కవిటి, జనవరి 12: పసిప్రాయంలో గుండెలపై ఆడించి.. బాల్య దశలో వేలు పట్టి నడిపించిన ఆ తండ్రి కూతురికి యుక్తవయసు రాగానే ఒక అయ్య చేతిలో పెట్టి గుండె బరువును తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ తండ్రి బలైపోతే.. అనుకొని పరిస్థితుల్లో ఆ కూతురే కొడుకై.. నేనున్నాను.. నాన్నా అంటూ అంత్యక్రియలు చేసి తండ్రి రుణం తీర్చుకుంది. కవిటి ఉద్దాన ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన శనివారం బొరివంకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కవిటి మండలం బొరివంక గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేస్తున్న బలగ బాలరాజు(40) కొంత కాలంగా కిడ్నీ వ్యాధితోవిశాఖపట్నంలో చికిత్స పొందుతూ స్వగ్రామానికి శనివారం రాత్రి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య భారతితో పాటు తల్లి కామాక్షి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తండ్రికి కుమార్తె అంత్యక్రియలు
హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు కుమారుడు అంత్యక్రియలు చేయడం ఆనవాయితీ. అయితే బాలరాజుకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. అనుకోని పరిస్థితుల్లో అతని పెద్ద కుమార్తె, పదోతరగతి చదువుతున్న తేజేశ్వరి ముందుకొచ్చింది.తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి నడిపించింది. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ సంఘటన చూసిన వారంతా ఆమె సాహసాన్ని అభినందించారు.
* అనాథైన కుటుంబం
ఐదేళ్ల కిందట తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యత అతని కుమారుడు బాలరాజుపై పడింది. తండ్రి వారసత్వంగా వచ్చిన గ్రామ రెవెన్యూ సహాయకునిగా బొరివంకలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. రెండేళ్ల కిందట అతను కిడ్నీ వ్యాధి బారిన పడడంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం.. మరొవైపు కుటుంబ బాధ్యతలు మోయడం అతనికి కష్టతరంగా మారింది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వీరు లక్షల రూపాయలు అప్పు చేసి చికిత్సనందించినా.. ఫలితం లేకపోయింది. బాలరాజు మృతితో ఆ కుటుంబ అనాథగా మారింది.విషయం తెలుసుకున్న వీ ఆర్ ఓ బాలకృష్ణ దహనసంస్కారాల ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
భోగ భాగ్యాల ‘్భగి’
శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 12: భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగ రానే వచ్చింది. అజ్ఞానాన్ని పారద్రోలి కోటికాంతుల కొత్త ఉత్సాహాన్ని భోగిపండుగ ఇస్తుందని తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసం. వెతలను బుగ్గి చేసే భోగి మంటలు, పిల్లల శ్రేయస్సును కాంక్షించే భోగిపండ్లు, ధనుర్మాసం ఆఖరి రోజు, గోదాదేవి శ్రీరంగనాధునిలో ఐక్యమైన రోజు, గోదాకల్యాణం..ఇలా శనివారం పండుగలుగా జరుపుకొంటారు. పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రధాన కూడళ్లలో సాంప్రదాయంగా భోగిమంటలను వేసేందుకు శుక్రవారం రాత్రి నుండి యువత ఏర్పాట్లు చేసుకున్నారు. పాతసామానులు, ఎండుబొమ్మలు, విరిగిన వస్తువులను సేకరించడంతో పాటు అవసరమైన కర్రలను భోగిమంటలకు సిద్ధం చేసుకున్నారు. పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో స్థానిక యువకులు చందాలను సేకరించి టింబర్ డిపోలలో కర్రలను కొనుగోలు చేసి భోగిమంటలను ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో పిల్లల కోసం పెద్దలు భోగిపిడకలను ముందుగా తయారు చేసి మాలలుగా గుచ్చి మంటల్లో వేయించి నూతన అనుభవాన్ని చవిచూపిస్తారు. శనివారం తెల్లవారుఝామున నుంచే భోగి మంటల సందడి ప్రారంభమవుతుంది. భోగి మంటల సంబరానికి అవసరమైన రేగుపండ్లు, చెరకుముక్కలు, పచ్చిశెనగలు తదితర వాటిని మహిళలు మార్కెట్‌లో కొనుగోలు చేశారు. చిన్నపిల్లలకు దిష్టిపోయి భగవంతుని దీవెనలు పుష్కలంగా లభిస్తాయన్న నమ్మకం. కొన్నిచోట్ల వివిధ రకాల ఆటవస్తువులను, అందమైన బొమ్మలను ఆకర్షణీయంగా పేర్చి బొమ్మల కొలువులను తీర్చిదిద్ది అతిథులకు ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుప్పావై ప్రవచనాలు సందర్భంగా భోగినాడు వైష్ణవ దేవాలయాల్లో గోదారంగనాధుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగను స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకొనేందుకు వలస వెళ్లిన వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుతున్నారు. బతుకుతెరువు కోసం వేర్వేరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న వీరంతా సొంత ఊరికి చేరుకుని కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, ఒడిశా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వారంతాగత రెండు రోజులుగా స్వగ్రామాలకు వస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిపండుగను జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర కుటుంబాల సభ్యుల బాగోగులపై ఆరాతీస్తూ ఈ మూడురోజులు సందడిగా గడిపేందుకు సమాయక్తమవుతున్నారు.
