ఒంగోలు, జనవరి 16: జిల్లాలో ఉప్పు సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. దీనితో రైతులు విలవిల్లాడిపోతున్నారు. కనీసం భూములను కౌలుకు తీసుకునేవారే కరవయ్యారు. గతంలో ఎకరాకు 15 వేల నుండి 20 వేల రూపాయల వరకు కౌలు పలకగా ఈ సంవత్సరం అదే భూమికి 8 వేల రూపాయలు కూడా అడిగే పరిస్థితి కనిపించడంలేదు. దీనితో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉప్పుసాగు చేపట్టిన భూములు బీడులుగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఉప్పు ధరలు పతనావస్థకు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉప్పు లారీ 18 వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం 12 వేల రూపాయలకు పడిపోయింది. దీనితో పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావోనన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత సంవత్సరం ఉప్పు నిల్వలు పేరుకుపోవడంతో ప్రస్తుతం తీసే ఉప్పునకు ధరలు వస్తాయా అన్న మీమాంసలో రైతులు ఉన్నారు. గత సంవత్సరం ఉప్పు ఇంకా వేలాది బస్తాలలో మూలుగుతోంది. ఆ ఉప్పు అమ్ముడుపోక రైతులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావన్న ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని ఊళ్ళపాలెం, మోటుమాల, కొత్తపట్నం, బీరంగుంట, పాతపాడు, చినగంజాం, పెదగంజాం, కనపర్తి తదితర ప్రాంతాలలో పెద్దఎత్తున రైతులు ఉప్పుసాగు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఈ పాటికే ఉప్పు తీయాల్సి ఉంది. కాని ధరలు లేకపోవడంతో ఉప్పుసాగు చేపట్టే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉప్పు పంటకు ధరలు లేకపోయినప్పటికి కూలీల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనితో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడంలేదు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా నుండి మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు ఉప్పు ఎగుమతులు అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున ఉప్పు నిల్వలు పేరుకుపోవడంతో దిగుమతులు చేసుకునే వ్యాపారులు ప్రస్తుతం కరవయ్యారు. మొత్తంమీద జిల్లాలో ఉప్పు సాగు చేపట్టిన రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు.
విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి
చెవిదుద్దులు అపహరణ
అద్దంకి, జనవరి 15: ఓ విద్యార్థినికి మత్తుమందిచ్చి చెవిదుద్దులు, కాళ్ళపట్టీలు అపహరించిన సంఘటన మంగళవారం అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలోని నర్రావారిపాలెంకు చెందిన నర్రా శ్రావ్య బెల్ అండ్ బెనె్నట్ స్కూలులో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్తుండగా శ్రీనగర్ కాలనీ వద్దకు ఇద్దరు పురుషులు, ఒక యువతి కారులో వచ్చారు. కారులోని యువతి తన పుట్టినరోజంటూ కేకు ఇవ్వజూపింది. కేకు తీసుకునేందుకు ముందుకు వంగిన సమయంలో మత్తుతో కూడిన చేతిరుమాలును ముక్కువద్ద పెట్టింది. మత్తులో ఉన్న శ్రావ్యను కారులో తీసుకువెళ్లి, చెవులకున్న దుద్దులు, కాళ్ళపట్టీలు దోచుకొని, కారును పలురోడ్లలో తిప్పి మరల శ్రీనగర్ సమీపంలోనే కారులో నుండి శ్రావ్యను దింపివేశారు. మగతలో ఉన్న శ్రావ్య పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమె కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సిఐ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్సై సమీవుల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
18 నుండి ఎన్‌టిఆర్ కళాపరిషత్ 14వ వార్షికోత్సవాలు
ఒంగోలు అర్బన్, జనవరి 16: ఎన్‌టిఆర్ కళాపరిషత్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 18 నుండి వచ్చే నెల 2వ తేది వరకు ఒంగోలులోని పివిఆర్ బాలుర మైదానంలో జరుగనున్నాయని కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. అందుకు సంబంధించిన కార్యక్రమ వివరాలను బుధవారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో హరిబాబు వెల్లడించారు. వినూత్న రూపకల్పనతో ప్రపంచంలోనే అరుదైన రంగస్థల వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభ సభ జరుగుతుందన్నారు. ముందుగా కళాకారులు కళాజ్యోతిని చేతబూని బాపూజీ కాంప్లెక్స్ వద్దగల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుండి ఎన్‌టిఆర్ విగ్రహం మీదుగా కర్నూల్‌రోడ్, సుందరయ్య భవన్ రోడ్డు మీదుగా పివిఆర్ మైదానానికి ఊరేగింపు చేరుకుంటుందన్నారు. అనంతరం ఎన్‌టిఆర్ అవార్డు గ్రహీత కెఎస్‌టి సాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. 