హైదరాబాద్, జనవరి 9: విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ఇఆర్‌సి ప్రతిపాదనలకు, విద్యుత్ కోతలకు నిరసన తెలియజేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. సబ్-స్టేషన్ల ముట్టడికి యత్నించారు. నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలు సబ్-స్టేషన్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఇలాఉండగా హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవి మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో పార్ట నాయకులు కార్యకర్తలు విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. నల్లగొండ జిల్లా కోదాడలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో, నర్సంపేట మండలం లక్కెపల్లిలో కార్యకర్తలు సబ్‌స్టేషన్‌ను ముందు ధర్నా నిర్వహించి, ఆ తర్వాత రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో ట్రాన్స్‌కో సిబ్బందిని రైతులు కొంత సేపు ఘోరావ్ చేశారు. వేములవాడ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో, కృష్ణా జిల్లా మైలవరం, నెల్లూరు జిల్లా కావలిలో, గుంటూరు జిల్లా అచ్చంపేట, చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లిలో, అనంతపురం జిల్లా లేపాక్షి, మడకశిర, ధర్మవరంలో ధర్నాలు నిర్వహించారు.ః
కర్నూలులో..
కర్నూలు,: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ప్రజల నుంచి షాక్ తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హెచ్చరించారు. విద్యుత్ చార్జీలు పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలులోని విద్యుత్ ఎస్‌ఇ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం వల్లే చంద్రబాబునాయుడు పదవి కోల్పోయారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. విద్యుత్ సర్‌చార్జీల పేర ఇప్పటికే మోయలేని భారం మోపిన ప్రభుత్వం మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచాలని భావించడం దారుణమన్నారు. కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మారెప్ప, ఎమ్మెల్యేలు చెన్నకేశవ రెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసమర్థ పాలన
నెల్లూరు,: అసమర్థ పాలన వల్లే రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల విద్యుత్ కష్టాలు వచ్చాయని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహానేత వైఎస్ ఐదేళ్ల పాలనలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. కేంద్రం గ్యాస్ ధర పెంచినా ఆ భారాన్ని రాష్ట్రం తరఫునే భరించేలా వైఎస్ ప్రజారంజక పాలన అందించారని గుర్తు చేశారు.
విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ఇఆర్‌సి
english title:
y
Date:
Thursday, January 10, 2013