శ్రీకాకుళం, జనవరి 10: శ్రీకాకుళం పట్టణంలో గుజరాతీపేట వద్ద గల పాతబ్రిడ్జి స్థానంలో కొత్తబ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. విస్తరించిన కలెక్టర్ బంగ్లా రహదారిని గురువారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఆరుకోట్ల రూపాయలతో పొన్నాడ బ్రిడ్జి సమీపం నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు రహదారిని 50 అడుగుల రహదారిగా విస్తరించారు. ఈ సందర్భంగా కినె్నర కాంప్లెక్సు కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రహదారిని సంక్రాంతి కానుకగా అభివర్ణించారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధులై ఉన్నట్లు చెప్పారు. నది ఒడ్డున ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని, దానిని గమనించి ప్రజలు మంచి నీటి అవసరాలను తీర్చాలని సంకల్పించి 40 కోట్ల రూపాయలతో నీటి పథకాన్ని అందించామన్నారు. ప్రజలకు అన్ని రకాల వౌళిక సదుపాయాలు ఉన్నప్పుడు చక్కని జీవనాన్ని గడపగలరన్నారు. జిల్లాకేంద్రానికి ఉండాల్సిన హంగులు శ్రీకాకుళం పట్టణానికి లేవని, వాటిని సమకూర్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. పొన్నాడ బ్రిడ్జిని రూ.22 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. నవభారత్ నుండి పెద్దపాడు వరకు గల రహదారిని 18 కోట్ల రూపాయలతో, అరసవల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపాన్ని ఎనిమిదికోట్లతోను, అరసవల్లిజంక్షన్‌లో ఎనిమిదికోట్లతో పర్యాటక స్టార్‌హోటల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. అరసవల్లి కూడలి నుండి అమ్మవారు దేవాలయం వరకు రహదారిని 80 అడుగుల రహదారిగా మార్చేందుకు 9.50 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి చెప్పారు. కలెక్టర్ బంగ్లా రహదారి, పురపాలక సంఘ రహదారి అయినప్పటికీ ఆర్‌అండ్‌బి శాఖకు మార్పించి నిధులు మంజూరు చేశామన్నారు. రహదారి విస్తరణలో ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇళ్లు ఇస్తామన్నారు. ఇందుకు 50 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇళ్లు కోల్పోయిన వారికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన రిమ్స్ ఆసుపత్రి రహదారిని ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. అదేరోజు పట్టణంలో వుడా కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒ గణేష్‌కుమార్, ఆర్‌అండ్‌బి పర్యవేక్షక ఇంజనీరు సోమశేఖర్, మున్సిపల్ కమీషనర్ రామలింగేశ్వర్, తహశీల్దార్ సత్తిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలుమంగమ్మ, డిసిఎంఎస్ అధ్యక్షులు గొండు కృష్ణమూర్తి, గుమ్మా నగేష్ తదితరులు పాల్గొన్నారు.
పండుగ వేళ.. ధరల మోత
పాతశ్రీకాకుళం, జనవరి 10: ధరల మోత సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక సంక్రాంతి వస్తుందంటే ఆనందం కంటే ఆయాసమే ప్రజల్లో ఆవరిస్తోంది. ఈ పండుగ వేళల్లో ఏ ఇంటికి వెళ్లినా కమ్మని ఘుమఘుమలు నోరూరించేవి. పిల్లలు, పెద్దలు హాయిగా కలసి భుజించేవారు. ప్రస్తుత ఏడాది మాత్రం ఏ ఇంట చూసినా అరకొర సరకులు, రుచిలేని వంటలు..నిట్టూర్పులు..సాధారణ రోజుల్లోనే ధరల నియంత్రణ లేదు ఇక సంక్రాంతి డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లో అన్ని సరుకుల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. ఇక ఏం కొంటాం..ఏం తింటామని ప్రజలంతా చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భగ్గుమంటున్న నిత్యవసర వస్తువుల ధరలు భోగి, సంక్రాంతుల్లో కాంతులు లేకుండా చేస్తున్నాయి. గ్యాస్‌తో పాటు విద్యుత్ చార్జీల బాదుడు ఓ మోత మోగిస్తుండగా, ఉప్పు, పప్పు, పసుపు, నూనె, బియ్యం... ఒకటేమిటి అన్నింటి ధరలూ ఆకాశనంటుతున్నాయి.
