కందుకూరు, జనవరి 9: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కంకణం కట్టుకుందని హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం కందుకూరు మండలం మండలంలోని కందుకూరు, తిమ్మాయిపల్లి, అన్నోజిగూడ, ఎన్టీఆర్‌తండా, బేగరికంచే, వావిల్లకుంట తండా, మీర్‌ఖాన్‌పేట గ్రామాల్లో రూ.3కోట్లతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ ప్రజల క్షేమం కోరుతూ ప్రభుత్వ ఫలాలు అందరికీ చేరేవిధంగా ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి నిరుదేపకు అందినపుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. మంచి నీటి సమస్యను ప్రజలకు మంత్రికి వివరించారు. కందుకూరులో రూ.16లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనం, తిమ్మాయిపల్లిలో రూ.8లక్షలతో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్, రూ.15లక్షలతో స్కూల్ బిల్డింగ్, రూ.16లక్షలతో సంపు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వావిల్లకుంటతండాలో రూ.8లక్షలతో నిర్మించనున్న ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్, రూ.2లక్షలతో సిసి రోడ్డు, రూ.9లక్షలతో నిర్మించనున్న సంపునకు శంకుస్థాపన చేశారు. భేగరికంచెలో రూ.9లక్షలతో నిర్మించనున్న సంపునకు, కందుకూరు నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు రూ.50లక్షలతో బిటి రోడ్డుకు, రూ.19లక్షలతో నిర్మించనున్న పైప్‌లైన్‌కు మంత్రి శంకుస్థాపన చేయగా రూ.10లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.6లక్షలతో చేపట్టిన పాఠశాల భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. రూ.62లక్షలతో మీర్‌ఖాన్‌పేటలోని రాంబాయికత్వా చెరువు మరమ్మతు పనులను ప్రారభించారు.
రూ.30కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం
ఉప్పల్, జనవరి 9: రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం పరిధిలో భూ కబ్జాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉంటూ అనుభవిస్తున్న ప్రభుత్వ స్థలాలపై అధికారులు దృష్టిమళ్లించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రైవేటు సర్వే నెంబర్ల పేరుతో కబ్జాచేసిన ప్రభుత్వ స్థలాలపై సర్వేలు నిర్వహించి కోట్ల విలువైన స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇప్పటికే మల్లాపూర్, ఉప్పల్, నాగోల్, రామంతాపూర్‌లోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి సూచికబోర్డులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాగోల్ బండ్లగూడలోని సర్వే నెంబర్ 36/6లో సర్వేలో అవకతవకల వల్ల కనుమరుగైన రెండున్నర ఎకరాల స్థలాన్ని మళ్లీ ఏడి సర్వే నిర్వహించి కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకుని బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా ఉప్పల్ రింగ్‌రోడ్డులోని సర్వే ఆఫ్ ఇండియా క్వార్టర్ల సమీపంలో సర్వే నెంబర్ 636, 637లో రూ.30కోట్ల విలువైన సుమారు మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఇదే స్థలంలో రైతు బజార్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలంగా భావిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే బి.రాజిరెడ్డి, హైదరాబాద్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. రైతుబజార్‌తో పాటు కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రణాళికను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధునాతన రైతుబజార్‌ను నిర్మించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వి.లచ్చిరెడ్డి, గడ్డి అన్నారం మార్కెటింగ్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ కంది ఆగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సంక్రాంతి చార్జీల బాదుడు
కంటోనె్మంట్, జనవరి 9: సంక్రాంతి పండగను పురస్కరించుకొని నగరం నుంచి సీమాంధ్ర ప్రాంతాలకి 4400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. వారం రోజులుగా సంబంధిత బస్సులు నడుస్తున్నాయి. జనవరి 13 వరకు సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుస్తాయి. టికెట్ చార్జి మాత్రం సాదరణ చార్జీ కంటే 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. అధికారులు మాత్రం అదనపు వసూళ్లను సమర్ధించుకోవడం గమనార్హం. బస్సులు సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్న కారణంగానే 50 శాతం అధికంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంబిస్తే తీవ్ర పరిణామాలు
