Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

యువత చేతుల్లోనే సాంకేతికాభివృద్ధి

$
0
0

గుడివాడ, జనవరి 16: దేశ సాంకేతికాభివృద్ధి యువత చేతుల్లోనే ఉందని కేంద్ర మానవ వనరుల, అభివృద్ధి శాఖామంత్రి ఎంఎం పళ్లంరాజు అభిప్రాయపడ్డారు. గుడివాడలోని వికెఆర్ అండ్ విఎన్‌బి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన డిఇఇపి కోర్సును ప్రారంభించిన అనంతరం విద్యార్థులనుద్ధేశించి ఆయన మాట్లాడారు. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కోర్సులను ప్రవేశపెడుతోందన్నారు. మనకు దేశం ఏం చేసింది అని కాకుండా దేశానికి మనమేమి చేశామని దృక్పథంతో యువత ఆలోచించాలన్నారు. యువతలో నిబిడీకృతమైన వృత్తి నైపుణ్యాలను వెలికితీసేందుకు దేశంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఐటిఐ తదితర కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మన దేశంలో ఉన్న యువశక్తిని వినియోగించుకునేందుకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారన్నారు. దీన్ని యువత అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ముందుగా కళాశాల వ్యవస్థాపకుడు దివంగత వేములపల్లి కోదండరామయ్య కాంస్య విగ్రహానికి పళ్లంరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల శిక్షణ కోసం వినియోగించే యంత్ర పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి కొలుసు పార్ధసారథి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, సాబ్ టెక్నాలజీస్ చైర్మన్ ఎం వెంకట్, కళాశాల పాలకవర్గ అధ్యక్షురాలు చంద్రసుబ్బారావు, కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు(నందివాడ బాబు), ఇలపర్రు పీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు సుంకర వెంకటరమణ, కళాశాల జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యుడు డాక్టర్ బలరామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ వై దినకరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి అప్పారావులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణపై శ్రద్ధ
- సిపి మధుసూదన్‌రెడ్డి
ఉయ్యూరు, జనవరి 16: ఉయ్యూరు సర్కిల్ స్టేషన్ పరిధిలో పెరుగుతున్న క్రైం రేట్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ మధుసూదనరెడ్డి అన్నారు. ఆయన బుధవారం స్థానిక సర్కిల్ స్టేషన్, దాని పరిధిలోని పోలీస్‌స్టేషన్ల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనని కలసిన విలేఖరులతో మాట్లాడుతూ సామాజిక ఉద్రిక్తతలు తలెత్తకుండా, నేర ప్రవృత్తి పెరగకుండ కఠినంగా వ్యవహరించాల్సి వుందని అన్నారు. స్థానిక ప్రధాన రహదారి వెంబడి నిర్మించిన డివైడర్ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం విలేఖరుల సిపి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన సంబంధిత శాఖలతో చర్చించి ప్రమాదసూచికలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా వృత్తిలో ప్రతిభకనబరచిన నలుగురు కానిస్టేబుల్స్‌ను ఆయన ప్రశంసించారు. తనిఖీలో భాగంగా ఉయ్యూరు పట్టణ, రూరల్, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండల పోలీసుస్టేషన్‌ల రికార్డులు ఆయన తనిఖీ చేశారు. ఎసిపి ఎస్ రాఘవరావు, సిఐ ప్రసాద్, ఎస్‌ఐలు శివప్రసాద్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఉయ్యూరు, జనవరి 16: మండలంలోని కలవపాముల గ్రామం వద్ద విజయవాడ - గుడివాడ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యిక్తి మృతి చెందాడు. ఉయ్యూరు రూరల్ పోలీసుల కథనం ప్రకారం ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన పి.కిశోర్‌బాబు (33) తన భార్య, బిడ్డలను గుడివాడ మండలం బిళ్ళపాడులో దించి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటికి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా కలవపాముల గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోయాడు. రహదారి వెంబడి వున్న రాయి తలకు బలంగా తగలటంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ కృష్ణమోహన్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలో నిర్వీర్యవౌతున్న యువశక్తి
