Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

14 నుండి శ్రీగోగులమ్మ తల్లి జాతీయ కబడ్డీ పోటీలు

$
0
0

నరసాపురం, జనవరి 5: శ్రీగోగులమ్మ తల్లి జాతీయస్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ చెప్పారు. శనివారం రుస్తుంబాదాలోని కబడ్డీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పోటీల వివరాలు వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 36 టీములు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. పోటీలు లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిన ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతాయన్నారు. దూర ప్రాంతాల నుండి విచ్చేసే క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే గెలుపొందిన జట్లకు రూ.5 లక్షల బహుమతులు అందిస్తామన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన పురుష, మహిళా జట్లకు లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా రూ. 75వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 50వేలు, నాలుగవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 25 వేలు అందిస్తామన్నారు. అలాగే పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులతోపాటు షీల్డులు అందిస్తామని జానకిరామ్ చెప్పారు. సమావేశంలో కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీర్ల వెంకయ్య, జిల్లా సంఘం కార్యదర్శి ఎం రంగారావు, జయరాజు, చినిమిల్లి శ్రీనివాసు, కొప్పినీడి గోపి, అడబాల బాబులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్1విడుదల
*జనం గుండెల్లో దడదడ*విద్యుత్ ఛార్జీల పెంపుపై బెంబేలు*వామపక్షాల వైపే చూపు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 5 : కొత్త సంవత్సరం మొదలైన దగ్గర నుంచి జనం గుండెలు దడదడలాడుతూనే వున్నాయి. ఈ దడ రోజులు గడిచే కొద్దీ పెరుగుతూనే వుంది తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఏప్రిల్ 1 విడుదల అన్న వాఖ్యంతో జనంలో బీపీ మరింత పెరిగిపోతోంది. సర్‌ఛార్జీల వడ్డనతోనే సరిపెట్టకుండా ఏకంగా కరెంటు ఛార్జీలు కూడా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి జరుగుతూనే వుంది. దానికి అనుగుణంగానే డిస్కంలు కరెంటు ఛార్జీల పెంపుదలకు ప్రతిపాదనలు రూపొందించి శనివారం ఇ ఆర్‌సికి సమర్పించాయి. ఇక ఈ పరిణామంతో ఛార్జీల వడ్డన పూర్తిగా ఖరారైనట్లేనని చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ 1 నుంచి పెంచిన కరెంటు ఛార్జీలను అమలు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కరెంటు బిల్లులు గూబలు అదిరేలా చేస్తుంటే దానికి సర్‌ఛార్జీ జత కలిపి గుయ్యిమనిపిస్తున్నారు. వీటికే జనం అల్లాడిపోతూ గగ్గోలు పెడుతుంటే దానికి తోడు ఇప్పుడు ఏకంగా కరెంటు ఛార్జీలే పెంచేసేందుకు సిద్ధం కావడం మాత్రం జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోందనే చెప్పుకోవాలి. గత కొద్దికాలంగా ఛార్జీల విషయంలో ప్రజలంతా తీవ్ర విమర్శలు చేస్తున్నా రాజకీయ పార్టీల నుంచి వాటికి వస్తున్న స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంటూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఛార్జీలు పెంచిన వెంటనే ఒకటి, రెండు రోజులు అక్కడక్కడ ధర్నాలు చేయడం, రాస్తారోకోలతోనే సరిపెట్టారు. దానే్న ప్రభుత్వంపై పోరాటంగా చెప్పుకుంటూ పార్టీలు కాలం గడిపేశాయి. దీంతో జనం పక్షాన నిలబడే పక్షాలేవన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. గతంలో ఇటువంటి సందర్భాల్లో వామపక్షాలు విశ్వరూపం ప్రదర్శించి ప్రభుత్వాలను కూడా గడగడలాడించిన పరిస్థితులు తెలిసినవే. