ఖమ్మం, జనవరి 2: వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను టిడిపి జిల్లా నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు యాత్ర జరిగే ప్రాంతాలను, రూట్‌మ్యాప్‌ను, బస ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావుతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య తదితరులు బుధవారం పరిశీలించారు. పూర్తిగా వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి తిరిగి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించే ప్రదేశం వరకు వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని నాయకులతో సమీక్షలు కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర జిల్లాలో నాలుగు రోజుల పాటు మాత్రమే జరుగుతుందని విస్తృతంగా ప్రచారమైంది. వరంగల్ జిల్లా నుంచి తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామం వద్ద జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర పాలేరు, కూసుమంచి, మేడేపల్లి, ముదిగొండ, వల్లభి, చెరువుమాధారం మీదుగా నల్గొండ జిల్లా శాంతినగరంలోకి ప్రవేశిస్తుందని టిడిపి నేతలు కొందరు స్పష్టం చేశారు. ఇదంతా కూడా నాలుగు రోజుల్లో పూర్తయ్యేలా చూస్తున్నామని కూడా వెల్లడించారు. అయితే జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు మాత్రం ఖమ్మంలోకి కూడా పర్యటించేలా ప్రయత్నిస్తున్నామని, తొమ్మిది రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర జరిగేలా చూస్తున్నారు. గతంలో చంద్రబాబు జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పర్యటించారని, పాలేరు నియోజకవర్గంలో పర్యటించక చాలాకాలం అయినందున ఆ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండేలా నాయకులు చూస్తున్నారు. అయితే ఎన్ని రోజులు జిల్లాలో పర్యటిస్తారనే విషయం స్పష్టత రాలేదు.
బాధ్యతగా విధులు నిర్వహించండి
కొణిజర్ల, జనవరి 2: వేలాది రూపాయలు వేతనం పొందుతున్నప్పుడు విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిహెచ్ వెంకటరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రికార్డులను పరిశీలించారు. పదవ తరగతి సిలబస్ ఎంత వరకు పూర్తి చేశారని, తదితర విషయాల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. సోషల్ సిలబస్ పూర్తి కాలేదని, ఆ ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నారని హెచ్‌ఎం తెలపగా, దానిని వేరే ఉపాధ్యాయుడికి అప్పగించి సిలబస్‌ను పూర్తి చేయాలన్నారు. మెడికల్ లీవ్‌కు సంబంధించి ఫాం-ఏను దాఖలు చేయని ఉపాధ్యాయుల వేతనాలను నిలిపివేయాలని, వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జి ఎంఇఓ కిషోర్‌బాబును ఆదేశించారు. తదుపరి తన ఆదేశాలు వచ్చే వరకు వేతనాలు ఇవ్వవద్దని సూచించారు. పదో తరగతి విద్యార్థులను ఒక్కొక్క టీచర్ ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకొని ఉదయం, సాయంత్రం అదనపు తరగతులను నిర్వహించాలని సూచించారు. అనంతరం పదో తరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియం తరగతుల్లో విద్యార్థుల నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అదే విధంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో 95శాతం ఫలితాలు సాధనకు కృషి చేస్తున్నామన్నారు. హైస్కూల్స్ అన్ని బాగానే పని చేస్తున్నాయని, ప్రాథమిక పాఠశాలలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. సైన్స్‌లో ప్రయోగాలు బాగా చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అర్థ సంవత్సర పరీక్షల అనంతరం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, ప్రతిభను గుర్తించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విష్ణుమూర్తి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
గగనతలంలో
హెలికాప్టర్ చక్కర్లు
* హెలిప్యాడ్ నిర్మాణ పరిశీలన
* స్థానికుల్లో ఒకింత ఆందోళన
చర్ల, జనవరి 2: చర్ల మండల కేంద్రంలో రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన హెలిప్యాడ్ నిర్మాణాన్ని బుధవారం హెలికాప్టర్‌తో పోలీసులు పరిశీలించారు. గతంలో ఈ హెలిప్యాడ్‌పై రెండు చిన్న చిన్న హెలికాప్టర్లను దింపి పరిశీలించగా ఈసారి పెద్ద హెలికాప్టర్‌తో పరిశీలించారు. మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉన్న దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లను ఏ విధంగా ల్యాండ్ చేయించాలి, ఎలా టేకాఫ్ తీసుకోవాలనే అంశాలపై పరిశీలన జరిపారు. ఒక్కసారిగా హెలికాప్టర్ చర్ల మండల కేంద్రంతోపాటు ఆయా గుట్టలపై చక్కర్లు కొట్టడంతో మండల ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కాగా హెలికాప్టర్‌ను చూసిన చిన్నారులు మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చర్ల మండలంలో మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉన్న దృష్ట్యా త్వరలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కూడా హెలికాప్టర్లపైనే జరుగుతుందనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. హెలికాప్టర్ వచ్చిన నేపథ్యంలో వెంకటాపురం సిఐ కెఆర్‌కె ప్రసాదరావు దగ్గరుండి బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాద్రిలోనూ...
