తిరుపతి,జనవరి 5: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతూ టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేదిక్ కళాశాలలో జూనియర్లను ర్యాగింగ్ పట్టి పీడిస్తోంది. అయితే కళాశాల ప్రిన్సిపాల్ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో సీనియర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్లపై దౌర్జన్యం జరుగుతున్నా పట్టించుకున్న వారే లేరు. తాజాగా చెప్పిన పని చేయలేదన్న కోపంతో కొంతమంది సీనియర్లు జూనియర్లపై పడిగుద్దులు కూడా కురిపించారు. దీంతో ముగ్గురు జూనియర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఇంతా జరిగినా అసలేం జరగలేదంటూ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ ఫిర్యాదు మేరకు పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే కేసులు లేకుండా చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. బాధితులు జగదీష్, యశ్వంత్, మల్లికార్జున, హామీద్‌ల కథనం మేరకు కళాశాలలో కొంతకాలంగా ర్యాగింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెస్ సెక్రటరీలుగా, ర్యాంగింగ్ నిరోధక కమిటీ సభ్యులుగా ఉన్న విద్యార్థులే ర్యాంగింగ్‌కు పాల్పడటం గమనించదగ్గ అంశం. మొదటి సంవత్సరం విద్యార్థులైన జగదీష్, యశ్వంత్, మల్లికార్జున, హామీద్‌లను నిత్యం సీనియర్స్ ర్యాంగింగ్ పేరుతో ఇబ్బంది పెట్టేవారన్నారు. ఇటీవల కళాశాలలో చేరిన హమీద్ అనే విద్యార్థి కడుపునొప్పితో ఆపరేషన్ చేయించుకుని ఉన్నప్పటికీ సీనియర్లు తరగతి గదిలోకి వచ్చిన ప్రతి సారి సెల్యూట్ చేయాలని హుకుం జారీ చేశారన్నారు. అది కూడా శబ్దం వినిపించేలా అంటూ ఇబ్బంది పెట్టారు. కడుపు నొప్పని కుదరదంటూ తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారన్నారు. సీనియర్ల దాడిలో గాయపడిన మల్లికార్జున, జగదీష్, యశ్వంత్‌లు మాట్లాడుతూ తమను బయటకు వెళ్లి షాంపూలు తెచ్చిమ్మనమని, టవల్స్ తెచ్చి ఇవ్వాలన్నారు. అంతేకాకుండా తమను చదువుకోనివ్వకుండా పనులు చెపుతూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. జూనియర్లకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడానికి కూడా తమకు అవకాశం ఇవ్వకుండా వెలివేశారన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జూనియర్లం కావడంతో కళాశాలలోని అధ్యాపకులు, అధికారులు కూడా తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాగా శుక్రవారం రాత్రి జూనియర్లకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా లోలోన నలుగుతున్న ర్యాగింగ్ సమస్య ఒక్కసారిగా బయట పడింది. జూనియర్లను సీనియర్ విద్యార్థులు కర్రలతో, రాడ్‌లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తోటి విద్యార్థులు చెపుతున్నారు. అనేక మంది జూనియర్లు ర్యాంగింగ్ కారణంగా కాలేజికి కూడా రావడం లేదంటున్నారు. నిత్యం ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది కల్గిస్తున్న ఫైనల్ ఇయర్ చదువుతున్న యుగంధర్, రమేష్, నాలుగో సంవత్సరం చదువుతున్న బాలకృష్ణ, భాస్కర్ గౌడ్, దీలీప్, జయచంద్ర, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముఖరమ్‌బాషా, మహేష్, శివ, అక్షయ్య, సురేష్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు జగదీష్, యశ్వంత్, మల్లికార్జున, హమీద్‌లు తెలిపారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అలిపిరి సిఐ రాజశేఖర్, ఎస్‌ఐ హరిప్రసాద్, శ్రీకాంత్ తమ సిబ్బందితో కళాశాలకు వెళ్లి విచారించారు. అయితే ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా కళాశాలలో మెస్ సెక్రటరీలుగా పెత్తనం చెలాయిస్తున్నవారే ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గాయపడిన విద్యార్థులు ముగ్గురు స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అడ్డొస్తే తొక్కించేస్తాం... ఖబడ్దార్!
