Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అక్బర్ అరెస్టుకు ముందు వైద్య పరీక్షలా?!

$
0
0

హైదరాబాద్, జనవరి 9: ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖ కొత్త అధ్యాయానికి తెరతీసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నడూ అరెస్టుకు ముందు వైద్య పరీక్షలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. పోలీసులు ఒక రకంగా అతి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై అక్బర్‌ను అరెస్టు చేయించారని వచ్చిన ఆరోపణలను కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపి, ఇద్దరు ఎమ్మెల్సీలు, 42 మంది కార్పొరేటర్లు, ఒక మేయరు ఆ పార్టీకి ఉన్నారని, ఈ దేశంపైనే యుద్ధం ప్రకటించే ప్రమాదకరపరిస్థితులకు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే కారణమని, ఎంఐఎం పెరుగుదలకు కాంగ్రెస్ కారణమని అన్నారు. మజ్లిస్ భూతాన్ని పెంచి పోషించి గతంలో పాతబస్తీలో వదిలారని, కొన్ని రోజులు హైదరాబాద్‌పై వదలగా, నేడు దేశం మొత్తం మీద వదిలారని అన్నారు. తాము చెబితేనే డిజిపిని బదిలీ చేశారనే అహంకార భావాన్ని ఎంఐఎం నేతలు ప్రదర్శిస్తున్నారని, ఒసామా బిన్ లాడెన్ ఆలోచనలను ప్రతిబింబించేలా అక్బర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. అక్బర్ అరెస్టును అన్ని పార్టీల వారూ, ప్రజలందరూ స్వాగతించారని, పాతబస్తీలో సంయమనం పాటించారని, ఇది ఆహ్వానించదగిందని చెప్పారు. అనేక సందర్భాల్లో మజ్లిస్ నేతలు అధికారులపైనా, మహిళలపై దాడిచేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. చిత్రంలో దత్తాత్రేయ తదితరులు

అమ్మిన ప్లాట్లనే వందల కోట్లకు తనఖా

శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో రియల్ దందా
బ్యాంక్‌ల నుంచి వందల కోట్లకు రుణాలు
లబోదిబోమంటున్న 400 ప్లాట్ల యజమానులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: రాజధాని పరిసర ప్రాంతాల్లో రియల్టర్ల దందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సంఘటనలు జరిగినప్పుడు మాత్రం పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటనలు చేయడం మినహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణల బలంగా ఉన్నాయి. ఇల్లు నిర్మించుకోవాలన్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ఆశలు అడియాశలు అవుతున్నాయి. రియల్టర్ల దందాల్లో అందరూ మోసపోతున్నారు. వెంచర్లతో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టి అందినకాడికి దండుకోవడంలో రియల్టర్లు పోటీపడుతున్నారు. హైదరాబాద్ సమీపంలో శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట పంచాయతీలో రియల్టర్ దందాలో 400 మంది మోసపోయినట్లు బాధితులు చెప్పారు. తమ గోడు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులు బుధవారం మీడియా సమావేశంలో చెప్పిన కథనం ప్రకారం బొమ్మరాసిపేట పంచాయతీలో 2001 సంవత్సరంలో 116 ఎకరాల వ్యవసాయ భూమిని ఇళ్ళ ప్లాట్లగా బదిలీ చేయించిన చక్రవర్తిరాజు అనే వ్యక్తి వెంచర్ ప్రారంభించారు.
గజం 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు వెయ్యి గజాల ప్లాటుతో 400 ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఈ వెంచరుకు లియో మెరిడిన్ వౌలిక వసతుల ప్రాజెక్టుగా నామకరణం చేశారు. మొదటి వెంచర్‌లో కొంత ఆరుబయలు స్థలాన్ని వదిలేసి పార్కులు, స్విమ్మింగ్, ఆటస్థలాలుగా చూపించారు. మొదటి వెంచరును తిరిగి ఎకరాలుగా చూపించి రెండవ వెంచరు ప్రాజెక్టులో విల్లాను నిర్మిస్తున్నట్లుగా ప్రచారాన్ని చేపట్టారు. మొదటి వెంచర్‌లో ప్లాట్లు కొన్న యజమానులకు లింక్ డాక్యుమెంట్లు చూపించకుండా మోసం చేశారని ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. మొదటి వెంచర్ ఆరుబయలు స్థలంలో 13-14 బహుల అంతస్తుల భవనాలుగా మార్చుతూ 250 విల్లాలుగా ఏర్పాటు చేశారు. రెండవ వెంచర్‌లో 116 ఎకరాలను వివిధ బ్యాంక్‌ల్లో తనఖా పెట్టి దాదాపు 600 నుంచి 800 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నట్లు ప్లాట్లు కొన్న యజమానులు ఆరోపించారు. విల్లాల పేరుతో ఒకేరోజు ఆంధ్రా,బరోడా బ్యాంక్‌ల నుంచి 300 కోట్ల రూపాయలను చక్రవర్తిరాజు రుణాలను పొందారని ప్లాట్ల యజమానులు బోరుమని విలపించారు. లియో మెరిడిన్ వౌలికవసతుల ప్రాజెక్టు ప్లాట్ల యజమానులు విలేఖరులతో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని హైదరాబాద్ పట్టణాభివృద్ధి అథారిటీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారు. అయితే అధికారుల్లో స్పందన లేదన్నారు.
తమతో డబ్బులు కట్టించుకొని ప్లాట్లు ఇవ్వాలని చక్రవర్తిరాజును అడిగితే దాడులకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు. అక్రమ డాక్యుమెంట్లు చూపించి తమను మోసం చేసిన రియల్టర్ రాజుపై కేసులు నమోదు చేసి తమకు న్యాయం జరిపించాలని ప్లాట్ల అసోషియేషన్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

