భీమవరం, జనవరి 16: తమ దేహాలు ముక్కలైనా సరే రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని సమైక్యాంధ్ర అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. స్థానిక రెస్ట్‌హౌస్ రోడ్డులో ఉన్న ఇరిగేషన్ గౌస్ట్‌హౌస్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపి మెంటే పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 23 జిల్లాలో నూటికి 90 శాతం మంది ప్రజలు సమైక్య రాష్ట్రానే్న కోరుకుంటున్నారన్నారు. రైతు కార్యాచరణ సమితి నాయకుడు ఎంవి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే అన్నీ అనర్ధాలేనని, కొంతమంది స్వార్థ నాయకుల కోసం రాష్ట్రాన్ని విభజించటానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని ఐకమత్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు పత్తి శేషయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వబిలిశెట్టి కనకరాజు, పెనుమత్స రామకృష్ణరాజు, ఆరేటి ప్రకాష్, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రుద్రరాజు సత్యనారాయణరాజు (పండురాజు), ఎఎస్ రాజు, మెంటే సోమేశ్వరరావు, అల్లూరి సూర్యనారాయణరాజు, కోళ్ళ నాగేశ్వరరావు, వడ్డి సుబ్బారావు, గంటా సుందరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెగ రాజుకుంటోంది
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 16: ఇంతకాలం ఎన్నడూ లేనివిధంగా హస్తినలో తెలంగాణా రాజకీయం వేడెక్కడం, మాటల తూటాలు కూడా శృతిమించి రాగాన పడుతుండటంతో ఏదో జరిగిపోతోందన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణా ఖాయమని ఆ ప్రాంత నేతలు చెపుతుండగా అది సహజమేననుకుంటే దానికి భిన్నంగా ఈసారి సీమాంధ్ర ప్రాంత నేతలు, అమాత్యులు కూడా విభజన దాదాపు ఖరారేనన్న విధంగా వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో సహజంగానే అలజడి రేగుతోంది. మాటల యుద్ధం ఒకప్రక్క కొనసాగుతుండగా భవిష్యత్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా ఈ ప్రాంత ప్రజానీకం కూడా కలిసి కదిలేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇదే సమయంలో కొంత వ్యూహాత్మకంగా కూడా పావులు కదపాలని నాయకత్వం భావిస్తుండటం మరో విశేషం. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు దానికి పశ్చిమగోదావరి జిల్లా దాదాపు అగ్రభాగాన నిలుస్తూ వచ్చింది. ఒక్కసారిగా రాజీనామాల పరంపరతో రాష్టవ్య్రాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. అయితే ఇదే సమయంలో సీమాంధ్ర రాజీనామా ఉద్యమంతో అటు తెలంగాణా ఉద్యమం కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ తర్వాతే అక్కడి శక్తులన్నీ దాదాపు ఏకమై ఒకే మాటతో ముందుకు సాగాయన్న ప్రచారం కూడా లేకపోలేదు. దీనికి మూలకారణం సీమాంధ్ర ఒక్కసారిగా ఉద్యమంలోకి దిగటం, ఇతరత్రా ఆందోళనలు భారీగా చేపట్టడం తెలంగాణాశక్తులను కలిపిందని లేకుంటే ఆ ప్రాంత ఉద్యమంలో ఈస్ధాయిలో శక్తులు లేవని కూడా అనుమానాలున్నాయి. ఈ అనుభవాన్ని గుర్తుంచుకుంటూనే ఈసారి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పకడ్బందీగా రూపొందించేందుకు శక్తులన్నీ కలిసి కదలనున్నాయి. దీనిలో భాగంగానే గురువారం హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు భేటీ కానున్నారు. దానికి తగ్గట్టుగానే జిల్లాలో కూడా సమైక్యాంధ్ర సెగ ఊపందుకుంటోంది. గురువారం రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో విభిన్నసంఘాలు, సమాఖ్యల సహకారంతో భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిలో కూడా కదలిక మొదలైంది. ఈ ప్రాంతంలో సమైక్యాంధ్ర సెంటిమెంట్ బలంగా ఉందని నిరూపించాల్సిన అవసరం మరోసారి తలెత్తిందంటూ సమితి నాయకులు ప్రకటనలు చేయటం గమనార్హం. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం రాజకీయ కారణాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుండగా అదే ప్రాతిపదిక అయితే విభజన దిశగానే కేంద్రం నిర్ణయం ఉండవచ్చునన్న అభిప్రాయం ఉంది. సీమాంధ్ర ప్రాంతంలో గత కొద్దికాలంగా జరిగిన ఎన్నికలను, ఫలితాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని బేరీజు వేసుకుంటే విభజన ద్వారా తెలంగాణా ప్రాంతాన్ని అయినా రాజకీయంగా తమ సొంతం చేసుకోవచ్చునన్న అభిప్రాయానికి రావచ్చునని తెలుస్తోంది. కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానాలు చేస్తూ రాజకీయ సమీకరణాలను తీసుకుంటే ఇటువంటి నిర్ణయమే కేంద్రంలోని పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెపుతుండటం గమనార్హం. గతంలోనూ ఎన్నికల సందర్భాల్లో కొంతమంది నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఈనేపధ్యంలో హస్తినలో జరుగుతున్న చర్చలు, కసరత్తులు ఇవే సంకేతాలను పంపుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్ధితులే సమైక్యాంధ్ర శక్తులను ఐక్యమత్యం చేసి మళ్లీ ఉద్యమబాటలోకి తీసుకువచ్చేందుకు కారణమవుతున్నాయని చెపుతున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కూడా గురువారం నుంచి మరింత క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనా రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పూర్తిగా వ్యతిరేకించాలని, సమైక్యాంధ్రే కొనసాగించాలని జిల్లా స్వరం మరోసారి మోగనుంది.
కాంగ్రెస్‌తోనే ఉజ్వల సహకారం
ఆకివీడు, జనవరి 16: సహకార రంగం మనుగడ ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో నిర్మించిన 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గోదాముల సముదయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం జిల్లా సహకార బ్యాంకుల్ని మూసేసే స్థితికి తెచ్చిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ సహకార రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 11 జిల్లాలోని సహకార బ్యాంకుల్ని మూతపడే స్థితికి తెచ్చిందన్నారు. ఆలనాపాలన లేని సహకార వ్యవస్థను అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరించిందన్నారు. వైద్యనాధన్ కమిటీ మేరకు ఎన్నికలు నిర్వహించి సహకార రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. 2004వ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉపయోగకరమైన పనులు చేపట్టిందన్నారు. 13 వేల కోట్ల బకాయిలు రద్దుచేసిందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలనే ధ్యేయంతో పొలంబడి, విత్తన శుద్ధి, రైతుచైతన్య సదస్సులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. తొమ్మిదన్నరేళ్ల టిడిపి పాలనలో రూ.1530 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌గా కేటాయిస్తే తమ కాంగ్రెస్ రూ. 2500 కోట్లకు పెంచిందన్నారు. ప్రతి సంవత్సరం రైతుకు అనుగుణంగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వంటి వాటిని అందిస్తూ రైతులకు అండగా నిలబడిన పభుత్వం తమదేనన్నారు. రానున్న సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి మీకు మీరే సేవలందించుకోవాలన్నారు. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పాదయాత్రల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వైఎస్సార్ పార్టీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వారి జెండాలు అన్ని కాంగ్రెస్ పార్టీ పథకాలే అన్నారు. అధికారులనూ, మంత్రులనూ జైల్లో పెట్టించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నిద్రపోతున్నారని.. ఎవరూ పనిచేయడం లేదని విమర్శిస్తున్న నాయకులకు ఏ పథకాలు ఆగాయో చెప్పాలని ప్రశ్నించారు. డబ్బుతో నాయకుల్ని కొంటూ నీచ రాజకీయాలకు ఒడిగడుతున్న మాటలు నమ్మొద్దన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ రైతాంగం ఎటువంటి అపోహలకు లోను అవ్వదని, రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని సహకార బ్యాంకుల్ని మరింత అభివృద్ధి పొందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కో- ఆపరేటివ్ సెక్టార్ నుంచి అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్థాపించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అతితక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా యూనివర్సిటీ ఉపయోగపడుతుందన్నారు. రైతుల పిల్లల్ని యూనివర్సిటీలో చదివించి వారిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పిస్తున్నామన్నారు. నర్సాపురం ఎంపి బాపిరాజు మాట్లాడుతూ వ్యవసాయానికి నీటికోసం ఇంజన్లు పెట్టి తోడుకుంటే డీజిల్ ఖర్చులు ఇచ్చే విధంగా ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మోటుపల్లి గంగధరరావు, కాంగ్రెస్ నాయకులు వానపల్లి బాబూరావు, ఉండి ఎఎంసి చైర్మన్ చిలుకూరి నరసింహరాజు, ఎండి షామీమ్, చూండురి వెంకట్రావు, రూరల్ బ్యాంకు అధ్యక్షుడు ముత్యాల ఉమాదేవి, జెఎస్‌ఆర్ డివి రమణమూర్తి, ముత్యాల రత్నం పాల్గొన్నారు. అంతకు ముందు మాదివాడలోని వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సభావేదికను మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ ప్రారంభింఛారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పాల్గొన్నారు.
నీరుంది... నీరసించకండి
పాలకొల్లు, జనవరి 16: ప్రస్తుతం పశ్చిమ డెల్టాలో రబీ సాగుకు సరిపడా నీరుందని, అధికారుల సమన్వయ లోపం వల్లే నీటి ఎద్దడి ఏర్పడిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. కావలసినంత నీరు ఇతర ప్రాంతాల నుండి గోదావరిలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ఎక్కడ పంటకు నీరు అవసరమో అక్కడ అందించాలని మంత్రి హితవు పలికారు. రబీకి నీటి సరఫరాపై బుధవారం పాలకొల్లులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు అధికార్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోందన్నారు. సంక్రాంతి అనంతరం నేటి నుండి పూర్తి స్థాయిలో కాలువలకు నీరు విడుదల చేస్తారని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాగు నీటి అవసరాల నిమిత్తం 225 ప్రాంతాల్లో అడ్డుకట్టలు కావాలని నిర్ణయించినట్టు చెప్పారు. అక్కడ పనులు ప్రారంభింస్తే తాను తక్షణం హైదరాబాద్ వెళ్లి నీటికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి పితాని స్పష్టం చేశారు. నెల రోజులు చేపల చెర్వుకు నీరు వెళ్లకుండా మత్స్యశాఖ అధికార్లు ఆదేశాలు ఇవ్వాలన్నారు. జనవరి 31తో నారుమళ్లు, నాట్లు పూర్తవుతాయని, తరువాత ఎద్దడి ప్రాంతానికి నీరు వంతుల వారీగా ఇచ్చినా సరిపోతుందన్నారు. ఎక్కడా ఒక్క ఎకరం కూడా నీరు లేకుండా ఎండి పోకుండా చూడాలన్నదే తమ అభిమతమని ఆయన వెల్లడించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ వాణీమోహన్ మాట్లాడుతూ సాగు నీటి నిర్వహణకు సంబంధించి గత నెలన్నరగా అధికార్లందరికీ ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 11 సమావేశాల్లో నీటి గురించే మాట్లాడానని ఆమె వెల్లడించారు. అధికార్లు సాగునీటి అవసరాలను అర్థం చేసుకోవాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికార్లతో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె కోరారు.