కేంద్ర మానవ వనరుల, అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు
గుడివాడ, జనవరి 16: కృష్ణాజిల్లా గుడివాడలోని వికెఆర్ అండ్ విఎన్‌బి పాలిటెక్నిక్ కళాశాలలో దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన డిప్లొమో ఎంప్లాయబిలిటి ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రాం (డిఇఇపి) కోర్సును కేంద్ర మానవ వనరుల, అభివృద్ధి శాఖా మంత్రి ఎంఎం పళ్లంరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సభలో పల్లంరాజు మాట్లాడారు. దేశంలో 25ఏళ్ళలోపు వయస్సు గలవారు 55కోట్ల మంది ఉన్నారని, వీరికి విద్యతోపాటు ప్రయోజన విద్య కూడా నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పాలిటెక్నిక్, ఐటిఐలను పటిష్ఠం చేస్తున్నామన్నారు. దేశంలో యువశక్తి అధికంగా ఉన్నప్పటికీ సద్వినియోగం కావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తు న్నామన్నారు. యువత కూడా దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. గుడివాడలో 60ఏళ్ళ కిందటే పాలిటెక్నిక్ విద్యను అందుబాటులోకి తెచ్చిన వేములపల్లి కుటుంబాన్ని అభినందించారు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు ద్వారా 15లక్షల మందికి ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశామన్నారు. సాబ్ ఇండియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ హెడ్ లార్స్- ఓలాఫ్ లిన్డ్‌గ్రెన్ మాట్లాడుతూ డిఇఇపి కోర్సు ద్వారా అత్యున్నత స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 6నెలల పాటు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ కోర్సును రూపొందించామన్నారు. మొదటగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. త్వరలో ఏవియేషన్ ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు స్వీడిష్ కంపెనీలు నూరుశాతం ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఢిల్లీ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో దిలీప్ షెనాయ్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా 2020నాటికి దాదాపు 56మిలియన్ల నైపుణ్యం గల ఉద్యోగులను ఒక్క భారతదేశం మాత్రమే అందిస్తుందన్నారు. కావాల్సిన నైపుణ్యాలను ఒక్క సాఫ్ట్‌వేర్ పవర్ బేస్డ్ పైనే ఆధారపడకుండా విద్యార్థులను పరిశ్రమలకు తగిన విధంగా వారిలో నైపుణ్యాలను పెంపొందించి సంస్థల అవసరాలను తీర్చడం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారథి, స్వీడన్ రాయబారి డేనియల్ ఓల్వెన్, కళాశాల అధ్యక్షురాలు చంద్ర సుబ్బారావు, కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు(నందివాడ బాబు) తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామనడం అవివేకం
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో అనుకూలమైన నిర్ణయం రాకుంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామని అనడం అవివేకమని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ ఏలూర్ రోడ్డులోని వికెఆర్ అండ్ విఎన్‌బి పాలిటెక్నిక్ కళాశాలకు విచ్చేసిన ఆయన ఆడిటోరియంలో విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై ఎవరైనా తమ వాదనలను వినిపించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని బాధ్యతగా గౌరవించాలన్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా సమావేశాలను నిర్వహించుకోవచ్చన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్య ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రాంతాల నేతలపై ఉందని పార్థసారథి గుర్తుచేశారు.