* విఆర్‌ఓలను హెచ్చరించిన ఇసుక మాఫియా * జాతీయరహదారికి అడ్డంగా ఇసుక ట్రాక్టర్లతో రాస్తారోకో
మదనపల్లె, జనవరి 5: ఇసుకను అక్రమంగా కాదు.. రాజులా తీసుకెళ్ళే అధికారం మాకుంది.. అడ్డుకునే వారు ఎదురైతే వారిపై దూసుకెళ్ళి తొక్కించేస్తాం.. ఖబడ్దార్.. అంటూ ఇసుకను తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్న విఆర్‌ఓలను హెచ్చరించారు. అంతేకాకుండా సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్లను తహశీల్దారు కార్యాలయానికి తరలించాలని విఆర్‌ఓలు తెలిపారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా తన ట్రాక్టర్‌లను జాతీయరహదారికి అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. స్పందించిన రూరల్ ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సర్దుబాటు చేస్తుండగా ట్రాక్టర్లను ఏకంగా తహశీల్దారు కార్యాలయం ఎదుట నిలిపేసి నిరసన తెలిపారు. నిలపడమే కాకుండా ఇసుక ట్రాక్టర్‌లను స్థానిక ప్రజాప్రతినిధి ఇంటివద్దగానీ, కార్యాలయం వద్దగానీ నిలుపుతాం.. దమ్ముంటే ఎవరైనా వచ్చి జరిమానా వేయాలని సవాల్ విసిరారు. స్పందించిన పోలీసులు ఇసుకట్రాక్టర్ల యాజమానులతో చర్చించారు. ఈ సంఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె, వేంపల్లె పంచాయతీ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విషయం అంకిశెట్టిపల్లె విఆర్‌ఓ భరత్‌కు సమాచారం అందించారు. దీంతో విఆర్‌ఓ సంఘటన స్థలానికి చేరుకుని ఇసుకను తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్‌లను సీజ్‌చేస్తు వాటిని తహశీల్దారు కార్యాలయానికి తరలించాలని ఆదేశించారు. దీంతో ఇసుకను తరలిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు, నక్కలదినె్నకు చెందిన ఇద్దరు విఆర్‌ఓ భరత్‌పై దౌర్జన్యానికి దిగారు. జరిగిన విషయం తహశీల్దారు, ఆర్‌ఐకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి మండలంలోని విఆర్‌ఓలందరు చేరుకున్నారు. ట్రాక్టర్‌ను కార్యాలయానికి తరలించాల్సిందే అని విఆర్‌ఓలందురు పట్టుబట్టారు. ఆగ్రహించిన ఇసుకమాఫియా గ్యాంగ్ ట్రాక్టర్‌లను బెంగళూరు-మదనపల్లె జాతీయరహదారికి అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన నిర్వహించడమే కాకుండా ట్రాక్టర్లను పట్టుకుని జరిమాన విధించే అధికారం ఎవరికీ లేదు.. ట్రాక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధి ఇంటివద్దగానీ, కార్యాలయం వద్దగాని పెడుతాం.. దమ్ముండే ఏ అధికారైనా జరిమాన విధించాలని సవాల్ విసిరారు. జాతీయరహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో సంఘటన స్థలానికి రూరల్ ఎస్‌ఐ మధు, సిబ్బంది చేరుకుని ఇరువర్గాలను సర్ధిజెప్పారు. అయితే ఇసుకట్రాక్టర్ల నిర్వాహకులు వాహనాలను నేరుగా తహశీల్దారు కార్యాలయం ఎదురుగా పెట్టి అక్కడ కూడా నిరసన తెలిపారు. విఆర్‌ఓలపై దౌర్జన్యం చేయడమే కాకుండా అక్రమంగా ఇసుకను తరలించడం నేరమని పోలీసులు చెప్పడంతో నిర్వాహకులు ట్రాక్టర్లను తహశీల్దారు కార్యాలయంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎనిమిది ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు తహశీల్దారు అమరేంద్రబాబు, ఎస్‌ఐ మధు తెలిపారు. అదేవిధంగా విఆర్‌ఓలపై దౌర్జన్యం చేసిన వారిపై కూడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వైభవంగా ముగిసిన
విశ్వనాథ సాహిత్యంపై సదస్సు
తిరుపతి, జనవరి 5: భారతీయ సాంస్కృతిక పరిరక్షణ, విశ్వనాథ సాహిత్యం అంశంపై నాలుగు రోజులుగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి ఎడిటర్ ఇన్ చీఫ్ రవ్వా శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారతీయ సంస్కృతి పరిరక్షణ - నాటకాలు అనే అంశంపై ప్రముఖ పండితులు ఉపన్యశించారు. పురాణ హితహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ‘గుప్తపాసుపథం’, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ కెఎ కృష్ణమూర్తి ‘త్రిశూలం’ కరీంనగర్‌కు చెందిన డాక్టర్ గండ్ర లక్ష్మణ్‌రావు ‘వేణరాజు’ కర్నూలుకు చెందిన డాక్టర్ బి మంగమ్మ ‘నర్తనశాల’ డాక్టర్ పి విజయ్‌కుమార్ ‘అనార్కళి’ అనే నాటకాలపై సుధీర్ఘంగా ప్రసంగించారు. డిపిపి కో- ఆర్డినేటర్ డాక్టర్ చెన్నకేశవుల నాయుడు‘శబరి’ మైసూరుకు చెందిన డాక్టర్ హరినాధ్ ‘వెయ్యిపడగల నవశిల్పం’ అనే అంశాలపై పరిశోధనా పత్రాలను సమర్పించారు. విజయవాడకు చెందిన అండవెల్లి సత్యనారాయణ, విశ్వనాథ వ్యక్తిత్వం అన్న అంశంపై హైదరాబాద్‌కు చెందిన సుబ్బారావు, విశ్వనాథ శ్రుతులు అన్న అంశంపై విజయనగరానికి చెందిన మానప్రగడ శేషసాయి, మద్యాక్కరలు అన్న అంశంపై తిరుపతికి చెందిన డాక్టర్ సర్వోత్తమరావు, విశ్వనాథ వేద సంస్కృతి అన్న అంశంపై డాక్టర్ ఆకెళ్ల, వివిధ పక్రియలపై ఆత్రేయ శర్మలు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో టిటిడి జేఇఓ వెంకట్రామిరెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షలు డాక్టర్ వెలిచాల కొండల రావు, డాక్టర్ లక్ష్మణమూర్తి, గౌరిపెద్ది వేంకటశంకర భగవాన్, అన్నమాచార్య ప్రాజెక్టు కో- ఆర్డినేటర్ డాక్టర్ కె వాణి పాల్గొన్నారు.
