Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘బుడ్డలు’ పండే నెల్లూరులో ఎలా సాధ్యం?

$
0
0

నెల్లూరు, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా చేపట్టిన మన బియ్యం కార్యక్రమం అమలు తీరు నెల్లూరుజిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎక్కడికక్కడ పండే బియ్యం రకాల్నే తెల్లరేషన్‌కార్డుదార్లకు ఈ కార్యక్రమంలో భాగంగా అందజేసేలా ప్రభుత్వం శ్రీకారం చుట్టడం తెలిసిందే. అయితే నెల్లూరు విషయానికొస్తే విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లావ్యాప్తంగా పెద్ద, చిన్నబుడ్డల రకాల్ని విస్తారంగా సాగు చేయడం పరిపాటి. కాగా, ఈ రకం బియ్యం స్థానికంగా వినియోగించరు. కేరళ రాష్ట్ర ప్రజానీకం, తమిళనాడు వాసులు కొంతమేర వాడే ఉప్పుడు బియ్యంగా మార్చేందుకు నెల్లూరులో పండే బుడ్డల రకం ధాన్యం బాగా అనుకూలిస్తుంది. అలాగే జిల్లాలో 1010, 1001 రకాలు ఎక్కువగా పండిస్తుంటారు. ఇవి కూడా స్థానికంగా వినియోగం లేదనే చెప్పాలి. లెవీ కింద అందజేయడంతో తిరిగి రేషన్‌కార్డుదార్లకు చేరుతున్నాయి. నెల్లూరు జిలకర మసూరాలు ఆ తరువాత స్థానంలో పండిస్తున్నా వాటిని కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం మినహాయించి స్థానికంగా వినియోగం నామమాత్రమే. అయితే అధికశాతం బిపిటి రకాలు (జిలకర మసూరా) పంట విస్తీర్ణం స్థానికంగా బహుస్వల్పం. వివిధ రకాల తెగుళ్ల ప్రభావంతో ఈ పంటను సాగుచేసే రైతన్నలు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఈ రకం వినియోగం మాత్రం చాలా అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు అందజేస్తున్న రూపాయికే కిలో బియ్యం సద్వినియోగం కావడం లేదనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచిన కొత్త కార్యక్రమానికి జిల్లాలో వివిధ సవాళ్లు ఎదురవుతున్నాయి. పాతిక రూపాయల విలువైన బియ్యాన్ని నూతన కార్యక్రమం ద్వారా తెల్లరేషన్ కార్డుదార్లకు అందచేస్తామనే ప్రచారం ఆసక్తికరంగానే ఉంది. అయితే రూపాయకే అందజేస్తామన్న ‘మన బియ్యం’లో స్థానికంగా పండించేది వినియోగించకపోతున్న నేపథ్యంతో ఈ కార్యక్రమం జిల్లాలో ఎలా కొనసాగిస్తారనేది వేచి చూడాల్సిన పరిణామం. ఇదే సందర్భంలో ఇన్నాళ్లు లెవీ కింద సేకరిస్తున్న 1010,1001 రకాలు సాగు చేసే రైతాంగం పరిస్థితి కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది.