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఇటువంటి పరిణామాలు దాదాపు రాష్ట్రంలోనే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి రాజకీయ పార్టీలు సర్వసాధారణంగా జనం సమస్యల్లో వున్నప్పుడు వాటిని భుజాన వేసుకుని ప్రభుత్వంతో పోరాటం జరుగుతుంటుంది. కానీ పార్టీలే రాజకీయ అవసరాల్లో కూరుకుపోయి ఎవరి కుంపటి వారు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన దుస్థితిలో జనాన్ని గురించి పట్టించుకునే తీరిక, అవకాశం లేకుండా పోయాయన్న విమర్శలు వినిపిస్తూనే వున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే వామపక్షాలు పోరాట పటిమ చూపి కొంతవరకైనా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుండేవి. ఇటీవలి కాలంలో జనం స్పందన తగ్గిందా? లేక వామపక్షాల పోరాట పటిమ వాడిపోయిందా? అన్న అనుమానాలు కలిగే రీతిలో సమస్యల విషయంలో స్పందన పెద్దగా కనిపించడం లేదనే చెప్పుకోవాలి. మరోవైపు కరెంటు ఛార్జీలను పెంచడంతోనే సరిపెట్టకుండా కొన్ని శ్లాబులను కూడా తొలగిస్తారన్న ప్రచారం జరుగుతుండటం కూడా జనాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ పరిస్థితే వస్తే బడుగులు, సామాన్యులు కూడా వేలల్లో ఛార్జీలు కట్టాల్సి రావచ్చు. ఈ అంశమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ప్రస్తుతానికి శ్లాబుల తొలగింపు లేదని కొంతమంది నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నా ఆ ప్రతిపాదనల్లో ఎటువంటి మెలికలు వున్నాయో అవి ఏ దిశగా పయనించి జనంపై పడతాయోనన్న ఆందోళన మాత్రం అందరిలోనూ వ్యక్తమవుతోంది. రానున్న రెండు రోజుల్లో కరెంటు ఛార్జీల భారం ఏ స్థాయిలో మోతెక్కనుందో అధికారిక హోదాలోనే వెల్లడి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగానే దాదాపు 18 వేల కోట్ల రూపాయల మేరకు ఛార్జీల పెంపుద్వారా జనంపై భారం వేయాలని డిస్కంలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే అదే దామాషాలో జిల్లాపై కూడా ఈ భారం తడిసిమోపెడుకానుంది.
వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి చర్యలు
కేంద్ర పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ, మత్స్యశాఖల సంయుక్త కార్యదర్శి సంజయ్
ఏలూరు, జనవరి 5 : రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులున్నాయని, వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ, మత్స్యశాఖల సంయుక్త కార్యదర్శి సంజయ్ బూసిరెడ్డి చెప్పారు. స్థానిక ఇరిగేషన్ అతిధిగృహంలో శనివారం సాయంత్రం కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులతో పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలను అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ జిడిపి వృద్ధి రేటులో 4 శాతం వ్యవసాయ రంగం నుండి వస్తుందని, దీనిలో 33 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల ద్వారా వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన రుణ పరపతిలో 82 శాతం రుణాలుగా వ్యవసాయ రంగానికి అందిస్తున్నామని, 8 నుండి 10 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలుగా అందిస్తున్నామన్నారు. పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధకం, పౌల్ట్రీ, మత్స్య, తదితర రంగాల అభివృద్ధికి వివిధ రాష్ట్రాలలో అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఏ ఏ రంగాలు ఏర్పాటుకు అనుకూలమో క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా ఆయా యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి రైతాంగానికి అవసరమైన యూనిట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ బక్కయ్య, డాక్టర్ లివింగ్‌స్టన్, డాక్టర్ నాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటే
ఎంపి కనుమూరి
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జనవరి 5: కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని భావిస్తున్నానని, భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో కలుస్తుందని ఎంపి కనుమూరి బాపిరాజు జోస్యం చెప్పారు. శనివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నివాసంలో విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కనుమూరి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌తో శత్రుత్వం లేదన్నారు. వలసలపై మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి వెళ్ళడం, కాంగ్రెస్‌లోకి రావడం సహజ అన్నారు. కాంగ్రెస్ సముద్రం వంటిదని దీనికి హద్దులు లేవన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎఎంసి ఛైర్మన్ పోతుల అన్నవరం, కాంగ్రెస్ నాయకులు యడ్లపల్లి వీరన్ననాయుడు, గుండుబోగుల నాగు, పచ్చమట్ల సావిత్రి, గోర్రెల లక్ష్మినరసింహం తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభం
భీమవరం, జనవరి 5: రాష్టస్థ్రాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పాల పోటీలను శనివారం మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి, టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. హనుమాన్ జంక్షన్ రాయలహంపి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి యర్రా మాట్లాడుతూ అతిపురాతన, ప్రాచీన కళా సంపదకు సంబంధించి ఇటువంటి పోటీలను భీమవరంలో నిర్వహిస్తున్న రాయలహంపి అధినేత కనుమూరి రాజబాబు అభినందనీయులన్నారు. కనుమరుగైపోతున్న ప్రాచీన కళాప్రదర్శనలను కూడా ఈ ఆరు రోజులు రాష్ట్రంలో ఉద్దండులైన ప్రాచీన కళాకారులతోప్రదర్శనలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ పోటీలను చూస్తుంటే సంక్రాంతికి పది రోజుల ముందే వచ్చేసినట్లుందన్నారు. కనుమూరి రాజాబాబు తల్లిదండ్రులు చినరాజు, సావిత్రమ్మలను మాజీ మంత్రి యర్రా అభినందించారు. టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను భీమవరంలోనే నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం రాష్టస్థ్రాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాధరాజు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాదిరాజు సత్యనారాయణరాజు, ఎఎంసి చైర్మన్ ఎఎస్ రాజు, గొట్టుముక్కల వెంకటపతిరాజు, అల్లూరి సుబ్బరాజు, కనుమూరి రామకృష్ణరాజు, వేగేశ్న కనకరాజు సూరి, చినఅమిరం యూత్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
గూడెం విమానాశ్రయాన్ని సందర్శించనున్న మంత్రి వేణుగోపాల్:కనుమూరి
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జనవరి 5: రెండు నెలల్లో స్థానిక విమానాశ్రయాన్ని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వేణుగోపాల్ పరిశీలిస్తారని ఎంపి కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే ఈలి నాని నివాసంలో విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కనుమూరి మాట్లాడుతూ దాళ్వాకు పూర్తిగా నీరు అందిస్తామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరామన్నారు. తాడేపల్లిగూడెంలో గరీబ్థ్‌న్రు నిలపాలని రైల్వే జిఎంను కోరామన్నారు. శివాలయం వద్ద రైల్వే అండర్ టనేల్‌కు రూ 4.60 కోట్లు ఇవ్వడానికి సిఎం అంగీకరించారన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు, ఎమ్మెల్యే నానిలు కలిసిమెలిసి పనిచేయాలన్నారు. సఖ్యతతో పనిచేసి తనతో సహకరించాలన్నారు. సమావేశంలోమాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈతకోట తాతాజీ, కాంగ్రెస్ నాయకులు పాలూరి వెంకటేశ్వరావు, రావుల శంకరరావు, నూకల బులయ్య, కొలి రమావతి, గొర్ల మహారాజ్ పాల్గొన్నారు.
దాళ్వా సాగుకు పూర్తిగా నీరందిస్తా: ఎంపి కనుమూరి
పెంటపాడు : దాళ్వా వరిసాగుకి నీరుపూర్తిగా అందించే బాధ్యత తనదేనని. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు రైతులకు భరోసానిచ్చారు. పెంటపాడులో రూ.16 లక్షలతో నిర్మించిన నీటిపారుదలశాఖ కార్యాలయం క్వార్టర్స్‌ను ఎంపి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాళ్వా వరిసాగుపై నీరు సక్రమంగా అందదేమోనని రైతులు అనుమానాలు వ్యక్తిపరిచారు. వెంటనే ఎంపి కనుమూరి మాట్లాడుతూ నారు వెంటనే పెంచి, నాట్లు త్వరితంగా వేయలన్నారు. గతవారంలో కాలువలనందు నీరు తగడానికి సీలేరునందు కొంత అనిశ్చత ఏర్పడిన మాటవాస్తమేనన్నారు. నీటి విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. అదేవిధంగా కలెక్టర్ వాణీమోహన్ ఆదేశాల మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ నుండి 12 మంది వికలాంగులకు సైకిళ్ళు యం.పి కనుమూరి, ఎమ్మెల్యే ఈలి నాని చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ కాంపౌండ్ వాల్‌కు రూ.4 లక్షలు, జట్లపాలెంలో బిసి కమ్యూనిటీ హాలుకు రూ. 5 లక్షలు యంపి నిధుల నుండి మంజూరు చేశారు. జట్లపాలెంలో నూతనంగా పిఆర్ నిధులు రూ 21.5 లక్షలతో నిర్మించిన వంతెను యంపి ప్రారంభించారు.