నర్సాపురం ఎంపి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉందని, జిల్లాలో అధికార్లు పనిచేసే వారు ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ కృషి ప్రశంసనీయమన్నారు. మంత్రి పితాని నాయకత్వంలో జిల్లాలో ఎటువంటి లోటు రాదన్న ధీమాను కనుమూరి వ్యక్తం చేశారు. ఇలావుండగా ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఇరిగేషన్ అధికారుల తీరును దుయ్యబట్టారు. నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్లో ఉన్న సమస్యలను వివరించారు. శివారు భూములకు నీరు వదిలితే మొత్తం జిల్లాకు నీరు అందినట్లేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ మాట్లాడుతూ రైతుల వద్దకు వెళ్లే పిల్ల కాలువలకు గతంలో ఉన్న చిన్న తూరలు తీసి పెద్ద తూరలు పెట్టడం వల్ల నీరు ఎక్కువగా వెళ్లి వృథా ఆవుతోందని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ టి బాబూరావు నాయుడు, అదనపు జెసి ఎంవి శేషగిరిబాబు, ఆర్డీవోలు కె నాగేశ్వరరావు, వసంతరావు, సూర్యారావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కృపాదాస్, ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, సాగునీటి ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పండురాజు, తహసీల్దార్లు, అన్ని శాఖల అధికార్లు పాల్గొన్నారు
ఉత్కంఠభరితంగా కబడ్డీ పోటీలు
నరసాపురం, జనవరి 16: రుస్తుంబాదలో నిర్వహిస్తున్న శ్రీ గోగులమ్మ తల్లి జాతీయ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. విజయమే అంతిమ లక్ష్యంగా క్రీడాకారులు పోరాడుతున్నారు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్న పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు వేలాదిగా రుస్తుంబాద కబడ్డీ స్టేడియంకు తరలివస్తున్నారు. పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిన ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు జరిగిన పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి. పురుషుల విభాగంలో జమ్ము కాశ్మీర్, కలకత్తా పోలీసు జట్ల మధ్య జరిగిన పోటీలో కలకత్తా పోలీసు జట్టు 11-32 పాయింట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. సిఆర్‌పి ఢిల్లీ సాయి ఎస్‌టిసి హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో సిఆర్‌పి ఢిల్లీ జట్టు 41-15 పాయింట్లతో గెలిచింది. బెస్ట్ ముంబాయి సౌత్ ఈస్ట్రన్ రైల్వే జట్ల మధ్య జరిగిన పోటీలో సౌత్ ఈస్ట్రన్ జట్టు 16 పాయింట్ల తేడాతో గెలిచింది. అలాగే బిఎస్‌ఎఫ్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య జరిగిన పోరులో బిఎస్‌ఎఫ్ ఢిల్లీ 32-16 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. అలాగే మహిళల విభాగంలో మహేశ్వర్ పూణే, జబల్‌పూర్ జట్ల మధ్య జరిగిన పోటీలో మహేశ్వర్ పూణే 75-20 పాయింట్లతో విజయకేతనం ఎగురవేసింది. పూణే పోలీసు, ఠాణే జట్ల మధ్య జరిగిన పోరులో పూణే పోలీసు 16-14 పాయింట్ల తేడాతో గెలిచింది. ఈ పోటీలో విజయం చివరి వరకు ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. ఆంధ్రా, మహేశ్వర్ పూనే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా అమ్మాయిలు మొదటి నుండి ఆధిక్యత ప్రదర్శించారు. ఈ పోరులో ఆంధ్రా జట్టు 26-16 పాయింట్లతో గెలిచింది. అలాగే ఢిల్లీ సెంట్రల్, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు 18-26 పాయింట్ల తేడాతో గెలుపొందింది. క్రీడాకారులను నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమెల్యే కొత్తపల్లి జానకిరామ్ పరిచయం చేసుకున్నారు.
