గుంటూరు (కల్చరల్), జనవరి 16: తరతరాల తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడుతూ, అమరులైన అనేక మంది మహనీయుల త్యాగాల వల్ల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండేలా ఆశీర్వదించాలని బుధవారం నగరంలో నిర్వహించిన మహాశాంతి యజ్ఞంలో సమైక్యాంధ్ర ప్రదేశ్ విద్యార్థి జెఎసి సకల దేవతలను ప్రార్థించింది. తెలంగాణవాదులు చేస్తున్న ఒత్తిడి మేరకు రాష్ట్రం విభజన జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రంతా సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా గల అన్నమయ్యపార్కు ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో సమైక్యాంధ్రప్రదేశ్ విద్యార్థి సంయుక్త కార్యాచరణ సంఘం, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ సంయుక్త ఆధ్వర్యాన మహాశాంతి యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞాన్ని వేదఘోషల మధ్య పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపి రాయపాటి మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరికీ ఎలాంటి సంకేతాలు అందలేదని, అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను రాజీనామా చేస్తానని తెలిపారు. శాంతియాగంలో భాగంగా మూడు హోమ గుండాలను యజ్ఞ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పలువురు రుత్విక్కులు తొలుత అగ్నిదేవుని యజ్ఞస్థలికి మంత్రపూరితంగా ఆవాహన చేసిన అనంతరం మహాగణపతి, రుద్ర సహిత హోమాన్ని, అలానే విశేషమైన ఫలితాన్నిచ్చే సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలిగి విశాలమైన ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధి, ప్రగతికి శక్తివంచన లేకుండా పాటుపడాలని, ఆ శక్తిని, స్థైర్యాన్ని ప్రజలందరికీ కల్గజేయాలని జెఎసి నాయకులు భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జెఎసి గౌరవాధ్యక్షుడు పి నరసింహారావు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఎండి హిదాయత్, కసుకుర్తి హనుమంతరావు, ఎస్ వెంకట చైతన్య, అడుసుపల్లి శ్రీనివాసరావు, షేక్ జిలాని, బి రంగారావు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ కన్వీనర్ బొల్లేపల్లి సత్యనారాయణ, జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం వెంకట రమణ, వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకవర్గ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపట్నుంచి కాజ వద్ద హిందూ చైతన్య శిబిరం
నేడు ఎగ్జిబిషన్ ప్రారంభం
మంగళగిరి, జనవరి 16: హిందూ సమాజాన్ని చైతన్య పరిచేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తూర్పు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన గుంటూరు - విజయవాడ నగరాల మధ్య జాతీయ రహదారి పక్కన మంగళగిరి మండలం కాజగ్రామ పరిధిలో ఈనెల 18వ తేదీనుంచి మూడురోజుల పాటు హిందూ చైతన్య శిబిరం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రాంగణం ముస్తాబు పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. 125 ఎకరాల విశాలమైన ప్రాంగణానికి శాతవాహన నగర్‌గా నామకరణం చేశారు. భారతీయ సాంస్కృతిక వైజ్ఞానిక వైభవాలను తెలియచేసే విధంగా ఏర్పాటు చేసిన ఫొటోప్రదర్శనను 17వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అలహాబాదు హైకోర్టు మాజీప్రధాన న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యవాహ సురేష్ జోషి ప్రారంభిస్తారని, సాయంత్రం 7 గంటలకు భగవాన్ రామదూత స్వామి శిబిర జ్యోతి ప్రజ్వలన గావిస్తారని ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణమధ్య క్షేత్రకార్యవాహ దూసి రామకృష్ణ బుధవారం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాను, స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగాను జరుపుతున్న ఈ శిబిరంలో కోస్తాంధ్ర జిల్లాల్లోని సుమారు 2600 గ్రామాల నుంచి గణవేషధారి స్వయం సేవకులు 28వేల మంది వరకు పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రాంగణంలో 14 నగరాలు ఏర్పాటు చేశామని, ఒక్కోనగరం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, ఒక్కో నగరంలో 1800 నుంచి 2వేల మందివరకు ఉండే విధంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సామాజిక, సాంఘిక సంస్కర్తలైన గురజాడ, భక్త రామదాసు లాంటివారి పేర్లు నగరాలకు పెట్టామన్నారు. నారాయణ తీర్థుల జన్మస్థలమైన కాజగ్రామంలో హిందూచైతన్య శిబిరం జరుగుతున్నందున ఆయన పేరును ఒక నగరానికి పెట్టామని రామకృష్ణ అన్నారు. 