11 గంటలకు జాతీయజెండా, భారతీయం జెండా, ఎన్‌టిఆర్ కళాపరిషత్ జెండా ఆవిష్కరణ జరుగుతుందన్నారు. 11.15 నిమిషాలకు దివంగత వెంపటి రాధాకృష్ణమూర్తి కళాప్రాంగణాన్ని ఎమ్మెల్సీ శిద్ధా రాఘవరావు, 11.20కు ఎఆర్ కృష్ణా కళావేదిక - 360ని కృష్ణసాయి గ్రానైట్స్ అధినేత శిద్ధా వెంకటేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు. భారతీయం కన్వీనర్ గొట్టిపాటి సత్యవాణి జ్యోతి ప్రజ్వలన చేస్తారని, నల్లూరి వెంకటేశ్వర్లు ఎన్‌టిఆర్‌కు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ప్రతిరోజు విద్యార్థులు, వివిధ బృందాల ప్రదర్శనలు భారతీయం కళార్చన ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. రాత్రి 7 నుండి 11 గంటల వరకు ప్రతిరోజు ఎన్‌టిఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటికలు, నాటకాలు జరుగుతాయన్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు గురుమిత్ర కళాసమితి రేపల్లెవారి తెలుగుబిడ్డ నాటకం, రాత్రి 8.30 నిమిషాలకు శ్రీ బాలసరస్వతి కళానాట్య మండలి రంగారెడ్డి జిల్లావారి శ్రీ భక్తపుండరీక పద్యనాటకం ఉంటుందన్నారు. ఈనెల 19వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు లిఖితసాయి శ్రీ క్రియేషన్స్ గోవాడవారి మాకంటూ ఓ రోజు నాటిక, 8.30 నిమిషాలకు సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారి ప్రథమ మహాసంగ్రామం 1857 పద్యనాటకం ప్రదర్శిస్తారన్నారు. ఈనెల 20వ తేది రాత్రి 7 గంటలకు సహజీవనం, ఇక్కడ కాసేపు ఆగుదాం సాంఘిక నాటకాలు ఉంటాయన్నారు. 21వ తేది సోమవారం రైతురాయల స్వర్ణ చరితం సంగీత నృత్య రూపకం, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు భగత్‌బోలా సాంఘిక నాటకం ప్రదర్శిస్తారన్నారు. 22వ తేది కొత్త నాయకుడు, సంభవామి పదేపదే సాంఘిక నాటకాలు ఉంటాయన్నారు. 23వ తేది గురు రాఘవేంద్ర చరితం పద్యనాటకం, 24న దేవుడు చూస్తున్నాడు సాంఘిక నాటిక, విష్ణు సాయుజ్యము పద్యనాటకం ప్రదర్శిస్తారన్నారు. 25న గమనం, సంచలనం సాంఘిక నాటకాలు ఉంటాయన్నారు. 26న మనుషులు కలిస్తే సాంఘిక నాటకం, 27న కొత్తసైన్యం నాటిక, 28న మహిషాసుర మర్థిని సంగీత నృత్యరూపకం, రావణ పద్యనాటకం ప్రదర్శిస్తారన్నారు. 29న తప్పటడుగులు, లైఫ్‌లైన్ నాటికలు ఉంటాయన్నారు. 30న ఒక క్షణం నాటిక, ఆదికవి నన్నయ్యబట్టు పద్యనాటకాలు జరుగుతాయన్నారు. 31న చెంగల్వపూదండ సాంఘిక నాటిక, సన్మతి, ఆచంద్రార్కం నాటికలు ప్రదర్శిస్తారన్నారు. 1వ తేదిన శ్రీకారం, సర్పయాగం, పృధ్వీ సూక్తం నాటికలు ఉంటాయన్నారు. వచ్చే నెల 2వ తేది శనివారం ముగింపు సభ జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు మిస్ మీన నాటకం, 8 గంటలకు కన్యాశుల్కం నాటకం ప్రదర్శిస్తారన్నారు. ఈ నాటకంలో సినీనటులు మురళీమోహన్, రాళ్ళపల్లి, జివి నారాయణరావు, అల్లరి సుభాషిణి, ఉత్తేజ్, ఝాన్సీ తదితరులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖులతోపాటు సినీనటులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా నీతి నిజాయితీలకు పట్ట్భాషేకం పేరుతో 21 మందికి శ్రీ భారతీయుడు పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో భారతీయం అధ్యక్షుడు ఈదర భరత్, ఎపి ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు
చీమకుర్తి, జనవరి 16: మండలంలోని రామతీర్థం వద్దగల పలు గెలాక్సీ గ్రానైట్ క్వారీలలో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సదరన్, ఆనంద్, పల్లవ, వివిఎల్, స్వాస్ మినరల్, కిషోర్ బ్లాక్‌గోల్డ్, డిఆర్, శిద్ధా హనుమంతురావు గ్రానైట్స్, నిర్మల్, యాక్ గ్రానైట్ క్వారీలలో గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం అన్ని క్వారీలలో నిబంధనలు ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. సూర్యా గ్రానైట్ క్వారీలో తనిఖీలకు వెళ్ళగా క్వారీ సెలవుల్లో ఉండటంతో అధికారులు వెళ్ళిపోయారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డిఎస్పీ వంగా సుబ్బారెడ్డి, ఇన్స్‌పెక్టర్ సంజీవ్‌కుమార్, ఎజి హనుమంతురావు, సురేష్‌బాబు, మరో సిఐ కిషోర్‌కుమార్, ఎజి రవీంద్రలు పాల్గొన్నారు.