బాలసదన్ భవనం ప్రారంభం
శ్రీకాకుళం(టౌన్), జనవరి 12: జిల్లాలో ప్రప్రథమ శిశుదత్తత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా బాలసదన్‌కు అదనంగా నిర్మించిన నూతన భవనాన్ని శనివారం మంత్రులు ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం 24.50 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించింది. ఈ సందర్భంగా బాలసదన్, శిశుగృహ పనివిధానాన్ని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. బాలసదన్‌లో నివశిస్తున్న బాలల వివరాలు, వారికి ప్రభుత్వపరంగా కల్పిస్తున్న భోజన, వసతి సౌకర్యాలు తదితర అంశాలను కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు, వైద్యవిద్య శాఖామంత్రి కోండ్రు మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌లు పరిశీలించారు. శ్రీకాకుళంలో పదవ తరగతి వరకు ఉచితంగా విద్యనందించే అవకాశం ఉందని, విజయనగరంలో పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు విద్యను అందించే సౌకర్యం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ పి.డి. టి.వి.శ్రీనివాస్ తెలిపారు. బాలసదన్‌లో 60 మంది బాలలను చేర్చుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం 59 మంది బాలలు ఉంటున్నారని వివరించారు. బాలసదన్‌లో బాగుందా..ఇంట్లో బాగుందా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాలలను ప్రశ్నించగా బాలసదన్‌లోనే బాగుందని బాలలు ముక్తకంఠంతో చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం.ఆర్.జి.నాయుడు, ఉపకార్యనిర్వాహక ఇంజనీరు కె.వి.ఎస్.ఎన్.కుమార్, జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ, శిశుగృహ మేనేజర్ లక్ష్మునాయుడు, పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతి, గుమ్మా నగేష్, మోహిని పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి పాటుపడతా
* రిమ్స్ రోడ్డు ప్రారంభోత్సవంలో మంత్రి ధర్మాన
శ్రీకాకుళం (టౌన్), జనవరి 12: జిల్లా అభివృద్ధికి తానిచ్చిన మాటపై నిలబడతానని మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన రిమ్స్ రోడ్డును మంత్రి శనివారం ఫ్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రజలు అప్పగించిన బాధ్యత తూచా తప్పకుంటా పూర్తిచేస్తానని ఆయన అన్నారు. ఆమదాలవలస నుండి వచ్చే రోడ్డును అభివృద్ధి చేయడానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. నవభారత్ జంక్షన్‌నుండి పెద్దపాడు వరకు 18 కోట్ల రూపాయలతో పాతబ్రిడ్జివద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 16 కోట్లు మంజూరరైనట్లు తెలిపారు. 27 కోట్ల రూపాయలతో పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి వద్ద 17 కోట్ల రూపాయలతో హోటల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీనికి టిటిడి నిధులు 8 కోట్లు రూపాయలు కేటాయింపజేయడానికి కృషిచేసినట్లు తెలిపారు. వంద కోట్ల రూపాయలతోరిమ్స్ మెడికల్ కాలేజీ, రెండు కోట్ల రూపాయలతో రిమ్స్ రోడ్డు, హడ్కోకాలనీ పనులు 18 లక్షలరూపాయలతో పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎ.వి.వరం, ఎం.వి.పద్మావతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
* టిడిపి నేతలకు కాంగ్రెస్ నాయకులు సవాల్
శ్రీకాకుళం (టౌన్), జనవరి 12: జిల్లా అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని అభివృద్ధి పట్ల ప్రజలముందుకే వెళ్లేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్ సవాల్ విసిరారు. శనివారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలు జిల్లా కేంద్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో పదవులు అనుభవించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ హయాంలో పట్టణం ఎంత అభివృద్ధి చెందిందో, మంత్రి ధర్మాన ప్రసాదరావు హయాంలో ఎంతటి అభివృద్ధి చెందిందో ప్రజల ముందుకే వెళ్లి తేల్చుకుందామన్నారు. నిజాలను నిర్భయంగా మాట్లాడే దమ్ము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఎటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసినా మాట్లాడటానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి రామ్మోహననాయుడు బహుశా 2004కు ముందు పట్టణంలో తిరిగి ఉండరని, అందుకే అలా మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు మాట్లాడుతూ టిడిపిని ప్రజలు ఏనాడో మరిచిపోయారన్నారు. సమావేశంలో అధికార ప్రతినిధులు రత్నాల నర్శింహమూర్తి, ముస్తాక్ మహమ్మద్, డి. ఎస్.కె.ప్రసాద్, మూకళ్ల తాతబాబు, పొన్నాడ రుషికుమార్, తంగి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో యువత కీలకం
శ్రీకాకుళం(రూరల్), జనవరి 12: దేశాభివృద్ధిలో యువతే కీలకపాత్రని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా పట్టణంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుని మార్గంలో యువత పయనించాలన్నారు. ప్రతీ వ్యక్తి స్వార్ధాన్ని వీడి దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ ధర్మాన ఉదయ్‌భాస్కర్ దాసరి పూర్ణచంద్రరావు, షేక్‌భాషా, రమణారెడ్డి, నవీన్, రావాడ జోగినాయుడు, కోరాడ రమేష్, నక్క రామకృష్ణ, అగతముడి అప్పలనాయుడు, అలపాన అప్పాజీరెడ్డి పాల్గొన్నారు.
అండగా ఉంటా
టిడిపి నేత రామ్మెహన్‌నాయుడు
బలగ, జనవరి 12: ప్రజలకు అవిరామంగా సేవలందించి అందరి మదిలో నిలిచిన తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జ్ కింజరాపు రామ్మెహన్‌నాయుడు అన్నారు. శనివారం పట్టణ రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు పుక్కళ్ల నీలయ్య ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్మికులు వచ్చి తమ మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి మీకు ఏవిధంగా సహాయ సహకారాలు అందించారో అదే విధంగా మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ అధ్యక్షులు చౌదరి బాబ్జీ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, చట్టి మోహన్, మాజీ కౌన్సిలర్ శివప్రసాద్, అరవల రవీంద్ర, శీర రమణమూర్తి పాల్గొన్నారు.