Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజల అవసరాలకనుగుణంగా నగరాభివృద్ధి

$
0
0

గుంటూరు, జనవరి 2: ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం నగర పరిధిలో 74 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎటి అగ్రహారం, బ్రాడీపేట ప్రాంతాల ప్రజలు రైల్వేగేటు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ దృష్ట్యా నగరపాలక సంస్థ రూ. 12 కోట్లతో రైల్వేశాఖ సమన్వయంతో ఆర్‌యుబి పని ప్రారంభించినట్లు చెప్పారు. ఈనెల 29వ తేదీ నుండి ఎగ్జిక్యూషన్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బ్రాడీపేట, ఎటి అగ్రహారం ప్రజలకు ఇదొక మంచి సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. వాహనాల రద్దీని నివారించేందుకు అరండల్‌పేట ఆర్వోబీపై మరొక బ్రిడ్జిని నిర్మించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి సర్వే జరుగుతోందన్నారు. అవసరమైనచోట హడ్కో గ్రాంటు మంజూరు చేయించి త్వరితగతిన పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా శ్యామలనగర్ జీరోలైనులో శాసనసభా నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. 8.65 లక్షల అంచనాల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి కన్నా ప్రారంభించారు. అనంతరం కంకరగుంట రైల్వేగేటు వద్ద ఆర్‌యుబి నిర్వాసితులకు రూ. 9 లక్షలతో నిర్మించనున్నట్లు దుకాణ సముదాయానికి మంత్రి భూమిపూజ చేశారు. తుఫాన్ నగర్‌లో 19 లక్షల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. వేళాంగిణినగర్‌లో 9.75 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును మంత్రి ప్రారంభించారు. అలాగే రామచంద్రాపురం మెయిన్‌రోడ్డు 20వ వార్డుకు రూ. 16.20 లక్షల అంచనాల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు, డ్రైన్ల నిర్మాణానికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్, అదనపు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ లతీఫ్, రైల్వే డివిజనల్ మేనేజర్ కృష్ణ, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కూలీల కొరతతో
నేలపాలవుతున్న పత్తి
అమరావతి, జనవరి 2: అమరావతి, పరిసర మండలాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో పొలాల్లో విరగకాసిన పత్తి తీయకపోవడంతో నేలపాలవుతోంది. ఇటీవల కర్నూలు, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలు, తమకు చాలినంత కూలీ ఇవ్వడం లేదంటూ తిరిగి వెళ్లిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కూలీలు లేక సతమతమవుతున్నామని, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, జనవరి 2: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలుపై బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత సిఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుపేద ప్రజలకు వరంలాంటిదన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ఆసుపత్రులను గుర్తించామని, వీటిలో ఐదు ప్రభుత్వాసుపత్రులున్నాయన్నారు. 2008లో జిల్లాలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు లక్షా 43 వేల సర్జరీలు జరగగా, సుమారు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా కనీస భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద 938 జబ్బులలో కొన్నింటికి ప్యాకేజీ పెంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఒ గోపినాయక్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ చల్లా మోహనరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కరరెడ్డి, ఆసుపత్రి సేవల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ పత్రీజీని వెంటనే అరెస్ట్ చేయాలి
ప కాంగ్రెస్ మనుగడ కోసమే టిడిపి నాయకులపై దాడులు: ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి
గుంటూరు (కొత్తపేట), జనవరి 2: ఆధ్యాత్మిక, పిరమిడ్ గురువు సుభాష్ పత్రీజీ శిష్యురాళ్లను కౌగిలించుకోవడం, కాళ్లు నొక్కించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్నారని, వెంటనే పత్రీజీని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 100 సంఖ్యలో పిరమిడ్ ధ్యానకేంద్రాలు నడుపుతూ భారతజాతి సిగ్గుపడే విధంగా తాతయ్య వయస్సులో ఉన్న పత్రీజీ మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పురుష శిష్యులతో కరచాలనానికి సైతం ఇష్టపడని పత్రీజీ మహిళల చేత మసాజ్ చేయించుకోవడం హేయమన్నారు. నిర్వహించే కార్యక్రమాలను నిలిపివేయాలని, ప్రభుత్వం పత్రీజీకి కేటాయించిన భూములను వెనక్కు తీసుకుని పేదలకు పంచిపెట్టాలని డి మాండ్ చేశారు. పత్రీజీని ప్రోత్సహిం చే మహిళల్లో కూడా తప్పు ఉందని, ఇలాంటి దొంగ గురువుల పట్ల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితి దయనీయంగా ఉందని, ప్రశ్నార్థక మ వుతున్న పార్టీ మనుగడను సాగించుకునేందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అకారణంగా దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేటలో కోడెల శివప్రసాద్‌పై, పరిటాల సునీత కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడు లు చేయిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో చిట్టాబత్తిన చిట్టిబాబు, సగ్గెల రూబెన్, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పారదర్శకంగా అమలుచేయాలి
గుంటూరు, జనవరి 2: ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పారదర్శకంగా లబ్ధిదారులకు అందేవిధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యూస్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లతో ఇందిరమ్మ అమృతహస్తం అమలు గురించి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మిన్నిమాథ్యూస్ మాట్లాడుతూ ఈ పథకం అమలు విజయవంతం కావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమశాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనవరి 1న 631 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల సూపర్‌వైజర్ల కొరత ఉందని, మొత్తం 150 పోస్టులకు గాను 80 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. మార్పు పథకం గురించి కలెక్టర్ ముద్రించిన పత్రాలను చూపిస్తూ మిన్నిమాథ్యూస్‌తో పాటు, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి నీలం సహాని, కమిషనర్ చిరంజీవి, ప్రిన్సిపల్ సెక్రటరి రూరల్‌డెవలప్‌మెంట్ రెడ్డి సుబ్రహ్మణ్యంలకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి డాక్టర్ ఎన్ యువరాజ్, అదనపు జెసి శారదాదేవి, డిఆర్‌డిఎ పిడి బి వెంకటరెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ గోపీనాయక్, మహిళా శిశు సంక్షేమం ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్ తనిఖీలు
యడ్లపాడు, జనవరి 2: యడ్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ విజిలెన్స్ శాఖ పెద్దఎత్తున విద్యుత్ సర్వీసులకు సంబంధించి తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 30 మందిపై కేసులు నమోదు చేసి అక్రమ విద్యుత్ వినియోగానికి సంబంధించి 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించింది. మండలిలోని జగ్గాపురం, సందెపూడి, లింగరావుపాలెం, చంగీస్‌ఖాన్‌పేట, కోట, కొండవీడు, బోయపాలెం గ్రామాల్లోని గృహ వినియోగదారులపై ఈ తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డిఇ వెంకటకృష్ణ 80 మందికి పైగా సిబ్బందితో దాడులు నిర్వహించడం సంచలనం కల్గించింది. విజిలెన్స్ బృందానికి చిలకలూరిపేట ఎడిఇ చంద్రానాయక్, యడ్లపాడు ఎఇ శ్రీనివాసరావు సహకరించారు.
దోషులను కఠినంగా శిక్షించాలంటూ
కొవ్వొత్తులతో విద్యార్థుల ప్రదర్శన
అమరావతి, జనవరి 2: ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలంటూ స్థానిక వినూత్న కానె్సప్ట్ స్కూలు విద్యార్థినీ, విద్యార్థులు అమరావతి పురవీధుల్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కోసూరు రోడ్డు జంక్షన్‌లో ఉన్న గాంధీబొమ్మ వద్ద పెద్దఎత్తున నినాదాలు చేశారు. మృతురాలు నిర్భయకు సంతాపం తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి హైస్కూల్ హెచ్‌ఎం ఎం అనూరాధ, డైరెక్టర్ పరమేశ్వరరావు నాయకత్వం వహించారు.