భద్రాచలం: భద్రాచలం గగనతలంలో బుధవారం మధ్యాహ్నం సుమారు గంటపాటు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. భద్రాచల గగనతలం పరిధిలోకి వచ్చిన హెలికాప్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటిసి) నుంచి రూట్ సంకేతాలు అందడంలో విఫలం కావడం వల్ల సుమారు గంటపాటు భద్రాచల పట్టణంపై ప్రదక్షిణలు చేసింది. గగనతలంపై హెలికాప్టర్ పలుమార్లు చక్కర్లు కొడుతుండటంపై ఎటువంటి సమాచారం లేని భద్రాద్రివాసులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. అనంతరం అదేవిధంగా తిరుగుతుండటంతో ఆసక్తిగా తిలకించారు. గంట అనంతరం ఏటిసి నుంచి సిగ్నల్స్ అందడంతో హెలికాప్టర్ రివ్వున చత్తీస్‌గఢ్ వైపు దూసుకెళ్లింది. కాగా భద్రాచలం గగనతలంలో తిరిగిన హెలికాప్టర్ రౌండ్ రౌండ్‌కు కిందకు దిగుతుండటంతో అధికారులు అత్యవసర పరిస్థితుల్లో దిగుతుందనే సందిగ్ధంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సమాయత్తమయ్యారు. కాగా ఏటిసి నుంచి రూట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అందిన క్షణాల్లోనే హెలికాప్టర్ వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో సర్పంచ్‌ను నరికి చంపిన మావోలు
చింతూరు, జనవరి 2: ఛత్తీస్‌గ్ఢ్ రాష్ట్ర బిజాపూర్ జిల్లా మాంకెళి సర్పంచ్‌ను మావోయిస్టులు బుధవారం కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. వివరాలు ఇలా వున్నాయి... బిజాపూర్ జిల్లా మాంకెళి పంచాయతీ సర్పంచ్ మిడియం బుద్దారాం (45) నయాపార రేషన్ దుకాణానికి సరుకుల కోసం వెళ్లాడు. ఈ క్రమంలో నలుగు మావోయిస్టులు రేషన్ దుకాణం వద్దకు ఒకేసారి కొడవళ్లతో దాడి చేసి నరికారు. బుద్దారం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో రేషన్ దుకాణానికి వచ్చిన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజీవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో సర్పంచ్‌ను నరికి చంపిన మావోలు
చింతూరు, జనవరి 2: ఛత్తీస్‌గ్ఢ్ రాష్ట్ర బిజాపూర్ జిల్లా మాంకెళి సర్పంచ్‌ను మావోయిస్టులు బుధవారం కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. వివరాలు ఇలా వున్నాయి... బిజాపూర్ జిల్లా మాంకెళి పంచాయతీ సర్పంచ్ మిడియం బుద్దారాం (45) నయాపార రేషన్ దుకాణానికి సరుకుల కోసం వెళ్లాడు. ఈ క్రమంలో నలుగు మావోయిస్టులు రేషన్ దుకాణం వద్దకు ఒకేసారి కొడవళ్లతో దాడి చేసి నరికారు. బుద్దారం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో రేషన్ దుకాణానికి వచ్చిన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజీవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎదుళ్ళవాగు లిఫ్ట్ ఇరిగేషన్‌కు
సత్వరం మరమ్మతులు చేయాలి
కొత్తగూడెం, జనవరి 2: రైతులకు ఉపయోగపడే మండల పరిధిలోని రాఘవాపురం పంచాయతీ మాలబంజర్ గ్రామంలో ఉన్న ఎదుళ్ళవాగుపై ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్‌ను మరమ్మతులు చేయించాలని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యులు మచ్చా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం మచ్చా నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించిన అనంతరం మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 7హెచ్‌పి మోటార్ ఏర్పాటు చేసి వాగులో బావి నిర్మాణం చేసి 10ఎకరాల భూమికి సాగునీరు ఇచ్చారని, అదేవిధంగా 10హెచ్‌పి మోటార్‌తో లిఫ్ట్ ఏర్పాటు చేసి 20ఎకరాలకు సాగునీరు ఇచ్చారని, 15హెచ్‌పి మోటార్లు రెండు ఏర్పాటు చేసి 60ఎకరాల భూమికి సాగునీరు ఇచ్చారని తెలిపారు.
రెండు మోటార్లకు కలిపి ఎదుళ్ళవాగులో ఒకే బావిని నిర్మించారని పేర్కొన్నారు. 2001వ సంవత్సరంలో ఎపిఎస్‌ఐడిసి ఆధ్వర్యంలో రూ.13లక్షల వ్యయంతో లిఫ్టిరిగేషన్ ఏర్పాటు చేసి 20హెచ్‌పి మోటార్లు రెండు ఏర్పాటు చేసి 70ఎకరాల భూమికి సాగునీరు అందించారని తెలిపారు. ప్రస్తుతం ఈనాలుగు లిఫ్టిరిగేషన్లు నడవడం లేదని బావులు కూడుకుపోయి మోటార్లు కాలిపోయి పనిచేయడం లేదన్నారు.
సత్వరమే మరమ్మతులు నిర్వహించి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతినిధి బృందంలో తాండ్ర నాగబాబు, మారెం శ్రీనివాసరెడ్డి, డి శ్రీనివాసరావు, చిరంజీవి, తెల్లబోయిన పెద్దశ్రీను, చిమటా అప్పారావు, భుక్కా నర్సింహారావు, కల్తి వెంకటి, తగరపు వెంకటరాములు, వెంకటేశ్వర్లు, నాగభూషణం, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
11న రాష్ట్ర సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 2: తెలుగుదేశం పార్టీ రాష్టస్థ్రాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 11వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర జిల్లాలో జరగనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ సమస్యలతో పాటు ప్రత్యేక తెలంగాణ అంశం, పాదయాత్ర పొడిగింపు, అసెంబ్లీ సమావేశాలు, సహకార, స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖరిని అన్ని జిల్లాల నాయకులకు మరోసారి స్పష్టం చేసే అవకాశం కూడా ఉంది.