గొబ్బెమ్మల నిమజ్జనం
నెల్లూరు కల్చరల్, జనవరి 16: ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా, కోలాహలంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవాన్ని మహిళలు బుధవారం పవిత్ర పెన్నానదీ తీరంలో ఎంతో వేడుకగా జరుపుకున్నారు. బంకమట్టి, పేడ, పసుపుతో తయారుచేసిన గొబ్బెమ్మలకు పూజలు చేసిన అనంతరం హారతులిచ్చి, నివేదనలు సమర్పించిన అనంతరం పాటలు పాడుతూ వీడ్కోలు పలుకుతూ పెన్నానది పవిత్ర జలాల్లో నిమజ్జనం చేశారు. పలువురు మహిళలు బియ్యం పిండితో ప్రమిదలు చేసి దీపాలు వెలిగించి నదిలో వదిలారు. పండుగనెల ప్రారంభం నుండి ఇళ్ల ముంగిళ్లలో రంగవల్లుల మధ్య ఉంచిన గొబ్బెమ్మలను తిరిగి పుట్టింటికి సాగనంపే నిమజ్జన కార్యక్రమంలో వేలాదిగా మహిళలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. రవికలు, వడిబియ్యం, పెరుగున్నం, పులిహోరం, అన్ని రకాల కూరగాయలు వేసి తయారుచేసి కదంబం అన్నం, శనగలతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాలను గొబ్బెమ్మలకు నివేదన చేసి ప్రసాదాలుగా పంచిపెట్టారు. గొబ్బెమ్మలను చూసేందుకు, నిమజ్జనం చేసేందుకు వచ్చే మహిళలు, పెద్దలు, పిల్లలతో వివిధ రకాల ఆటబొమ్మల దుకాణాలు, రంగులరాట్నాలు చెరుకురసం దుకాణాలు, మిఠాయిల దుకాణాలతో కిక్కిరిసిన పెన్నానదీ తీరం కోలాహలంగా కనిపించింది. కార్పోరేషన్ ఆధ్వర్యంలో విద్యుత్‌దీపాలు, షామ్యానాలు, మంచినీరు ఏర్పాటుచేశారు. రంగనాయకులపేటనుండి పెన్నానదీ తీరం వరకు దారిపొడవునా ట్యూబ్‌లైట్లు, ఫ్లెడ్‌లైట్లు ఏర్పాటుచేశారు. పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిన ఏర్పాటుచేశారు. కార్పోరేషన్‌తోపాటు దేవాదాయ,్ధర్మాదాయశాఖ, పోలీస్, విద్యుత్‌శాఖలు నిమజ్జనోత్సవంలో పాలుపంచుకున్నాయి. జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయాలుగా పేరుగాంచిన రంగనాయకులస్వామి, దర్గామిట్ట రాజరాజేశ్వరి, ఇరుకళల పరమేశ్వరి, వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాలతోపాటు నర్రవాడ వెంగమాంబ దేవాలయాలు గొబ్బెమ్మల నిమజ్జనంలో సహకరించడం విశేషం. ఆయా ఆలయాల తరఫున కార్యనిర్వాహణాధికారుల పర్యవేక్షణలో పెన్నానదీ తీరంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దేవతలు కొలువుదీరారు. రాజరాజేశ్వరి,మూలస్థానేశ్వరస్వామి, జొన్నవాడ కామాక్షి, నర్రవాడ వెంగమాంబ ఆలయాల తరపున పెన్నాతీరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆలయాల సెట్టింగులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భక్తి సంగీత విభావరి ఆకట్టుకుంది. భక్తులకు మంచినీరు, ప్రసాదాలు పంచిపెట్టారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు నదీతీరంలో షామియానాలు ఏర్పాటుచేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ, శీతలపానీయాలు,పులిహోరా, పొంగలి, లడ్డులు అందచేశారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ముందు జాగ్రత్తగా గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. కులమతాలకు అతీతంగా మహిళలంతా పెన్నానదీ తీరంలో గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. పెన్నాతీరంలో ఇసుకలో ఆడుతూ, పాడుతూ, తమతోపాటు తెచ్చుకున్న వివిధ రకాల తినుబండారాలు, భోజనాలు, ప్రదాసాలు ఆరగిస్తూ, గాలిపటాలు, బెలూన్లు ఎగురవేస్తూ ఇంటిల్లిపాదీ ఆనందంగా గడిపారు. అనంతరం పక్కనే ఉన్న రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసులు మైకులు ఏర్పాటుచేసి ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు, జేబుదొంగలబారీన పడకుండా ఉండేందుకు సూచనలు ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. మహిళా హోంగార్డులతోపాటు మఫ్టీలో పోలీసులను నియమించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గొబ్బెమ్మల నిమజ్జనానికి పెన్నానదికి వచ్చిపోయే మహిళలు, పిల్లలు, పెద్దలతో రంగనాయకులపేట, సంతపేట, రైల్వేగేటు తూర్పువైపు పరిసరాలు సందడిగా కోలాహలంగా కనిపించాయి. ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డితోపాటు మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు, అనధికారులు, మాజీ కార్పోరేటర్లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన గొబ్బెమ్మల నిమజ్జన కార్యక్రమం రాత్రి పొద్దుపోయేంతవరకు కొనసాగింది.

