నెల్లూరుసిటీ, జనవరి 5: రాష్ట్రంలో పేద, బడుగు బలహీన లబ్ధిదారులకు దాదాపు 2.81లక్షల ఎకరాలను భూపంపిణీ కార్యక్రమం కింద ఇచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక విఆర్సీ మైదానంలో నెల్లూరు డివిజన్ పరిధిలో లబ్ధిదారులకు భూపంపిణీ, గ్యాస్, కౌలురైతులకు రుణాలు, బ్యాంక్ లింకేజి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతిష్ఠాత్మంగా భూపంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున 5విడతలుగా అమలు చేశామన్నారు. ఇంకా మిగిలి పోయిన లబ్ధిదారులను గుర్తించి 6వ విడతగా భూపంపిణీ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. జిల్లాలో 5 విడతలుగా 39,975 మంది లబ్ధిదారులకు 50,805 ఎకరాల భూపంపిణీ చేశామన్నారు. 6వ విడతలో 10వేల ఎకరాలు 8,091 మంది లబ్ధిదారులకు భూపంపిణీ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. అందులో నెల్లూరు డివిజన్‌కు సంబంధించి 2,460ఎకరాలు 2,299 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో సాగుదారులు రక్షణ హస్తం కింద కౌలు రైతులకు ఇంతవరకు 35,540 మందికి 15,70కోట్లు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసినట్లు చెప్పారు. నెల్లూరు డివిజన్‌లో 3.5కోట్లు, దీపం కనెక్షన్ కింద 5వేల మందికి, బ్యాంక్ లింకేజి మెప్మా ద్వారా దాదాపు 487గ్రూపులకు 10,41 కోట్ల వివిధ కార్పొరేషన్ సంస్థల ద్వారా 149 మంది లబ్ధిదారులకు 91.36లక్షలు రుణాలను మంజూరు చేసి సంబంధిత చెక్కులను పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అందచేసిన భూములను ఆర్థిక స్థోమత లేక చాలామంది భూములను అభివృద్ధి చేసుకోలేని పరిస్థితులలో ఉన్న పేద బలహీన వర్గాల భూములను దాదాపు 10లక్షల ఎకరాలను సమగ్ర అభివృద్ధి పరచేందుకు 1,860కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామన్నారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తామన్నారు. రైతులు వేసుకున్న పంటలను పూర్తి స్థాయిలో పండించేందుకు ప్రస్తుతం ఉన్న సాగునీటి పరిస్థితులకు అనుగుణంగా నీటిని పొదుపుగా విడుదల చేస్తూ సాధ్యమైనంత వరకు పంటలు పూర్తి స్థాయిలో పండించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 7ఏళ్ళ కాలంలో దాదాపు 6లక్షల ఎకరాలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించామన్నారు. లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ 890కోట్లతో, 650కోట్లతో భూగర్భడ్రైనేజి వ్యవస్థ నిర్మాణాలను చేపడతామన్నారు. నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పేద బడుగు బలహీన వర్గాల వారినికి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నెల్లూరు డివిజన్‌కు సంబంధించి దాదాపు 5వేల మందికి భూపంపిణీకి, 5వేల మంది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ మాట్లాడుతూ భూపంపిణీ కార్యక్రమం కింద అర్హులైన లబ్ధిదారును గుర్తించి వారికి భూమి పట్టాలు ఇవ్వడమే కాకుండా పాస్ పుస్తకాలతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను కూడా అందస్తామన్నారు. 6వ విడత భూపంపిణీలో జిల్లాలో 10వేల ఎకరాలకు గాను నెల్లూరు డివిజన్‌లో 5వేల ఎకరాలు భూపంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తిరుపతి ఎంపి చింతామోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళికలో సంక్షేమ పథకాలకు 69వేల కోట్లు వెచ్చించామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం కిదం సంవత్సరానికి ప్రతి లబ్ధిదారునికి ఏడాదికి 20వేల రూపాయలను నేరుగా అందేలా 600 జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ, శాసన మండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరు గ్రామీణ నియోజక వర్గ ఇన్‌చార్జ్ ఆనం విజయకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిటీ కన్వీనర్ యలమూరి రంగయ్యనాయుడు, పిండి సురేష్‌బాబు, వెంకటజ్యోతి, సంయుక్త కలెక్టర్ బి లక్ష్మీకాంతం, నెల్లూరు ఆర్‌డిఓ కె మాధవీలత పాల్గొన్నారు.