కొత్త పంట వచ్చినా ఇంతేనా..
వర్షాలు పడి పంటలు బాగా పండాయి. కొత్తపంటల రాకతో పప్పుదినుసులు, బియ్యం ధరలైనా తగ్గాల్సిందిపోయి భారీగా పెరిగాయి. ఇక మాంసాహారం సంపన్నుల ఆహారంగా మారిపోతుంది. చికెన్ ధర చుక్కల్లో ఉంటే మటన్ ధర 400 నుండి 550 రూపాయలకు పెరిగింది. బియ్యం సాంబమసూరి 30 నుండి 45 వరకు పెరిగింది. ఎండుమిరప కిలో 110, పంచదార 40, ఆయిల్ లీటరు 90 రూపాయలు, శెనగపలుకలు కిలో 120 రూపాయలు, మినపపప్పు ధర భారీగా పెరగడంతో సామాన్యులు దుకాణాల వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు.
పండుగకోటా తుస్సే...
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రధాన పండుగల్లో విడుదల చేసే ప్రత్యేక కోటా ఈ ఏటా లేనట్టే. తెల్లరేషన్ కార్డుదారులకు ఈసారి ప్రత్యేక కోటా అందడం లేదు. అధికార పార్టీకి ప్రజాసమస్యలు గాలికొదిలేయడం తగదంటూ ఆరోపిస్తున్నారు.
జిల్లా సస్యశ్యామలం
నదులు, ఉపనదులు, అధిక వర్షపాతంతో జిల్లాలో వరి, చెరకు, కొబ్బరి, అరటి, కూరగాయల పంటలు అధిక దిగుబడులతో పుష్కలంగా పండుతున్నాయి. అయినప్పటికీ ఎందుకీ ధరలు పెరుగుతున్నాయంటే ప్రజావసరాలను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గాలికొదిలేయడమే కారణంగా పలువురు పేర్కొంటున్నారు.
ధరల నియంత్రణ కమిటీ ఉందా?
బహిరంగ మార్కెట్‌లో సరఫరా, గిరాకీ మధ్య సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు దానిని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతీ జిల్లాలోను కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఈ కమిటీ చైర్మన్‌గా, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెట్ శాఖలకు చెందిన సహాయసంచాలకులు, వినియోగదారుల మండలి, వర్తకసంఘం, మీడియా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ధరల నియంత్రణపై తరచూ సమావేశమై అవసరమగు చర్యలు తీసుకోవాలి. ప్రతీవారం మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులను పరిశీలించాలి. అందరికీ అందుబాటులో సరుకులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి. విజిలెన్సును అప్రమత్తంచేసి నల్లబజారుకు సరుకులు తరలిపోకుండా చూడాలి. బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు జరిగేలా చూడాలి. అయితే అసలు ఈ వ్యవస్థ ఉన్నట్లే తెలియని సిక్కోలు ప్రజానీకం నిత్యం వర్తకుల దోపిడీకి గురవుతూనే ఉన్నారు.