ఘట్‌కేసర్, జనవరి 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నాన్చుడి ధోరణిని అవలంబిస్తున్న కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ మండల టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాగడాలతో భారీ ర్యాలీ జరిపి జాతీయ రహదారిపై రాస్తారోకో జరిపారు. ఘట్‌కేసర్‌లోని జాతీయ రహదారిపై వందలాది మంది తెలంగాణవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ జరిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిఆర్‌ఎస్ మేడ్చల్ ఇంచార్జి మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంధ్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిపై విసుగు చెందిన ఏడువందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొంగళ్ళ స్వామి యాదవ్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, యాదగిరి యాదవ్, రొడ్డ యాదగిరి, బట్టె లక్ష్మణ్ పాల్గొన్నారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: టిఆర్‌ఎస్ అధిష్టానం పిలుపు మేరకు బుధవారం రాత్రి మేడ్చల్ ఆ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు కాగడాల ప్రదర్శనను నిర్వహించారు. పట్టణంలోని జెఏసి శిబిరంనుండి ప్రారంభమైన ఈ కాగడాల ప్రదర్శన పలు పురవీధులగుండా సాగి తిరిగి శిబిరం వద్దకు చేరుకుంది. ప్రదర్శన సందర్భంగా తెలంగాణా అనుకూల నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరభద్రారెడ్డి, నాయకులు కమలాకర్‌రెడ్డి, భాస్కరయాదవ్, సత్యనారాయణ, విష్ణుచారి, యూసుఫ్‌ఖాన్, మోనార్క్, మల్లికార్జున్, సంజీవరావు, మల్లారెడ్డి, సుధాకరరెడ్డి పాల్గొన్నారు.
చందానగర్‌లో
శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కాగడాల ప్రదర్శన జరిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి కొండకల్ శంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో చందనగర్‌లో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై కాగడాలతో ప్రదర్శనగా వెళ్లారు. తక్షణమే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా జాప్యం చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నీరుగారిస్తే జనం తిరగబడతారని హెచ్చరించారు. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. ఎంఐఎం పార్టీతో జగన్ కుమ్మక్కై మతకల్లోలాలు సృష్టించి తద్వారా తెలంగాణ అంశాన్ని మరుగున పడేయాలని కుటిల యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిసి విభాగం నేత సాయిబాబా, యువజన విభాగం అధ్యక్షుడు జి.సంగారెడ్డి, డివిజన్ నాయకులు శీతల్‌సింగ్, సంకటిస్వామి, సదానందచారి, రాజేశ్, అరవింద్, మహ్మద్ ఇసా తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం పేరుతో మరోసారి మోసం
మాజీ మంత్రి చంద్రశేఖర్
వికారాబాద్, జనవరి 9: అఖిలపక్షం పేరుతో తెలంగాణా ప్రజలను మరోసారి కేంద్రం మోసం చేసిందని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జెఎసి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ గంజ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వికారాబాద్ తెలంగాణా గర్జనలో ఆయన మాట్లాడుతూ అఖిలపక్షం నుండి పార్టీకి ఇద్దరి చొప్పున పిలవడమే తప్పని అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలనే లక్ష్యమన్నారు. ప్రకటించిన తెలంగాణ రాకుండా చేసింది సీమాంధ్ర టిడిపి, కాంగ్రెస్ నాయకులేనన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్ తెలంగాణ కొరకు రాజీనామా చేయకుంటే ప్రజలు క్షమించబోరని అన్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ రంగారెడ్డి జిల్లా జెఎసి చైర్మన్ కె.శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జెఎసి అధికార ప్రతినిధి విఠల్, ఇంజనీర్స్ జెఎసి చైర్మన్ వెంకటేశం, టిఎల్‌ఎఫ్ అధ్యక్షుడు కత్తివెంకటస్వామి, టిఆర్‌ఎస్ పశ్చిమ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కె.శివరాజ్, విద్యార్థి జెఎసి జిల్లా కన్వినర్ ఎన్.శుభప్రద్‌పటేల్, యూత్ జెఎసి జిల్లా కన్వినర్ శంకర్, టిఆర్‌ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాఫర్, జెఎసి నియోజకవర్గ, పట్టణ చైర్మన్‌లు నర్సింలు, రాంచందర్ పాల్గొన్నారు.