10 అడుగుల ఎత్తున 30 ఇంటు 150 అడుగుల విస్తీర్ణంలో విశాలమైన వేదికను ఏర్పాటు చేసి ముస్తాబు చేస్తున్నారు. 18వతేదీన ఉదయం 10.30 గంటలకు కాకినాడ శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి, సురేష్‌జోషి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని రామకృష్ణ తెలిపారు. 19వ తేదీన గుంటూరు, విజయవాడ నగరాల్లో గణవేషధారి స్వయంసేవకుల పద సంచలనం ఉంటుందన్నారు. 20వ తేదీన మాతృమూర్తుల సమ్మేళనం, సాధుసంతుల సమావేశం జరుగుతుందని, హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చ జరుగుతుందన్నారు. 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు సార్వజనికోత్సవం జరుగుతుందని, లక్షమంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి, రాష్ట్ర మాజీ డిజిపి డాక్టర్ కె అరవిందరావు, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలకులు మోహన్ భగవత్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. హిందూ చైతన్య ప్రధాన ఉద్దేశ్యంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారినుంచి శిబిరానికి వెళ్ళే ప్రధాన మార్గాన్ని ఆర్‌ఎస్‌ఎస్ పతాకాలతో తీర్చిదిద్దారు. శిబిరం వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుచేశారు. 40 ఎకరాల్లో సభా ప్రాంగణం, వెలుతురు కోసం ఫ్లడ్‌లైట్లు, వినికిడి కోసం మైకులు ఏర్పాటు చేశారు. రామకృష్ణతో పాటు స్వాగత కమిటీ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కార్యదర్శి వెలగపూడి రామకృష్ణ తదితరులు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
పులిచింతల పూర్తి చేయలేకుంటే తప్పుకోండి
ప రైతు నాయకుడు యలమంచిలి
తెనాలి, జనవరి 16: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం అంచనాలు పెరిగిపోతున్నా అనుకున్న లక్ష్యం నెరవేరటంలేదని, కాంట్రాక్టర్లు, ప్రభుత్వం మధ్య అపవిత్ర సంబంధం కొనసాగుతున్నట్లు ఉందని, వారివల్లకాకుంటే రైతులే స్వచ్ఛందంగా పూర్తి చేసుకుంటారని, కాంట్రాక్టర్లు తప్పుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు, రైతు నాయకుడు యలమంచలి శివాజీ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఐతానగర్‌లోని రైతుభవన్‌లో ఏర్పాటుచేసి సమావేశంలో శివాజీ మాట్లాడుతూ 1960లో పులిచింతలకు దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేశారని, ఆ తరువాత ఎన్టీఆర్ హయాంలో మరో శంకుస్థాపన జరిగిందని, వాయిదాల క్రమంలో 2004లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 268కోట్ల అంచనాలతో ప్రారంభించిన పులిచింతల ప్రాజెక్టు 8సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు ప్రయోజనకరం కాకపోవటం ఈప్రాంతంలో రైతులకు గురించి పట్టించుకొనే నాయకులు లేకపోవటమే అన్నారు. 390కోట్ల అంచనాలు పెంచారని, 32గేట్లను 24కు కుదించారని, వాస్తవ పరిస్థితులు గమనిస్తే తెలంగాణ అంశం ఒక కొలిక్కివస్తే పులించితల నిర్మాణం ఆగిపోయే పరిస్థితి ఉందని యలమంచలి అన్నారు. పులిచింతల పూర్తి చేసేవిషయమై ఈనెల 20న విజయవాడ ఆటోనగర్‌లో ఎగ్జిబిషన్ సొసైటి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసమావేశం ద్వారా పులిచింతలను స్వచ్ఛందంగా రైతులే నిర్మించుకునే కార్యాచరణ అంశంపై చర్చింనున్నట్లు తెలిపారు. పులిచింతల ఆయకట్టు 13లక్షల ఎకరాలు ఉందని, ఎకరాకు బస్తా ధాన్యం చొప్పున పోగుచేసినా 130కోట్ల రూపాయలు వస్తాయని, ఆదిశగా పులిచింతల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అఖిల పక్షంలో చర్చించనున్నామన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో సర్‌ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్టను ఐదు సంవత్సరాల్లో