చిరకాల కోరిక నెరవేరినట్లే!
టిడిపి పొలిట్‌బ్యూరోలో సోమిరెడ్డికి చోటు

ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 16: తెలుగుదేశం నేత , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి చిరకాల కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆయనను ర్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా అధినేత నారా చంద్రబాబునాయుడు ఎంపిక చేశారు. ఈ వార్త తెలియగానే తెలుగుదేశంపార్టీ నెల్లూరు జిల్లా కేడర్‌లో హర్షం వ్యక్తం అవుతోంది. బుధవారం ఉదయం ఖమ్మం జిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడ్ని సోమిరెడ్డి కలిశారు. బాబు నుంచి ముందస్తు కబురుతోనే సోమిరెడ్డి పాదయాత్రలో కలుసుకున్నట్లు సమాచారం. పార్టీ పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పిస్తున్నట్లు బాబు తెలపడంతో సోమిరెడ్డి అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1991లో పార్టీలో ప్రవేశించినప్పటి నుంచి సోమిరెడ్డి ఎన్నో కీలక పదవుల్లో కొనసాగారు. అయితే పార్టీ భవిష్యత్‌ను ఎప్పటికప్పుడు నిర్దేశించే నిర్ణయాత్మక కమిటీగా భావించే పొలిట్‌బ్యూరోలో సభ్యత్వం కోసం సోమిరెడ్డి ఇన్నాళ్లు ఉవ్విళ్లూరారు. టిడిపి అధినేత చంద్రబాబు మదిలో సోమిరెడ్డిపై ఎప్పటి నుంచో సానుకూల ధోరణి ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉండగా 1997 నుంచి 1999 ఎన్నికల వరకు సోమిరెడ్డి ఏడుశాఖల (సిఎంఇవై, యువజన సర్వీసులు, క్రీడలు, ఉపాధి, తదితర) మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత మరలా 2001 నుంచి 2004 ఎన్నికల వరకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈ రెండు పర్యాయాల్లోనూ కేబినెట్ హోదాలోనే సోమిరెడ్డి కొనసాగారు. 2004 ఎన్నికల అనంతరం పార్టీ విపక్షపాత్ర పోషిస్తున్న సందర్భంలోనూ జిల్లా అధ్యక్షునిగా ఎన్నో పోరాట కార్యక్రమాల్లో అలుపెరగని రీతిలో వ్యవహరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిపై వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తున్న తెలుగుగంగ కాలువ పనుల్లో అవినీతిని దుయ్యబడుతూ సుమారు ఏడుకోట్ల రూపాయల మొత్తాన్ని అటు నుంచి ప్రభుత్వానికి జమ అయ్యేలా చేయడం సోమిరెడ్డి పోరాట నిరతికి నిదర్శనం. పట్టుబడితే సాధించే వరకు నిద్రపోని యోధుడిగా ఖ్యాతి గడించిన ఈయన గత 2009 ఎన్నికల్లో జిల్లాలో పదింట ఐదు నియోజకవర్గాల్లో పార్టీ జయకేతనం ఎగురవేసేలా కృషి చేశారనే విశే్లషణ ఉంది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో ఆయన గత రెండు పర్యాయాలుగా సర్వేపల్లి నుంచి, గత ఏడాది జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. ఇదిలాఉంటే 2004 నుంచి తొమ్మిదేళ్లపాటు, 1994కు ముందు కొన్నాళ్లు పార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగిన ఈయన గత ఏడాది చివరలో ఆ పదవి నుంచి దూరం కావడం తెలిసిందే.

