ప్రయాణం అంటేనే హడావుడి. అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు ప్రయాణంలో ఎదురుకావటం మన అందరికీ తెలిసిందే. ఇక విదేశీ ప్రయాణమైతే మరింత కంగారు తప్పదు. ప్రయాణ సమయంలో ఎదురయ్యే కష్టనష్టాల వలన ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకొనేందుకు ప్రయాణ బీమా పాలసీ తీసుకోవడం మంచి పని. ప్రయాణ సంబంధ దుర్ఘటనలు, ప్రయాణంలో ఊహించని ఆరోగ్య సమస్యలను తట్టుకొనేందుకు ప్రయాణ బీమా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత దుర్ఘటన, సామాన్లు పోగొట్టుకోవటం, లగేజీ రావటంలో ఆలస్యం, పాస్‌పోర్టు పోగొట్టుకోవటం, ప్రయాణం ఆలస్యం కావటం, మృతదేహాలను తీసుకురావడం వంటి విషయాలకు ప్రయాణ బీమా వర్తిస్తుంది. నగదు రహిత సౌకర్యంతో లేదా వైద్యచికిత్సను పొందే సదుపాయాన్ని ఎక్కువ ప్రయాణ బీమా పథకాలు అందిస్తున్నాయి.
కొన్ని దేశాలకు వెళ్లేందుకు అవసరమైన వీసాను తీసుకోవాలంటే ఓవర్‌సీస్ ట్రావెల్ బీమాపాలసీని తీసుకోవటం తప్పనిసరి. ఇది అవసరం లేనిచోట కూడా వ్యాపారం పనిమీద లేదా సెలవులను గడిపేందుకు వెళుతున్నప్పుడు, విద్యాభ్యాసం, పరిశోధనల నిమిత్తం వెళుతున్నప్పుడు బీమా పాలసీని తీసుకోవటం ఉత్తమం. ఇతర దేశాలలో వైద్యచికిత్సకు అయ్యే వ్యయం చాలా ఎక్కువగా వుండటం వలన బీమాపాలసీని తీసుకోవటం ద్వారా వైద్య ఖర్చులను భరించటం సాధ్యమవుతుంది.
తీసుకోవాలనుకొంటున్న ప్రయాణ బీమా పాలసీ గురించి, ఆ పాలసీ కచ్చితంగా ఏయే అంశాలకు అవకాశం కల్పిస్తుందో చదివి తెలుసుకోవటం ముఖ్యం. మీ సందేహాలను తీర్చమని బీమా కంపెనీ వారిని లేదా వారి ఏజెంటును ప్రశ్నించి మరీ తెలుసుకోవాలి. నియమ నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రయాణ బీమా సాధారణంగా నిర్దిష్ట కాల వ్యవధికి మాత్రమే వర్తిస్తుంది. అయితే, కొన్నిరకాల బీమా కంపెనీలు ప్రయాణికుల ప్రత్యేక అవసరాల మేరకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టాయి. కార్పొరేట్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా బీమా పథకాలు ఉన్నాయి.
దేశీయ విమాన ప్రయాణాలలో సాధారణంగా టిక్కెట్టును కొనుగోలు చేస్తున్నప్పుడే బీమా తీసుకొనే సదుపాయాన్ని ఆన్‌లైన్ కంపెనీలు అందజేస్తున్నాయి. బీమా మొత్తం, తదనుగుణంగా ప్రీమియంలను చెల్లించి బీమా చేయించుకోవచ్చు. కొన్ని బీమా కంపెనీలు ప్రయాణికుల వయస్సు, ప్రయాణ వ్యవధి వంటి వాటి ఆధారంగా కూడా ప్రీమియాన్ని నిర్ణయిస్తున్నాయి. ప్రయాణ బీమా తీసుకొంటున్నప్పుడు మినహాయింపు క్లాజుల గురించి తెలుసుకోవలసిన అవసరం వుంది. ముందుగానే వున్న వ్యాధులు, యుద్ధప్రమాదాలు, ఆత్మహత్య లేదా మతిస్థిమితం లేకపోవటం, ప్రమాదంతో కూడిన ఆటల వంటి వాటికి సామాన్యంగా ప్రయాణ బీమా వర్తించదు.