‘అనర్హులకు ఓటు హక్కు కల్పించారు’
సిఎస్‌పురం, జనవరి 16: సహకార ఎన్నికలకు సంబంధించి వందల సంఖ్యలో భూమిలేని అనర్హులకు ఓటు హక్కు కల్పించారని టిడిపి నాయకులు సహకార ఎన్నికల అధికారి, తహశీల్దార్ ఎం సుబ్బారావుకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అధికారపార్టీకి చెందిన అత్యధికమంది భూమిలేని వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పది రూపాయలు సభ్యత్వం కలిగిన వారికి 320రూపాయల నగదు కట్టించుకుని బుధవారం వరకు ఓటు హక్కు కల్పించాలని గడువు ఇచ్చినా కార్యదర్శి లేకపోవడంతో వారు ఓటు పొందలేకపోయారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా భూమిలేని ఉద్యోగులకు, విద్యార్థులకు, ఒకే కుటుంబ సభ్యులందరికి అక్రమంగా ఓటు కల్పించాలని విచారించి ఓట్లు తొలగించాలని కోరారు. అలాగే వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కూడా సొసైటీ ఓటర్ల జాబితా అక్రమాలపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు పి రవికుమార్, జి జయరాములు, ఎస్ వెంకటేశ్వర్లు, వి సత్యం, చిరంజీవి, లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కె వెంకటేశ్వర్లు, దేవరాజు, ఎ కాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో జోరుగా అభివృద్ధి పనులు
ఒంగోలు, జనవరి 16: ఒంగోలులో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు తెలిపారు. బుధవారం తనను కలిసిన విలేఖర్లతో కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ఒంగోలులో ప్రధానమైన కర్నూలు రోడ్‌తోపాటు నగరంలోని పలు డ్రైనేజీ అభివృద్ధి పనులు సుమారు 6 కోట్ల రూపాయలతో జరుగుతున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంలో మొత్తం 19 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్‌లు, అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్‌లను పిలువగా ప్రస్తుతం సుమారు 6 కోట్ల రూపాయల పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే కర్నూలురోడ్డు విస్తరణ పనులు రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో చేపట్టి ప్రజలకు సౌకర్యాన్ని కలుగజేయనున్నట్లు తెలియజేశారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు వచ్చిన సమయంలో ప్రతి ఏడాది లోతట్టు కాలనీల్లో నీరు చేరి ఇబ్బందులు పడుతుండటంతో ఇప్పటికే పోతురాజు కాలువ అభివృద్ధి పనులు చాలావరకు జరగడం వలన పోతురాజు కాలువ చుట్టుపక్కల కాలనీలైన ఎన్‌టిఆర్ కాలనీ, ఉషోదయం కాలనీ, భరత్ కాలనీ, కరుణా కాలనీ, బలరాం కాలనీ తదితర కాలనీలకు ముప్పు తప్పిందని అన్నారు. ప్రగతి కాలనీలో ఈ సీజన్‌లో కురిసిన వర్షాలకు భారీస్థాయిలో నీరు చేరి కాలనీ ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రగతి కాలనీలోకి నీరు చేరకుండా జాతీయ రహదారి పక్కనున్న డ్రైనేజీ అభివృద్ధి పనులు చురుగ్గా చేస్తునట్లు వెల్లడించారు. ఒంగోలు నగర ప్రజలకు ప్రస్తుతం తాగునీటి సమస్య లేదన్నారు. నగరంలోని రెండు ఎస్‌ఎస్ ట్యాంకుల్లో తాగునీరు పుష్కలంగా ఉందన్నారు. మరో వారం రోజుల్లో సాగర్ నీరు విడుదలైతే ఆ నీటిని కూడా ఎస్‌ఎస్ ట్యాంకులకు నింపి నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని కమిషనర్ తెలిపారు.