కార్మిక సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషకృషి
గుంటూరు (రూరల్), జనవరి 2: కార్మికుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఎఐటియుసి నగర అధ్యక్షుడు గుంజి వెంకయ్య అధ్యక్షతన వల్లూరివారితోటలో బుధవారం జరిగిన భవన నిర్మాణ రంగంలోని 50 మంది కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని అసంఘటిత కార్మికులైన మట్టి పనివారు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, బిల్డింగ్, రోడ్డు నిర్మాణ పనివార్లు, ఇటుక తయారీ వారి సంక్షేమానికి 1996, 98 సంవత్సరాల్లో చట్టాల ప్రకారం రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడిందని, తద్వారా ఆయా రంగాల్లోని కార్మికులకు గుర్తింపు కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డుల ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి ఇందిర బీమాయోజన, ఆమ్ ఆద్మీ బీమాయోజన కింద 2 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేయడం జరుగుతుందన్నారు. మహిళా కార్మికులకు ప్రసూతి సహాయం కింద 5 వేల రూపాయలు, కార్మికుని కుమార్తె వివాహానికి కానుకగా మరో 5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి జి సురేష్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, కార్మిక సంఘ అధ్యక్షుడు సత్తెనపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్ చిన్నబ్బాయి, కార్యదర్శి కోండ్రు అరుణ్‌కుమార్, సహాయ కార్యదర్శి జూటూరి సుబ్బారావు, కోశాధికారి నక్కా అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.
సహకార బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలి
పెదకూరపాడు, జనవరి 2: సహకార బ్యాంకు అభివృద్ధికి ఆయా సంఘాల అధ్యక్షులు, కో ఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది సంయుక్తంగా కృషి చేయాలని జిడిసిసి బ్యాంకు చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు కోరారు. పెదకూరపాడు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు పరిధిలోని 75 తాళ్లూరు, గుడిపూడి, వరగాని, ఫణిదం సంఘాల అధ్యక్షులు, బ్యాంకు సిబ్బందితో సమీక్షా కార్యక్రమం జరిగింది. అనంతరం ఛైర్మన్ నల్లపాటిని సహకార సంఘ అధ్యక్షుడు వట్టికూటి శివరామకృష్ణయ్య, బ్యాంకు మేనేజర్ పతకమూరి రాములు గుడిపూడి సొసైటీ అధ్యక్షుడు కె పుల్లారావు, వరగాని సొసైటీ అధ్యక్షుడు సౌర్రెడ్డి, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మన్నవ కృష్ణమూర్తి, జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, వెంకటరమణ, సిఇఒ వెంకటేశ్వర్లు, వై సత్యనారాయణ, రత్తయ్య, గురవారెడ్డి, ఎన్ అప్పారావు, ఎం వెంకట్రావ్, అనిల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

