తిరుపతి, జనవరి 2: 20వ శతాబ్ధంలోనే తెలుగు సాహిత్యం సుసంపన్నం చేసిన సాహితీవేత్తల్లో విశ్వనాథ సత్యనారాయణ ప్రథముడని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు, టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, విశ్వనాథ సాహితీపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ‘్భరతీయ సాంస్కృతిక పరిరక్షణ - విశ్వనాథ సాహిత్యం’ అనే అంశంపై నాలుగురోజుల జాతీయ సదస్సు బుధవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగింది. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగల నవలకు తెలుగు సాహిత్యంలో తొలిసారి జ్ఞానపీఠ్ పురస్కారం లభించిందన్నారు. ఆయన రచనలు మొత్తం తెలుగు సాహిత్యానికే నాథంగా నిలిచారన్నారు. ఆయన తెలుగుతల్లిని ప్రేమించాడని, భారతీయతను ఆరాధించాడన్నారు. ఆయన రచనలు అన్నీ కలుపుకుంటే లక్ష పేజిలున్నాయన్నారు. ఆయన రచనలపై లోతుగా అధ్యయనం చేశారన్నారు. పద్యం, నాటకం, నవలలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఒకటేమిటి అన్ని అంశాలపై బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశ్వనాథ సత్యనారాయణ తనదైన శైలిలో రచనలు చేశారన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన రచనలు తెలుగుకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా విస్తరించాయన్నారు. ఆయన రచించిన అనేక రచనలు పరభాషల్లోకి అనువదించబడ్డాయన్నారు. విశ్వనాథ సత్యనారాయణ కూడా తెలుగుకే పరిమితం కాకుండా అనేక భాషల్లో రచనలు సాగించి తన సత్తా చాటాడన్నారు. ఆయన రచించిన వేయిపడగల నవలను మాజీ ప్రధాన మంత్రి దివంగత పివి నరసింహారావు హిందీ భాషలోకి సహస్ర ఫన్ పేరుతో అనువదించి ఆస్వాదించారన్నారు. భక్తియోగం, జ్ఞానయోగం, కర్మయోగం కలగలిపిన వ్యక్తిత్వం విశ్వనాథ సత్యనారాయణకు వుందన్నారు. వాల్మీకి రామాయణాన్ని అందించి తెలుగువారికి ప్రియమైన సాహితీవేత్త అయ్యాడన్నారు. ఆయన బాటలో పయనించే మహోన్నత సాహితీ వేత్త విశ్వనాథ స్యరాయణ అని కొనియాడారు. టిటిడి ఇటువంటి సామాజిక, సాంస్కృతిక, మానవీయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడంలో ఎంతో ముదావహమన్నారు. టిటిడిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరిన్నింటిని వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే గవర్నర్ ఆద్యంతం తెలుగులో మాట్లాడి సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ తెలుగుభాష ఔన్నత్యాన్ని పెంచే ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొనడం సంతోషదాయకమన్నారు. విద్యార్థులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకుని, విశ్వనాథ సాహిత్యంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి పరిరక్షణకు విశ్వనాథ వారి సాహిత్యం ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విశ్వనాథుని రచనలు చదివితే జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొనే శక్తి ఏర్పడుతుందన్నారు. ఇతర భాషలకు చెందిన