25న ఒంగోలు డెయిరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికలు
ఒంగోలు, జనవరి 16: జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెడ్ ఒంగోలు (డెయిరి) పాలకసభ్యుల ఎన్నికలు ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు డెయిరీ ఎన్నికల అధికారి నంద్యాల వరదారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు డెయిరీ పాలకవర్గ సభ్యులు రొటేషన్ పద్ధతిలో ప్రతి సంవత్సరం ముగ్గురు చొప్పున పదవీ విరమణ చేస్తారన్నారు. ప్రస్తుతం ముగ్గురు పాలకవర్గ సభ్యులైన బాచిన నాగేశ్వరరావు, దొడ్డా వెంకటసుబ్బులు, మేడికొండ ఆదెమ్మల పదవీకాలం ఫిబ్రవరి 3వ తేదితో ముగుస్తుందన్నారు. దీనితో ఆ మూడు ఖాళీలను తిరిగి భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించే నిమిత్తం తనను ఎన్నికల అధికారిగా నియమించారని పేర్కొన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈనెల 17వ తేదీన జారీ చేస్తామని తెలిపారు. ఈనెల 21వ తేది 10 గంటల నుండి 1 గంట వరకు నామినేషన్‌లను స్వీకరిస్తామన్నారు. ఈనెల 21వ తేదీ 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈనెల 22వ తేది సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. ఈనెల 25వ తేది ఉదయం 8 నుండి 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఒకవేళ పోటీ లేనట్లైతే ఈనెల 22వ తేది ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల తేది నాటికి పదవిలో ఉన్న ఓటు హక్కుగల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహహకార సంఘంలోని ప్రెసిడెంట్‌లు మాత్రమే అర్హులని తెలిపారు. వారి వెంట గుర్తింపు పత్రాలు తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.
విద్యుత్ కోతలతో సంక్షోభంలో వ్యవసాయం
అమలుకాని ప్రభుత్వ హామీ
మార్కాపురం, జనవరి 16: వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, పంటల సాగుకు 7గంటలపాటు విద్యుత్ అందించాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. అధికారులు మాత్రం 7గంటలు ఇవ్వడం కష్టమని, 5గంటలకు మించి వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇవ్వడం కష్టమని చెప్పడం సర్వసాధారణమైంది. అయితే ఈ రెండు హామీలు అమలు జరగకుండా పంటలకు అందేది మాత్రం రెండు గంటలేనని రైతులు అంటున్నారు. మార్కాపురం డివిజన్‌లో సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు వ్యవసాయం విద్యుత్‌పై ఆధారపడి సాగిస్తున్నారు. గతఏడాది నుంచి విద్యుత్ రంగంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనితో పంటలు పండక నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నో ఏళ్ళ నుంచి కంటికి రెప్పలా కాపాడుకువస్తున్న బత్తాయి, నిమ్మ పంటలు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి వాటిని నరికివేసి వ్యవసాయం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే విద్యుత్ సరఫరాలో అంతరాలు ఏర్పడి పంటలు వాడుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేసుకోమని అధికారులు చేస్తున్న విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని పత్తి, మిరప లాంటి పంటలు సాగు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడుల కారణంగా సాగుచేసిన కొద్దిపాటి పంటలు ఎండిపోతుండటంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా ఏ సమయంలో ఎంతసేపు సరఫరా చేస్తారో అర్థంకాక పొలాల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు. దీనిపై జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఇ మాత్రం రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా చేయలేమని, పగటిపూట ఇచ్చిన విద్యుత్‌తోనే వ్యవసాయం సాగించాలని చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌పై ఆధారపడి వ్యవసాయం సాగించడం ఇబ్బందికరంగా తయారైందని రైతులు అంటున్నారు. కరవుప్రాంతంగా గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
