హైదరాబాద్, జనవరి 9: మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ అరెస్టు ప్రభావం పాతబస్తీలో ఇంకా కొనసాగుతోంది. మంగళవారం ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత నిర్మల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. బుధవారం పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. అక్బరుద్ధీన్ నివాసం, మజ్లిస్ పార్టీ కార్యాలయం దారుస్సలంతో పాటు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే అక్బర్ అరెస్టు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పాతబస్తీలో అదనపు బలగాలను మోహరించిన పోలీసులు మంగళవారం అర్థరాత్రి నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, టాస్క్ఫోర్సు పోలీసుల బందోబస్తును మరింత పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే బుధవారం అక్బరద్దీన్ ఓవైసిని పోలీసులు నిర్మల్ కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించటం, అలాగే తనను చంచల్‌గూడ జైలుకు మార్చాలని అక్బర్ పెట్టుకున్న పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించటం వంటి నేపథ్యంలో పాతబస్తీ పరిస్థితులపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాతబస్తీలో ఒక వర్గానికి చెందిన ప్రజలు, మజ్లిస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేపడుతారన్న సమాచారం సేకరించిన పోలీసులు ఉదయం నుంచే పలుచోట్ల గస్తీని ముమ్మరం చేశారు. అక్బర్ అరెస్టు నేపథ్యంలో పాతబస్తీలో బుధవారం ఏమైనా సంఘటనలు జరుగుతాయోనన్న భయంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఇరువర్గాలకు చెందిన వ్యాపారస్థులు దుకాణాలను తెరవలేదు. కాగా, అక్బరుద్ధీన్ అరెస్టుకు ముందు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నపుడు ఆస్పత్రిలోకి చొరబడేందుకు యత్నించి శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన పలువురు మజ్లిస్ కార్యకర్తలను గుర్తించి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. బుధవారం కూడా ఆసుపత్రి వద్ద ప్రత్యేక బందోబస్తు కొనసాగింది. రోగుల సహాయకులను పోలీసులు తనిఖీలు చేసి లోనికి అనుమతించారు. నార్త్‌జోన్ డిసిపి శ్రీకాంత్ బుధవారం కూడా గాంధీ ఆస్పత్రిని సందర్శించి, బందోబస్తును పర్యవేక్షించారు.
ఏసిబికి చిక్కిన మరో గ్రేటర్ ఇంజనీర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రోజురోజుకి అవినీతికి, లంచాల డిమాండ్‌కు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇప్పటి వరకు వరుసగా డజన్ల కొద్ది ఉద్యోగులు, ఉన్నతాధికారులను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా, మిగిలిన సిబ్బంది పనితీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం గమనార్హం. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్(6)లో అసిస్టెంటు ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న వడితె కుప్పనాయక్(39) కూడా ఎసిబికి చిక్కారు. మంగళవారం ఆఫీసు ముగిసిన తర్వాత ఓ పనికి సంబంధించి ఫిర్యాదుదారుడికి అనుకూలం చేసేందుకు గాను ఇంజనీర్ నాయక్ సంతోష్‌నగర్ సమీపంలోని సవేరా హోటల్ వద్ధ రూ. 35వేల లంఛం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి ఎసిబి కోర్టు ముందు హజరుపర్చనున్నట్లు తెలిపారు.
మారణాయుధాలు స్వాధీనం: నలుగురి అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: ప్రమాదకరమైన మరణాయుధాలను సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ తతంగాన్ని నడిపిస్తున్న నలుగురు నిందితులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసుల కథనం ప్రకారం విశ్వసనీయవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు విజయనగర్‌కాలనీలోని బ్లాక్ బ్యారెట్ సెక్యూరిటీ ఎజెన్సీపై పోలీసులు దాడి నిర్వహించగా, పలురకాల మారణాయుధాలను బయటపడ్డాయి. అంతేగాక, ఈ ఎజెన్సీ మారణాయుధాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ బ్యాంకు ఇతరాత్ర సంస్థలకు అక్రమంగా సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నట్లు గుర్తించారు.