వారు సైతం ఆయన రచనలు పట్ల ఆసక్తి చూపుతారన్నారు. జెఇఓ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ విశ్వనాథ సాహిత్యంలోని విజ్ఞాన భాండాగారాన్ని విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతోనే ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వాక్కు, వాక్యం, దర్శనం, భావం, విమర్శనంలో నిండైన వ్యక్తిత్వం కనిపిస్తోందన్నారు. వెయ్యి పడగల నవలను ఆయన 23 రోజుల్లో పూర్తి చేశారని, దీన్ని సామాన్యులు చదివి అర్థం చేసుకోవడానికి నెలరోజులు పడుతుందన్నారు. సభాధ్యక్షులు మేడసాని మోహన్ మాట్లాడుతూ శ్రీవారిపై కొన్ని వేల కీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమయ్యకు విశ్వనాథంకు ఎంతో సారూప్యం వుందన్నారు. ఆయన సాహిత్య రసాన్ని యువత గ్రహించాలని హితవు పలికారు. సాహిత్య పీఠం గౌరవాధ్యక్షుడు డాక్టర్ వెలిచాల కొండలరావు కీలకోపాన్యాసం చేస్తూ భారతీయ సంస్కృతికి, ఉత్తమమైన విలువలకు ప్రతిబింబంగాను, సాహిత్య కళానీతి, రీతులకు అద్దం పట్టేదిగాను, వ్యక్తి జీవితానికి తాత్విక, అధ్యాత్మిక కోణాలను సమకూర్చేదిగాను, సర్వకాలాలకు, సర్వ ప్రాంతాలకు వర్తించేవిధంగా విశ్వనాథ సాహిత్యం వుంటుందన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆచార్య జెవి రాఘవేంద్రరావు ‘విశ్వనాథ - ఏ లిటరరీ లెజెండ్’ పుస్తక పరిచయం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ మనవళ్లు అయిన విశ్వనాథ సత్యనారాయణ, మనోహర, శ్రీపాణిని వెలిచెర్ల కొండలరావును, ఆచార్య తుంబపూడి కోటేశ్వర్‌రావు, సుబ్బారావును, అనుమాళ్ల భూమయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సివిఎస్‌ఓ జివిజి అశోక్ కుమార్, టిటిడి సప్తగిరి ముఖ్య సంపాదకులు రవ్వా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా మధ్యాహ్నం అన్నమాచార్య కళామందిరంలో జరిగిన మొదటి సదస్సుకు టిటిడి హరివంశ ప్రాజెక్టు కో- ఆర్డినేటర్ తుమ్మపూడి కోటేశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. చెన్నైకి చెందిన బాలసుబ్రహ్మణ్యం సుందరకాండలోని ఆంజనేయ స్వామి పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. తిరుపతికి చెందిన దామోదర్‌నాయుడు మాట్లాడుతూ విశ్వనాథుని సాహిత్యం నుండి వెలువడిన రేడియో, నాటక రూపాలపై ఉపన్యసించారు. విశ్వనాథుని సాహిత్యంలోని భారతీయ సంస్కృతిపై విజయవాడకు చెందిన రాజగోపాల చక్రవర్తి ప్రసంగించారు. తిరుపతికి చెందిన మిరియాల రమణారెడ్డి విశ్వనాథుని పద్యాలను మధురంగా ఆలపించారు.
పలు పుస్తకాలు ఆవిష్కరించిన గవర్నర్
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మేడసాని మోహన్ రచించి, టిటిడి ముద్రించిన శ్రీ వేంకటేశ్వర స్తోత్ర రత్నాకరం, తుమ్మపూడి కోటేశ్వర్‌రావు రచించిన ‘వేయిపడగల మణి ప్రభలు’ అనే రెండు పుస్తకాలను బుధవారం మహతి ఆడోరియంలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జెఇఓ వేంకట్రామిరెడ్డి, సాహితీ వేత్తలు తదితరులు గవర్నర్ నరసింహన్‌ను ఘనంగా సన్మానించారు.
