Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మంత్రికి ముడుపుల మాట నిజమేనా...?

$
0
0

ఏన్కూరు, జనవరి 5: మండల కేంద్రమైన ఏన్కూరులో గత మూడు సంవత్సరాల క్రితం గిరిజన పిల్లల అభివృద్ధి కోసం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన శ్రీచైతన్య టెక్నోస్కూల్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర ఉద్యానవనశాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి ఆయన అనుచరులు కొంతమంది చైతన్య టెక్నోస్కూల్ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేసి రూ. 35లక్షలు వసూలు చేశారని స్కూలు యాజమాన్యం రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా పాఠశాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈక్రమంలో మంత్రికి దఫాల వారీగా సుమారు రూ. 35లక్షలు ఇచ్చామని పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వాంకుడోత్ రమేష్ శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సంచలనమైన ఈవ్యవహారంపై స్పెషల్ పోలీస్‌వర్గాలు రంగంలోకి దిగి చైతన్య టెక్నోస్కూల్ ఎక్కడ ఉంది, దీని వెనుక వ్యక్తులు ఎవరు, స్కూల్ అనుమతి ఏ తరగతి వరకు ఉంది, పిల్లల ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారనే విషయాలపై ఆరాతీశారు. దీంతోపాటు మంత్రికి రూ.35లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయంపై ఇంటిలిజెన్స్ సిఐ కిషన్ ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రమేష్ నుండి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా పాఠశాల యాజమాన్యానికి, గతంలో ఈపాఠశాల అభివృద్ధి కోసం పనిచేసిన జర్పుల వెంకటేశ్వర్లు, దారావత్ నర్సింహారావు అనే వ్యక్తులకు మధ్య ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలో మండలంలోని నూకాలంపాడుకు చెందిన గొంతు చంద్రం అనే వ్యక్తి జర్పుల వెంకటేశ్వర్లు ద్వారా పాఠశాల యాజమాన్యానికి పెట్టుబడిగా రూ.35లక్షలు ఇచ్చినట్లు, అవి అడిగితే ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో డిసెంబర్ మాసంలో కేసునమోదైంది. ఈవిషయంపై పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రమేష్‌కు, గొంతు చంద్రంకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇరువర్గాలపై డిసెంబర్ 17న పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఇల్లెందు డిఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈవ్యవహారం అంతా కోర్టు పరిధిలో ఉండడంతో కేసులు ఎలా మలుపుతిరుగుతాయో అని పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
మంత్రి రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
* మండల కాంగ్రెస్ నాయకుల ఖండన
స్థానిక చైతన్య టెక్నోస్కూల్ నుండి మంత్రి రాంరెడ్డివెంకటరెడ్డి డబ్బులు తీసుకున్నారని పత్రికలలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని మండల కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో ఖండించారు. మంత్రి రాంరెడ్డి రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు ఎదుర్కోలేదని మంత్రిపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రజాసేవ కోసం పనిచేసే మంత్రిపై ఇలాంటి ఆరోపణలు తగవని తెలిపారు. ఈప్రకటన చేసినవారిలో చలపతి రామరాజు, సక్రునాయక్, నల్లమల వెంకటేశ్వరరావు, నరేంద్ర, హనుమంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