ఎజెన్సీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకోవటంతో పాటు రెండు డిబిబిఎల్ రైఫిళ్లు, మూడు ఎస్‌బిబిఎల్ రైఫిళ్లు, మరో 33 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, రెండు ఖాళీ క్యాట్రిడ్జ్‌లు, నాలుగు లైసెన్స్‌డ్ గన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నాని ఈ ఎజెన్సీ మేనేజర్ అయిన విజయనగర్‌కాలనీ నివాసి కృష్ణకిరణ్(34), నిర్వహణలో భాగస్వాములైన ప్రస్తుతం ఎర్రమంజిల్‌లోని బ్యాంక్ ఆఫ్ బహరిన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భీమల్‌కుమార్ మిశ్రా(35), సికింద్రాబాద్ ఆర్పీరోడ్డులోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ప్రదీప్ పాండే(52)లతో పాటు హిమాయత్‌నగర్‌లోని సిటీ యూనియన్ బ్యాంక్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్న సచ్చిదానంద్ పాటక్(24)లను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎజెన్సీ తాలుకూ డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, వీరితో పాటు మారణాయుధాల చట్టాన్ని ఉల్లఘించి అక్రమంగా సెక్యూరిటీ గార్డులను పంపుతున్న బీహర్‌కు చెందిన అమర్‌నాథ్, భిరేందర్‌సింగ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు తెలిపారు.
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్ జనవరి 9: మహానగరాభివృద్ధి, ప్రజలకు మెరుగైన పౌర సేవలను కల్పించటంతో పాటు బల్దియా పరిపాలన అంశాల్లో కూడా కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం 15వ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. మేయర్ మాజీద్ హుస్సేన్ అధ్యక్షతన గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం ముందు మొత్తం 18 అంశాలతో కూడిన అజెండాను అధికారులు ప్రవేశపెట్టగా, ఇందులో మూడు ప్రతిపాదనల మినహా మిగిలిన ప్రతిపాదనలన్నింటికీ స్థారుూ సంఘం ఆమోదం తెలిపినట్లు తెల్సింది. ఇందులో ముఖ్యంగా వీది లైట్ల నిర్వహణలో భాగంగా మూడు కంపెనీల నుంచి సామాగ్రిని కొనుగోలు చేసే ప్రతిపాదననను స్థారుూ సంఘం మళ్లీ వాయిదా వేసినట్లు తెల్సింది. అలాగే నగరంలోని 31 నాలాల ఆధునీకరణ, ప్రహరీగోడల నిర్మాణానికి 13వ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఆశిస్తున్న రూ. 487.34 కోట్ల నిధులు ఒక వేళ కేంద్రం మంజూరు చేయని పక్షంలో ప్రత్యామ్నాయంగా పనులెలా చేపట్టాలన్న అంశంపై చర్చ కూడా జరిగింది. అయితే సుమారు రూ. 252.26 కోట్ల వ్యయంతో తొలి దశగా ప్రాధాన్యత ప్రాతిపదికన 11 నాలాల ఆధునీకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలని స్థారుూ సంఘం ఆదేశించినట్లు తెల్సింది. అలాగే శివార్లలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించిన పివిఎన్ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి ఆరంఘర్ వద్ధనున్న అండర్‌పాస్ వద్ధ వీది ధీపాల నిర్వహణ బాధ్యతను హెచ్‌ఎండిఏకు అప్పగించాలని, అలాగే ఆరంఘర్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, లక్ష్మీనగర్, రేతీబౌలీ చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్, వీది ధీపాల నిర్వహణ బాధ్యతలను హెచ్‌ఎండిఏకు అప్పగించాలన్న ప్రతిపాదనను సైతం వాయిదా వేసినట్లు తెల్సింది. నగరంలో నిత్యం రద్ధీగా ఉండే పలు కారిడార్ల అభివృద్ధి, ఆధునీకరణకు సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగింది. గత అక్టోబర్ మాసంలో నగరం వేదికగా జరిగిన జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సును పురస్కరించుకుని ఇప్పటికే కొన్ని మెయిన్ రోడ్లను అభివృద్ధి పరిచామని అధికారులు సమావేశంలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం సివోపి సందర్భంగా అభివృద్ది పరిచిన మెయిన్‌రోడ్లు కాకుండా మరికొన్ని ముఖ్యమైన కారిడార్లను ఎంపిక చేసి ఆధునీకరించేందుకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను ఒక్కో జోన్‌కు రూ. 50 కోట్లను కూడా కేటాయిస్తూ, ఈస్ట్, సౌత్, నార్త్‌జోన్లకు చెందిన జోనల్ కమిషనర్లు ఒక్కోక్కరు రూ. 50 కోట్ల వరకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని ఆదేశించినట్లు తెల్సింది.