విభజనకు, మతతత్వానికి ముడిపెట్టొద్దు: పొన్నం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: రాష్ట్ర విభజన అంశాన్ని మతతత్వానికి ముడిపెట్టవద్దని తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే మతపరమైన విద్వేషాలు చెలరేగుతాయని మజ్లిస్ పార్టీ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మత విధ్వేషాల అంశం ప్రాంతాలకు సంబంధం లేదని పొన్నం బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ అంశానికి జోడించరాదని ఆయన కోరారు. మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ సమస్య జాతీయ అంశాలతో ముడిపడి ఉన్నదని, దేశ సమగ్రత, సౌభ్రాతృత్వంతో కూడిందని తెలిపారు. కేంద్రంలో అసమర్థత, చేతకాని, దద్దమ్మ ప్రభుత్వం ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై పొన్నం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కావూరి పార్టీ ఫిరాయించనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయన్నారు. కావూరి వ్యాఖ్యలను సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కొంతమంది మద్దతు తెలిపేలా చేతులెత్తారని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్సకు ఫిర్యాదు చేశామని, సోనియాకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దేశంలో కొత్తగా 16 రాష్ట్రాలు ఏర్పడితే ఎక్కడా అల్లర్లు జరగలేదని ఆయన చెప్పారు. అగ్నిగుండం అంటే హిందువులను కాల్చేస్తారా? లేక సీమాంధ్ర వారిని కాల్చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
కాసును క్యాబినెట్ నుంచి తప్పించాలి
మంత్రి పదవి తనకు చిత్తు కాగితంతో సమానమంటూ వ్యాఖ్యానించిన రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని పొన్నం ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. అలా వ్యాఖ్యానించడం మంత్రివర్గాన్ని అవమానించడమే అవుతుందని అన్నారు. మంత్రి కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