కలెక్షన్లలో ‘నాయక్’
చాగల్లు, జనవరి 16: ఇటీవల విడుదలైన నాయక్ చిత్రం కలెక్షన్లలో దూసుకుపోతోందని ఆ చిత్ర దర్శకుడు వివి వినాయక్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7 రోజుల్లో రూ. 25 కోట్లు వసూలుచేసి గరిష్ఠ రికార్డు సాధించిందన్నారు. బెంగుళూరు, మద్రాసు, నార్త్ ఇండియా వసూళ్లు దీనికి అదనం అన్నారు. ఏడు రోజుల్లో ఇది అత్యధిక రికార్డుగా పేర్కొన్నారు. జిల్లాలో వారంలో రూ. 2 కోట్లు వసూలుచేసి గరిష్ఠ రికార్డు చిత్రంగా నిలిచిందన్నారు. అందుకు ఆయన చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. నాయక్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా చాగల్లులో తన నివాస గృహం వద్ద బుధవారం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు.. అనంతరం నాయ్‌క్ విజయం గురించి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. నాయక్ అందరి అంచనాలకు భిన్నంగా యాక్షన్, సందేశాత్మక చిత్రంగా కాకుండా కుటుంబ చిత్రంగా రూపొందించామన్నారు. అందువల్ల 5 రోజుల్లో క్లాస్ ఆడియన్సును కూడా టచ్ చేసిందన్నారు. ఇప్పటివరకు తీసిన చిత్రాలు సందేశాత్మక, యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలన్నారు. తదుపరి బెల్లంకొండ సురేష్ కుమారుని హీరోగా పరిచయం చేస్తూ చిత్రం చేయనున్నట్టు తెలిపారు. తన చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన భవిష్యత్తు అభిమానులు, ప్రజలు శ్రేయోభిలాషుల చేతుల్లో ఉందని, వారి కోరిక మేరకు వ్యవహరిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ అన్నారు.
తన గ్రామంలో సంక్రాంతి రోజుల్లో చిన్ననాటి మిత్రులను కలవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే గ్రామాభివృద్ధికి తండ్రి కృష్ణారావు కోరిక మేరకు కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, లయన్ కొడవటి కాశీ విశే్వశ్వరరావు, జుట్టా కొండలరావు, మాజీ ఎంపిటీసి గండ్రోతు సూర్యనారాయణ, పోతురాజు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
మరింత పటిష్ఠంగా మీ-సేవలు
ఏలూరు, జనవరి 16 : జిల్లాలో మరింత పటిష్ఠంగా మీ-సేవ కేంద్రాలను నిర్వహించి ప్రజలకు సత్వర సేవలందించడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా మీ-సేవ అవార్డు అందుకున్న కలెక్టర్ వాణిమోహన్‌కు స్థానిక కలెక్టరు బంగ్లాలో బుధవారం పెద్ద ఎత్తున అధికారులు, విద్యార్ధినీ విద్యార్ధులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. మీ-సేవ అవార్డు తన బాధ్యతలను మరింత పెంచిందని, ప్రజలకు నిరంతరం మేలు జరగాలన్నదే తన తపన అని కలెక్టర్ చెప్పారు. తాను వివిధ హోదాల్లో పనిచేసిన కాలంలో నిరంతరం పేద వర్గాలు, మహిళలు, విద్యార్ధినీ విద్యార్ధులకు ఏ విధంగా చేయూత అందించాలనే ఆలోచనతో ముందడుగు వేశానని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పధకం ప్రజలకు చేరువ అయినప్పుడే ఆపధక లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. మీ-సేవ కేంద్రాల ద్వారా మరిన్ని సేవలను ప్రజలకు సత్వరమే అందించడానికి కృషి చేస్తానని నిర్ధేశించిన కాలానికి ముందే ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందించడానికి మండలస్థాయిలో మరింత నిర్మాణాత్మకమైన కృషి చేస్తామని చెప్పారు. ప్రతీ ఏటా పాఠశాలలు తెరిచే రోజుల్లో ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు కోసం తహశీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగే వారమని, మీ-సేవ కేంద్రాల వల్ల సత్వరమే ఆ ధృవపత్రాలు అందగలుగుతున్నాయని, ముఖ్యంగా మీ-సేవ కేంద్రాలు విద్యార్ధుల పాలిట కల్పతరువుగా చెప్పవచ్చునని నల్లజర్లకు చెందిన బిటెక్ విద్యార్ధిని మోదుగు పార్వతి అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులు మీదుగా మీ-సేవ అవార్డు పొందిన మహిళా కలెక్టర్ డాక్టర్ వాణిమోహన్ కావడం తనకెంతో ఆనందంగా ఉందని కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించడానికి అంతదూరం నుండి ఇక్కడకు వచ్చానని పార్వతి చెప్పింది. మీ-సేవ కేంద్రాలను మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్న కలెక్టర్‌ను అభినందించడం బాధ్యతగా భావిస్తున్నానని గోపన్నపాలెం మీ-సేవ కేంద్రం డైరెక్టరు కొండేటి హనుమంతరావు చెప్పారు.
