ఖమ్మం, జనవరి 9: ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను చేస్తున్న పాదయాత్ర మహాయజ్ఞమని, పార్టీ నాయకులంతా యాత్ర స్ఫూర్తిగా ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించి వారి తరఫున పోరాడి మద్దతు సాధించాలని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద జరిగిన పార్టీ రాష్టస్థ్రాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న ప్రారంభించిన పాదయాత్ర వంద రోజులకు చేరుకోవటం, ఆ రోజు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు కావటం కాకతాళీయంగా జరిగినా, నాటి పోరాట స్ఫూర్తితో నేడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. తాను ఒక్కడినే తిరగటం వల్ల ఉపయోగం ఉండదని, అందుకే నాయకులంతా హైదరాబాద్ వదిలిపెట్టి తమ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు.
ఇదిలా ఉండగా పాదయాత్రకు తన ఆరోగ్యం సహకరించకున్నా, ప్రజల కష్టాలను చూసి తన బాధను మరచిపోతున్నానన్నారు. పది జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు తనకు నేరుగా సమస్యలు విన్నవిస్తున్నారని, వాటన్నింటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపైనే ఉందన్నారు.
టిడిపి అధికారంలోనే ఉన్నప్పుడు మతం కొట్లాటలు లేవని, ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి వెనుకంజలో ఉన్నాయని, అంతర్గత కలహాలతో బిజెపి, అవినీతిలో కాంగ్రెస్ కూరుకుపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, దానిని పరిష్కరించేందుకు కనీసస్థాయిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. దొంగ కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను చూసి ప్రజలు ఆగ్రహం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడే వారి ఆస్తులను ఒడిషా, బీహార్‌లలో మాదిరిగా స్వాధీనం చేసుకొని ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. 30ఏళ్ళ తెలుగుదేశం పార్టీకి అవినీతి మచ్చలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం తప్పనిసరిగా మారిందన్నారు.
సహకార ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించిందన్నారు. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పామని, ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు కాబట్టే తెలంగాణ ప్రాంతంలో తన యాత్రకు విస్తృత స్పందన లభించిందన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రాలో వైఎస్‌ఆర్‌సిపిలు కనుమరుగవుతాయని, వచ్చే సాధారణ ఎన్నికల్లో టిడిపి అధికారం కైవసం చేసుకోవటం ఖాయమన్నారు. తెలుగుదేశం నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, దీనిని పార్టీ పరంగా ఎదుర్కొంటామన్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విద్యుత్ సంక్షేమం, చార్జీల పెరుగుదల అనే అంశంపై రావుల చంద్రశేఖర్‌రెడ్డి, విద్యుత్ సంక్షోభంపై కోడెల శివప్రసాదరావు, మహిళలపై అత్యాచారాలు, మతసామరస్యం, శాంతి భద్రతల అంశంపై శోభా హైమావతి, అధిక ధరలు, వంట గ్యాస్‌పై సీతక్క, సహకార ఎన్నికలపై పెద్దిరెడ్డి, తెలుగుదేశం పార్టీ విధానాలు - హామీలపై పయ్యావుల కేశవ్, పల్లెపల్లెకు తెలుగుదేశంపై దేవినేని ఉమామహేశ్వరరావు, సంస్థాగత విషయాలపై కెఇ కృష్ణమూర్తి, మైనార్టీ సంక్షేమంపై షరీఫ్‌లు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
నాయకులంతా గ్రామాలకు తరలాలి * ప్రజల అభీష్టంమేరకే అభ్యర్థుల ఎంపిక తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాం * రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో బాబు
english title:
s
Date:
Thursday, January 10, 2013