సిక్కోలు ప్రతిభను
జాతీయ స్థాయిలో చాటుతాం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 10: నాబార్డు బ్యాంకు ఆర్థిక సహాయంతో శ్రీకాకుళం జిల్లా గిరిపుత్రులు మోడువారిన కొండలను పచ్చని మైదానాలుగా మార్చడంలో సఫలీకృతులయ్యారని వివిధ రాష్ట్రాలకు చెందిన నాబార్డు అధికారుల బృందం కితాబునిచ్చింది. దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రెండురోజుల పర్యటనలో భాగంగా సారవకోట మండలం బురుజువాడ, పాతపట్నం బ్రెడ్స్ కార్యాలయం, సీతంపేట మండలం కుసుమి వాటర్‌షెడ్ పథకాలు, కొత్తూరు మండలం పొల్లలో మాతోట కార్యక్రమాలను పరిశీలించారు. అలాగే కొరగాంలో విడిపి కార్యక్రమాలతోపాటు సీతంపేట మండలంలో గిరిజన రైతాంగం కోసం రూపొందించిన రైతుక్లబ్‌లు, ఉత్పత్తుల విక్రయాలకు నెలకొల్పిన వారపు సంతలను ఈ బృందం పరిశీలించింది. అనంతరం గురువారం సారవకోట మండలం బురుజువాడ గ్రామంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో 2009లో నాబార్డు సహాయంతో మాతోట కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. లబ్ధిదారులుగా ఎంపికైన గిరిజనులు వారికి కేటాయించిన అటవీ ప్రాంతంలో ఫలసాయాలు ఇచ్చే చెట్లు, మొక్కలను మూడు సంవత్సరాల వ్యవధిలో పెంచి నేడు లబ్ధిపొందుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కుసుమి ప్రాంతంలో ఉన్న వాటర్ షెడ్ పథకాలను నాబార్డు కార్యక్రమాలకే తలమానికంగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు అధికారులతో మాట్లాడుతూ మారుమూల ఉన్న గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. గిరిజన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీవన స్థితిగతులపై ఆరా తీసి మరింత మెరుగు పరచుకోవాలని కోరారు. జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలుచేసేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నాబార్డు శిక్షణా కేంద్రంలో జాతీయ సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సుకు పథకాలను విజయవంతంగా అమలు చేసిన జిల్లా లబ్ధిదారులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బృందానికి నాబార్డు ఎజిఎం ఎ సుబ్రహ్మణ్యం, డిజిఎం ఎంకె మహంతి నాయకత్వం వహించారు.
పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
శ్రీకాకుళం (టౌన్), జనవరి 10: జిల్లాలోని అన్ని పాఠశాలలకు జనవరి 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాద్యాయులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని, 21వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు.
డిసిసిబి పీఠం కైవసమే లక్ష్యం
* వైకాపా శాసనసభ పక్ష ఉపనేత కృష్ణదాస్
నరసన్నపేట, జనవరి 10: రాబోవు సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసేందుకు ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కోరారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జగన్ విడుదల కోసం కోటి సంతకాల సేకరణలో భాగంగా నేటివరకు జిల్లాలో ఐదు లక్షల మేర సంతకాలను సేకరించామన్నారు. మరో రెండులక్షల వరకు సంతకాలను సేకరించేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, వజ్జ బాబూరావు, మార్పు ధర్మారావు, కూన మంగమ్మ, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైలు చార్జీల మోతపై కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
* మాజీ మంత్రి సీతారాం
ఆమదాలవలస, జనవరి 10: సుపరిపాలన అందిస్తామని, నెరవేరని హామీలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారం వెలగబెడుతూ అకస్మాత్తుగా రైల్వే చార్జీలు పేరిట ప్రయాణీకులకు వాతలు పెట్టిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం ఆయన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ మరోవైపు సామాన్యునిపై భారాలు మోపుతుందని విమర్శించారు. విద్యుత్, రైలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరైనది కాదన్నారు. ఈ ప్రభుత్వాన్ని క్షమించేది లేదని, ప్రజలే సాగనంపాలని పిలుపునిచ్చారు. పెరిగిన చార్జీలకు నిరసనగా సంక్రాంతి అనంతరం ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రానున్న సహకార, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతిని, చార్జీల పెరుగుదలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బ్యాంకు ఖాతా ఉంటేనే హౌసింగ్ బిల్లు
* ఇ.ఇ. గణపతిరావు
జలుమూరు, జనవరి 10: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కాలనీలు మంజూరైన ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలని, బ్యాంకు ఖాతా ఉన్నవారికి నిర్మాణం జరిగిన వారం రోజులకే తగిన బిల్లు అందుతుందని గృహనిర్మాణ శాఖ ఇ.ఇ. గణపతిరావు అన్నారు. మండలం అంధవరం పంచాయతీ గంగన్నపేట గ్రామంలో రచ్చబండలో మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. బ్యాంకు ఖాతా చేయించుకునే బాధ్యత ఇళ్ల లబ్ధిదారులు, దిగువస్థాయి హౌసింగ్ అధికారులపై ఉందన్నారు. బ్యాంకు అకౌంట్లు ఆలస్యమైనచో సంబంధిత దిగువస్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇందిరమ్మ, రచ్చబండ, జీవో 171 కింద టెక్కలి డివిజన్ పరిధిలో 76,240 ఇళ్లు గతంలో మంజూరయ్యాయని ఇ.ఇ. గణపతిరావు తెలిపారు. పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇందులో 49,436 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇంకా 24వేల ఇళ్ల పనులు ప్రారంభం కాలేదన్నారు. మండలంలో 19,106 ఇళ్లు మంజూరుకు గాను 12,300 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని స్పష్టం చేసారు. ఆయనతోపాటు ఎ.ఇ. నర్సింగరావు, హౌసింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావులు ఉన్నారు.