స్కౌట్స్ కళారంగంలోనూ రాణించాలి

గుంటూరు (పట్నంబజారు), జనవరి 2: స్కౌట్ విద్యార్థులు సేవలతో పాటు కళారంగంలో కూడా రాణించాలని జడ్పీ సిఇఒ, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. స్థానిక రైలుపేటలోని సత్యసాయి విద్యానికేతన్ విద్యార్థి మద్ది సిద్ధార్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఎడ్యుకేషన్ ఈజ్ ది కీ ఫర్ సక్సెస్ అనే అంశంపై ద్వితీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సిఇఒ జయప్రకాష్ నారాయణ, సిద్ధార్థను అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి విజయలక్ష్మి, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఎస్ చిట్టికుమారి, ఉపాధ్యాయురాలు జి జ్యోత్స్న పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డుల పంపిణీ
మంగళగిరి, జనవరి 2: పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజారు బ్రాంచి ప్రాంగణంలో చేనేత కార్మికులకు బుధవారం క్రెడిట్‌కార్డులను జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్‌బిఐ రీజినల్ మేనేజర్ శ్రీనివాసప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు, బ్రాంచి మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్, చేనేత, జౌ ళిశాఖ, లీడ్‌బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. సుమారు 250 మంది లబ్ధిదారులకు క్రెడిట్‌కార్డులు అందజేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి
* ఉచిత వైద్య శిబిరంలో ఆర్‌ఎం పివి రామారావు
గుంటూరు (కొత్తపేట), జనవరి 2: ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండెక్టర్లు, సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పివి రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 24వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన వైద్యులు బాలసుబ్రహ్మణ్యం, మధుసూధనరావు, నవీన్, చారి, ఆర్టీసీ వైద్యులు వి రవితేజానాయక్, సిహెచ్ విజయలక్ష్మి డ్రైవర్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మొత్తం 235 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఈసిజి, బిపి, రక్తపరీక్షలు, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం పివి రామారావు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఒత్తిడిని అధిగమించాలంటే ముందు ఆరోగ్యపరమైన సూత్రాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటిఎం ఆదం సాహెబ్, సిఎంఇ జి సత్యనారాయణ, ఎటిఎం సిహెచ్ వెంకటేశ్వరరావు, 1,2 డిపో మేనేజర్లు ప్రసాద్, ఎ వెంకటేశ్వరరావు, టిప్యూటీ సిఎఒ ఎం రత్నవాణి, ఎఒ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ మొత్తం పెంచాలంటూ వికలాంగుల దీక్షలు
గుంటూరు (పట్నంబజారు), జనవరి 2: ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను పెంచాలంటూ వికలాంగులు బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 500 పింఛన్‌ను 1500కు పెంచాలని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపుమేరకు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ల వద్ద నెల రోజుల పాటు రిలేదీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిముట్టి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించకుంటే మార్చి 13న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నేటిదీక్షలో బుల్లాడేవిడ్, గాలిముట్టి కిరణ్, కొల్లి మాధవి పాల్గొన్నారు. దీక్షకు ఎంఆర్‌పిఎస్ నాయకులు కూచిపూడి సత్యం, చలివేంద్రం వెంకటేశ్వరరావు, ఏటుకూరి విజయ్, సాంబయ్య, పల్లెపోగు థామస్, కోట హనుమంతరావు, మందా ప్రేమానందం, మల్లవరపు రవిరాజా సంఘీభావం తెలిపారు.
28 నుంచి మంగళగిరిలో
జిల్లా సెంట్రల్‌జోన్ క్రీడాపోటీలు