కొన్ని సందర్భాలలో ప్రయాణ బీమాపాలసీ కొనుగోలుచేసే ముందు వైద్య పరీక్షలు అవసరం అవుతాయి. సాధారణంగా ప్రయాణానికి బయలుదేరే మూడునాలుగు వారాల ముందు తీసుకొన్న వైద్య నివేదికలను బీమా కంపెనీకి సమర్పించవలసి వుంటుంది. విదేశాలలో వున్నప్పుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయాలనుకొంటే ఎవరిని సంప్రదించాలో కూడా తెలుసుకోవాలి. పాలసీదారులు క్లెయిమ్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్థానిక పోలీసులకు, రాయబార కార్యాలయం, రవాణా కంపెనీ వంటి వాటికి కూడా సమాచారం అందించవలసిన అవసరం కొన్ని పాలసీల విషయంలో వుంటుంది. సాధారణంగా ప్రతి ప్రయాణ బీమాపాలసీ డాకెట్‌లో క్లెయిమ్ ఫారం కూడా జతచేసి వుంటుంది. దీనిని భద్రంగా వుంచుకోవటం అవసరం.
ప్రయాణ కాలవ్యవధిలో వైద్య చికిత్సకు వెళ్లే అవసరం తలెత్తితే బీమా కంపెనీ వారికి ముందస్తుగా తెలియజేయాలనే నిబంధనల్ని కొన్ని కంపెనీలు పెడుతున్నాయి. పాలసీని క్షుణ్ణంగా చదివి అలాంటి అవసరాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. చాలా పాలసీలకు ముందస్తు అనుమతి అవసరం. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రిలో చేరి, వెనువెంటనే సంబంధిత బీమా కంపెనీకి సమాచారం పంపే వెసులుబాటు వుంటుంది. పాలసీని కొనుగోలుచేసే ముందు ఇటువంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి.
బీమా క్లెయిమ్‌ల పరిష్కరణకు చాలా బీమా కంపెనీలకు థర్డ్‌పార్టీ అడ్మినిస్ట్రేటర్ వుంటారు. చాలా సందర్భాలలో వారు నగదు రహిత సౌకర్యాన్ని అందజేయటం జరుగుతుంది. ఈ వివరాలు పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొనటం జరుగుతుంది.
ఒక్కోసారి ప్రయాణం వాయిదా పడటమో లేదా పూర్తిగా రద్దుకావటమో జరిగే అవకాశం వుంది. అటువంటి సందర్భాలలో తగిన రుజువులను చూపటం ద్వారా ప్రీమియం మొత్తాన్ని వాపసు పొందవచ్చు. అయితే, పరిపాలనా సంబంధిత వ్యయాలను తగ్గించుకొని ప్రీమియం తిరిగి చెల్లిస్తారు.
ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలోవుంచుకొని ప్రయాణ బీమా తీసుకొన్నప్పటికీ ఒక్కోసారి బీమా కంపెనీలు క్లెయిమ్‌ను చెల్లించేందుకు నిరాకరించవచ్చు. అటువంటి సందర్భాలలో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. ఐఆర్‌డిఎకు చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవియనె్సస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆన్‌లైన్‌లో బీమా పాలసీలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది.
పాలసీదారులు తాముచేసిన ఫిర్యాదుల పరిస్థితిని ఈ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐఆర్‌డిఎకు ఫిర్యాదుచేసే ముందుగా బీమా కంపెనీకి కూడా ఫిర్యాదు చేయాలి. బీమా కంపెనీ సంతృప్తికరంగా ఫిర్యాదును పరిష్కరించటంలో విఫలమైనప్పుడు ఐఆర్‌డిఎకు ఫిర్యాదు చేయవచ్చు.