మీ-సేవ కేంద్రాలు వల్ల సత్వరమే కరెంటు బిల్లులు చెల్లించుకోగలుగుతున్నామని, రెవిన్యూ రికార్డులను కూడా సులభంగా పొందగలుగుతున్నామని బుట్టాయిగూడెంనకు చెందిన రైతు వెంకటేశ్వరరావు చెప్పారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన వివిధ వర్గాల ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ పేద ప్రజలకు సత్వర సేవలు అందించడానికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని చెప్పారు.
తోకలపూడిలో పాముకు పూజలు
వీరవాసరం, జనవరి 16: వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఒక తాచుపాము స్ధానిక సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి దగ్గరలో బుధవారం పడగ విప్పి దర్శనమిచ్చింది. దీనితో ప్రజలు గినె్నలో పాలు పోసి పాముకు పెట్టారు. పాము ఎవరినీ ఏమీ చేయకుండా అక్కడే తిరుగుతుంటే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి, పూజలు నిర్వహించారు. పాము ఉన్న ప్రాంతానికి పది గజాల దూరంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద కూడా 1976వ సంవత్సరంలో ఒక లావుపాటి పాము పదిరోజులు అక్కడే సంచరించడంతో చూసిన గ్రామస్ధులు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. కొన్ని రోజులకు పాము అదే ప్రాంతంలో ప్రాణాలు విడవడంతో ఆ స్ధానంలో గ్రామస్ధులందరూ కలిసి గుడి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వందలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ వస్తున్నారు. ఆలయానికి పదిగజల దూరంలో పాము సంచరించడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. పాము ఉన్న ప్రాంతంలోనే పందిరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడ మరోగుడి నిర్మించాలని భక్తులు పేర్కొంటున్నారు. 1976లో స్వామివారి ఆలయం నిర్మించిన తరువాత గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని, అదే తరహలో ఈ ప్రాంతంలో మరో ఆలయం నిర్మించాలని భక్తులు కోరుకుంటున్నారు.