పూర్తిచేశారని, కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్‌ను మూడు సంవత్సరాల్లో పూర్తిచేశారని, ఈవిషయాన్ని నేటి పాలకులు, కాంట్రాక్టర్లు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పులిచింతల నిర్మాణానికి ఇసుక, సిమెంటు, రహదారి సౌకర్యాలు ఉన్నా నిర్మాణ లోపానికి కొరవడినది చిత్తశుద్దేనన్నారు. పులిచింతల నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు మరో పోరాటం చేపడతామన్నారు. ఈసమావేశంలో రైతుసంఘం నాయకులు ఈదర పూర్ణచంద్, మైనేని రత్నప్రసాద్, దావులూరి సోమశేఖర్, తుమ్మల సాంబశివరావు,కె వాసుదేవనాయుడు తదితర రైతులు పాల్గొన్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలల్లో ఇంటర్నెట్
ప విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం: ఆర్‌విఎం పీడీ ఉషారాణి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 16: పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్నెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వి ఉషారాణి తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కేంద్రం నుండి విచ్చేసిన 17వ ఉమ్మడి సమీక్షా సంఘం సభ్యుల నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీవ్ విద్యామిషన్ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్‌విఎం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపైనే కాకుండా 1వ తరగతి విద్యార్థుల హాజరును కూడా అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుని ఈ కార్యక్రమాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైతే వారి స్ఫూర్తితో విద్యార్థులు కూడా గైర్హాజరు కాకుండా ఉంటారని చెప్పారు. మానసిక వికలాంగులకు ఫిజియోథెరపి, స్పీచ్‌థెరపి వంటి వైద్య సౌకర్యాలను కల్పించడం అభినందనీయమన్నారు. అధికారులు జిల్లాలో ఆక్షరాస్యతా శాతం పెంపుదలకు కృషి చేయాలన్నారు. బృంద సభ్యురాలు యూరోపియన్ యూనియన్ ప్రతినిధి మనీషా సోలంకి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక వైద్య నిపుణులచే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థుల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై కూడా ఉందన్నారు. స్థానిక అమరావతి రోడ్డులోని సెయింట్ ఆన్స్ మనో వికాస కేంద్రంలోని చిన్నారుల పట్ల ఆయాలు తగు శ్రద్ధ తీసుకోవడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇటువంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర నిర్వాహకులను ఉషారాణి ఆదేశించారు. కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ రాజీవ్ విద్యామిషన్ కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఆర్‌విఎం కింద చేపడుతున్న కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లానే ఎంచుకుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ ప్రతినిధి జెబి మాధుర్, ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ కె శారదాదేవి, పాఠశాల విద్య ఆర్‌జెడి పి పార్వతి, ఆర్‌విఎం జిల్లా పిడి డి చైతన్య, డిఇఒ డి ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
న్యాయవాద వ్యవస్థలో మార్పులకు సూచనలివ్వండి
గుంటూరు (లీగల్), జనవరి 16: భారత న్యాయవాద వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని భారత న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) భావిస్తున్న నేపథ్యంలో జిల్లా న్యాయవాదులందరూ తమ తమ సూచనలు, సలహాలు అందజేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి విజ ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం గుంటూరు బార్ అసోసియేషన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో బ్రహ్మారెడ్డి మాట్లాడారు. బిసిఐ నిర్మాణం జరిగి 50 సంవత్సరాలు పూరె్తైన సందర్భంగా ఫిబ్రవరి 16,17 తేదీల్లో న్యూ ఢిల్లీలో జరిగే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఛైర్మన్ మానన్ కుమార్ మిశ్రా నుండి తనకు ఆహ్వానం అందిందని, సదరు ఉత్సవాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా పాల్గొంటారని తెలిపారు.
