Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తీరు మారాలి

$
0
0

ఒంగోలు, జనవరి 5: జిల్లాలో తహశీల్దార్లు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ అనితారాజేంద్ర మండిపడ్డారు. ప్రజల కోసం పని చేయాలంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాలులో రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, మీసేవా కేంద్రాల పనితీరు తదితర అంశాలపై కలెక్టర్ తహశీల్దార్లతో సమీక్షించారు. సమావేశం జరుగుతున్న సమయంలో కొంతమంది తహశీల్దార్లు నిద్రపోవడం, మరికొంతమంది మాట్లాడుకోవటాన్ని కలెక్టర్ గమనించారు. ఈసందర్భంగా వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని ఆమె హితవు పలికారు. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణపై కూడా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జనవరి నెలాఖరులోగా రెవెన్యూ రికార్డులు, ఎల్‌ఆర్‌ఎంఎస్‌లు పూర్తిచేయాలన్నారు. అవసరమైన మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలని తహశీల్దార్లను ఆమె ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ రికార్డులు కంప్యూటీకరణ పూర్తిచేసినట్లైతే లబ్ధిదారులకు వేగవంతంగా భూములకు సంబంధించిన వివరాలు అందచేసేందుకు వీలౌతుందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారులు వారానికి ఒకరోజు తహశీల్దార్లు కార్యాలయాలను సందర్శించి రికార్డులు పరిశీలించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మీసేవా కేంద్రాల్లో అన్నిరకాల సర్ట్ఫికెట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల నిధుల నుండి మంజూరైన నిధులు రైతులకు పంపిణీ చేసి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు వెంటనే అందచేయాలన్నారు. 2005 నుండి 2011 సంవత్సరం వరకు ప్రకృతి వైపరీత్యాల నిధుల నుండి పంపిణీ చేయగా మిగిలిపోయిన నిధులను తహశీల్దార్లు ప్రభుత్వ శాఖలకు జమచేయాలని ఆమె ఆదేశాలు జారీచేశారు. పెండింగ్ నిధులు బ్యాంకు ఖాతాకు జమచేయనట్లయితే ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో గృహనిర్మాణ పొజిషన్ సర్ట్ఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పొజిషన్ సర్ట్ఫికెట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని కేటాయించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు అప్పగించాలని జిల్లాకలెక్టర్ అనితారాజేంద్ర తహశీల్దార్లను ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా సంయుక్తకలెక్టర్ పి లక్ష్మీనృశింహం, సిపిఒ కెటి వెంకయ్య, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