‘మీకొక న్యాయం...మాకొక న్యాయమా’
కందుకూరు, జనవరి 16: న్యాయంకోసం పోరాటం చేసే మీకు ఒక న్యాయం, మాలలమైన మాకు ఒక న్యాయమా అని వైఎస్‌ఆర్‌సిపి, టిడిపిలను మాలమహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు సూటిగా ప్రశ్నించారు. గురువారం స్థానిక స్వర్ణాప్యాలెస్‌లో విలేఖరుల సమావేశంలో మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ న్యాయంకోసం వైఎస్‌ఆర్‌సిపి కోర్టులను ఆశ్రయిస్తూ న్యాయం చేయాలని పదేపదే కోరడాన్ని ఆయన గుర్తుకు తేచ్చారు. అదేవిధంగా చంద్రబాబునాయుడుపై సిబిఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు కోర్టును ఆశ్రయించడం ఆయన గుర్తుకు తెచ్చారు. అయితే వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు 2004నవంబర్ 5న వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం అని ఇచ్చిన తీర్పును టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. తమ రాజకీయ లబ్దికోసం మాల, మాదిగల మధ్య వైరుధ్యాలను పెంపొందించి తమ పదవులను, పాలనను రక్షించుకునే ప్రయత్నంలో అగ్రవర్ణ రాజకీయ నాయకులు చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. 1996వ సంవత్సరంలో వర్గీకరణ అమలు నుండి వర్గీకరణ రద్దు చేయాలని మాలలు అనేక ఉద్యమాలను నిర్వహించారని ఆయన తెలిపారు. 1997లో జస్టిస్ సాదాముల్లాహుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం అని తెలిపినట్లు ఆయన తెలిపారు. అనంతరం డివిజన్ బెంచ్ ముందు తమ వాదలు వినిపించామని, అయితే ఐదుగురు సభ్యులు గల బెంచ్‌లో నలుగురు వర్గీకరణకు అనుగుణంగా తీర్పు ఇవ్వగా, ఒకరు అనుకూలంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఈతీర్పులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. వర్గీకరణ జరిగిన పది సంవత్సరాల కాలంలో 25వేల ఉద్యోగాలను మాలలు కోల్పోయారని ఆయన తెలిపారు. ఆఅంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లగా సుప్రీం కోర్టు మానవతా ధ్రుక్పథంతో ఉద్యోగాలను ఉంచాలని తెలిపారు. అందువలన మాలల సౌజన్యంతోనే 25వేల ఉద్యోగాలలో మాదిగలు కొనసాగుతున్నారని ఆయన తెలిపారు. ఇంత తంతు జరుగుతున్నా రాజకీయపార్టీలు సబ్‌ప్లాన్ నిధుల అంశంలో వర్గీకరణకు ప్రాముఖ్యత ఇస్తూ ఓటు వేయడం అన్యాయం అని అన్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌సిపిలో ఉన్న మాల నేతలు మాలల రిజర్వేషన్లపై విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలను అంది పుచ్చుకొని మాలలకు వ్యతిరేకంగా ఓటు వేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
19న మాలల సమరభేరి
మాల వర్గాల ప్రజలందరిని ఒక తాటిపై తెచ్చేందుకు ఈనెల 19న ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ ప్రాంతంలోగల మున్సిపల్ పాఠశాల ఆవరణలో మాలల సమరభేరి నిర్వహించనున్నట్లు మల్లెల వెంకట్రావు తెలిపారు. ఈసమరభేరికి అమలాపురం ఎంపి హర్షకుమార్, జిల్లాలోని కొండపి ఎమ్మెల్యే జివి శేషు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్, మాల వర్గానికి చెందిన ప్రముఖులు, కళాకారులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.