అక్బర్ ప్రసంగ దృశ్యాలను
తొలగించాలన్న పిటిషన్ కొట్టివేత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఒక మతం గురించి చేసిన ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలను ఇంటర్నెట్‌లోని యూట్యూబ్‌లో తొలగించాలని దాఖలైన పిటిషన్ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. మరొకరి భావ ప్రకటనా స్వేచ్ఛలో తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ నేరుగా న్యూయార్కులోని యూట్యూబ్ కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని చూసి సంతోషించేవారు, నిరసించేవారు, విని తెలుసుకునేవారు ఉంటారని, తెలుసుకోవడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని పేర్కొన్నారు. యూట్యూబ్ ఈ తరహా దృశ్యాలను ప్రచారం చేయడంపై తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. యూట్యూబ్‌లోని ఒవైసీ ప్రసంగాన్ని పదే పదే ప్రసారం చేయకుండా ప్రసార మాధ్యమాలను ఆదేశించాలని అభ్యర్ధిస్తూ న్యాయవాది జెవిఎన్ రామారావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
16లోగా బకాయిలు చెల్లించాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: సహకార సంఘాలకు సభ్యులు తమ బకాయిలను ఈ నెల 16వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. బకాయిలు చెల్లించిన వెంటనే వారికి సభ్యత్వాలను ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలో అన్ని సహకార సంఘాలకు వర్తింపచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
‘గాలి’ బెయిల్ పిటిషన్ దాఖలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: ఓబులాపురం మైనింగ్ గనుల తవ్వకాల కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దనరెడ్డి బెయిల్ కోసం బుధవారం సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు శ్రీనివాసరెడ్డి కూడా బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్‌ను అప్పగించాలని గాలి జనార్దన్‌రెడ్డి సిబిఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది.
రిపుంజయరెడ్డికి ఈనెల 22 వరకు రిమాండ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు రిపుంజయరెడ్డికి న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ఏసీబీ న్యాయస్థానం 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
క్యాట్‌లో హైదరాబాద్
విద్యార్థుల ప్రతిభ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: కామన్ ఆప్టిట్యూడ్ టెస్టు (క్యాట్-2012) ఫలితాల్లో హైదరాబాదీలు ప్రతిభను ప్రదర్శించారు. 105 మందికి 99 శాతం పర్సంటైల్ దక్కింది. 180 మందికి 99 పర్సంటైల్ దక్కి ముంబై అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ అభ్యర్ధులు 168 మందికి, బెంగళూరుకు చెందిన 157 మందికి, కోల్‌కతాకు చెందిన 92 మందికి, చెన్నైకి చెందిన 85 మందికి 99 పర్సంటైల్ దక్కింది. క్యాట్‌లో నూరు పర్సంటైల్ వచ్చిన వారు దేశవ్యాప్తంగా పదిమంది మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఢిల్లీ యూనివర్శిటీకి చెందినవారు కాగా, మిగిలిన వారిలో ఐదుగురు ఐఐటిల్లో చదువుతున్న వారే. 99.99 పర్సంటైల్ మాత్రం నలుగురు స్ర్తిలకు దక్కింది. 99 పర్సంటైల్ 255మంది స్ర్తిలకు, 1640మంది పురుషులకు దక్కింది.
ఉస్మానియా విద్యార్థిని హత్య కేసులో
నిందితునికి కాలు, చెయ్యి తొలగింపు
హైదరాబాద్, జనవరి 9: ఉస్మానియా విద్యార్థిని హత్య కేసులో నిందితుడు శివకుమార్ కాలు, చెయ్యిని తొలగించారు. విద్యార్థిని హత్య చేసిన అనంతరం నిందితుడు శివకుమార్ పుణెకు వెళ్ళాడు. వారం రోజుల తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన శివకుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. పుణెలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చివరకు శివకుమార్ ఎడమ కాలిని, కుడి చేతిని వైద్యులు తొలగించారు.
విద్యుత్ చార్జీలు పెంచొద్దు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని పిసిసి కిసాన్ సెల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలను విరమించుకోవాలని ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో తప్పేమి లేదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని మంత్రులు, తమ పార్టీ ఇతర నాయకులు మాట్లాడడంలో తప్పేమి లేదని కోదండరెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. డిస్కాంలు ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని వేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ హామీ అమలుపై షరతులు విధించడాన్ని రైతులు భరించలేరని అన్నారు. 2009 ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వ్యవసాయానికి ఇస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్‌ను 9 గంటలకు పెంచుతామని హామీ ఇచ్చామన్నారు. 9 గంటలకు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, అయితే ఛార్జీలు పెంచి సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారం మోపరాదని ముఖ్యమంత్రిని కోరారు.
పోరాట స్ఫూర్తి దినాన్ని
పాటించిన టిఎన్‌ఎస్‌ఎఫ్
హైదరాబాద్, జనవరి 9: అవినీతి, అధికధరలు విద్యార్ధి యువజన వ్యతిరేక చర్యలతో రాష్ట్రంలోని పేద ప్రజలను పీడిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై రాజీలేని పోరాటంలో భాగంగా వంద రోజుల పాటు వస్తున్నా మీ కోసం పాదయాత్రను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పూర్తి చేసుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు వందలాది మోటార్ సైకిళ్లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడువునా ఎన్టీఆర్ అమర్ రహే, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రోజు పోరాట స్ఫూర్తి దినంగా పాటించామన్నారు.