వైఎస్ పథకాలే
జగన్‌కు శ్రీరామరక్ష
పెళ్లకూరు, జనవరి 5: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్‌కు శ్రీరామరక్షగా నిలుస్తాయని నెల్లూరు ఎంపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన పెళ్లకూరు బస్‌షెల్టర్ వద్ద వైఎస్సార్‌సిపి నాయకులు పేరం మధునాయుడు, ఓడూరు గిరిధర్‌రెడ్డి, బైనా చంద్రశేఖర్‌రెడ్డిలు శనివారం వైఎస్ జగన్ విడుదల కోసం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని అరెస్డ్‌చేసి 7 మాసాలైందని, ఇప్పటివరకు ఆయనను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జగన్ జైలునుండి బైటకు వస్తే టిడిపి, కాంగ్రెస్ పార్టీల దుకాణాలు మూతపడతాయన్నారు. జగన్‌కు ఉన్న జనాదరణ చూసి ఢిల్లీ పెద్దలు కంగు తింటున్నారని, అందుకే ఆయనను జైలులో పెట్టించారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఆయన కుమారుడు జగన్ సిఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. టిడిపి హాయాంలో రాష్ట్రంలో కేవలం 16 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చారని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా 70 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. 2014లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సిపికి 35 పార్లమెంటు స్థానాలు 200కు పైచిలుకు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు.
మేకపాటికి ఘన స్వాగతం
నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డుమార్గాన నేరుగా మండల కేంద్రమైన పెళ్లకూరు వద్ద ఏర్పాటు చేసిన కోటి సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మధునాయుడు, గిరిధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆనంతరం ఆయన వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పెళ్లకూరు, సిఎంపేట, కలవకూరు తదితర గ్రామాల నుండి సుమారు 300 మంది కార్యకర్తలు పార్టీలో చేరగా, వారికి మేకపాటి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ డిఐజి కె బాలకొండయ్య, మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, చెన్నారెడ్డి బాలచెన్నయ్య, ఓడూరు సుందరరామిరెడ్డి, వెందోటి పార్ధశారధిరెడ్డి, మస్తాన్‌రెడ్డి, రామచంద్రయ్య, రవి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సర్‌చార్జీలు చెల్లించలేమంటూ
టిడిపి వినూత్న నిరసన
నెల్లూరు సిటీ, జనవరి 5: విద్యుత్ సర్ చార్జీలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశంపార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. శనివారం నగరంలోని గాంధీబొమ్మ కూడలి వద్ద ఇద్దరు తెలుగుదేశంపార్టీకి చెందిన కార్యకర్తలు విద్యుత్ సర్‌చార్జీలు చెల్లించలేమంటూ ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా నాటకీయంగా వ్యవహరించారు. నాడు రాజశేఖరరెడ్డి పాపానికి, నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి శాపానికి బలైపోతున్నామంటూ ఉరి వేసుకుంటున్నట్లు నటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాల గుత్తి అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నెల్లూరు నగరశాఖ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగుదేశం మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షులు మున్వర్, బిసిసెల్ జిల్లా అధ్యక్షులు నూనె మల్లికార్జునయాదవ్, మాజీ కౌన్సిలర్ భైరపోగు బుజ్జయ్య, మాజీ కార్పొరేటర్లు దగ్గు సుబ్బారావు, ధర్మవరం సుబ్బారావు, తెలుగుదేశం నాయకులు ఉచ్చి భువనేశ్వరిప్రసాద్, మండవ రామయ్య, అన్నం దయాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
జగన్ కోసం జనం
సంతకాల కొనసాగింపు
నెల్లూరు, జనవరి 5: జగన్ కోసం జనం సంతకం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా సహకరిస్తున్న వారందరికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పోలుబోయిన అనీల్‌కుమార్‌యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక రాజన్నభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య లక్షన్నరకు చేరుకుంటోందని వివరించారు. గత నెల 25వ తేదీ నుంచి నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి తరువాత ఈ సంతకాల నివేదికల్ని రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి అందజేయనున్న దృష్ట్యా ఆలోగానే తాము సేకరించిన వాటిని రాష్టక్రమిటీకి అందజేయనున్నట్లు చెప్పారు. విలేఖర్ల సమావేశంలో మాజీ కార్పొరేటర్ రూప్‌కుమార్‌యాదవ్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు సుభాన్, సుధాకర్, వెంకటేశ్వరరెడ్డి, తాజుద్దీన్ పాల్గొన్నారు.