బాబు పాదయాత్రకు లక్ష మందితో స్వాగతం
* మాజీ మంత్రి నెట్టెం రఘురాం
వత్సవాయి, జనవరి 16: లక్ష మంది జనసమీకరణతో చంద్రబాబు పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి నెట్టెం రఘురాం తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌తో కలిసి బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణాలో పాదయాత్ర ముగించుకొని ఆంధ్రాప్రాంతంలో అడుగుపెడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మందితో ఘన స్వాగతం పలుకుతామన్నారు. 21న జగ్గయ్యపేట ప్రాంతంలో పర్యటన పూర్తి అయిన తరువాత 22న వత్సవాయి మండలంలో మక్కపేట గ్రామం మీదుగా ఆయన పెనుగంచిప్రోలు చేరుకుంటారని, ఈ సందర్భంగా మక్కపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మక్కపేట - పెనుగంచిప్రోలు మధ్యలో భోజన విరామం అనంతరం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు 62ఏళ్ల వయస్సులో ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారని, నాడు వైఎస్‌ఆర్ అధికార దాహంతో పాదయాత్ర చేపడితే నేడు చంద్రబాబు నాయుడు ప్రజలను కష్టాలు, బాధలనుండి విముక్తి చేయడానికి పాదయాత్ర ప్రారంభించారని, ప్రతి కార్యకర్త, నాయకులు, ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, కట్టా నర్శింహరావు, ఆవుల రామారావు, వడ్లమూడి రాంబాబు, చిట్టూరి సుభాష్, నంబూరి రామారావు, పెద్ది రామారావు, నెల్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సహకార ఓట్ల చేర్పుపై కాంగ్రెస్, టిడిపి ఘర్షణ
* కర్రలు, రాళ్లతో దాడులు * పలువురికి గాయలు
తోట్లవల్లూరు, జనవరి 16: సహకార సంఘాల ఎన్నికలకు ఓటర్ల చేర్పింపుపై ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య కొట్లాటకు దారితీసిన సంఘటన బుధవారం మండలంలోని బొడ్డపాడు సహకార సంఘం వద్ద జరిగింది. కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో ఇరుపార్టీల నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సహకార సంఘంలో రూ.10 షేర్ ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలని అధికారులు నిర్ణయించిన గడువుబుధవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుండటంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు తమతమ వర్గీయుల ఓట్లు చేర్పించేందుకు వచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల తరువాత కూడా రైతులు క్యూలో నిలిచి ఉన్నారు. చాలా మంది కౌలురైతుల పేరుతో విఆర్‌ఓ సంతకాలు లేకుండా ఓటుహక్కు దరఖాస్తు అందించేందుకు వచ్చారు.కొందరి దరఖాస్తులను విఆర్‌ఓ సంతకాలు లేవని కార్యదర్శి ఎ కేశవరావు తిరస్కరించటంతో వివాదం మొదలయింది. ఫలాన వ్యక్తి దరఖాస్తు తీసుకున్నారని ఒకరు, తమ వారివి తీసుకోలేదని మరొకరు, తమ వర్గం వారి ఓటు తొలగించారని మరొకరు వాదనలను లేవనెత్తటంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. కార్యదర్శి కేశరావుకి సహాయకుడిగా ఉన్న తెలుగుదేశం నాయకుడు అనే్నకృష్ణ కాంగ్రెస్ కార్యకర్తలతో వాదన పడుతుండటంతో నీకేమిపని అంటు కాంగ్రెస్ నాయకుడు నిమ్మగడ్డ జయరాం వచ్చారు. దీంతో కృష్ణ జయరాంపై చేయిచేసుకున్నారు. జయరాం కూడా కృష్ణపై చేయిచేసుకున్నారు. దీంతో ఇరుపార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో ఇరుపార్టీ కార్యకర్తలు ఒకరికొకరు కొట్లాడు కుంటుండగా మధ్యలో వచ్చిన కాంగ్రెస్ నాయకుడు మూడేశివశంకర్, తెలుగుదేశం నాయకుడు సూర్యదేవర సత్యనారాయణ ఒకరికొకరు కొట్లాడుకొవటంతో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళతో, కర్రలతో దాడులు చేసుకుంటుండగా ఈ లోపు ఎస్‌ఐ కె రమేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి చక్కబడింది. ఉయ్యూరు నుంచి సిఐ ప్రసాద్ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ రమేష్ అడగ్గా ఇరువర్గాల వారు ఘర్షణ పడటం వాస్తమేనని ఇరువర్గాలలో ఎవరు కేసు పెట్టిన ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేస్తామన్నారు.