పేదల ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా దివంగత ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక దినం కూడా జనవరి 9వ తేదీ నిలుస్తుందన్నారు. ట్రస్టు భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద వంద కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొడాలి రవికుమార్, బ్రహ్మం చౌదరి, అవినాష్ రెడ్డి, శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

కులీకుతుబ్‌షా సమాధుల
పరిరక్షణకు కార్యాచరణ
ఆగాఖాన్ ఫౌండేషన్‌తో సర్కారు ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: చారిత్రక కులీ కుతుబ్‌షా సమాధులను పరిరక్షించేందుకు 90 కోట్ల రూపాయలతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఆగాఖాన్ ట్రస్ట్, ఆగాఖాన్ ఫౌండేషన్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో, సాంస్కృతికశాఖ మంత్రి వట్టి వసంతకుమార్ సమక్షంలో పురావస్తుశాఖ, కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు కలిసి ఆగాఖాన్ సంస్థల ప్రతినిధులతో బుధవారం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ మాట్లాడుతూ అత్యంత చారిత్రాత్మకమైన కుతుబ్‌షా సమాధులను రక్షించేందుకు, వాటి సాంస్కృతిక వైభవాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీనిచ్చారు. భావితరాలకు నగరంలోని చారిత్రాత్మక కట్టడాలను అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లలో 90 కోట్ల రూపాయలతో ఈ సమాధులను పరిరక్షించేందుకు, సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఒప్పందంలో నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, సుందరీకరణ, ఆధునీకరణ చేసేందుకు నిర్ణయించారు. కుతుబ్‌షా సమాధులున్న ప్రాంతంలో దాదాపు 70 వరకు ఇతర కట్టడాలు ఉన్నాయని, కుతుబ్‌షా పురావస్తు పార్కు, దక్కన్ పార్కు, మసీదులను కూడా అభివృద్ధికి నోచుకోనున్నాయ. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఆగాఖాన్ ట్రస్టు డైరెక్టర్ జనరల్ లూయిస్ మోన్రీల్, ఉపాధ్యక్షుడు రహింతుల్లా, ఇతర ప్రతినిధులు కామెరూన్ రష్టీ, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్, పురావస్తుశాఖ డైరెక్టర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అదనపు భూములు ‘కొల్లేరు’వే!

రైతులకిచ్చే అవకాశాలు శూన్యం
పరిహారం కావాలంటే ఇవ్వొచ్చు
అదనపు భూములపై ప్రభుత్వం ఆరా