ఆమోదం పొందిన ప్రతిపాదనలు
స్థారుూ సంఘం 15వ సాధారణ సమావేశంలో భాగంగా ఫతేనగర్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం సేకరించిన 4114 గజాల స్థల సేకరణకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు రూ. 83లక్షల 83వేల పై చిలుకు నష్టపరిహారంగా చెల్లించేందుకు స్థారుూసంఘం ఆమోదం తెలిపినట్లు తెల్సింది. అలాగే బార్కాస్ వై జంక్షన్ నుంచి బాలాపూర్ వరకు రూ. 34లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ ప్రతిపాదన, చందూలాల్ భరాదారీ పారిశ్రామిక వాడలో ఆర్‌ఎంసి రోడ్డు నిర్మాణం కోసం రూ. 37.50లక్షల ప్రతిపాదనకు కూడా స్థారుూసంఘం ఆమోదం తెలిపినట్లు సమాచారం. అదే ప్రాంతంలో రూ. 25.50లక్షలతో మరో సిసిరోడ్డు నిర్మాణం, గోపన్‌పల్లి గ్రామంలోని రెండు, దర్గాలోని ఓ స్మశానవాటికలకు ప్రహరీగోడలు నిర్మించేందుకు వేర్వేరుగా ప్రహరీగోడల నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెల్సింది. వీటితో పాటు చాంద్రాయణగుట్ట ఫ్లైవోవర్ నుంచి ఓవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు రూ. 25లక్షల 84వేల పై చిలుకు స్ట్రక్చరల్ వాల్యు ప్రతిపాదన, పత్తర్‌గట్టిలో దుకాణాల నేమ్ బోర్డుల ఏర్పాటు, బోరబండాలోని స్వరాజ్‌నగర్‌లో సిసి రోడ్డు నిర్మాణాల ప్రతిపాదనలు, కూకట్‌పల్లిలోని ధీనబంధునగర్‌కాలనీలో ఆర్‌సిసి, సీవరేజీ పైప్‌లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెల్సింది.
కౌన్సిల్ ఆమోదం లేకుండానే పనులా?
రూ. 50లక్షల పైబడిన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను తప్పకుండా కౌన్సిల్‌లో పెట్టి, కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా సర్కారు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య పెరిగిన దూరం, అలాగే లంగర్‌హౌస్, బోరబండ డివిజన్ల కార్పొరేటర్ల మార్పు వంటి పరిణామాల నేపథ్యంలో కౌన్సిల్ నిర్వహించకుండా మూడుసార్లు వాయిదా వేసిన మేయర్ మాజీద్ హుస్సేన్, అధికారులు రూ. 50లక్షల పై విలువైన పలు ప్రతిపాదనలను సర్కారు నేరుగా ఆమోదించాలని కోరుతూ సర్కారుకు పంపాలని బుధవారం నాటి స్థారుూ సంఘంలో తీర్మానం చేయటం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా కౌన్సిల్, కౌన్సిల్‌లో సభ్యులైన కార్పొరేటర్ల హక్కులను కాలరాస్తున్నట్టేనని పలువురు సభ్యులు మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా స్థారుూ సంఘం ఆమోదించిన రూ. 50లక్షల పై చిలుకు విలువైన సుమారు రూ. 190 కోట్ల విలువైన ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, కౌన్సిల్ ఆమోదం లేకుండా సర్కారు ఆమోదం పొందేందుకు సర్కారుకు పంపాలని స్థారుూ సంఘం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రాష్టప్రతి ఆదేశాలూ బేఖాతర్
ఖైరతాబాద్, జనవరి 9: విద్యుత్ సంస్థల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు రాష్టప్రతి కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలను విద్యుత్ సంస్థల్లో ఉన్న ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తున్నారని ఏపి జెన్‌కోలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఇంజనీర్ ఆర్.చలపతి రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్న ఉన్నతాధికారుల అవినీతి బట్టబయలు చేసినందుకు తనకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపివేశారని ఆవేదన చెందారు. దీంతో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించానని విజులెన్స్ విభాగం సదరు అధికారులను శిక్షించాలని సిఫార్సు చేసినా, రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టులు చివాట్లు పెట్టిన అవినీతి అధికారులు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇదే విషయమై ముఖ్యమంత్రికి, ప్రిన్సిపల్ సెక్రెటరీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశానా ఎలాంటి చర్యలకు ఉపక్రమించక పోవడం ఎంతో విచారకరమని అన్నారు. 