మదనపల్లె మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తి
మదనపల్లె, జనవరి 5: మదనపల్లె పురపాలికలో కమిషనర్, స్పెషలాఫీసర్‌పై మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్‌హుసేన్ లోకాయుక్తాకు ఫిర్యాదుచేసిన వాటిపై విచారణ పూర్తిచేసి, వీటిపై నివేదిక పదిరోజుల్లో లోకాయుక్తాకు అందజేస్తామని రాజమండ్రి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ అండ్ అప్పిలేట్ అధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. లోకాయుక్తా కేసు నమోదు చేసి జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి నివేదికలు అందజేస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రత్యేకాధికారి నాలుగునెలల కాలం పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలు జరిగినట్లు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
విశ్రాంత కమిషనర్‌ను విచారించిన ఆర్డీ
2004-07 వరకు మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన నాగభూషణం పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై శనివారం రిటైర్డ్ కమిషనర్ నాగభూషణంను రాజమండ్రి రీజినల్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ విచారించారు. పట్టణంలో ఎన్‌విఆర్ లేఔట్ సమీపంలో వేసిన రోడ్డు పనులు, కాలువలు, పార్కుల అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన పనులపై ఆర్డీ విచారించారు.
‘రుయా’ ఉద్యోగుల దీక్షల విరమణ
తిరుపతి,జనవరి 5: రుయాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. రుయాలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ సమ్మెకు దిగిన నాలుగో తరగతి ఉద్యోగులకు హామీ ఇస్తూ డిసిసి అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రుయాసుపత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి అండగా ఉంటామని ప్రభుత్వం తరపున తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రుయా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తమ ఆసుపత్రికి 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆసుపత్రిని తాము అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు. అందుకు డిసిసి అధ్యక్షుడు స్పందించి సమస్యలన్నింటిని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం ఐఎన్‌టియుసి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎల్ రత్నకుమార్, రుయా బ్రాంచి అధ్యక్షుడు గురవయ్య మాట్లాడుతూ రుయాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వం స్పందించడం శుభ పరిణామమన్నారు. ఎజిఎల్‌ఐ బాండ్లు వెంటనే ఇవ్వాలలన్నారు. కార్యక్రమంలో ఐఎన్‌టియుసి నాయకులు సుబ్రహ్మణ్యం, భూపతమ్మ, సక్కుబాయి, ఎంయుకెఎస్ రాజు, సెల్వరాజు, గంగరాజు పాల్గొన్నారు.
ఎఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం
చిత్తూరు, జనవరి 5: సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ఎఎన్‌ఎంను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేటట్లు చేసిన ఎస్‌పిహెచ్‌ఓను సస్పెండ్ చేయాలని ఎపి పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తిరుచానూరు సబ్‌సెంటర్‌లో ఎఎన్‌ఎంగా పనిచేస్తున్న గిరిజన ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ ఇ.బి.దేవి వేధిస్తుండడంతో వేధింపులు తాళలేక ఎఎన్‌ఎం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు ఆరోపించారు. ఈవిషయమై ఈనెల 7నజిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు లక్ష్మీనారాయణ, శివ తెలిపారు. ఇంకా వీరితోపాటు ఎపి పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా కోశాధికారి పెరుమాళ్, భానుప్రకాష్, శివ, మురళితోపాటు పలువురు ఉన్నారు.
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
పుత్తూరు, జనవరి 5: గత ఏడాదిలో పుత్తూరు పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డు రాజేంద్ర హత్య కేసులో శనివారం నిందితుడు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పుత్తూరు డిఎస్పీ అరిపూల్లా విలేఖరులకు తెలిపారు.