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: కొల్లేరు వన్యప్రాణ సంరక్షిత ప్రాంతంలో అదనంగా ఉన్నట్లు భావిస్తున్న భూములు కూడా శాంచ్యురీ పరిధిలోనే ఉండిపోతాయి తప్ప వాటిని రైతులకు అప్పగించే అవకాశాలు మృగ్యమని అధికారులు తేల్చి చెబుతున్నారు. సంరక్షిత ప్రాంతంలో ప్రతి కట్టడం, ప్రతి భూమి సంరక్షిత ప్రాంత పరిధిలోకే వస్తుందని, చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయని అధికారులు అంటున్నారు. కొల్లేరు అటవీ ప్రాంతంలో ఐదో కాంటూరు వరకు దాదాపు 77 వేల ఎకరాల భూమి ఉన్నట్లు అధికారుల రికార్డుల్లో ఉండగా, 85 వేల ఎకరాలు ఉన్నాయని ఆ ప్రాంతంలోని ప్రజలు, నేతలు చెబుతున్నారు. చివరకు సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు కూడా 85 వేల ఎకరాల భూమి కొల్లేరు సంరక్షిత ప్రాంతంలో ఉందని, దానిని అక్కడి వారికి పంచిపెట్టాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వాస్తవాలు తేల్చేందుకు, అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం ఏమి తేల్చాలో నిర్ణయించుకోలేని పరిస్ధితికి చేరుకుంది. కేంద్ర నిబంధనలు, అటవీ చట్టాల మేరకు సాధారణ అటవీ భూముల కన్నా రిజర్వ్ ఫారెస్ట్‌లో కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇక రిజర్వ్ ఫారెస్ట్ కన్నా కూడా శ్యాంచురరీలో చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి.
ఈ ప్రాంతంలో చీపురుపుల్ల కదల్చాలన్నా కూడా కేంద్ర అనుమతులు తప్పనిసరి. ఇక కట్టడాలు, వ్యవసాయంపై కూడా ఆంక్షలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో భూములను నిబంధనల మేరకు వినియోగించుకునేందుకే తప్ప రైతులకు, అక్కడి ప్రజలకు హక్కుగా కేటాయించడం సాధ్యంకాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం కొల్లేరు అధికారులకు శిరోభారంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కొల్లేరుపై వత్తిళ్లు వస్తుండడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితికి చేరుకుంటోంది. వాస్తవంగా రికార్డుల్లో ఉన్న భూముల కన్నా ఎక్కువగా భూమి ఉన్నా అది సంరక్షిత ప్రాంతం పరిధిలోకే వస్తాయని అధికారులు అంటున్నారు. నిజంగా భూముల ఎక్కువగా ఉంటే అది అధికారుల గత తప్పుడు లెక్కలేనని మరికొందరు వాదిస్తున్నారు. అయితే భౌగోళిక మార్పుల కారణంగా కూడా భూముల మొత్తం పెరిగే అవకాశాలు ఉంటాయని ఒక అధికారి వ్యాఖ్యానిస్తున్నారు. కొల్లేరులో నీటి పరిమాణం తగ్గుముఖం పడితే కొంత భూమి బయటకు కనిపిస్తుందని, నీటి మట్టం పెరిగితే భూమి ముంపునకు గురై బయటకు కనిపించే విస్తీర్ణం తగ్గినట్లు కనిపిస్తుందని, ఇలా నీటి మట్టంలో తేడాల కారణంగా భూమి విస్తీర్ణంలో మార్పులు సంభవిస్తాయని ఆయన అంటున్నారు. ఏదియేమైనా వాస్తవ విస్తీర్ణం గుర్తించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. విస్తీర్ణం గుర్తించిన తరువాత కూడా అది పూర్తిగా శాంచ్యురీలోనే ఉండిపోతుంది తప్ప ప్రజలకు పట్టాలుగా పంపిణీ చేసే ఆస్కారం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఇంకా కావాలంటే ఆ భూములకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వడం ద్వారా సమస్యను నివారించవచ్చునని అంటున్నారు. దీనికోసం భారీగా నిధులు అవసరమవుతుండడంపై కూడా మంత్రివర్గ ఉపసంఘంలో సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

‘బిట్స్’ సీట్లు 18వేలకు పెంపు

డైరెక్టర్ ప్రొఫెసర్ వి.ఎస్.రావు వెల్లడి

హైదరాబాద్, జనవరి 9: పిలానీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బిట్స్ నాలుగు క్యాంపస్‌లలో సీట్ల సంఖ్యను 2020 నాటికి 18వేలకు పెంచనున్నట్టు హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి ఎస్ రావు చెప్పారు. బుధవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నాలుగు క్యాంపస్‌లలో విద్యాత్మక అభివృద్ధికి వెయ్యి కోట్లు వెచ్చించేందుకు వీలుగా ‘పరివర్తన్’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. రవి వారణాసి, సంజయ్ కేండ్రీ, శరత్ గొల్ల, ప్రొఫెసర్ ఎం. బి. శ్రీనివాస్, శే్వత, వసుందరి అల్లూరిలతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అత్యున్నత సాంకేతిక నిర్మితితో కూడిన దూరవ్యాప్తి సౌకర్యాన్ని (టెలి ప్రెజన్స్ ఫెసిలిటీ) ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరే ఇతర విద్యాసంస్థల్లో లేనివిధంగా ఈ సౌకర్యం విద్యార్ధులకు, ఫ్యాకల్టీ సభ్యులకు, డైరెక్టర్లకు మూడు చానల్స్ ద్వారా కల్పించామని నిరంతరం నిపుణులతో సంభాషించి పరిష్కారాలను కనుగొనవచ్చని అన్నారు. బిట్స్ పిలానీని పరిశోధనాత్మక వర్శిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇటీవల కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ పొదిగే శాస్త్ర సాధనం (టెక్నాలజీ ఇంక్యుబేటర్) కోసం ఐదు కోట్ల రూపాయల గ్రాంట్‌ను అందజేసిందని పేర్కొన్నారు. దీంతో ఔషధ రంగం, జీవసాంకేతిక రంగం, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంపై వెచ్చించనున్నట్టు తెలిపారు. బిట్స్ ప్రపంచ రెండో సదస్సును వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్టు పూర్వవిద్యార్ధుల సహకారంతో 27 కోట్లు సమీకరించి ఆధునికత పనులను చేపట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం నాలుగు క్యాంపస్‌లలో కలిపి 11వేల మంది విద్యార్ధులు ఉన్నారని, హైదరాబాద్ క్యాంపస్ సీట్లను 950కు పెంచుతామని వెల్లడించారు. ఏటా ఫీజు 1.40 లక్షలు ఉండగా, అది రానున్న రోజుల్లో మరో 15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

