జలుమూరు, జనవరి 12: ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ బస్సులు కాకుండా సంక్రాంతి పర్వదినాల దృష్ట్యా శ్రీకాకుళం-2 డిపో పరిధిలో అదనంగా 15 బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మండలం చల్లవానిపేట జంక్షన్ సమీపంలో శనివారం విలేఖరులతో మాట్లాడారు. బస్సుల ప్రయాణ స్థితిగతులను స్వయంగా పరిశీలించేందుకు డిపో పరిధిలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం-బత్తిలి రహదారిలో ఐదు, శ్రీకాకుళం-పాతపట్నం వయా సారవకోటకు మూడు, ఆమదాలవలస ఆర్.ఎస్.కు మిగిలిన బస్సులను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు పండుగకు స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. 11వ తేదీ వరకు సుమారు 12 లక్షల రూపాయల ఆదాయం లభించిందని తెలిపారు. ఆయనతోపాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నాయుడులు ఉన్నారు.
కలియుగ భీముడు
కోడి రామ్మూర్తినాయుడు
నేడు 70వ వర్ధంతి
వీరఘట్టం, జనవరి 12: ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధుడు, కలియుగ భీముడు , సిక్కోలు పేరును నలుమూలాల వ్యాపించిన కోడి రామ్మూర్తినాయుడు 70వ వర్ధంతి ఆదివారం జరుగనుంది. 1883 నవంబర్ 8న వీరఘట్టంలో అప్పలకొండమ్మ, వెంకయ్యనాయుడులకు జన్మించిన రామ్మూర్తినాయుడు తండ్రి పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. వీరఘట్టంలోని కూరాకుల వీధి పాఠశాలలో కోడి రామ్మూర్తినాయుడు ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆయన చిన్నతనంలో ప్రతీ రోజూ వేకువజామున వీరఘట్టంలో ఉన్న రాతిచెరువు సమీపంలో వ్యాయామం చేస్తుండేవారు. ఎప్పటిలాగే చెరువు గట్టుపై సాధన చేస్తుండగా ఒక రోజు ఆ దారిలో వెళ్తున్న సన్యాసి అతను చేస్తున్న సాధన చూసి ముగ్ధుడై యోగ విద్యను నేర్పించాడు. అప్పటి నుండి మల్లవిద్యలో ప్రావీణ్యం సంపాదించిన రామూర్తినాయుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కుస్తీలు, సాము గరడీలలో ప్రత్యేక మెళకువలు నేర్చుకున్నారు. అనేక సాహసోపేత కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా పేరుగడించారు. నాయుడు తన సంపాదనలో కొంత భాగాన్ని పాఠశాలలు, ఆసుపత్రులకు కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. విజయనగరం సంస్థానం ఆధ్వర్యంలో ప్రారంభమైన రామ్మూర్తినాయుడు ఖ్యాతి భారత దేశంలోనే కాకుండా ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, లండన్ వంటి విదేశాల్లో వ్యాపించి ఖ్యాతిని ఆర్జించాడు. అతని ప్రతిభను గుర్తించి మేరుమగధీరుడు, ప్రపంచ మల్లయోధుడు, కలియుగ భీముడు, జగదేక మల్లుడు, మల్లమార్తాండ తదితర బిరుదులు లభించాయి. విజయనగరం జమిందార్ అలకానంద గజపతి ప్రోత్సాహంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఎంతో వైభవంగా సాగి ఒరిస్సా జమిందార్ బలంగీర్ ఆస్థానంలో భోగిరోజు రాత్రి సంక్రాంతి ఘడియల్లో శాశ్వత నిద్రలోకి ఆయన జారుకున్నారు. ఆయన జ్ఞాపకార్ధం ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఒక స్టేడియంను ఏర్పాటు చేసింది. అలాగే వీరఘట్టం ఎం ఆర్ సి భవనం ఎదుట బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోను రామ్మూర్తినాయుడు నిలువెత్తు విగ్రహాలను ఉపాధ్యాయులు గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేశారు.
వివేకానంద జీవితం ఆదర్శనీయం
శ్రీకాకుళం(టౌన్), జనవరి 12: ప్రజాసేవే దైవసేవ అని పేర్కొన్న వివేకానంద మనకు ఆదర్శం కావాలని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గపు ఇంచార్జి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. శనివారం స్థానిక సూర్యమహల్ వద్ద ఏర్పాటు చేసిన వివేకానందుని విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవితకు ముఖ్యంగా యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత దేశానికి అనంతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించే ఘనుడు వివేకానందుడే అని ఆతనిని అనుసరించాల్సిన అవసరముందన్నారు. వివేకానందుని రుణం ప్రపంచ దేశాలుగాని, మనముగాని ఎన్నటికీ తీర్చలేమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి, పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
* శ్రీకాకుళం- 2 డిపో మేనేజర్ శ్రీనివాసరావు
english title:
a
Date:
Sunday, January 13, 2013