ఉన్నత ప్రమాణాలతో కూడిన న్యాయ విద్యతో పాటు, న్యాయవాదులను సమాజానికి అందించాలన్న లక్ష్యంగా సమావేశంలో పలు తీర్మానాలను బిసిఐ చేస్తోందన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడుగా తాను ఇప్పటికే కొన్ని అంశాలను సిద్ధం చేశానని, రాష్ట్రంలోని అన్ని కోర్టులకూ సొంత భవనాల నిర్మాణం, మహిళా బార్ అసోసియేషన్లు, జూనియర్లకు స్ట్ఫైండ్, న్యాయ కళాశాలల్లో ప్రవేశం, బోధనా పద్ధతులు, ప్రాక్టీస్ అనంతరమే న్యాయమూర్తులుగా ఎంపిక, గుంటూరులో హైకోర్టు, హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు తదితర విషయాలను బ్రహ్మారెడ్డి ప్రస్తావించారు. మరిన్ని సలహాలు, సూచనలను జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు తనకు అందజేయాలని కోరారు.
28 మందిపై బైండోవర్ కేసులు నమోదు
అమరావతి, జనవరి 16: మండల పరిధిలోని లింగాపురం ఎస్సీ కాలనీలో తరచూ ఘర్షణలకు దిగుతున్న 28 మందిపై బైండోవర్ కేసులు న మోదు చేసినట్లు అమరావతి ఎస్‌ఐ మల్లిఖార్జునరావుతెలిపారు. కంభంపాటి దిబ్బయ్య వర్గానికి చెందిన 14 మంది, చిలకా వీరయ్య వర్గానికి చెందిన 14 మందిపై కేసు నమోదు చేసి, గుంటూరుఆర్‌డిఒ వెంకట రమణ ఎదుట హాజరుపర్చినట్లు తెలిపారు.
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తే సహించం
గుంటూరు (కొత్తపేట), జనవరి 16: కేంద్రప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదుతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఇస్తే సహించేది లేదని, హైదరాబాద్ రాష్ట్ర ఉమ్మడి ఆస్తి వంటిదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. నదీజలాలు, రెవెన్యూ, ప్యాకేజీలు ప్రకటించిన తర్వాతే కేంద్రం తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఎక్కువ నిధులను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం తెలంగాణ అంశం తెరపైకి రావడంతో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని అక్కడి నేతలు డిమాండ్ చేయడం సరికాదన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసిగా విడిపోదామన్న సందేశమిస్తున్న నేతలు రాజధాని విషయంలో మొండిపట్టు పట్టడం సబబు కాదన్నారు. రెవెన్యూపరంగా ఆంధ్రా, రాయలసీమ కన్నా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా వస్తుందని, అందుకు గత 50 సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కారణమన్నారు. తెలంగాణ ఇచ్చే ముందు నదీజలాలు, హైదరాబాద్, రెవెన్యూ ప్యాకేజీ తదితర అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ మూడు ప్రాంతాలకు గుండెకాయలాంటి హైదరాబాదు విషయమై చర్చలు జరగాలని, కేంద్రం నామామత్రంగా తెలంగాణపై స్పందిస్తే ఇరుప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతిని ఆందోళనలు ఉద్ధృతమయ్యే పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. రాయలసీమ, ఆంధ్రాప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిన విషయం కేంద్రం గుర్తించాలని, తెలంగాణ ఇస్తే కేంద్రం ఎన్ని లక్షల కోట్లు పెట్టి రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొల్లా వీరయ్యచౌదరి, చిట్టాబత్తిన చిట్టిబాబు, హనుమంతరావు, మానుకొండ శివప్రసాద్, ధారునాయక్, రూబెన్, బ్రహ్మాచారి, మనె్నం నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వేసవి నీటిఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక
గుంటూరు (కార్పొరేషన్), జనవరి 16: నగర ప్రజలకు వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికను ఏర్పాటు చేయాలని, నగరంలోని చెరువులను, విలీనమైన పది గ్రామాల్లో చెరువులను నీటితో నింపాలని ఆదేశించారు. హడ్కో నిధులతో నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు పశ్చిమ నియోజకవర్గంలో అనువైన ప్రాంతాలను గుర్తించి వివరాలు హడ్కో వారికి పంపాలన్నారు. ఆటోనగర్‌లో మంచినీటి సరఫరా పథకం ఎన్‌ఎఫ్‌డిబి నిధులతో చేపడుతున్న చేపలమార్కెట్ నిర్మాణం, రాజీవ్ ఆవాస్ యోజన పథకం, జోనల్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం తదితర పనులను నిబంధనల ప్రకారం ప్రారంభించాలన్నారు. నగరపాలక సంస్థ విద్యుత్ విభాగం ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ నగరంలో సోలార్, ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పగలు, రాత్రి సమయాల్లో కూడా పనులు చేపట్టాలన్నారు. సోలార్ లైట్లు, అమర్చిన వెంటనే సాధారణ విద్యుత్ లైన్లను నిలుపుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పి ఆదిశేషు, ఎఇలు సుధాకరరావు, నగేష్‌బాబు, మహేష్, డిఇలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
* స్పీకర్ నాదెండ్ల మనోహర్
తెనాలి, జనవరి 16: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, అర్హులైన పేదలు సంక్షేమ ఫలాలు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసందర్శన వార్డు పర్యటనల్లో భాగంగా బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ పట్టణంలోని 3నుండి 6, 21నుండి 24వార్డులు ఉదయం, సాయంత్రం పర్యటించారు. ఈక్రమంలో ప్రజల నుండి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు ఇచ్చారు. స్థానిక కవిరాజా పార్కులో ఏర్పాటుచేసిన జన సందర్శన సభలో 35దీపం గ్యాస్ కనెక్షన్లు, 10ఎన్‌ఎప్‌డిఎస్ కుటుంబ ప్రయోజన బాండ్లు, ఇద్దరు పిల్లల సంరక్షణలో భాగంగా 38మందికి పత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా రేపల్లె గేటు సెంటర్‌లో ఏర్పాటుచేసిన జనసందర్శన సభలో 50దీపం గ్యాస్ కనక్షన్లు, 13ఎన్‌ఎఫ్‌డిఎస్ బాండ్లు, 53 ఇద్దరు పిల్లల సంరక్షణ పత్రాలు పంపిణీ చేశారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ వార్డు పర్యటన ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవటంతో పాటుగా ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేర్చేందుకు అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ఆర్డీఓ ఎస్ శ్రీనివాసమూర్తి, కమీషనర్ బి బాలస్వామి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్యశశిధర్, మాజీ మున్పిపల్ చైర్మన్ యు జానకీరామచంద్రరావు, పార్టీలో వివిధ స్థాయి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
లెక్చరర్ పోస్టులకు వయోపరిమితి
పెంచాలని వినతి
వినుకొండ, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ఎపిపిఎస్సీ ద్వారా త్వరలో భర్తీ చేయనున్న జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని వినుకొండ పోస్టు గ్రాడ్యుయేట్ అభ్యర్థులు బుధవారం డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావుకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ ఓసి అభ్యర్థులకు 39 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 44 సంవత్సరాలు పెంచాలని ప్రభుత్వానికి విన్నవించారు. గతంలో అన్ని పోస్టులకు 39సంవత్సరాలుగా నిర్ణయించారని, 2011-12లో కొన్ని పోస్టులకు 36 సంవత్సరాలుగా నిర్ధారించారని, ప్రస్తుతం 34సంవత్సరాలకు కుదించటం పట్ల లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని వాపోయారు. వినతి పత్రం అందజేసిన వారిలో మోహన్‌రావు, వెంకట్, సుధాకర్, కోటేశ్వరరావు, పెద గోవిందు తదితరులు ఉన్నారు.