స.హ. కమిషనర్ల
ఫైలుకు కదలిక
ఆ నలుగురి జాబితాతోనే మళ్లీ రాజ్‌భవన్‌కు
గతంలో తిరస్కరించిన గవర్నర్ నరసింహన్

హైదరాబాద్, జనవరి 9: సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఫైలుకు మళ్ళీ కదలిక వచ్చింది. గతంలో గవర్నర్ తిరస్కరించిన నలుగురు పేర్లతో కూడిన జాబితానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు రాజ్‌భవన్‌కు పంపించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జరిపిన భేటీలో సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై కూడా వారు చర్చించినట్లు తెలిసింది. గతంలో ఎనిమిదిమందితో కూడిన సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించిన జాబితాను గవర్నర్ ఆమోదానికి పంపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహలతో కూడిన కమిటీ ఎంపిక చేసిన జాబితానే గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపించింది. అయితే ఆ ఎనిమిది మందిలో నలుగురి పేర్లనే గవర్నర్ ఆమోదించి మిగిలిన నలుగురి పేర్లను తిరస్కరించారు. గవర్నర్ తిరస్కరించిన ఇంతియాజ్ అహ్మద్, వి వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, విజయనిర్మల పేర్లనే మళ్ళీ గవర్నర్ ఆమోదానికి ముఖ్యమంత్రి తాజాగా పంపించారు.
న్యాయవ్యవస్థలో అనుభవం ఉన్న వారి పేర్లను స.హ. కమిషనర్ల నియామకం సందర్భంలో పరిశీలించవచ్చునని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. గవర్నర్ గతంలో తిరస్కరించిన నలుగురిలో విజయనిర్మలకు మినహా మిగిలిన ముగ్గురు అడ్వకేట్లుగా పని చేశారు.
ఎపిపిఎస్‌సి సభ్యుని నియామకం కూడా..
రిపుంజయరెడ్డి అరెస్టు, రాజీనా మాతో ఖాళీ అయిన ఎపిపిఎస్‌సి సభ్యత్వ పదవిని భర్తీ చేయడంపై కూడా ముఖ్యమంత్రి దృష్టిపెట్టినట్లు తెలిసింది.

కాకినాడ బీచ్ ఉత్సవాలకు సిఎం
హైదరాబాద్, జనవరి 9: కాకినాడలో నిర్వహిస్తున్న బీచ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెళ్ళనున్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నానికి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాకినాడ చేరుకుంటారు. అధికార, అనధికారులతో భేటీ అయిన తరువాత మధ్యాహ్నం సర్పవరంలో ఇన్ఫోటిక్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఐటి టవర్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి 3.40 గంటలకు కాకినాడ బీచ్‌కు చేరుకుని ఉత్సవాల్లో పాల్గొంటారు.