మంగళగిరి, జనవరి 2: జిల్లా సెకండరీ స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు మంగళగిరిలో సెంట్రల్‌జోన్ బాలుర క్రీడాపోటీలు జరుగుతాయని సికె హైస్కూల్ కమిటీ కార్యదర్శి పిఎఎస్ సుందరరావు వెల్లడించారు. బుధవారం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సికె జూనియర్ కాలేజీ ఆవరణలో రాత్రిపూట ఫ్లడ్‌లైట్ల వెలుతురులో వాలీబాల్, కబడ్డీ, క్యారమ్స్, చెస్ పోటీలు జరుగుతాయని, మనె్నంవారి వీధిలోని కాలేజీ గ్రౌండ్‌లో ఖోఖో, సాఫ్ట్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడాపొటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. అసోసియేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె మోహనరావు, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు జె దేవేంద్రరావు, బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం జి గీతాకిరణ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి కరీముల్లారావు, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె కాంతారావు, వై సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
పులిచింతల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయండి
గుంటూరు, జనవరి 2: పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితులకు సంబంధించి సహాయ, పునరావాస కార్యక్రమాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పునరావాస కార్యక్రమాల అమలుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ పునరావాస ప్రాంతాల్లో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రంథాలయం తదితర వౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. బెల్లంకొండ, మాచవరం, మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జెసి డాక్టర్ ఎన్ యువరాజ్, పులిచింతల ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ లక్ష్మయ్య, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శంకరకంటి ఆసుపత్రి సేవలు హర్షణీయం
పెదకాకాని, జనవరి 2: శంకరకంటి ఆసుపత్రి సేవలు హర్షణీయమని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అన్నారు. బుధవారం పెదకాకానిలోని శంకరకంటి ఆసుపత్రిని సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాసిక్ నూ ఎక్విప్‌మెంట్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ పొట్టి మాట్లాడుతూ ఈ ల్యాసిక్‌మిషన్ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లేనికారణంగా హైదరాబాదు, మద్రాసు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై సుదూర ప్రాంతాలకు వెళ్లే అవస్థ ఇక్కడి ప్రజలకు తప్పిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి కళ్లజొడు నుండి విముక్తి కల్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సభ్యులు కంభంపాటి నాగేశ్వరరావు, వైఎ చౌదరి, పిఆర్‌ఒ సురేష్‌కుమార్, ఎంపిడిఒ గంగవరపు జోసఫ్‌కుమార్, తహశీల్దార్ అనిల్‌కుమార్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు
నియామక ఉత్తర్వులు
గుంటూరు (కార్పొరేషన్), జనవరి 2: 2012 డిఎస్సీ కింద ఎంపికైన అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా నియామక ఉత్తర్వులను నగరపాలక సంస్థ కమిషనర్ బుధవారం జారీ చేశారు. మొత్తం 13 మంది అభ్యర్థుల్లో ఎ పవిత్ర హిందీపండిట్‌గా, ఎస్‌జిటిలుగా జె హిమబిందు, డి అమూల్య, కె స్వాతి, డి దివ్య, జె శంకరవరప్రసాద్, ఎం సుశీల, ఆర్ వెంకటసుబ్బమ్మ, ఫాతిమాబేగమ్, కె బ్రాహ్మణి, ఎస్ మోహనరావు, ఎ మేరిసరిత, ఎం రాజకుమారిలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వేణుగోపాలనగర్, కంకరగుంట, గాంధీనగర్, రైలుపేట, ఫాతిమానగర్, రామిరెడ్డితోట, బసవతారక రామానగర్, బుచ్చయ్యతోట తదితర ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు ఉపాధ్యాయులుగా నియామకపత్రాలను అందజేశారు.
పురుగుమందు తాగి

యువకుని ఆత్మహత్య
అమరావతి, జనవరి 2: మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన బెల్లపు శివశంకర్ (27) బుధవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివశంకర్ ఎంబిఎ చదివి నిరుద్యోగిగా ఉండి ఉద్యోగానే్వషణ చేస్తున్నాడు. 9 నెలల క్రితం దాచేపల్లికి చెందిన శివజ్యోతితో శివశంకర్‌కు వివాహం జరిగింది. పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న శివశంకర్‌ను అమరావతి 30 పడకల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య శివజ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మల్లిఖార్జునరావు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

* మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>