కల్లాల్లోనే ధాన్యం కుప్పలు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 16: వ్యవసాయ పనులు పూర్తయినా ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు ఇంకా కల్లాల్లోనే ధాన్యం కుప్పులు ఉంచేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2.5లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం బీపిటీ రకం ధాన్యం ఆశాజనకంగా ఉంది. ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతన్నలు పొలాల్లో కుప్పలు వేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1500 ఇస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.1600పైబడి ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత ఏడాది ఇదే రకం ధాన్యం క్వింటా రూ.900కు మించి కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తుండటంతో ఇంకా ధర పెరుగుతుందని ఆశిస్తున్నారు.

జూదాలు నిర్వహించే వారిపై కేసులు
చల్లపల్లి, జనవరి 16: సాంప్రదాయం పేరిట బరితెగించి విచ్చల విడిగా జూదాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఘంటసాల మండలం పాపనేశ్వరం వద్ద కృష్ణ కరకట్ట దిగువన సంక్రాంతి, కనుమ పండుగ రెండు రోజులూ విచ్చలవిడగా నిర్వహించిన కోడి పందాలు, పేకాట, చిత్తులాట, కాయ్‌రాజాకాయ్, లక్కీనెంబరు తదితర జూద క్రీడలు పెద్ద ఎత్తున జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. జూదాలను నియంత్రించాల్సిన సంబంధిత శాఖ ముందస్తు హెచ్చరికలకే పరిమితమైందని ప్రజల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పట్టు నిలుపుకునేందుకు నిర్వాహకులు, వారి అనుయాయులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సంబంధిత శాఖ ఇప్పటికే కొంత మందిని గుర్తించినట్లు సమాచారం.

మొదట అధ్యయనం.. తరువాతే కార్యాచరణ
* విఎంసి కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సువర్ణపండాదాస్
అజిత్‌సింగ్‌నగర్, జనవరి 16: విజయవాడ నగరాభివృద్ధిపై మొదట అధ్యయనం చేసిన తరువాతే కార్యాచరణ అమలు చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ జి సువర్ణపండాదాస్ చెప్పారు. ప్రస్తుత కమిషనర్ అబ్దుల్ అజీమ్ బదిలీ అనంతరం నూతన కమిషనర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ నగరం అత్యంత కీలకమైనదని, స్థానికంగా ఉన్న సమస్యలు, పరిష్కారాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తేగానీ ఒక అవగాహన వస్తుందన్నారు. దాని ప్రకారం కార్యాచరణ రూపొందించి సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అయితే మొదటిసారిగా విజయవాడకు కేవలం కమిషనర్‌గానే వచ్చానని, ఇంతకుముందెన్నడూ ఈ నగరం గురించి అంతగా ఆలోచించలేదన్నారు. ప్రధానంగా నగర ప్రజలకు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ తదితర వౌలిక సదుపాయాలపై దృష్టిసారించి ఆయా సౌకర్యాలను ప్రజల ముంగిట చేరుస్తానని అన్నారు. అలాగే ఉద్యోగులకు 010 జీవో ప్రకారం ట్రెజరీ ద్వారా జీతాలు అందేలా కృషి చేస్తానని, ఈవిషయంపై ఇప్పటికే అజీమ్ ప్రభుత్వంతో తగు సంప్రదింపులు జరుపుతున్న విషయం విదితమేనన్నారు. 010 అమలు అయితే నగర పాలక సంస్థకు వందలాది కోట్ల రూపాయల భారం తగ్గి ఖజానాకు నిధుల లేమి సమస్య ఉండదని, తద్వారా నగరాభివృద్ధి మరింత వేగంగా చేపట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. నగర ప్రజలు, కార్పొరేషన్ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని సువర్ణపండాదాస్ వివరించారు.