‘మీ కోసం’ యాత్ర
ఓ మహా ప్రజాయజ్ఞం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 5: మీ కోసం యాత్ర ఓ మహా ప్రజాయజ్ఞం లాంటిదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయటం, ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పాలకపక్షానికి నిద్రపట్టడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందని, యువతరం ఉపాధి అవకాశాలు లేక నిరుత్సాహాస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని పాలకులు నిర్వీర్యం చేయటంతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. డిడిపి పరిపాలన కాలంలో రైతులను, విద్యార్థులను అన్ని విధాల ఆదుకున్నారని గుర్తు చేశారు. క్రమశిక్షణ లేని పరిపాలన, పదవులకు పాకులాడటం కాంగ్రెస్‌కే చెల్లించిందన్నారు. చంద్రబాబు మీకోసం యాత్ర జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి కొనసాగనున్నదని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై యాత్రకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. అనంతరం ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసినందుకు గుర్తుగా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో 100అడుగుల ఎత్తులో నిర్మించిన పైలాన్‌ను చంద్రబాబు ప్రారంభిస్తారని, ఈ ప్రాంతంలోనే పార్టీ బహిరంగ సభ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు పాదయాత్ర కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపిందన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినంతో పాటు చంద్రబాబు పాదయాత్ర పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోవాలన్నారు. రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ముందుండి నడిపించాల్సింది కార్యకర్తలేనన్నారు. అనంతరం ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిందని, విద్యుత్ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రాత్రి సమయాల్లో సైతం విద్యుత్‌ను సరఫరా చేయటం లేదని, ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, మందడపు సుధాకర్, భీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిపబ్లిక్‌డే కానుకగా తెలంగాణ రాష్ట్రం
* ఎమ్మెల్యే రేగా ఉద్ఘాటన
పినపాక, జనవరి 5: గత కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ నెల 26న జరిగే రిపబ్లిక్‌డే నాడు రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్ని హంగులతో కూడిన అజెండాను సిద్ధం చేసినట్లు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలోని ఏడూళ్ళబయ్యారం క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ మోసపరిత ప్రకటనలు చేసిందని టిఆర్‌ఎస్, మిత్రపక్షాలు చేసిన ఆరోపణల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేసిన ప్రకటనకు అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని హైకమాండ్ ముందే చెప్పిందన్నారు. దీనికి కట్టుబడి రిపబ్లిక్ డే కానుకగా రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో టిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలు చేసే పార్టీలు కూడా బూటకపు ప్రకటనలు మానుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతం, సీమాంధ్ర ప్రాంత ఎంపీ సీట్లు సమానంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో 2014లో ఎన్నికల్లో రెండు ప్రాంతాల నుంచి 20ఎంపీ సీట్లకు తగ్గకుండా ఉండేలా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అలాగే రెండు ప్రాంతాల్లో ఉండే ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా హైద్రాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుతో హైద్రాబాద్‌లోని ముస్లీంల మనోభావాలు సైతం దెబ్బతినకుండా వారి నుంచి సైతం సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు కుడితిపూడి కోటేశ్వరరావు, కంది సుబ్బారెడ్డి, పొనుగోటి భద్రయ్య, పూజారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వికె 7ఇంక్లైన్‌ను సందర్శించిన ఎపిజెన్‌కో డైరెక్టర్
రుద్రంపూర్, జనవరి 5: కొత్తగూడెం ఏరియా పరిధిలోని వికె 7ఇంక్లైన్ గనిని ఎపిజెన్‌కో డైరెక్టర్ ఎస్ ఆంజనేయరావు శనివారం సందర్శించారు. 7షాఫ్ట్ గనిలోని బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కంటిన్యూస్‌మైనర్ (సిఎంఆర్)ను పరిశీలించారు. అనంతరం ఏరియా నుండి కెటిపిఎస్‌కు బొగ్గు రవాణా అవుతున్న లోడింగ్‌పాయింట్, బొగ్గు నాణ్యత వివరాలను ఎస్‌ఓటుజిఎం కె సూర్యనారాయణలు, ప్లాంట్ ఇంజనీర్ ముత్యాల నాయుడును అడిగి తెలుసుకున్నారు. డైరెక్టర్ వెంట సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ జె సమ్మయ్య, కెటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ ఎం సిద్దయ్య, కెటిపిఎస్ కోల్ ప్లాంట్ ఇన్‌చార్జ్ కె నర్సింహం, సుబ్రహ్మణ్యం, చింతల శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

అవినీతి వల్లే రాష్ట్రంలో అభివృద్థి కుంటుపడింది
ఆఎంపి నామ నాగేశ్వరరావు విమర్శ
కొణిజర్ల, జనవరి 5: అవినీతి, జవాబుదారి తనం లేకపోవటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు విమర్శించారు. పార్టీఅధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు సంఘీభావంగా శనివారం గద్దలగూడెం నుంచి బస్వాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు దోచుకుతిన్నారని, లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, హైదరాబాద్‌ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడుదన్నారు. నేడు
బాబు చేస్తున్న యాత్రకు ప్రజల చూపిస్తున్న అభిమానాన్ని మరువలేమన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి పరిపాలనలోకి రావటం ఖాయమని, బాబు యాత్రలో వచ్చిన ప్రజా సమస్యలన్ని పరిష్కారమవుతాయన్నారు. చంద్రబాబు చేస్తున్న యాత్రకు జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, చంద్రబాబు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అన్ని జిల్లాల్లో కంటే మిన్నగా ఖమ్మం జిల్లాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోట్ల శ్రీను, రాందాస్ నాయక్, బాలాజీ నాయక్, బెల్లం వేణుగోపాల్, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