యువకులు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి
కర్లపాలెం, జనవరి 16: యువకులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ సభ్యులు ఆరాద్యుల సత్యనారాయణరాజుయాదవ్ అన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యాదవ యువజన ఐక్యవేదిక తృతీయ సమావేశం బుధవారం జరిగింది. ఈసమావేశానికి నర్రా సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పలు సేవాకార్యక్రమాల్లోపాల్గొని దేశ సేవలో ముందుండాలన్నారు. ఈసందర్భంగా 10మంది పేద విద్యార్థులకు 1116 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో విద్యుత్ ఏఇ పెరుగు శ్రీనివాసరావు, పమిడి భాస్కరావు, భక్తుల శ్రీనివాసరావుయాదవ్, తోట నారాయణ, బొమ్మన బోయిన సాంబయ్య, పందరబోయిన శ్రీనివాసరావు, ఓసా శివయ్య, బుర్ల రాజేష్ పాల్గొన్నారు.
ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
* భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
అచ్చంపేట, జనవరి 16: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ ఎలుకల మందు తిన్న సంఘటనలో భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా మారింది. మండలంలోని చెరుకుంపాలెం గ్రామంలో సుంకర లక్ష్మీనారాయణ (24), భార్య లలిత కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మంగళవారం రాత్రి ఎలుకల మందు తిని అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స చేయిస్తుండగానే బుధవారం లక్ష్మీనారాయణ మృతి చెందగా, లలిత ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. నారాయణమృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సాగునీటి కోసం రైతుల ధర్నా
నాదెండ్ల, జనవరి 16: సాగునీటి కోసం రైతులందరూ కలిసి ధర్నా చేసిన సంఘటన కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. నాలుగు గ్రామాల రైతులు కలిసి సాతులూరు గ్రామం వద్ద ధర్నా నిర్వహించారు. ఆరుతడి పంటలకు నీరు అందిస్తామని ప్రకటించి ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కేవలం పది క్యూసెక్కుల నీరు విడుదల చేసి చేతులు దులుపుకుందని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎఇ స్వర్ణలత ఘటనా స్థలానికి చేరుకోగానే రైతులందరూ ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నీరు తప్పక విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ధర్నా నిర్వహించిన వారిలో సాగునీటి సంఘ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, హనుమంతరావు, చిన శ్రీనివాసరావు తదితర రైతులు పాల్గొన్నారు. అనంతరం ఎస్‌ఐ పచ్చల సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నటనతోనే అత్మీయతానురాగాలు
అచ్చంపేట, జనవరి 16: నటనతో ఆత్మీయతానురాగాలను పొందుతున్నామని టివి నటి దుర్గాదేవి అన్నారు. బుధవారం ఆమె రోకలిగుంటవారిపాలెం గ్రామంలో పూర్ణోదయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయులు, అభిమానుల నడుమ 36వ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నటి దుర్గాదేవి మాట్లాడుతూ కలవారి కోడలు, ముద్దుబిడ్డ, భార్యామణి, దేవత, అన్నాచెల్లెళ్లు టివి కథలలో నటిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 50 చలన చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. అనంతరం జన్మదిన కేక్‌ను కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యంగళరెడ్డి, జానకీ రామయ్య, సిహెచ్ రమణ, పురుషోత్తమ్, ప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనను తేల్చాల్సింది కాంగ్రెస్సే