చౌకడిపోలను మోడల్ డిపోలుగా తీర్చిదిద్దడానికి చర్యలు
జాయింట్ కలెక్టర్ బాబూరావు నాయుడు
ఏలూరు, జనవరి 5 : నగదు బదిలీ పధకం వల్ల చౌకడిపోలు రద్దుకావని ప్రభుత్వం మరింత పటిష్టవంతంగా చౌకడిపోలను మోడల్ డిపోలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నా రేషన్ కార్యక్రమం కింద జిల్లా నలుమూలల నుండి పౌర పంపిణీపై వచ్చిన సమస్యలను ఆయన పరిష్కరించారు. నగదు బదిలీ వల్ల రేషన్‌షాపులు రద్దవుతాయనే భయం వద్దని భవిష్యత్తులో చౌకడిపోలను ప్రభుత్వం రాష్త్ర వ్యాప్తంగా ఒక మోడల్ డిపోలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుందని జెసి చెప్పారు. పేద ప్రజలకు సమర్ధవంతంగా నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేసి డిపో డీలర్లు ప్రజాభిమానాన్ని పొందాలని, ప్రభుత్వం ఇస్తున్న కమిషన్‌ను కూడా పెంపుదల చేసే ఆలోచన పరిశీలనలో వుందని చెప్పారు. జిల్లాలో 39 లక్షల మంది జనాభా వుంటే రేషన్‌కార్డులను బట్టి 44 లక్షల మంది ఉన్నట్లు చూపుతున్నారని ఈ విషయంలో అనర్హుల చేతుల్లో ఉన్న రేషన్‌కార్డులన్నీ స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఏలూరు డిపో డీలర్లను ఆదర్శంగా తీసుకుని బోగస్ రేషన్‌కార్డులు గాని, కూపన్లు గాని ఇప్పటికైనా సరెండరు చేయాలని లేనిపక్షంలో రాబోయే మార్చి తరువాత ఆధార్‌కార్డుల ద్వారా అనర్హుల చేతుల్లో ఉండే బోగస్ కార్డులన్నీ రద్దుకాక తప్పదని చెప్పారు. జిల్లాలో పంచదార, కిరోసిన్ కూడా పక్కదారి పడుతోందని హైదరాబాదులో జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ్ధర్‌బాబు ప్రస్తావించారని కావున జిల్లాలో నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరుగు జిల్లాలలో ఆధార్‌కార్డుల జారీ ద్వారా కనీసం ఒక్కొక్క జిల్లాలో మూడు లక్షల బోగస్ కార్డులు బయట పడ్డాయని త్వరలోనే జిల్లా ప్రజలకు ఆధార్‌కార్డుల జారీ జరుగుతుందని, దానివల్ల అనర్హుల చేతుల్లో ఉండే కార్డులన్నీ బహిర్గతమవుతాయని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో బోగస్ కార్డుల ఏరివేతలో కొంతమంది డిప్యూటీ తహశీల్దార్లు చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు. తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ప్యాకింగ్ ద్వారా ప్రభుత్వం వచ్చే మార్చి నుండి పేదలకు అందించాలని నిర్ణయించిందని, ఉగాది నుండి మన బియ్యం పేరుతో పేదలకు కిలో రూపాయి బియ్యాన్ని అందిస్తుందని జెసి చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో 15 కిలోమీటర్లు దూరంలో చౌక డిపోలు వుండడం వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన దృష్టికి తీసుకువచ్చిందని, యుద్ధప్రాతిపదికపై ఏజెన్సీలో ప్రతీ రెండు కిలోమీటర్లుకు ఒక చౌక డిపో ఉండేలా తగు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జెసి బాబూరావునాయుడు డి ఎస్‌వో లక్ష్మీనారాయణను ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజరు సలీంఖాన్, తూనికలు, కొలతలు శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ, పలువురు డిటిలు, ఎ ఎస్ ఓలు పాల్గొన్నారు.
సహకార రుణాల చెల్లింపులో ఉద్రిక్తత
ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత అధ్యక్షుని ఓటు హక్కు
ద్వారకాతిరుమల, జనవరి 5: సహకార సంఘంలో ఓటు హక్కు పొందేందుకు తీసుకున్న రుణాలు చెల్లించే ప్రక్రియ సమయం మించిపోయిందని, ప్రస్తుత సంఘ అధ్యక్షుని ఒక వర్గం వారు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక విశాల సహకార సంఘంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఈ వాదోపవాదాలు శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగాయి. అర్థరాత్రి అయినా రుణంగా తీసుకున్న సొమ్ము జమ కాకపోవడంతో ప్రస్తుత సంఘ అధ్యక్షుని ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారింది. వివరాల ప్రకారం సహకార సంఘంలో తీసుకున్న రుణం చెల్లింపునకు ఈ నెల నాలుగు సాయంత్రం అయిదు గంటల వరకు గడువు విధించారు. సభ్యులు ఓటు హక్కు పొందాలంటే తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలన్నది నిబంధన. ఈ క్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు ఆచంట రామచంద్రరావు సంఘ బకాయిగా సుమారు 18 లక్షల రూపాయలవు చెల్లించాల్సి వుందని చెబుతున్నారు. ఆయన సొమ్ము చెల్లించేందుకు సిద్ధం కాగా సమయం మించి పోయిందని అయిదు గంటలు దాటిన తరువాత ఎలా చెల్లిస్తారని ప్రత్యర్థి వర్గం వాదనకు దిగింది. తాను సరైన సమయంలోనే వచ్చానని, అయితే తన ముందు కొందరు రైతులు రుణాలు తిరిగి చెల్లిస్తున్నందున తనకు అవకాశం రాలేదని రామచంద్రరావు పేర్కొన్నారు. ససేమిరా కట్టేందుకు వీల్లేదని ప్రత్యర్థి వర్గం ఘర్షణకు దిగడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు చెలరేగాయి. దీంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో డిఆర్ రవికుమార్, ఎన్నికల అధికారి వి గోపాలరెడ్డి ద్వారకాతిరుమల సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు వారికి తమ వాదనలు వినిపించారు. వాదోపవాదాలతో అర్థరాత్రి సమయం దాటడంతో క్లోజ్ బుక్, ఓచర్లను క్లోజ్ చేయాలని ఆదేశించి అధికారులు వెళ్లిపోయారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి వసంత్