విజయమ్మ వంచనకు మారుపేరు
వైఎస్‌ఆర్‌సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వంచనకు మారుపేరు అని మల్లెల వెంకట్రావు విమర్శించారు. మాలల ఓట్లతో ఉప ఎన్నికలలో గెలుపొందిన వైఎస్‌ఆర్‌సిపి వర్గీకరణ అంశంలో మాలలకు అన్యాయం చేస్తూ మాదిగలకు తోడున్నామని భ్రమ కల్పిస్తున్నారని ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధుల అమలు అంశంపై ఓటింగ్‌కు కొన్ని నిముషాల ముందే విజయమ్మ నిర్ణయం తీసుకుని వర్గీకరణకు అనుకూలంగా ఓటు వేయడం వంచనకు మారుపేరు అని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపికి అండదండలు ఇస్తున్న మాలలపై వైఎస్‌ఆర్‌సిపి అనుసరిస్తున్న విధానాలను మాల వర్గాల ప్రజలు అవగాహన చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈసమావేశంలో మాలమహాసభ జిల్లా అధ్యక్షుడు కె ప్రకాశ్, కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం
ఎమ్మెల్యే దగ్గుబాటి ఎదుట రైతుల ఆవేదన
మార్టూరు, జనవరి 16: సాగర్ కాలువల ద్వారా చివరి భూములకు సక్రమంగా నీరు రావటంలేదని, వేసిన పంటలు ఎండిపోతున్నాయని, నీరు సకాలంలో ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని పలువురు రైతులు బుధవారం కాలువ దగ్గరకు వచ్చిన పర్చూరు శాసనసభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వద్ద తమ బాధలను వ్యక్తం చేశారు. బొల్లాపల్లి కాలువకు 305 క్యూసెక్కుల నీరు విడుదల కావలసి ఉండగా కేవలం 185 క్యూసెక్కుల నీరు మాత్రం రావటంతో చివరి భూముల్లో వేసిన మొక్కజొన్న, శనగ, మిర్చి పంటలను కాపాడుకోవటానికి నీరుకోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలువపై అధికారులు పర్యటిస్తే నీరు వస్తుందని, లేకపోతే నీరు రావటం లేదని తెలిపారు. వెంటనే స్పందించిన శాసనసభ్యులు పక్కనే ఉన్న నాగార్జునసాగర్ కెనాల్ ఎస్‌ఇ కోటేశ్వరరావుతో మాట్లాడారు. సక్రమంగా నీరు ఎందుకు రావటం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ మాట్లాడుతూ 18వ మైలు వద్ద నీటి పరిమాణం తగ్గటంతో ఇక్కడ కూడా నీటి పరిమాణం తగ్గిందన్నారు. నాగార్జునసాగర్ నీటిని 10 రోజులపాటు అందించాలని ఎమ్మెల్యే ఎస్‌ఇని ఆదేశించారు. ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలసి కాలువలపై పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆయన వెంట మార్టూరు యార్డు చైర్మన్ బి రామకృష్ణ, పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ శివారెడ్డి, మాజీ చైర్మన్ జాస్తి వెంకటనారాయణబాబు, ఉప్పలపాటి చెంగలయ్య, నర్రా శేషగిరిరావు, మహమ్మద్ బుడే, బండి రామయ్య, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఇని నిర్బంధించిన రైతులు
సాగర్ నీటి కోసం ఎస్‌ఇ కోటేశ్వరరావును రైతులు నిర్బంధించారు. సక్రమంగా నీరివ్వకపోతే జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. అధికారులు కాలువలపై పర్యటించి చివరి భూములకు నీరు అందించేందుకు కృషి చేయాలని నాగార్జునసాగర్ కెనాల్ ఎస్‌ఇ కోటేశ్వరరావును రైతులు బొల్లాపల్లి వద్ద బుధవారం నిర్బంధించాచారు. ఈ కార్యక్రమంలో రైతులు గోవిందరెడ్డి, హనుమంతరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
యువకుడి వద్ద ఆభరణాలు దోపిడీ
* స్కార్పియో నుంచి తోసివేయడంతో తీవ్రగాయాలు
పెద్దారవీడు, జనవరి 16: గుర్తుతెలియని వ్యక్తులు ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడిని స్కార్పియో వాహనంలో ఎక్కించుకొని ఆభరణాలు తీసుకొని తోసివేసిన సంఘటనలో తీవ్రగాయాలయ్యాయి. పొదిలికి చెందిన ఇండియన్ గ్యాస్ మేనేజర్ ముళ్ళ మునీర్ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అత్తగారి ఊరైన పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళేందుకు కుంటలో ఆటో కోసం వేచిఉన్నాడు. అదేసమయంలో స్కార్పియో వాహనం వచ్చి మున్నీర్ వద్ద ఆగి ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా బోడిరెడ్డిపల్లి వెళ్ళాలని చెప్పడంతో మేము కూడా అటే వెళ్తున్నామని చెప్పి వాహనంలో ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత మున్నీర్ వద్ద ఉన్న ఉంగరం, సెల్, కొంత నగదు తీసుకొని బోడిరెడ్డిపల్లి గ్రామం దాటిన తరువాత వాహనం నుంచి తోసివేశారు. దీనితో మున్నీర్ తలకు, చేతులకు, కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో మున్నీర్‌ను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్దారవీడు ఎస్సై దాసరి ప్రసాద్ తెలిపారు.