తాండూరు, జనవరి 5: రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించినందుకే తన సోదరుడు అక్బరుద్దీన్ రాద్ధాంతాన్ని భూతద్దంలో చూపిస్తున్నారని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ఈద్గా మైదానం ప్రాంగణంలో శనివారం రాత్రి 11.30 వరకూ జరిగిన బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపిల రహస్య ఒప్పందానికి ఇది నిదర్శనమని అన్నారు. తాము హిందువులకు వ్యతిరేకం కాదని, అక్బరుద్దీన్ వచ్చాక కోర్టులో లొంగిపోతారని, కోర్టులంటే తమకు ఎనలేని గౌరవముందని అన్నారు. నిర్మల్‌లో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్‌లో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హిందూపక్షపాతిగా మారారని, ముస్లింలతో పాటు హిందువుల అభ్యున్నతి కోసం తమ రాజకీయ జీవితంలో పాటుపడుతున్నామని అన్నారు. వైఎస్ హయాంలో ముస్లింలకు ఎంతోకొంత న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తాము ఎవరికీ భయపడమని, తమ అస్తిత్వానికి దెబ్బతగిలితే సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయాలు శాశ్వతం కాదని, ముస్లింలపై వివక్ష ఇలా ఎంతకాలమని ఆయన ప్రశ్నించారు.
ఆధునికత పేరుతో దేశం సర్వనాశనం అవుతోందని, అందుకు ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన దుస్సంఘటనే నిదర్శనమన్నారు. నాగరికత అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ముస్లిం తమ కుటుంబాన్ని, భార్యాపిల్లలను గౌరవించాలని, పెద్దలు చేసే తప్పులనే పిల్లలు చేస్తారన్నారు. హిందుస్థాన్ దేశ సమగ్రతను కాపాడటంలో ముస్లింలు మొదటి నుంచి ముందున్నారని అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు అబ్దుల్ రహీమ్ ఖురేషి ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా వౌలానా రెహమాన్, వౌలానా హసీమ్ మద్దాని, వౌలానా సాహెబ్ పాషా ఖాద్రి, వౌలానా మొహినొద్దీన్‌తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు ముంతాజ్‌ఖాన్, పాషా ఖాద్రి, బల్లాల, అఫ్సర్‌ఖాన్, తాండూరు పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు ఎంఎ హాథీ, ముస్లిం ప్రముఖులు వేలాది మంది ముస్లిం యువకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో తాండూరు డిఎస్పీ ఉదయ్‌కుమార్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తల్లిదండ్రులు
గర్వపడేలా ఎదగాలి
గచ్చిబౌలి, జనవరి 5: తల్లిదండ్రులు గర్వపడేలా యువత ఎదగాలని సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్ర యువజన సర్వీసుల ఆధ్వర్యంలో శిల్పారామంలో జరుగుతున్న యువజన ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ప్రతివిషయంలోనూ నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పర్చుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు. ఏ దేశమేగినా తెలుగుభాషను మర్చిపోవద్దని తెలిపారు. ఆడపిల్లలు మృగాల బారిన పడకుండా తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న యువజన ఉత్సవాలలో యువకళాకారులు ఉర్రూతలూగించారు. కళాకారులతో రాజేంద్రప్రసాద్ చిందేసి ఉత్సాహాన్ని నింపారు. 19 విభాగాలలో జరిగిన పోటీల విజేతలకు యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ చక్రవర్తి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, శిల్పారామం ప్రత్యేక అధికారి జిఎన్ రావు, సినీనటులు రక్షాకమల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. విజేతలలో మొదటి బహుమతిని పొందిన వారిని జాతీయ యువజనోత్సవాలకు పంపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.
-- వంద సీట్లు గెలుచుకుంటాం --
సీమాంధ్ర ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వం
ఘట్‌కేసర్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ప్యాకేజీలు ఇస్తే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ప్యాక్ చేసి ఢిల్లీకి పంపుతామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. ఘట్‌కేసర్‌లోని బాలాజీనగర్‌లో శనివారం రాత్రి తెలంగాణ ధూం ధాం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటూ తెలంగాణలో ఓట్లు, సీట్ల కోసం వస్తున్న పార్టీలను తరిమికొట్టాలని అన్నారు.
రానున్న ఎన్నికలలో వంద సీట్లు తెలంగాణలో గెలుచుకుని అసెంబ్లీలో ఆంధ్ర ఎమ్మెల్యేలు అడుగుపెట్టనివ్వకుండా తెలంగాణ తీర్మానం చేసుకుంటామని ఆయన అన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎక్కడ చేశారో మాత్రం చెప్పలేరని ఆయన విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో కనీసం ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారా చూపండి అన్నారు. నాలుగు జిల్లాలకు నాలుగు యూనివర్శిటీలు ఏర్పాటు చేసుకున్నారు. పది జిల్లాల తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇడుపులపాయను అభివృద్ధి చేసుకోగా, నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి కలికిరిని అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి అనుచరులు భూములను అమ్ముకుని కోట్లు దండుకున్నారనిఆయన విమర్శించారు.
ఈ సందర్బంగా అబ్బసాని యాదగిరి యాదవ్ అధ్వర్యంలో వెయ్యిమంది టిడిపి, కాంగ్రెస్, వైయస్‌ఆర్ సిపిల నుండి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఏపూరి సాయన్న బృందం నిర్వహించిన ధూం ధాం కార్యక్రమం అందిరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్‌ఎస్ తూర్పు డివిజన్ అధ్యక్షుడు పుటం పురుషోత్తంరావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, నాయకులు కమలాకర్‌రెడ్డి, ఉదారి శివకుమార్, బద్రి నారాయణగౌడ్, చిలుకరాజు, గోంగళ్ళ స్వామి యాదవ్, కేశవనాధంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
50 శాతం రిజర్వేషన్లతో బిసిలకు రాజ్యాధికారం
వనస్థలిపురం, జనవరి 5: ఈ ధన రాజకీయ వ్యవస్థలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు పెడితే తప్పక రాజ్యాధికారం సాధింవచ్చునని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బిసి యువజన విభాగం అధ్యక్షుడు ముద్దగోని సతీష్‌గౌడ్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో ఏర్పటు చేసని విలేఖరుల సమావేశంలో కృష్ణయ్యతో పాటు ఆలేరు ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ బిసిలను ఓట్లేసే యంత్రాల్లా చూస్తున్నారని విమర్శించారు. బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి పదివేల కోట్ల నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రకులాలు ఆస్తులు సంపాదించడానికి, కాపాడుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కాని బిసి కులాలు అందుకోసం కాదని, కులాల అభివృద్ధి, ఆత్మగౌరవం పెంచుకోవడానికి అధికారం కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బిసి జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు కృష్ణమోహన్, కాంగ్రెస్ నాయకులు ముద్దగోని జగన్‌గౌడ్, కె.జగన్నాథం, గొరిగే మల్లేష్ యాదవ్, పండాల శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్‌గౌడ్, ఎం.రంజిత్‌గౌడ్, దుర్గయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.