పని లేకున్నా కూలీ పైకం

19నుంచి ఉపాధి హామీలో కొత్త విధానం
కోటి మంది ఎన్‌ఆర్‌ఇజిపి కూలీలతో సమాఖ్య
దారిమళ్లిన రూ. 141 కోట్లు.. రూ. 62 కోట్లు దుర్వినియోగం
గ్రామీణ ఉపాధి హామీ పథకం మంత్రి డొక్కా వెల్లడి

హైదరాబాద్, జనవరి 9: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ఎన్‌ఆర్‌ఇజిపి) ఈ నెల 19 నుంచి విప్లవాత్మకమైన విధానం అమలులోకి రాబోతుంది. ఈ పథకం కింద పని కల్పించని పక్షంలో పరిహారంగా దినసరి కూలీలో 25 శాతాన్ని చెల్లించే విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలులో ఉన్న మరే రాష్ట్రంలో అమలు చేయని హెచ్‌ఆర్ పాలసీని క్షేత్రస్థాయిలో పని చేస్తోన్న 21 వేల మంది సిబ్బందికి నూతన సంవత్సర కానుకగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఆర్‌ఇజిపి పథకం పురోగతిని సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు మీడియాకు వివరించారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని సక్రమంగా అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తూనే, అమలు చేయని అధికారులు, సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దినసరి కూలీ ప్రస్తుతం రూ. 137 చెల్లిస్తుండగా, పని కల్పించని పక్షంలో పరిహారంగా ఇందులో 25 శాతాన్ని చెల్లించనున్నట్టు మంత్రి తెలిపారు. కూలీలకు పని కల్పించని పక్షంలో సంబంధిత అధికారి, ఉద్యోగి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఉపాధి కూలీలకు చెల్లించే దినసరి వేతన చెల్లింపులో ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావులేకుండా ఆధార్ కార్డులు కలిగిన కూలీలకు నేరుగా బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరపడానికి కూలీల నుంచి ఎలాంటి సర్వీసు చార్జీలను వసూలు చేయమని, ఈ చార్జీలను ఇక నుంచి ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఆధార్ కార్డుల ద్వారా ఉపాధి కూలీలకు దినసరి వేతనం చెల్లించే విధానాన్ని ఏప్రిల్ నెల నుంచి రాష్టవ్య్రాప్తంగా అమలు చేస్తామని మంత్రి డొక్కా తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కోటి మంది కూలీలతో త్వరలో సమాఖ్యను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఎన్‌ఆర్‌ఇజిపి పథకం అమలులో రాష్ట్రం అగ్రభాగంలో నిలిచిందనీ, 2012-13 ఏడాదికిగాను రూ. 4113 కోట్లు ఉపాధి హామీకి ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఇందులో రూ. 3053 కోట్లు కూలీల వేతనాలకే ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో వేసవికాలంలో కూలీలకు కష్టతరంగా ఉంటుందని, నేల గట్టిగా ఉండి తవ్వడానికి ఇబ్బంది పడతారని, ఆ సమయంలో అదనంగా వేతనాన్ని చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి, జూన్ మాసాల్లో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం చొప్పున అదనంగా కూలీ చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా మూడు సంవత్సరాల్లో పది లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 45 వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు.
ఎన్‌ఆర్‌ఇజిపి పథకంలో 141 కోట్ల రూపాయలు దారి మళ్లినట్టు సామాజిక తనఖీల్లో తేలిందని, ఇందులో 13 కోట్లు లెక్క తేలకపోగా, 62 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించామని మంత్రి వివరించారు. ఇందులో 21 కోట్ల రూపాయలు రికవరీ చేయగా, ఇంకా 41.32 కోట్లు రాబట్టుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ పథకంలో నిధుల దుర్వినియోగం, అక్రమాలు, అవినీతికి పాల్పడిన 577 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించగా, 443 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు మంత్రి తెలిపారు. అలాగే అవినీతి, అక్రమాలకు పాల్పడిన 3463 మంది క్షేత్రస్థాయి సిబ్బందిని విధుల నుంచి తప్పించినట్టు మంత్రి తెలిపారు.

కొత్తగా 234 కరవు మండలాలు
హైదరాబాద్, జనవరి 9: రాష్ట్రంలో కొత్తగా 234 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 63, వైఎస్సార్ కడప జిల్లాలో 43, కర్నూలు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 28, నల్లగొండ జిల్లాలో 11, నెల్లూరు జిల్లాలో 9, మహబూబ్‌నగర్ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం పేర్కొంది.

పోలీసులు అతిగా వ్యవహరించారన్న కిషన్‌రెడ్డి
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>