పల్స్ పోలియో
ఏర్పాట్లపై సమీక్ష
శ్రీకాకుళం (టౌన్), జనవరి 10: ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మొదటి విడత పల్స్‌పోలియో ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. శారద మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఐదు సంవత్సరంల లోపు పిల్లలను గుర్తించి తప్పకుండా వారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. వలస వచ్చిన వారికి కూడా చుక్కలు వేయడంతో పాటు అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాంప్రసాద్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి (లెప్రసీ అండ్ ఎయిడ్స్), మాస్ మీడియా అధికారులు బి.ముఖలింగం, ఎస్.అశోక్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరూ విద్యావంతులు కావాలి
రణస్థలం, జనవరి 10: విద్య అభివృద్ధికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పేర్కొన్నారు. గురువారం మండలం వల్లభరావుపేట గ్రామం వద్ద జరిగిన పల్లెకుపోదాం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యత వల్ల ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గూర్చి తెలుసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలన్నారు. మీ పిల్లలను చదువు ఆపేయకుండా బాగా చదివించాలని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతీరోజూ వస్తున్నదీ, లేనిదీ గ్రామస్థులు పరిశీలించాలని తెలిపారు. సక్రమంగా రాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాలని సూచించారు. వల్లభరావుపేట ఎస్సీ కాలనీకి గ్రామ పంచాయతీ నిధుల నుండి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధి హామీ నిధుల నుండి కాలనీకి సి.సి.రోడ్డు, కాలువ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. పల్లెకుపోదాం కార్యక్రమంలో అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు దానిని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో 50 మందికి పింఛన్లు, 12 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. మండలంలో పట్టాదారుపాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తక్కువగా ఉన్నట్టు స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న సాక్షర భారత్ కేంద్రాన్ని సమాచార కేంద్రంగా మార్చి అడంగల్ కోసం పుస్తకం, పింఛను మంజూరు వివరాలు, కీ రిజిష్టర్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. వల్లభరావుపేట గ్రామ పంచాయతీకి ఉపాధి హామీ పథకం నుండి 25 లక్షల రూపాయల మెటీరియల్ పనులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా లేదని, వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల ర్యాంకు రిజిష్టర్‌ను పరిశీలించారు. ఎక్కువమంది బి, సి గ్రేడ్‌ల వారు ఉన్నారని, ఉపాధ్యాయుల పనితీరు సక్రమంగా లేదని, మండల విద్యాశాఖాధికారి దృష్టి సారించాలన్నారు. మాసాంతపు చదువుల పండుగ కార్యక్రమం నిర్వహించినప్పుడు పిల్లల ప్రొగ్రాస్‌పై తల్లిదండ్రుల రిమార్క్‌లను రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే వల్లభరావుపేట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం తహశీల్దార్ రమేష్, ప్రత్యేకాధికారి గున్నయ్య, ఎంపిడిఒ వాసుదేవరావు, మండల వ్యవసాయాధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం ఎ.పి.ఎం.లు తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికులు, ఎక్సైజ్ అధికారుల మధ్య వాగ్వివాదం
శ్రీకాకుళం (టౌన్), జనవరి 10: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన గీతకార్మికులకు ఎక్సైజ్ అధికారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు వినతి పత్రం అందజేయడానికి గురువారం ఉదయం ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకుని కొద్దిసేపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అధికారులు బయటకు వచ్చి తమ వినతి పత్రాన్ని స్వీకరించాలని వారు కోరగా దాన్ని నిరాకరించిన అధికారులు తీరుపై కార్మికులు మండిపడ్డారు. తాము శాంతియుతంగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరామని, మీరెందుకు తమ వినతిని స్వీకరించరని ఎక్సైజ్ కార్యాలయం సూపరిండెంటెంట్ బలరాంను ప్రశ్నించారు. మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆఖరుకు కార్మికుల ఆగ్రహాన్ని చవిచూసిన అధికారులు బయటకు వచ్చి వారి వినతి పత్రం స్వీకరించడంతో కథసుఖాంతమైంది. ముందుగా కార్మికులనుద్దేశించి చేతివృత్తిదారుల జిల్లా కన్వీనర్ టి.తిరుపతిరావు మాట్లాడుతూ ప్రకృతి ద్వారా వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తున్న గీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు.