త్వరలో రెండో విడత
సాగర్ నీరు విడుదల!
కాల్వల పర్యవేక్షణలో నిమగ్నమైన అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 5: జిల్లాలోని రైతులకు శుభవార్త. రెండవ విడత రైతులకు నీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. జిల్లాలోని రైతులకు తొలివిడతగా 20 రోజులపాటు సాగర్ నీటిని విడుదల చేశారు. దీంతో ఎండిపోతున్న పంటలకు కొంతమేర ఊపిరి వచ్చింది. కాగా ప్రభుత్వ కాలపరిమితి దాటిపోవటంతో సాగర్ అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. కాగా తొలివిడత సాగర్ నీటి సరఫరా విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి. బల్లికురవ మండలం ముక్తేశ్వరం, త్రిపురాంతకం మండలం గురిజేపల్లి వద్ద సాగర్ కాల్వలకు గండికొట్టి నీటిని కిందకు కొంతమంది వదిలారు. దీంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు సక్రమంగా అందలేదు. అదేవిధంగా సాగర్ కాల్వల పనులు కూడా సక్రమంగా జరగకపోవటంతో నీరు వేగంగా రాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉండగా కాల్వలపై పోలీసు, రెవెన్యూ అధికారుల గస్తీకూడా నామమాత్రంగానే ఉందనే చెప్పవచ్చు. ఈ సమస్యలన్నింటిపై నాగార్జున సాగర్ అధికారులు అధ్యయనం చేసి నీటిని త్వరితగతిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా జిల్లాకు రావాల్సిన నీటి వాటాను కూడా గుంటూరు జిల్లా అధికారులు అక్రమంగా తరలించుకుపోయారు. దీంతో జిల్లాలోని రైతులకు సక్రమంగా నీరు అందకపోవటంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వలపై అద్దంకి, దర్శి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాదురెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తదితరులు తిరిగి నీటి పరిమాణాలపై ఆందోళన చెందారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో 4.54 హెక్టార్లలో వివిధ పంటలను సాగుచేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 2.20 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు ఉన్నాయి. సాగర్ ఆయకట్టు కింద ప్రధానంగా వరిసాగు ఎక్కువగా ఉంటుంది. కాని నీరు సక్రమంగా రాకపోవటంతో ఎక్కువశాతం మంది రైతులు వరి సాగుకు స్వస్తిపలికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు కింద మొక్కజొన్న, మిర్చి, శనగ, పొగాకు, వరి పంటలు ఉన్నాయి. చీమకుర్తి, సంతనూతలపాడు తదితర మండలాల్లో సుమారు 25వేల ఎకరాల్లో పొగాకు పంట సాగైంది. సాగర్ నీటిని రెండవ విడత విడుదల చేస్తేనే జిల్లాలోని పంటలకు జీవం పోసినట్లు అవుతుంది. ఇదిలాఉండగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ శాతం బత్తాయి తోటలు ఎండిపోవటంతో రైతులు ప్రత్యామ్నాయంగా గడ్డిమడులు పెట్టుకుని పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంమీద త్వరలోనే జిల్లాలోని రైతులకు రెండవ విడత సాగర్ నీటిని విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఎస్‌సి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి’
చీరాల, జనవరి 5: రానున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్‌సి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తప్పదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోస్తాంధ్ర జిల్లాల కన్వీనర్ నాగయ్య మాదిగ హెచ్చరించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో చీరాల నియోజకవర్గ ఎంఆర్‌పిఎస్ ముఖ్యనాయకులతో శనివారం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఆర్‌పియస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 2006లో వర్గీకరణకు అనుకూలంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారన్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటుచేశారన్నారు. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలోని 59కులాలకు 15శాతం రిజర్వేషన్‌ను సామాజికంగా విద్య, ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో 8 శాతం రిజర్వేషన్ మాత్రమే మాదిగ, మాదిగ ఉపకులాలకు అవకాశాలు దక్కుతున్నాయన్నారు. తక్కువ జనాభాగల మాలలకు 13శాతం రిజర్వేషన్ అవకాశాలు రావటం వలన అన్ని రంగాలలో ముందుకు వెళ్ళారన్నారు. కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి 2008లో నివేదిక సమర్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో చట్టం తీసుకురావాలని సూచించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా మాదిగ ప్రజలను మోసం చేయటంపట్ల అన్ని రంగాలలో అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవటానికి ఎంఆర్‌పియస్, అనుబంధ సంఘాల గ్రామ, మండల కమిటీలను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య మాదిగ, తాళ్ళూరి త్యాగరాజు, అనపర్తి రత్నబాబు, పి అభిషేక్, మనోహర్, ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు సాగాలి
* ఎస్‌ఎఫ్‌ఐ 35వ జిల్లా మహాహభలలో వక్తల పిలుపు
కందుకూరు రూరల్, జనవరి 5: ప్రపంచీకరణ విషసంస్కృతి విద్యా వ్యవస్థను కలుషితం చేస్తుందని, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలని పలువురు వక్తలు రద్ఘాటించారు. ఎస్‌ఎఫ్‌ఐ 35వ జిల్లా మహాససభలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్యనగర్ (జనార్దనస్వామి కల్యాణ మండపం)లో శనివారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభలో ఆసంఘ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కంచర్ల రామయ్య అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈసందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రపంచీకరణతో ప్రభుత్వ రంగ, విద్యాప్రమాణాలు పడిపోవడం, సంక్షేమం నీరుగారిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో విదేశీ యూనివర్సిటీలను అనుమతించే చర్యల వల్ల విశ్వవిద్యాలయాలు మూతపడే ప్రమాదముందన్నారు. నిధుల కొరతతో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజిల్లా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6న ఛలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈకార్యక్రమంలో యుటిఎఫ్ గౌరవాధ్యక్షులు పిజె విలియం మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు యూనివర్సిటీతోపాటు స్టడీ సర్కిల్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జెవివి నాయకులు డాక్టర్ మువ్వా కొండయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాస్ర్తియ అవగాహన అవలరుచుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షులు ఎస్ సుబ్బారెడ్డి, జె అల్లూరిస్వామి, అధ్యక్షవర్గంగా వ్యవహరించి సుబ్బారెడ్డి ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి కిరణ్, జిల్లా కార్యదర్శి బి రాఘురామ్, మాజీ కార్యదర్శులు జివి కొండారెడ్డి, జివిబి కుమార్, వ్యవసాయ కార్మిక సంఘ డివిజన్ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, నాయకులు ఎం మల్లికార్జున, డాక్టర్ ఓ రామకోటయ్య, ఎం మనోజ, మహేష్, మహేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సదరం క్యాంపులో వికలాంగుడు మృతి
* ప్రజాసంఘాల నిరసన
* మృతదేహాన్ని సందర్శించిన డిఆర్‌డిఎ పిడి, ఆర్‌డిఓ
కందుకూరు, జనవరి 5: స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఆవరణలో జరుగుతున్న సదరం క్యాంపులో పొన్నలూరు మండలం శివన్నపాలెం గ్రామానికి చెందిన పంది తిరుపతయ్య (65) అనే వికలాంగ వృద్ధుడు మృతి చెందాడు. ఈసంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. వికలాంగుడి బంధువులు, వైద్యుల కథనం మేరకు కుడికాలు పూర్తిగా చచ్చుపడి వికలాంగుడిగా జీవనం వెళ్లదీస్తున్నాడని తెలిపారు. ఆ వృద్ధుడు తన మేనల్లుడు వద్ద జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో వికలాంగ పింఛన్ పొందడానికి వికలాంగ ధ్రువీకరణ పత్రం కోసం సదరం క్యాంపునకు హాజరైనట్లు తెలిపారు. కాగా సదరం క్యాంపు క్యూలో ఎక్కువ మంది ఉండడంతో చాలా సేపు వేచి చూశాడు. ఈక్రమంలో తనకు తోడుగా వచ్చిన మేనల్లుడు బ్యాంకు పనిపై బయటకు వెళ్లాడు. కొంతసేపటికి వికలాంగుడు క్యూలో నిలబడలేక పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడని, కూర్చున్న వెంటనే సొమ్మసిల్లి పడిపోయాడు. కాగా తిరుపతయ్య గుండెపోటుతోమృతి చెందాడని వైద్యులు తెలుపుతున్నారు. ఈసంఘటనపై స్పందించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంమాదిగ, జిల్లా కార్యదర్శి వర్లా దేవదాసుమాదిగ, స్థానిక వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు గోచిపాతల కోటి ఆధ్వర్యంలో వికలాంగుడు మృతిపై నిరసన వ్యక్తం చేశారు. ఈక్రమంలో వైద్యశాలకు చేరుకున్న డిఆర్‌డిఎ పిడి పద్మజ, ఆర్‌డిఓ టి బాపిరెడ్డి ముందుగా పోలీస్‌శాఖ సహాయంతో క్యూను క్రమబద్దీకరించి వికలాంగులకు సౌకర్యం కల్పించారు. అనంతరం మృతుని బంధువులు నాయకులతో డిఆర్‌డిఎ పిడి, ఆర్‌డిఓ బాపిరెడ్డిలు మాట్లాడారు. ఈసందర్భంగా నాయకులు కనీస వసతులైన తాగునీరు సౌకర్యం అంతంతమాత్రంగా ఉందని వివరించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను పట్టుబట్టారు. ఈక్రమంలో డిఆర్‌డిఎ పిడి, ఆర్‌డిఓ మృతుని అంత్యక్రియలకు 5వేలు నగదు అందించి, ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ముందుగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లైతే ఈ పరిస్థితులు నెలకొని ఉండేవికాదని వికలాంగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్బరుద్దీన్ దిష్టిబొమ్మ దగ్ధం
చీరాల, జనవరి 5: హిందువుల మనోభావాలను కించపరుస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం చీరాలలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హిందువులను రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ మాట్లాడటం అత్యంత దారుణమైన విషయమని బిజెపి నాయకులు మండిపడ్డారు. వెంటనే ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ సెంటర్ నుంచి పురవీధులలో ఎంజిసి మార్కెట్, ముక్కోణం పార్కు, బస్టాండ్, నాజ్ థియేటర్ రోడ్డుమీదుగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు చేరుకున్నారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవి ఉండి అక్బరుద్దీన్ హిందువులను రెచ్చగొడుతూ ఈవిధంగా వ్యాఖ్యానాలు చేయటం హేయమైన చర్య అని వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నాశిన చంద్రశేఖర్, ఎంవి రమణారావు, రామిశెట్టి కోటేశ్వరరావు, మేడికొండ భరణీరావు, హనుమంతరెడ్డి, శ్రీనివాసరావు, ఎం సుబ్బయ్య, గంజి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష్మీచెన్నకేశవస్వామి శాంతికల్యాణం
మార్కాపురంరూరల్, జనవరి 5: భూదేవి, శ్రీదేవి సమేతుడైన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి శాంతికల్యాణం శనివారం స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి మూలవిరాట్‌కు అర్చకస్వాములు ఎస్ కేశవచార్యులు, ఎన్ తిరుమలచార్యులు స్వామివారిని పుష్పాలంకరణ, అభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఆలయ మధ్యరంగ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామిని వేంచేపచేశారు. ఉభయదాతలతో కలిసి స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదమంత్రోశ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

హెచ్‌వైడిఎస్ ద్వారా మెరుగైన విద్యుత్‌తోపాటు చౌర్యాన్ని అరికడతాం
* రైతులు కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవాలి
* ట్రాన్స్‌కో ఎస్‌ఇ హరినాథరావు
మార్కాపురం, జనవరి 5: జిల్లాలోని మార్కాపురం, కనిగిరి సబ్‌డివిజన్ల పరిధిలో హైఓల్టేజీ డిస్కం సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివలన విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంతోపాటు రైతులకు మెరుగైన విద్యుత్ అందించే అవకాశం ఉంటుందని జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఇ హరినాథరావు తెలిపారు.

తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>