సమస్యలకు పరిష్కార మార్గం
హిందువుల్లో చైతన్యమే..
* రేపు హిందూ చైతన్య శిబిరం ప్రారంభం
* స్వాగత సమితి అధ్యక్షుడు గంగరాజు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 16: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ హిందువుల్లో చైతన్యం రావటం ఒక్కటే పరిష్కార మార్గమని హిందూ చైతన్య శిబిరం స్వాగత సమితి అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు అన్నారు. బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ముఖ్యంగా అవినీతి, దేశ సరిహద్దుల్లో సరైన భద్రత లేకపోవటం, మత మార్పిడులు, ఉగ్రవాద సమస్య, దేశ అంతర్గత విషయాల్లోకి ప్రత్యక్ష పరోక్ష విదేశీయుల చొరబాటు వంటి అనేకానేక సమస్యలున్నాయని, అయితే హిందూ సంఘటన ద్వారా మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించుకో గలుగుతామన్నారు. అందుకే హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని సంఘటితపరచి వారితో సమాజానికి మేలు చేయించే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి 75ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట 125 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ నెల 18నుంచి మూడురోజుల పాటు హిందూ చైతన్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. 10వేల మంది మహిళలతో పాటు మొత్తం దాదాపు 25వేల మందికి పైగా పాల్గొననున్నారన్నారు. వీరందరికీ ఐదేసి ఎకరాల విస్తీర్ణంలో 15నగరాలను తాత్కాలికంగా నిర్మిస్తున్నామని, ప్రతి నగరంలో కనీసం 2వేల మంది కోసం 100కి పైగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాతవాహనుల కాలంనాటి చరిత్రను ప్రతిబింబించే విధంగా 200 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తుతో హిందూ చైతన్య శిబిరం ముఖద్వారం ఉంటుందన్నారు. కార్యకర్తలు ఎవరికివారే స్వయంగా వంట చేసుకుంటారని, అయితే విజయవాడలో 10వేల కుటుంబాల నుంచి దాదాపు 2లక్షల అరిసెలను సేకరించి వారందరికీ పంపిణీ చేస్తామన్నారు. శిబిరం ముగింపు రోజు జరిగే బహిరంగ సభ కోసం భారీ వేదిక నిర్మాణం చకచకా జరుగుతోంది. ఒక పెద్ద ఫ్లెక్సీని బ్యాక్‌డ్రాప్‌గా ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వయం సేవకులు పాదయాత్ర, సైకిల్ యాత్రలో 17న సాయంత్రానికే శిబిరానికి చేరుకుంటారు. ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణమధ్య క్షేత్ర కార్యవహ దూసి రామకృష్ణ మాట్లాడుతూ 17న సాయంత్రం భారతీయ హిందూ సంస్కృతి సంస్కృతి పరంపర వంటి అంశాలతో కూడిన చిత్రాల ప్రదర్శనను అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యవాహ్ భయ్యాజీ జోషీ ప్రారంభిస్తారన్నారు. కొండపల్లి బొమ్మలు, కొటప్పకొండ నుంచి వచ్చే ప్రభ శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. 18న ఉదయం శ్రీ పరిపూర్ణానంద సరస్వతీ స్వామి ప్రసంగంతో శిబిరం ప్రారంభం అవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ సురేష్ జోషి ముఖ్యవక్తగా పాల్గొంటారు. 19న సాయంత్రం విజయవాడ, గుంటూరు నగరాల్లో ఒకేసారి పథ సంచలనం జరుగుతుంది. ఆరోజు ఉదయం కుర్తాళం పీఠాథిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ప్రసంగిస్తారు. 20న మధ్యాహ్నం మాతృమూర్తుల సమ్మేళనం, సాయంత్రం బహిరంగ సభ జరుగుతాయన్నారు. ఈ సభలో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్, చినజీయర్‌స్వామి, మాజీ డిజిపి అరవిందరావు ప్రసంగిస్తారు. విలేఖరుల సమావేశంలో శిబిర స్వాగత సమితి కార్యదర్శి, న్యాయవాది వెలగపూడి రామకృష్ణ, జిడివి ప్రసాదరావు, పివి శ్రీరామ్‌సాయి పాల్గొన్నారు.

బస్సు బోల్తా కేసు నలుగురు మృతులు గుర్తుతెలియని వారే..
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 16: బెంజి సర్కిల్ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనలో ప్రమాదం జరిగి 24గంటలు దాటుతున్నా మృతి చెందిన ఐదుగురిలో ఇంకా నలుగురిని గుర్తించలేని స్థితి కొనసాగుతోంది. ఈ నలుగురి గుర్తింపునకు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చునీలో ఉంచారు. నిత్యం ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారిని పోలీసులు తీసుకొచ్చి మృతదేహాలను చూపిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. ఏ ఒక్కరూ మృతలెవరనేది గుర్తించలేక పోతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ టి నాగరాజు, ప్రయాణికురాలు రజని, ఫుట్‌పాత్ వాసి ఎం కోటేశ్వరరావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అసలు బస్సు బోల్తాకు కారణం ఏమిటనే విషయమై మాచవరం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

