని ప్రయత్నించడం, వెనువెంటనే ఒక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపానికి గురైన ఆ తహశీల్దార్ సెలవులో వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తం మీద జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం తూతూమంత్రంగానే సాగిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ముక్కుసూటిగా వ్యవహరించే జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు గురు, శుక్రవారాల నాటి భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించి బోగస్‌ల బెడదను తొలగించేందుకు రాజకీయ జోక్యం లేకుండా చూడాలని రెవిన్యూ మంత్రిని కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అర్హులైన వారు ఎంతో మంది కొత్త రేషన్‌కార్డుల కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తూనే వస్తున్నారు. ప్రభుత్వం బోగస్‌ల ఏరివేత అనంతరం కొత్తకార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో జెసిల కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై క్షుణ్ణంగా చర్చించి కొత్తకార్డుల మంజూరుకు మార్గదర్శకాలు విడుదల చేస్తారని భావిస్తున్నారు.
అదే విధంగా నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు, వాటి పరిధిలో భూసేకరణ అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. అలాగే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ పధకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆధార్ కార్డుల అంశంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఆ లోగా ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే జెసిల కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై ప్రధాన చర్చ జరగనుంది. వీటితోపాటు త్వరలో చేపట్టనున్న ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమంపై సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అయిదు విడతల భూ పంపిణీ కార్యక్రమం విజయవంతమైనట్లు కాగితాలపై కనిపిస్తున్నా వాస్తవానికి లబ్ధిదారులకు చాలాచోట్ల భూ పంపిణీ జరగలేదనే చెప్పవచ్చు. పైకి పట్టాలు ఇచ్చినా ఎక్కడ భూమి వుందో చెప్పే నాధుడు లేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరవ విడత చేపట్టే భూ పంపిణీ కార్యక్రమమైనా సక్రమంగా జరిగేలా చూసేందుకు ఈ కాన్ఫరెన్స్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. రెవిన్యూ, పౌర సరఫరాలుతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
నేడు విధుల్లో చేరనున్న అడిషినల్ జెసి
జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు గురువారం తిరిగి విధుల్లో చేరనున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు ఐ ఎ ఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏజెసి గురువారం జిల్లాలో బాధ్యతలు చేపట్టి త్వరలోనే జాయింట్ కలెక్టర్‌గా మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌ఎం సస్పెన్షన్‌లో నాటకీయ పరిణామాలు
అత్తిలి, జనవరి 2: అత్తిలి మండలం వరిఘేడు నెం.1 పాఠశాల ప్రధానోపాధ్యాయిని సస్పెన్షన్‌పై బుధవారం ఆ గ్రామంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాఠశాలలో గల ముగ్గురు ఉపాధ్యాయులు నిర్ణీత వేళలకు పాఠశాలకు వెళ్ళారు. విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చారు. పాఠశాల తాళాలు సస్పెన్షన్‌కు గురైన ప్రధానోపాధ్యాయిని వద్ద ఉండడంతో ఉపాధ్యాయులు ఎంఇఒకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై డిఇఒ ఇచ్చిన సూచనల మేరకు గ్రామ రెవెన్యూ అధికారి నాగభూషణం, పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావుముగ్గురు ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల తాళాలను బద్దలకొట్టించి పాఠశాలను నిర్వహించారు. పాఠశాలలో గల రికార్డులను నమోదు చేశారు. ఉన్నత పాఠశాల నుండి బియ్యం తెప్పించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. ప్రధానోపాధ్యాయని సస్పెన్షన్ తగదంటూ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు వేరే చోట ప్రధానోపాధ్యాయని తరగతులు నిర్వహించింది.