* మాజీ మంత్రి కోడెల
నరసరావుపేట, జనవరి 16: రాష్ట్రాన్ని విడగొట్టినా, కలిపి ఉంచినా కాంగ్రెస్ పార్టీ వాళ్లే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనే అంశం ప్రస్తుతం వారి కోర్టులో ఉందన్నారు. తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మా బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో సార్లు ప్రకటనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణా అంశంపై ఇంతకాలం ఎందుకు నాన్చారో క్షమాపణతో కూడిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరాహార దీక్షలు చేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు అఖిల పక్ష సమావేశాన్ని జరపడాన్ని కోడెల తప్పు బట్టారు. కాంగ్రెస్‌పార్టీ అసమర్థ దివాళాకోరుతనంతో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, ఆదాయం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఆంధ్రరాష్ట్ర పరువును బజారుకు ఈడ్చింది కాంగ్రెస్ పార్టీనాయకులే నన్నారు. ప్రజల్ని అయోమయోంలో పెట్టవద్దని సూచించారు. చంద్రబాబునాయుడు రాయలసీమలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని వారికి ఉపసమనమిచ్చి ఆంధ్రా ప్రాంతంలోకి వస్తున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు పాదయాత్రను ఆపాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు లక్షల సంఖ్యలో స్వాగతం పలకనున్నారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్, చిదంబరం, గులామ్‌నబి ఆజాద్, వీరప్పమొయిలీ తదితరులు తెలంగాణాను ఇవ్వబోమని ప్రకటన చేశారని, ఏ కారణం చేత ఇవ్వనన్నారో తెలపాలన్నారు. ఆంధ్రప్రజలు పూర్తిగా చైతన్య వంతులయ్యారని అన్నారు. ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రచ్చగొడుతోంది కాంగ్రెస్ పార్టీయేనని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అంశం కన్నా రాజకీయ ప్రయోజనాలనే ఎక్కువగా ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి అధిష్టానం చెప్పిన మాటలే మాకు శరోధార్యమన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు విజయమ్మ రెండు కోట్ల సంతకాలతో రాష్టప్రతిని కలిస్తే దొంగ దొరైపోతారా అని ప్రశ్నించారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లి చెట్టులా.. విజయమ్మ వాకిట్లో అవినీతి పుట్ట అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి పరుడా? కాదా? చెప్పాలన్నారు. బైబిల్‌పై ప్రమాణం చేసి తన కుమారుడు కోట్లాది రూపాయలు సంపాదించలేదని చెప్పాలన్నారు. తప్పుని ఒప్పుకుంటే కోర్టుల్లో క్షమాపణ దొరుకుందని కోడెల సలహా ఇచ్చారు.
జగన్, కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగై టిడిపిని విమర్శించడం సూర్యునిపై ఉమ్మినట్లేనన్నారు. నేరగాడు తప్పించుకుంటే సమాజం చిన్నా భిన్నం అవుతుందని, నేరగాళ్లను శిక్షించాలని కోడెల అన్నారు. ఈ సమావేశంలో వేల్పుల సంహాద్రి యాదవ్, రాజా కాశయ్య, పులిమి రామిరెడ్డి, కొల్లి ఆంజనేయులు, కడియం కోటి సుబ్బారావు, బాబు, చల్లా సుబ్బారావుతదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేటలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా?