రూ.400కోట్లతో ప్రత్యేక మంచినీటి పైపులైన్ల నిర్మాణం
నెల్లూరు సిటీ, జనవరి 5: సంగం బ్యారేజ్ నుండి ప్రత్యేక మంచినీటి పైపులైన్ల నిర్మాణం 400 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక 27వ డివిజన్‌లోని రుత్విక్ లేఅవుట్ వద్ద 10లక్షలతో నిర్మించునున్న సిమెంట్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా పట్టణాన్ని కార్పొరేషన్‌గా మార్చి కోట్లాది రూపాయలను వెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అందులో భాగంగా 140కోట్లతో ఇందిర జలాశయం నిర్మించి మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. 600కోట్లతో భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. జాతీయ రహదారినికి కలుపుతూ పట్టణంలో ప్రధాన కూడళ్ల నుండి అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా 27వ డివిజన్‌లో దాదాపు 12కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నెల్లూరు నగరంలో స్థానిక శాసన సభ్యుల సహకారంతో పూర్తి స్థాయిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను మంజూరు చేస్తోందన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో పొదలకూరు రోడ్డును నాలుగులైన్ల నిర్మాణాలగా చేపతామన్నారు. నగరంలో దాదాపు అన్ని డివిజన్‌లలో సిమెంటు రోడ్డు, డ్రైన్లు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మాజీ కార్పొరేటర్ సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడుతూ 27వ డివిజన్‌లో దాదాపు 10కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ డివిజన్‌లో దాదాపుగా సిసి రోడ్లు, డ్రైయిన్లు, కల్వర్టులను పూర్తి చేశామన్నారు. ఒక్క రోడ్డు మాత్రమే పెండింగ్‌లో ఉందని దానిని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, ఎన్‌డిసిసి చైర్మన్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆనం విజయకుమార్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు, నరేంద్రరెడ్డి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
స.హపై కోర్టు ఝలక్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 5: సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆదేశాల్ని తప్పుపట్టడమేగాక అవాస్తవ ఫిర్యాదు చేసిన వ్యక్తికి హైకోర్టు పదివేల రూపాయల జరిమానా విధించిన అంశాన్ని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉప కులపతి రాజారామిరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని దర్గామిట్ట బారాషాహీద్ దర్గా వద్ద ఉన్న విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివిధ వివరాలను తెలిపారు. తమ విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన భూ విస్తీర్ణం, సర్వేనెం, ఇతర వివరాలను, ఆక్రమించుకున్న వారి పేర్లను, న్యాయపరంగా కొనసాగుతున్న విధానం తెలపాలంటూ రావూరు రమేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ప్రకారం కోరారన్నారు. అయితే ఇందుకు సంబంధించి అన్ని వివరాలను తాము సదరు వ్యక్తికి అందజేశామన్నారు. అయినాసరే వివరాలను ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ అతను సమాచార హక్కు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఆ సందర్భంలో వివరాలు తెలపాలంటూ కమిషనర్ నుంచి తమకు తాఖీదు అందిందన్నారు. దీనిపై విశ్వవిద్యాలయ పిఆర్‌ఓ కాకుండా రిజిస్ట్రార్ వస్తేనే వివరణ స్వీకరిస్తామంటూ కమిషనర్ అప్పట్లో కరాఖండిగా స్పష్టం చేశారన్నారు. ఈ విధంగా జరిగిన జాప్యంతో కమిషనర్ తమ రిజిస్ట్రార్‌పై రెండువేల రూపాయల వరకు జరిమానా విధించారన్నారు. ఇందులో తమ తప్పేమి లేనందున, జరిమాన చెల్లించకుండా హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇంతవరకు పత్రికల్లో వార్తలు ప్రచురితమైన సంగతి కూడా ఆయన గుర్తు చేశారు. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు చూస్తే వృథాప్రయాసగా స.హ చట్టం వినియోగించుకుంటున్న ఫిర్యాదిదారుడిపైనే ఆగ్రహం వెలిబుచ్చిన సంగతి అర్ధమవుతుందన్నారు. అతని నుంచే పదివేల రూపాయల జరిమానా వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించిందని తగిన వివరాలన్నీ విలేఖర్లకు చూపారు. అధికార్ల పరిపాలనా సమయం వృధా అయ్యేలా చేయడం, అవాస్తవ ఫిర్యాదుతో అగౌరవపరిచేలా వ్యవహరించడంపైనే హైకోర్టు తీవ్రంగా స్పందించిందన్నారు. చాలామంది స.హ ప్రకారం వెబ్‌సైట్‌లో లభించే సమాచారం, సాధారణ దరఖాస్తుల్లో కూడా ఉండే వివరాలను కోరుతున్నారన్నారు. దీనివల్ల తమకు చాలా సమయం వృథా అవుతుందని రాజారామిరెడ్డి వాపోయారు.
