హైదరాబాద్, జనవరి 5: ఒక వర్గం ప్రజల మనోభావాలను, వారు ఎంతో పవిత్రంగా పూజించే దేవుళ్లను కించపరిచే విధంగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ఒకవైపు రాష్ట్రంలోనే గాక, జాతీయ స్థాయిలో సైతం విమర్శలు, నిరసనలు, ఖండనలు వ్యక్తమవుతున్నా, నిన్నమొన్నటి వరకు ఆ పార్టీలోని నేతలెవ్వరు కూడా నోరువిప్పకపోగా, అదే పార్టీకి చెందిన మరో వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆ పార్టీలో కొనసాగాలా? లేదా? అన్న అంశంపై తర్జనభర్జన చేస్తున్నట్లు తెలిసింది. ముస్లింయేతర వర్గానికి చెందిన నలుగురు కార్పొరేటర్లకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న వత్తిడి కారణంగా వారు ఏం చెప్పాలో తెలీక వౌనం వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కార్పొరేటర్లు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నా, దాన్ని ఆఫ్‌ది రికార్డుగా భావించాలని కోరటం విశేషం. ముఖ్యంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మజ్లిస్ మతతత్వ పార్టీలో తానింక కొనసాగేది లేదని జాంబాగ్ మున్సిపల్ వార్డు కమిటీ సభ్యుడు ఎం.ఎ. హకీం శనివారం స్పష్టం చేశారు. ఇస్లాం మత ఏ మతం గానీ, వర్గం ప్రజల మనోభావాలను కించపర్చాలని ఎక్కడా చెప్పలేదని అక్బరుద్ధీన్ అలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల నగరంలోని ఇరువర్గాల ప్రజల మధ్య ద్వేషాలను రెచ్చగొట్టినట్టవుతుందని ఆయన స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజలు, విద్యావంతులు, సెక్యులర్ భావాలు కల్గిన వారు సైతం ఆయన వ్యాఖ్యల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా, మజ్లిస్ పార్టీ నేతల భయం కారణంగా భయటపడటం లేదనే చెప్పవచ్చు. ఇతర పార్టీలకు చెందిన మైనార్టీ నేతుల నిజంగానే లౌకికవాదులైతే ఆయన వ్యాఖ్యలను బహిరంగంగా ఎందుకు ఖండించటం లేదని వాదన విన్పిస్తోంది. ఇతర పార్టీల నుంచి మజ్లిస్‌లో చేరిన నేతలు సైతం లోలోపల ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అలాగే అక్బరుద్ధీన్‌కు వ్యతిరేకంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. బిజెపి పార్టీ ఆధ్వర్యంలోనే గాక, ఏ పార్టీకి సంబంధం లేని తటస్తులు సైతం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రెండురోజుల క్రితం మాసాబ్‌ట్యాంక్ ఫ్లై వోవర్ కింద బిజెపి నేతలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయగా, శనివారం రామంతాపూర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పలువురు స్థానికులు అక్బరుద్ధీన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాజాగా అక్బర్ అరెస్టుకు సంబంధించి డిజిపి డెడ్‌లైన్ విధిస్తూ శనివారం ప్రకటన చేయటం మజ్లిస్ వర్గాలను మరింత కలవరానికి గురి చేసిందనే చెప్పవచ్చు.
నేరరహిత సమాజ నిర్మాణంలో
న్యాయ విద్యార్థుల పాత్ర కీలకం
ముషీరాబాద్, జనవరి 5: మగవారిలో నేరప్రవృత్తి పెరగడానికి మూలాలను లెక్కించుకుండా కేవలం సంఘటనలకే పరిమితమై కఠిన శిక్షలు అమలు చేయడం వల్ల నేరప్రవృత్తిలో మార్పు రాదని సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని ఓయు లా కాలేజీలో ‘్భరతదేశంలో మహిళలపై చిత్రహింసలు-విమర్శనాత్మక దృక్పథం’ అనే అంశంపై సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ నేరరహిత సమాజం నిర్మాణ దిశగా పాలకులు, పౌరసమాజం కృషి చేయాలని, అందుకు న్యాయవిద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్న యువత హద్దులు మీరి ప్రవర్తించడం వల్లే నేరాలు అధికమవుతున్నాయన్నారు. గృహాల్లో, యూనివర్సిటీల్లో, సమాజంలో మనిషికి మతవిలువలు కాకండా మానవత్వ విలువలు బోధిస్తే మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఆకాంక్షించారు.
పరిశ్రమలో గ్రూప్‌లను అరికట్టేందుకు కృషి
ఖైరతాబాద్, జనవరి 5: సినీపరిశ్రమలో గ్రూప్‌లు ఉన్నమాట వాస్తవమేనని, గ్రూప్‌లను అరికట్టేందుకు కృషి చేస్తానని ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పరిశ్రమలో అందర్నీ కలుపుకొని విభేదాలకు తావులేకుండా చూస్తానని తెలిపారు. కౌన్సిల్ తరఫున ఒక టీవీ చానల్ ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. అన్ని ధరలతో పాటు టికెట్ల ధరలు పెరిగిపోతున్నాయి తప్ప కేవలం సినిమా టికెట్ల ధరలే పెరగడం లేదని దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
* అక్బర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు! * తీవ్రంగా ఖండించిన వార్డు కమిటీ సభ్యుడు * ఆలోచనలో పడ్డ మజ్లిస్ కార్పొరేటర్లు..?
english title:
m
Date:
Sunday, January 6, 2013