22న జిల్లా వైఎస్సార్‌సిపి సర్వసభ్య సమావేశం
* సామినేని వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 16: వైఎస్సార్‌సిపి జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను బుధవారం నాడిక్కడ తెలిపారు. విజయవాడలోని సీతారాంపురంలోగల జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కె)ని నియమించినందున పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన్ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో ఈ నెలాఖరులో జరుగనున్న సహకార సంఘ ఎన్నికలను ప్రధాన ఎజెండాగా తీసుకొని చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని మండల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల వారు తప్పక హాజరుకావాలని సూచించారు.

సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ
టెన్నిస్ పోటీలకు కెఎల్‌యు జట్టు
విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 16: వడ్డేశ్వరంలోని కెఎల్ విశ్వవిద్యాలయం టెన్నిస్ పురుషుల జట్టును వర్సిటీ వ్యాయామ విద్య విభాగాధిపతి డాక్టర్ ఎ.కలీముల్లా బుధవారం ప్రకటించారు. ఈ జట్టు 17 నుండి 21వ తేదీ వరకు కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రా లయోల కళాశాలలో జరుగనున్న దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ పురుషుల టోర్నీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా జట్టు సభ్యులను వర్సిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాజాహరేన్, కులపతి డాక్టర్ జిఎల్ దత్తా, ఉపకులపతి డాక్టర్ ఆర్.శ్రీహరిరావు, రిజిస్ట్రార్ ఎన్.రంగయ్య, డీన్ డాక్టర్ కెఆర్‌కె ప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఇన్‌ఛార్జ్ ఎం.సుమన్, వ్యాయామ విద్య విభాగం సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపికైన జట్టు సభ్యుల వివరాలు ఇలా వున్నాయి. టి.అర్జున్ (కెప్టెన్), సి.సాయికృష్ణ, ఇ.వి.శ్రీహర్ష, జి.వెంకట మనోజ్, వై.పి.ప్రసాద్, ఎస్‌కె బాషా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారు.

నేటి నుండి సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ పురుషుల టెన్నిస్ టోర్నీ
* ఏర్పాట్లు పూర్తి * నగరానికి చేరిన జట్లు
* సుందరంగా రూపుదిద్దుకున్న క్రీడా మైదానాలు
విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 16: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని ఆంధ్రా లయోల కళాశాల టెన్నిస్ అకాడమీలో నేటి నుండి దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ పురుషుల టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే నగరానికి ఐదు రాష్ట్రాల నుండి 20 జట్లు చేరుకున్నాయి. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి అ సౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం ఆరు మైదానాలను సిద్ధం చేశారు. వీటితో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉన్న సింథాటిక్ మైదానాలను కూడా సిద్ధం చేసినట్లు టోర్నీ కార్యనిర్వహక కార్యదర్శి, కృష్ణావర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న వివిధ వర్సిటీల జట్లు బుధవారం ముమ్మర సాధనలో మునిగి తేలాయి. గురువారం ఉదయం కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.వెంకయ్య, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్సిటీ స్పోర్ట్స్‌బోర్డ్ సభ్యులు గోకరాజు గంగరాజులు అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభిస్తారు. నేటి నుండి ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చే క్రీడాకారులకు అసౌకర్యం కలుగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావుతెలిపారు. క్రీడా మైదానాలతో పాటు వేదికను సుందరంగా తయారు చేశారు. వర్సిటీ స్థాపించి నాలుగు సంవత్సరాల కాలంలోనే నిర్వహిస్తున్న దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టోర్నీలో ఎటువంటి లోపాలు ఉండకుండా అసౌకర్యం కలుగకుండా ఉపకులపతి వెంకయ్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కావల్సిన సూచనలను, సలహాలను నిర్వహకులకు అందిస్తున్నారు.

కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి పళ్లంరాజు
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>