భీమడోలు, జనవరి 5 : రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వట్టి వసంతకుమార్ శనివారం భీమడోలు గ్రామంలో 66 లక్షల రూపాయల విలువైన భవనాలకు ప్రారంభోత్సవాలు జరిపారు. భీమడోలు హైస్కూలులో 12 లక్షల సర్వశిక్ష అభియాన్ నిధులతో నిర్మించిన అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం 54 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఇన్‌స్పెక్షన్ బంగ్లాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఎస్ ఇ శివన్నారాయణకు మంత్రి నిర్మాణం విషయంలో పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్తి సాంబశివరావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అప్పక రాంబాబు, తహశీల్దార్ బి సోమశేఖర్, ఎంపిడివో కె కోటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ ఈదా వెంకటరత్నం, మాజీ ఎంపిటిసి విజయ అచ్యుతం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సూర్యచంద్రరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పసుపులేటి సత్యనారాయణ, యర్రంశెట్టి ఏడుకొండలు, ఎగ్గిన గంగా కమలాకర్, చింతా శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే అన్ని వసతులు
ఉండి, జనవరి 5: ప్రాథమిక స్థాయిలో తమిళనాడు ప్రభుత్వం విద్యార్థికి అన్ని వసతులు కల్పిస్తుందని, ఆ రాష్ట్ర ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి జిఎ రాజకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. ఆడపిల్లల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యతను తమిళనాడు ప్రభుత్వమిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థికి బట్టలు, తిండి , పుస్తకాలు, సైకిల్స్ ఒకటేమిటి విద్యార్థికి కావలసినవన్నీ సమకూర్చుతున్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా బాగా అమలు జరుపుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ కల్గిన విద్యనందించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిపై విమర్శలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ అంకితభావంతో పనిచేయాలని కోరారు. తమిళనాడులో ద్విభాషా విధానం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. తామంతా మాతృభాషలోనే విద్యాబోధన చేసి ఉన్నత స్థానానికి చేరుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ కార్యదర్శి చింతపల్లి శ్రీనివాసరావు, జి ఐజాక్, విజయబాబు, చక్రవర్తి, కృపావరం, సూర్యనారాయణమూర్తి, సిఆర్‌పి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
రూ.219కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం
ఉంగుటూరు, జనవరి 5: జిల్లాలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి 101 పనులు రూ.219కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ఈ సంవత్సరం మార్చి 31వ తేదీలోగా పూర్తిచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వట్టి వసంతకుమార్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇని ఆదేశించారు. శనివారం ఉంగుటూరు మండలం నారాయణపురం శివారు తోకలపల్లి మేజర్ మురుగు డ్రెయిన్‌పై రూ.3.3కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను మంత్రి వట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రహదారులు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. రహదారులు ఇటీవల తుపానుకు బాగా దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం రహదారులకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణ, ఇఇ రవికృష్ణస్వామి, డిఇ భాస్కరరావు, ఎఇ ప్రభాకరరావు, ఎంపిడిఒ రాము, ఎఎంసి మాజీ ఛైర్మన్ కె సర్వేశ్వరరావు, డిసిసి సభ్యుడు దొంతంశెట్టి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కె కిరణ్, పశు సంవర్థక శాఖ జిల్లా అధ్యక్షుడు గంగాధరరావు, ఉంగుటూరు సర్పంచ్ పెనుగొండ సూర్యచంద్రరావు, వివిధ గ్రామాల విఆర్వోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పోటీల కన్వీనర్ కొత్తపల్లి
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>