అర్హులైన గీత కార్మికులందరికీ నెలకు వెయ్యి రూపాయలు పింఛన్ ఇవ్వాలని, ఉపాధి మెరుగుకు కల్లు విధానాన్ని రూపొందించాలని, అందుకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ ఏర్పాటు చేయడంతో పాటు సొసైటీలకు భూమిని కేటాయించాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన గీత కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కోట మల్లేష్, డి.దానయ్య, ఎ.రాములు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే చార్జీల పెంపుతో
సామాన్యునికి పెనుభారం
* టిడిపి నేత రామ్మోహననాయుడు
శ్రీకాకుళం (టౌన్), జనవరి 10: దేశంలో సామాన్యునిపై పెనుభారం మోపే విధంగా రైల్వేచార్జిలను అడ్డగోలుగా పెంచడం పట్ల తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇంచార్జి కింజరాపు రామ్మోహననాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. పనిగట్టుకొని పెట్రో ఉత్పత్తులు, గ్యాస్ సిలిండర్ల ధరలు, విద్యుత్ చార్జీలు రికార్డు స్థాయిలో పెంచుకుంటూ పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల బ్రతులను చిద్రం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుని జీవితాన్ని అతలాకుతలం చేసే పనిలో నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని అన్నారు. పెంచిన రైల్వే చార్జిలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధరల పెంపునకు కుంటిసాకులు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భక్తులతో పోటెత్తిన కనక మహాలక్ష్మి సన్నిధి
ఎచ్చెర్ల, జనవరి 10: కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరున్న కనకమహలక్ష్మీ సన్నిధి మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భక్తులతో పోటెత్తింది. మండలంలో కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపాన కొలువై ఉన్న శ్రీకనకమహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మండలంలో వివిధ ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రం నుంచి కూడా వందలాది మంది భక్తులు కనకమహాలక్ష్మీకి ముడుపులు, మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు సాగించేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్యూకట్టారు. అమ్మవారి తీర్ధప్రసాదాలు అందరికీ అందించడంతోపాటు అన్నసమారాధన కార్యక్రమాన్ని కూడా ఆలయ ధర్మకర్త రమణమూర్తి పర్యవేక్షణలో సాగింది. గత మూడు వారాలుగా అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు రుత్వికులు నిర్వహిస్తున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్త తొలగింపు
ఉత్తర్వులు రద్దు చేయాలి
* ఎజెసిని కోరిన యూనియన్ నాయకులు
శ్రీకాకుళం (టౌన్), జనవరి 10: జిల్లాలోని ఆమదాలవలస మండలం పొన్నంపేట అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మిని విధులనుండి తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వులు రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పంచాది అరుణ కోరారు. గురువారం స్థానిక కలక్టర్ కార్యాలయంలోని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 6వతేదీ నుండి విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మిని అకారణంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారని అన్నారు. తప్పుడు నివాస ధృవపత్రాలు అందజేశారనే అధికారుల ఆరోపణలలో నిజం లేదన్నారు. వాటిని నిర్ధారణ జరుపకుండా ఎలా తప్పుడు పత్రాలని నిర్ధారిస్తారన్నారు. పత్రాల నిర్ధారణకు సెలక్షన్ కమిటీ నియమించాల్సి ఉందని, అటువంటిది నియమించలేదన్నారు. తొలగింపు ఉత్తర్వులు జారీచేసే ముందు లక్ష్మికి ముందస్తు సమాచారం లేదని, ఆరోపణలను ఆధారంగా చేసుకొని తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే ఉత్తర్వులు రద్దుచేయాలని కోరారు. ఏజెసిని కలిసిన వారిలో యూనియన్ కార్యదర్శి పి.లతాదేవి ఉన్నారు.