శరవేగంగా పైలాన్ నిర్మాణ పనులు
తిరుమలాయపాలెం, జనవరి 5: మండల పరిధిలోని మాదిరిపురం గ్రామంలో మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 100రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా నిర్మిస్తున్న పైలాన్ నిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పైలాన్‌కు చంద్రబాబు యాత్రకు గుర్తుగా చారిత్రాత్మక ఘట్టంగా ప్రజల్లో నిలిచిపోవాలనే తలంపుతో నామ నాగేశ్వరరావు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సుబ్లేడు క్రాస్‌రోడ్డులో బస్టాండ్‌కు తూర్పుభాగంలో దీనిని నిర్మిస్తున్నారు. పైలాన్‌కు అవసరమైన గద్దెను పొడుగు, వెడల్పు 31అడుగులు, గద్దెపై నుంచి పైలాన్ స్టీల్‌ను 69అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నట్లు హైదరాబాద్ మధుకాన్ గ్రూపు సలహాదారు సజీవన్ పిళ్లై, బృందం సభ్యులు నాగేంద్రబాబు, నర్సింహా, లక్ష్మబాబు, రమణమూర్తి తెలిపారు. పైలాన్ నిర్మాణపు పనులను శనివారం ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, రాష్ట్ర ఎన్టీయుసి కార్యదర్శి రత్నాకర్, జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, స్వర్ణకుమారి, వరంగల్ జిల్లా నేత రామ్మోహన్‌రావు, ఎలగొండ కృష్ణమూర్తి తదితరులు పరిశీలించారు. కాగా పైలాన్ నిర్మాణపు పనుల నిర్వహణను కంపెనీ సలహాదారుడు సజీవన్ పిళ్ళైను ఎంపి నామ నాగేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. రాత్రింబవళ్ళు కూలీలు పని చేస్తున్నందున ఆదివారం ఉదయం వరకు పైలాన్ నిర్మాణం పూర్తవుతుందని, ఆదివారం ఉదయానే్న ఎన్టీఆర్ విగ్రహం బాపతు అవసరమైన నిర్మాణాలను ప్రారంభిస్తామని ఆయన ఎంపి నామాకు తెలిపారు. ఇదిలా ఉండగా ఎంపి నామ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను పాలేరు టిడిపి ఇన్‌చార్జి స్వర్ణకుమారి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు, బెల్లం వేణు మాదిరిపురం వద్దనే మకాం వేసి నామ సూచనలను పాటిస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నారు. చివరిగా నామ నాగేశ్వరరావు ఒక బృందం గాను, తుమ్మల, సండ్ర, బాలసాని తదితరులు మరో బృందంగాను వేర్వేరు సమయాల్లో పైలాన్‌ను పరిశీలించారు. అందరూ ఒకేసారి వస్తే ఐక్యంగా ఉన్నారనటానికి అవకాశాలున్నాయని, వేర్వేరుగా రావటం వల్ల కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పోతున్నాయనే వాదనలు విన్పిస్తున్నాయి.

ట్రాన్స్‌కో ఎఇని నిర్బంధించిన రైతులు
దమ్మపేట, జనవరి 5: వేళాపాళా లేని విద్యుత్ కోతలు..ఎండుతున్న పంటలతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు నాగుపల్లి ట్రాన్స్‌కో ఎఇ రామారావును శనివారం సబ్ స్టేషన్‌లో నిర్బంధించారు. గత కొన్ని రోజులుగా వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదు. దీంతో రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో నాగుపల్లికి చేరుకున్న రైతులు ఎఇ రామారావుతో వాగ్వివాదానికి దిగారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని విద్యుత్‌తో తాము ఎలా పంటలు సాగు చేయాలని ప్రశ్నించారు. రోజుకు కనీసం నాలుగు గంటలు కూడా సరఫరా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎఇ సమాధానం సంతృప్తిగా లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఎఇతో పాటు సిబ్బందిని నిర్బంధించి తాళాలు వేశారు. సమాచారం అందుకున్న ఎడిఇ రమేష్ నాగుపల్లికి చేరుకుని రైతులతో చర్చించారు. పై నుంచి కోతలు ఉండటం వల్లే తాము సరఫరా చేయలేకపోతున్నామని, ఈ ఫీడర్ పరిధిలోని రైతుల సమస్యను అధికారులకు నివేదిస్తామన్నారు. సమస్యను పరిష్కరించి నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

బహిరంగ శిక్షలు ఉంటేనే భయం ఉంటుంది
కారేపల్లి, జనవరి 5: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి బహిరంగ శిక్షలు ఉంటేనే భయం ఉంటుందని వైరా ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని విశ్వనాథపల్లి పంచాయితీ బంజర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సమాజంలో తప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతుండగా బాధితులు మాత్రం అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న చట్టాలను అమలు చేస్తే కొత్త చట్టాల అవసరం ఉండదన్నారు. ఢిల్లీ ఘటనపై దేశమంతా స్పందించిన తీరు అపూర్వమని ఆయిన ఇంకా అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదుష్టకరమన్నారు. ప్రభుత్వం కింది స్థాయిలో ఇబ్బందులను పరిశీలించకుండానే పథకాలను ప్రవేశ పెట్టడం వల్ల క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అమృతహస్తం పథకంలో కేటాయించిన పైకంతో పౌష్టికాహరం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కేటాయించే నిధులతో కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి ఉందన్నారు. కారేపల్లి మందులవాడ విషయమై వి ప్రస్తావించగా స్పందించిన ఎమ్మెల్యే నూతన తహశీల్దార్ విధుల్లోకి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్థామన్నారు. కార్యక్రమంలో సింగు నరసింహారావు, దొండపాటి రమేష్, నారాయణ, పురం వెంకట్, పాల్గొన్నారు. అంతకుముందు కారేపల్లి-1 అంగన్‌వాడీ కేంద్రంలో అమృతహస్తంను ఎమ్మెల్యే ప్రారంభించారు.