2012 జనవరి 5న ట్రాన్స్‌కో, జెన్‌కోలలో జరుగుతున్న అవినీతిని లిఖితపూర్వకంగా రాష్టప్రతికి ఫిర్యాదు చేయగా స్పందించిన రాష్టప్రతి కార్యాలయం సదరు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, కాంట్రాక్ట్‌లు, అగ్రిమెంట్ల విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్యానల్ ఉద్యోగులను వెంటనే చేర్చుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్యానల్ ఉద్యోగులు పనిచేస్తూ జీవనం గుడుపుతున్న ఉద్యోగులను వెంటనే బేషరుతుగా తిరిగి చేర్చుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానెల్ ఎంప్లాయిస్(నాలుగో తరగతి) అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌తో అసోసియేషన్ నేతలు, సభ్యులు బుధవారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి. అనిల్‌కుమార్, మాలల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణలు మాట్లాడుతూ ప్యానల్ ఎంప్లాయిస్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న దాదాపు 3500 మంది ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసు గానీ సమాచారం గానీ లేకుండా అకస్మికంగా విధుల్లో నుంచి తొలగించటం పట్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గత్యంతరం లేని ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా, వాదోపవాదనలు పూర్తయినానంతరం అప్పటి న్యాయమూర్తి ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చారని వివరించారు. ఎలాంటి సమాచారం లేకుండా తొలగించిన ప్యానల్ ఉద్యోగులను మూడునెలల లోపు పర్మినెంటుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టనట్టుగా వ్యవహారించారని వారు మండిపడ్డారు. ఆ తర్వాత బ్యాంకు అధికారులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉద్యోగులందర్నీ లేబర్ కోర్టు ద్వారా ఆశ్రయించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.
రాజీవ్ ‘గృహకల్ప’ పెండింగ్ రుణాలను విడుదల చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: రాజీవ్ గృహకల్పకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో వున్న రుణాలను వెంటనే విడుదల చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. గరిష్టంగా వారం రోజుల సమయంలో ఈ రుణాల విడుదల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా ఆమె సూచించారు. రాజీవ్ గృహకల్ప ఇళ్ల డాక్యుమెంటేషన్, బ్యాంకు రుణాలపై వివిధ బ్యాంకుల అధికారులతో బుధవారం ఆమె కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 25,761 ఇళ్ళకుగాను 24,749 ఇళ్ళ డాక్యుమెంటేషన్ ఇప్పటికి పూర్తయి వాటన్నింటికి రుణం విడుదల చేయడం జరిగిందన్నారు. ఇంకా 1015 ఇళ్ళకు సంబంధించి డాక్యుమెంటేషన్‌తోపాటు రుణాన్ని కూడా విడుదల చేయాల్సి ఉందని, వీటిల్లో ఆంధ్రాబ్యాంకు అత్యధికంగా రూ.3.79 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కెనరా బ్యాంకు 2.47 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.1.60 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, ఇట్టి రుణాలను వారం రోజుల్లో రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. రాజీవ్ గృహకల్ప లబ్దిదారులందరూ పేద వాళ్లేనని, దీర్ఘకాలంగా రుణాలు విడుదల చేయకపోవడంవల్ల వారిపై వడ్డీ రూపంలో అధిక భారం పడుతుందని తెలిపారు. లబ్దిదారుల తరపున ఆలోచించి బ్యాంకర్లు రుణ విడుదలకు చొరవ చూపాలని ఆదేశించారు. ఇళ్లు అప్పగించిన తర్వాత లబ్దిదారులు ఆ ఇంటిలో నివసించని పక్షంలో వాటిని రద్దు చేస్తామని ఆమె పేర్కొంటూ ఈ అంశాలపై సంబంధిత లబ్దిదారులకు నోటీసులు పంపాల్సిందిగా ఆర్జీకె పిఓను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ మండలి చీఫ్ ఇంజనీర్ రాజీవ్‌గోపాల్ మాట్లాడుతూ రాజీవ్‌గృహ కల్పకు సంబంధించి ఏవైనా సబ్సిడీలు మిగిలి ఉంటే వెంటనే వాటిని ఆయా బ్యాంకులకు విడుదల చేయడం జరుగుతుందని, బ్యాంకర్లు జాప్యం చేయకుండా తమ వంతు రుణాలను రిలీజు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ సూర్యారావు, లా అధికారి వేణుగోపాల్, రాజీవ్ గృహకల్ప పి.ఓ. శ్రీనివాస్‌రెడ్డి, యస్‌బిహెచ్ డిజిఎం ఎం.కె.్భట్టాచారి, ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్ శివకుమార్, సిండికేటు బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు పాల్గొన్నారు.