విద్యార్థిని కాపాడిన సిఐ సుధాకర్
ఏలూరు, జనవరి 16 : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఒక విద్యార్ధిని తన జీపులో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన రూరల్ సిఐ సుధాకర్‌ను స్థానిక ప్రజలు అభినందించారు. స్థానిక ఓవర్‌బ్రిడ్జి వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న నల్లజర్ల విద్యార్ధి సుధాకర్‌ను చూసిన రూరల్ సిఐ సుధాకర్ జీపు ఆపి ఆ విద్యార్ధిని జీపు డ్రైవర్ సహకారంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ విద్యార్ధికి సకాలంలో వైద్య సేవలు అందించడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడడం జరిగిందని వైద్యులు చెప్పారు. కళ్ల ఎదుటే ప్రమాదం జరిగినందున 108 వాహనంకు ఫోన్ చేసే బదులు మరింత ముందుగానే తన వాహనం ద్వారా ఆసుపత్రికి తరలిస్తే సకాలంలో వైద్యం అందుతుందనే భావనతో హుటాహుటిన విద్యార్ధిని ఆసుపత్రికి తీసుకువచ్చానని సుధాకర్ చెప్పారు. గాయపడ్డ విద్యార్ధి పేరు కూడా సుధాకర్ కావడం తనకు మరింత సంతోషంగా ఉందని, తన పేరున్న ఒక వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తీసుకువచ్చి రక్షించగలిగాననే సంతృప్తి కలుగుతుందని చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్ధి స్నేహితులు ఆసుపత్రికి వచ్చి సిఐకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్స్‌పెన్సివ్ పవర్ సప్లయ్ స్కీమ్
ఏలూరు, జనవరి 16: జిల్లాలో విద్యుత్ వినియోగ నియంత్రణ పరిధిలోకి వచ్చే వినియోగదారులందరికీ అధిక ధరతో విద్యుత్తును వినియోగించుకునేందుకు ఎక్స్‌పెన్సివ్ పవర్ సప్లయ్ స్కీమ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిందని ట్రాన్స్‌కో ఎస్‌ఇ టివి సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ అంశంపై గురువారం ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయంలో అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన డెడికేటెడ్ ఫీడర్లు, పారిశ్రామిక ఎక్స్‌ప్రెస్ ఫీడర్లు, లోడ్ రిలీఫ్ లేని ఫీడర్లు మీద గల వినియోగదారులు ఈ నెల 21 లోగా ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
దెందులూరు ఎస్సైపై చర్య తీసుకోండి
-ఎస్పీకి బాలల హక్కుల కోర్టు ఆదేశం
ఏలూరు, జనవరి 16: బాల్య వివాహంపై కేసు నమోదు చేయనందుకు దెందులూరు ఎస్సైపై చర్యలు తీసుకుని వెంటనే నివేదిక సమర్పించాలని బాలల హక్కుల కోర్టు నుంచి జిల్లా ఎస్‌పికి ఆదేశాలు జారీ అయ్యాయి. దెందులూరు మండలం చల్లచింతలపూడికి చెందిన ఒక బాలికకు ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లికి చెందిన ఒక యువకునితో వివాహం జరిగిన విషయం జిల్లా కలెక్టర్, మానవ హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు వెళ్లడమే కాకుండా జిల్లా బాలల హక్కుల కోర్టుకు సమాచారం అందింది. వివాహం జరిగిన మరుసటి రోజున బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించాలని బాలల హక్కుల కోర్టు అధికారులను ఆదేశించింది. బాలికను దెందులూరు బాలికా సదన్‌కు పంపాలన్న ఆదేశాలను ఇటు అధికారులు, అటు బాలిక బంధువులు అమలు చేయకపోవడంతో వారిపై కేసు నమోదు చేయాలని గత నెల 16న బాలల హక్కుల కోర్టు భీమడోలు సిడిపివోను ఆదేశించింది. గత నెల 22న సిడిపివో దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెలరోజులు అయినప్పటికీ దెందులూరు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయలేదని బాలల హక్కుల కోర్టు దృష్టికి సిడిపివో తీసుకువచ్చారు. దీనితో బాలల హక్కుల కోర్టు ఛైర్మన్ డాక్టర్ డి సుబ్బారావు, యు రాజ్‌కుమార్, డాక్టర్ ఇ ఎస్ ఆర్ శర్మ, టి ఎన్ స్నేహన్, డి రిబ్కారాణిలతో కూడిన ఫుల్ బెంచ్ తీవ్ర ఆక్షేపణను, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. నెలరోజులుగా బాల్య వివాహంపై కేసు నమోదు చేయని దెందులూరు ఎస్సైపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని బాలల హక్కుల కోర్టు ఎస్‌పిని ఆదేశించింది.