కెఎస్సార్ మెమోరియల్ ట్రస్ట్‌ను రద్దు చేయాలి
నాయుడుపేట, జనవరి 5: మండలపరిధిలోని నరసారెడ్డికండ్రిగ వద్దగల కెఎస్సార్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్‌ను రద్దు చేయాలని, సంస్ధ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ట్రస్ట్‌లో చదువుతున్న విద్యార్ధులు శనివారం నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. మండలపరిధిలోని నరసారెడ్డి కండ్రిగ వద్ద కేంద్రప్రభుత్వ గిరిజన సంక్షేమసంఘ నిధులతో కెఎస్సార్ మెమోరియల్ ట్రస్ట్‌ను బాబురెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ స్వచ్చందసంస్థ ద్వారా శ్రీ సాయి సంజీవని గిరిజన పాఠశాల, బిఇడి కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో హాస్టల్ వసతికి తమ వద్ద నుంచి సుమారు 11 వేల రూపాయలు వసూలు చేశారని విద్యార్థులు చెప్పారు. తగిన వసతులు కల్పించడంలో నిర్వాహకులు విఫలమైనారని శుక్రవారం విద్యార్ధులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో పలు మానవహక్కుల సంఘాలవారు శుక్రవారం కెఎస్సార్ మెమోరియల్ ట్రస్ట్‌కు వెళ్లగా గిరిజన పాఠశాలలో చదువుతున్న 37 మంది విద్యార్థ్ధులకు కనీసతిండిలేక వంటలుకూడా వారే వండుకుంటూ దృశ్యాలు చూసి నిర్వాహకులను తీవ్రంగా మందలించారు. ఈ నేపధ్యంలో శనివారం ఉదయం ట్రస్ట్ నిర్వహకునికి సంబంధించిన ఒక రు ఆగ్రహంతో ఊగిపోతూ పాఠశాల విషయాలను బైటవారికి ఎందుకు చెప్పారని విద్యార్థులను తీవ్రంగా కొట్టారు. దీనితో భయబ్రాంతులకు గురైన విద్యార్ధులు హాస్టల్‌నుండి పెట్టేబేడా సర్ధుకుని తలోదారి వెళ్లిపోయారు. అదేసమయంలో అక్కడకు చేరుకున్న మానవహక్కుల సంఘం ప్రతినిధులు వారిలో 24 మంది విద్యార్ధులను గుర్తించి నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాత్కాలిక శిబిరం ఏర్పాటుచేసి ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ చెంచుకృష్ణమ్మ, ఎంపిడివో ప్రమీళారాణి, సిఐ మాణిక్యరావు, జిల్లా బాలల సంరక్షణాధికారి దేవికిరణ, ఐసిటిఎస్ కౌన్సిలర్ సుమలత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తహశీల్దార్ సబ్‌కలెక్టర్ జె నివాస్‌కు సంఘటనా వివరాలను వివించి వారి ఆదేశాల మేరకు విద్యార్ధినిలను పుదూరులరోని గురుకుల పాఠశాలలో, విద్యార్ధులలో నాయుడుపమేటలోని గురుకుల పాఠశాలలో చేర్పించారు. పాఠశాల నిర్వాహించలేని ఓ ప్రైవేటు స్వచ్చందస్థకు బిఇడి కళాశాల ఏ విదంగా కేటాయించారని, ఇందులోని నిజానిజాలను తేల్చాలని, అంతేగాక ఈ స్వచ్చంద సంస్థలో ఉన్నారన్నది వెల్లడించాలన్నారు.