* కాంగ్రెస్ నేతల సవాల్
నరసరావుపేట, జనవరి 16: తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన 1983 నుండి 2004 వరకు అదే విధంగా 2004 నుండి 2012వ సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో నియోజక వర్గం ఎవరి పాలనలో ఎక్కువ అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు షేక్ హుస్సేన్, మురళి, వేలూరి సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు దుర్గాబాబు, మాజీ జట్‌పిటిసి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎనిమిదిన్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగిందా? తొమ్మిది సంవత్సరాల టిడిపి పాలనలో అభివృద్ధి జరిగిందా అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు. 20 సంవత్సరాల కోడెల శివప్రసాదరావు పాలనలో ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందిందా, ఎనిమిదిన్నర సంవత్సరాల కాసు కృష్ణారెడ్డి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా అనే అంశంపై తాము చర్చికు సిద్ధంగా ఉన్నామన్నారు. టిడిపికి సంబంధించిన కె చానల్‌లో చర్చించటానికి సిద్ధమన్నారు. తమ పార్టీ నుండి ఒకరు లేదా ఇద్దరు చర్చికు రావటం జరుగుతుందన్నారు. 20వ తేదీ ఉదయం 10గంటలకు టిడిపికి చెందిన కె చానల్‌కు తాము రావడం జరుగుతుందన్నారు. కాసు వెంకట కృష్ణారెడ్డి 2014లో నరసరావుపేట నియోజక వర్గం నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో తిరిగి గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కరెంట్ రీడింగ్ పేరుతో దోచుకున్న వ్యక్తికి జైలు
గుంటూరు (లీగల్), జనవరి 16: కరెంట్ మీటరు రీడింగ్ చూసే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బెదిరించి నగలు దోచుకున్న వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు నాల్గవ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పి భాస్కరరావు బుధవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం... 2009 ఆగష్టు 14న వెలగా రవి అనే నిందితుడు స్థానిక రాజాగారితోటలోని కొల్లిపర నీరజారాణి ఇంట్లోకి ప్రవేశించి కరెంట్ మీటరు రీడింగ్ చూడాలని చెప్పాడు. ఒంటరిగా ఉన్న నీరజారాణిని కత్తితో బెదిరించిన రవి నాలుగున్నర లక్షల విలువ గల బంగారంతో పాటు, ఆమె వద్ద గల సెల్‌ఫోన్‌ను కూడా దోచుకుని పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు రవిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా మరో 9 మందితో కలిసి తాను ఈ విధమైన నేరాలు చేస్తుంటానని చెప్పడంతో అందరినీ అరెస్ట్ చేశారు. ఒకరిపై కేసును వేరు చేయగా 8 మందిపై కేసును కొట్టివేశారు. వెలగా రవిపై మాత్రం నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్షతో పాటు, వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు. ఎపిపి కొండముది ఎలిజబెత్ స్వర్ణలతాభాను ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
విద్యుత్ చార్జీల భారాలను ఉపసంహరించాలి
గుంటూరు (పట్నంబజారు), జనవరి 16: రాష్ట్రప్రభుత్వం ప్రజలపై మోపనున్న విద్యుత్ చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ విద్యుత్ సర్‌చార్జీల భారాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుండగానే మరలా రూ. 17,720 కోట్ల మేరకు వచ్చే ఏప్రిల్ నుండి విద్యుత్ చార్జీలు పెంచేందుకు రంగంసిద్ధం చేయడం దారుణమన్నారు. ప్రజల నుండి సంతకాల సేకరణ, పోస్టుకార్డుల ఉద్యమం, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు ఈనెల 19వ తేదీన జరగనున్న డిఆర్‌సి సమావేశాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. సామాన్య ప్రజల నుండి పరిశ్రమల వరకు వేలాది రూపాయల్లో బిల్లులు వస్తుండటంతో ఎలా చెల్లించాలో తెలియక పలుచోట్ల అధికారులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గతంలో ఉన్న టెలీస్కోప్ విధానాన్ని ప్రభుత్వం తొలగించి 42 శాతం విద్యుత్ చార్జీలను పెంచడానికి ప్రభుత్వం ప్రతిపాదించడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో వి కృష్ణయ్య, జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ శివారెడ్డి, ఎ కొటిరెడ్డి, జి చలమయ్య, పి నరసింహారావు, జెవి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
మాదిగలను బలోపేతం చేసి టిడిపిని గెలిపించాలి
గుంటూరు (కొత్తపేట), జనవరి 16: జిల్లాలో ఉన్న మాదిగలను బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి, కృషి చేయాలని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మానుకొండ శివప్రసాద్ కోరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో జిల్లా మాదిగల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మానుకొండ శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సమానత్వం కల్గించింది ఎన్‌టి రామారావేనని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయస్సులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో మాదిగ రాజకీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజకీయ సదస్సుకు రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, రాష్ట్ర పార్టీ నాయకులు వర్ల రామయ్య, ఎవె