ప్రమాదాలు నివారించండి
* రహదారి భద్రతా వారోత్సవాల్లో కలెక్టర్ హితవు
చిత్తూరు, జనవరి 2: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా రవాణాశాఖ అధికారి బసిరెడ్డి అధ్యక్షతన రహదారి భద్రతా వారోత్సవాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ప్రమాదాలకు గురవుతున్నాయని, తద్వారా యువత మృతి చెందడంతో తల్లిదండ్రులకు పుత్రశోకం మిగులుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారని హెచ్చరించారు. ప్రజలకు హైవేలో ఎంత వేగంగా వెళ్ళాలి అనేదానిపై షైనింగ్ బోర్డులు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డిటిసి బసిరెడ్డి మాట్లాడుతూ ఆర్‌అండ్‌బి, పోలీసు, రవాణాశాఖతో కలసి ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు శాఖలు సమన్వయంగా పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిపై చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిత్తూరు ఆర్టీవో ఎస్‌ఎస్.మూర్తి, మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
లారీ, కారు ఢీ - ఇద్దరు దుర్మరణం
యాదమరి, జనవరి 2: మండల పరిధిలోని బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలో లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం బెంగళూరు నగరానికి చెందిన హెచ్‌ఆర్.జనార్దన్‌అయ్యంగార్, హెచ్‌ఆర్.శ్రీనివాసన్ అయ్యంగార్(60), వినయ్(35) ఈనెల 1వ తేది తిరుమల శ్రీవారిని దర్శించుకొని బుధవారం ఉదయం కారులో బెంగళూరుకు వెళ్తుండగా గాండ్లకొత్తూరు సమీపంలోని వీరభద్రాపురం వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో హెచ్‌ఆర్.జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ హెచ్‌ఆర్.శ్రీనివాస్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వినయ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం వేలూరు సిఎంసికి తరలించారు. ఈమేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంచార వాహనాల ద్వారా విద్యార్థులకు సత్వరం ఆధార్ కార్డులు
* కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ వెల్లడి
చిత్తూరు, జనవరి 2: జిల్లా వ్యాప్తంగా స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతరాత్ర సదుపాయాలు పొందే విద్యార్థులకు ఆధార్ కార్డులను సత్వరం అందించేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లాకలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ అన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో సంక్షేమశాఖ అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆధార్ కార్డులకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.43 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వీరిలో కేవలం 34 వేల మంది మాత్రమే స్కాలర్‌షిప్‌లు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధికి ఆధార్ కార్డులు సమర్పించారన్నారు. మిగిలిన వారు కూడా సత్వరం ఆధార్ కార్డులు పొందేలా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు కళాశాలల ప్రిన్సిపాళ్ల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. ఏ కళాశాలలోనైనా 50మందికి పైగా విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవంటే తమకు తెలియజేస్తే ఆ కళాశాలకు ఆధార్ కార్డులు తీసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ వాహనాన్ని పంపుతామని సూచించారు. రాష్ట్రానికి చిత్తూరు జిల్లా ఆదర్శం కావాలంటే ప్రతి ఒక్క విద్యార్థి ఆధార్‌కార్డు కలిగి ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ ఆధార్ కార్డు యుఐడి నెంబర్లు 12అంకెలు లేనివారు ఈఐడి రసీదులో ఉన్న 14అంకెల నెంబర్లు వేసి దరఖాస్తులు భర్తీచేసి ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు వారికి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆధార్‌కార్డు దరఖాస్తు ఏలా భర్తీచేయాలి, ఆధార్‌కార్డు ఎలా ఉంటుంది అనే విషయాలను జెసి పవర్‌పాయింట్ ద్వారా కళాశాల ప్రిన్సిపాళ్లకు వివరించారు. ఈ సమావేశంలో ఎజెసి వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డిడి ధనంజయరావు, ఎల్‌డిఎం వెంకటేశ్వర్‌రెడ్డి, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ రామచంద్రరాజు, మైనార్టీ కార్పొరేషన్ ఇడి హేమచంద్ర, గిరిజన సంక్షేమ శాఖ ఆఫీసర్ లలితాబాయ్, ఎఎస్‌డబ్ల్యూఓలు, కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
సహకార సంఘం సభ్యత్వ నమోదులో అవకతవకలు
* కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా
చిత్తూరు, జనవరి 2: సహకార సంఘం ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదులో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని, దీని గూర్చి ఎవ్వరు పట్టించుకోవడంలేదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలంలోని సింగిల్ విండోలో మొదటగా ఎన్ని ఓట్లు ఉన్నాయని తాము సెక్రటరీని వివరణ కోరితే 3,248 ఓట్లు ఉన్నట్లు తమకు రాతపూర్వకంగా ఇచ్చారన్నారు. అయితే తిరిగి 3,843 ఓట్లు ఉన్నట్లు ప్రచురింతం చేశారని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించగా ఎవ్వరు సమాధానం చెప్పడం లేదని, కలెక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికార దాహంతో కాంగ్రెస్‌పార్టీ సింగిల్ విండో ఎన్నికల్లో విజయం కోసమే తప్పుడు ఓటర్లను నమోదు చేశారని విమర్శించారు. గంటల తరబడి ఆందోళన కొనసాగించడంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రిదేవి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎఎస్.మనోహర్, కత్తి నరసింహారెడ్డి, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరుకు చెందిన పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
కురవంకలో చోరీ
వంద గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి అపహరణ
మదనపల్లె, జనవరి 2: మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీ ఎక్స్‌టెన్షన్ కురవంకలోని ఓ ఇంటిలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి వంద గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండితో పాటు రూ.45వేల నగదును దోచుకెళ్ళారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ మల్లికార్జున కథనం ప్రకారం పట్టణంలోని కురవంకలో నివాసముంటున్న క్రిష్ణారెడ్డి(59) తన తండ్రి ఎర్రంరెడ్డి కడప జిల్లా నూలివీడులో రెండురోజుల క్రితం మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళారు. గుర్తు తెలియని దుండగాలు మంగళవారం రాత్రి ఇంటి ప్రధాన తలుపును పగలగొట్టి ఇంటిలోని ప్రవేశించి మూడు గదుల్లోని బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించకెళ్ళారు. బుధవారం ఊరినుంచి ఇంటికొచ్చిన నివాశితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
ప్రపంచ తెలుగుమహాసభల నిర్వహణ నూతన అధ్యాయం
* గవర్నర్ నరసింహన్ ప్రశంస
తిరుపతి, జనవరి 2: ప్రపంచ తెలుగుమహాసభలు నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి దారి తీస్తోందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక పరిరక్షణ - విశ్వనాథ సాహిత్యం అన్న అంశంపై టిటిడి నిర్వహించిన నాలుగురోజుల జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా గవర్నర్ తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ తెలుగుమహాసభల స్ఫూర్తి మరింతగా ద్విగుణీకృతం కావాలన్నారు. ఈ సభల ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందారన్నారు. ఈ సభలతో తెలుగుభాషకు నూతన శకం ప్రారంభమైనట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ మహాసభల స్ఫూర్తితో సాహితీ సభలు, భాషాభివృద్ధి సదస్సులు నిర్వహించాలని భాషాభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. తెలుగు ఎంతో సరళమైన భాష అని, అందుకే తాను ప్రపంచ మహాసభల్లోనూ, నేడు మహతిలో జరిగిన సదస్సులోనూ తెలుగులోనే మాట్లాడానన్నారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ ఒక ధృవతారలాంటివారన్నారు. ఆయన రచనల నుండి యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఎపిపిఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.
-- సాంబారులో బల్లి పడి --
పది మంది విద్యార్థులకు అస్వస్థత
పలమనేరు, జనవరి 2: మండల పరిధిలోని ముసలిమడుగు పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం సాంబారులో బల్లి పడి పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తయారీ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో బల్లి పడిన సాంబారును విద్యార్థులకు వడ్డించడంతో విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయులు, కుకింగ్ ఏజన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యవల్లే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు మోనిష, ప్రభాస్, చైతన్యల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి వాసుదేవనాయుడు దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
మూలస్థాన ఎల్లమ్మ ఉత్సవాల పోస్టర్లు
ఆవిష్కరించిన మంత్రి గల్లా
చంద్రగిరి, జనవరి 2: చంద్రగిరిలోని శ్రీమూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో ఈనెల 13నుండి జరగబోయే సంక్రాంతి ఉత్సవాల వాల్‌పోస్టర్లను మంత్రి గల్లా అరుణకుమారి బుధవారం ఆవిష్కరించారు. చంద్రగిరిలోని శ్రీమూలస్తాన ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి యేడాది వలే ఈనెల 13నుండి 19వతేదీ వరకు సంక్రాంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి వాల్‌పోస్టర్లను మంత్రి గల్లా అరుణకుమారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి తిమ్మారెడ్డి, మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ బోర్డుమెంబర్లు మధుసూదన్‌రెడ్డి, మునిరత్నం, తిరుపతి వ్యవసాయమార్కెట్ కమిటీ సభ్యురాలు లలిత, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.