పార్టీ ప్రణాళికల ద్వారా ప్రజల్లోకి వెళ్తాం
పాల్వంచ, జనవరి 5: పార్టీ రూపొందించిన ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్ళి పార్టీని మరింత పటిష్ఠవంతం చేయనున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి జిల్లా నాయకులు జలగం వెంకట్రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణగతొక్కుతుందన్నారు. రాష్ట్రంలోని పేదప్రజలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే పరిష్కారమన్నారు. ఢిల్లీలో అత్యాచారం చేసి ఆమె మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతినియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈవిలేఖరుల సమావేశంలో నాయకులు మచ్చా శ్రీనివాసరావు, రవీందర్‌రెడ్డి, వసంత, మందలపు వెంకటేశ్వర్లు, వల్లపు యాకయ్య, అప్పారావు పాల్గొన్నారు.

ప్రజా చైతన్యమే కళాకారుల లక్ష్యం
కొత్తగూడెం, జనవరి 5: కళల ద్వారా ప్రజలను చైతన్యం చేసి దోపిడిపై సమరశంఖం పూరించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు నిరంతరం కళారూపాలు ప్రదర్శిస్తూ అమర కళాకారుల ఆశయాలను సాధించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వి కొండలరావు పిలుపునిచ్చారు. కార్మిక ప్రాంతమైన రామవరంలో అమర కళాకారుల శ్రద్ధాంజలి సభను ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసభకు నియోజకవర్గ అధ్యక్షులు మజ్జిగ కొమరయ్య అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, జిల్లా నాయకులు బరిగెల సాయిలు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సాధు ఇజ్జిగిరి, ఎస్‌కె మెహమూద్, తూముల శ్రీనివాస్, వంగా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.

శృంగేరి పీఠాధిపతికి ఘన స్వాగతం
ఖమ్మం (కల్చరల్), జనవరి 5: శృంగేరి జగద్గురు శారదాపీఠాధిపతులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి శనివారం రాత్రి పట్టణానికి చేరుకున్నారు. ఆదివారం నాడు పట్టణంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను ఆయన పట్టణానికి విచ్చేయగా ఆయనకు పట్టణంలోని భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. రెండు దశాబ్ధాల తర్వాత పట్టణానికి శృంగేరి పీఠాధిపతులు రావటంతో పట్టణంలోని భక్తబృందంలో ఆనందం వెల్లివిరిసింది. పట్టణ శివార్లలో స్వామికి ఎదురేగిన భక్తబృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికి, పాద ప్రక్షాళన చేసి పట్టణంలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఆయన భక్తులకు మంగళాశాసనం చేస్తూ వేడుకగా మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా స్వర్ణ్భారతి కల్యాణ మండపం వరకు తొడ్కొని వచ్చారు. కార్యక్రమంలో పట్టణ శృం గేరి భక్తబృందం, పురోహిత సంఘం, సర్వబ్రాహ్మణ సేవాసమాజం, శివాలయం ధర్మాధికారి సోమశేఖర్, కోదండరామాలయం ధర్మాధికారి రామకృషన్‌రావు, రామచంద్రుల గురవయ్య సత్రం ధర్మాధికారి జూపూడి హనుమప్రసాద్ పాల్గొన్నారు.

హనుమత్ వాహనంపై విలాసోత్సవం
భద్రాచలం, జనవరి 5: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నస్వామి వారి విలాసోత్సవాలలో భాగంగా శనివారం పంచాయతీ ఆధ్వర్యంలో విలాసోత్సవం నిర్వహించారు. తొలుత స్వామివారిని రామాలయం నుంచి భాజాబజంత్రీలు, మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా పంచాయతీ కార్యాలయ ఆవరణలోని శ్రీ నృసింహదాసు మండపంలో శ్రీ ఆంజనేయస్వామి వాహనంలో ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, అర్చన, మంగళవాద్యం, చతుర్వేద విన్నపాల అనంతరం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, పంచాయతీ ఇఓ గోపాలకృష్ణమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, జెవి రావు, దేవస్థానం, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మండల కేంద్రమైన ఏన్కూరులో గత మూడు సంవత్సరాల క్రితం
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>