======
రేపుహైదరాబాద్‌లో
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి భేటీ
14 విశ్వవిద్యాలయాల నుంచి ప్రతినిధులు హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 16: సీమాంధ్ర ప్రాంతంలోని 14 విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రతినిధులతో ఈ నెల 18న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి నాయకులు కృష్ణయాదవ్ తెలిపారు. బుధవారం స్థానిక ఆమనిగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలుగువారి మనోభావాలకు విఘాతం కలిగించడం తగదన్నారు. యూపిఏ తెలంగాణావాదుల బెదిరింపులకు లొంగే ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలన్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు హైదరాబాలో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు వివరించారు. విలేఖర్ల సమావేశంలో జేఏసి నాయకులు అద్దంకిజాన్, రాజా, ప్రభాకరరెడ్డి, మురళి, కార్తీక్, దీపక్, మణి, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి నిర్మల భారత్ వారోత్సవాలు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 16: గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నిర్మూలించి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, స్ర్తిల ఆత్మగౌరవం కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో నిర్మల భారత్ అభియాన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విస్తృతంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమి సంయుక్తంగా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాల కల్పన నిమిత్తం నిర్మల భారత్ అభియాన్ పథకాన్ని మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జతపరచిందన్నారు. పదివేల రూపాయల యూనిట్ విలువతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం భారీ ఎత్తున చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం గురించి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, డ్వామా పి.డి తెలిపారు. ప్రభుత్వం సూచించిన నమూనాలో మరుగుదొడ్డిని నిర్మించేందుకు ఉపాధి హామి పథకం కింద నాలుగున్నర వేల రూపాయలు, నిర్మల్ భారత్ అభియాన్ నిధుల కింద నాలుగువేల ఆరువందల రూపాయలు, లబ్ధిదారుని వాటాగా తొమ్మిది వందల రూపాయలు కలుపుకుని ఒక మరుగుదొడ్డి యూనిట్ విలువ పదివేల రూపాయలుగా నిర్ణయించినట్లు వివరించారు. ఈ నమూనా మరుగుదొడ్డి నిర్మాణంలో రెండు లీస్ట్ పిట్లకు బదులుగా లబ్ధిదారుడి పదివేల రూపాయలకు పైబడిన ఖర్చు భరాయించే ప్రతిపాదికన సెప్టిక్ ట్యాంక్‌ల్ని నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. తొలి విడతలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 236 గ్రామ పంచాయతీల్లో 61,966 వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రధానంగా మండల పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు తమ సిబ్బందితో ఎంపిక చేసిన గ్రామాల్లో పర్యటించి జనావాసాల్లో అపరిశుభ్రతను పారద్రోలి సంపూర్ణ పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించడం ద్వారా మహిళలకు గోప్యతను, గౌరవాన్ని పెంపొందించేలా కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాల్సిందిగా, మరుగుదొడ్ల అర్జీదారులు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి మార్చి 2013లోగా తప్పక పూర్తి చేయాల్సిందిగా తగు చర్యలు తీసుకోవాలని 2013 ఏప్రిల్ నుంచి రెండోవిడత పథకం చేపట్టాలని, అప్పుడు తొలివిడత గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అవకాశం ఉండదని సంచాలకులు తెలిపారు.

సమాజసేవలో ఆనందం:వెంకయ్య

ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 16: సమాజ సేవలో పరిపూర్ణమైన ఆనందం లభిస్తుందని బిజెపి జాతీయ నేత, రాజ్యసభ సభ్యులు ముప్పవరపువెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం ఉదయం స్థానిక కొండాయపాళెం గేట్‌కు సమీపంలోని వాత్సల్య నిరాదర బాలబాలికల వసతిగృహంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు వేదాంత సంగమేశ్వరశాస్ర్తీ కాంశ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు వెంకయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉద్యోగులు, రాజకీయ నాయకులు తమ జీతభత్యాల కోసం, పేరు ప్రతిష్ఠల కోసం పనిచేస్తారని, కాని వాత్సల్య శాస్ర్తీ ఎలాంటి లాభాపేక్ష, ప్రచారం లేకుండా సేవా కార్యక్రమాల్ని నిర్వహించారని గుర్తు చేశారు. జయభారత్ ఆసుపత్రిని నిర్మించడంలోనూ ప్రముఖ పాత్ర వహించిన వేదాంత సంగమేశ్వరశాస్ర్తీ వాత్సల్య నిర్మాణానికి విశేష కృషి చేశారన్నారు. దిక్కూమొక్కు లేని బాలబాలికల్ని చూసి జాలిపడటంతోనే సరిపెట్టకుండా వారిని ఆదరించి ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఆకలి లేని రాజ్యం రావాలని, ప్రతిఫలం లేకుండా సేవ చేసి సమాజం నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. స్వామి వివేకానంద బోధనల్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని వెంకయ్య ఈ కార్యక్రమంలో భాగంగా పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ మాట్లాడుతూ ఆనందం అనేది వ్యక్తిగతంగా కాకుండా సమాజపరంగా అందరూ ఆస్వాదించేలా ఉండాలని పేర్కొన్నారు. వాత్సల్యతోపాటు భారతీయ విద్యావికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వృద్ధాశ్రమాల్ని దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం విశేషమన్నారు. హైదరాబాద్‌కు చెందిన సేవావారధి ప్రతినిధి శారదాదేవి మాట్లాడుతూ సంగమేశ్వరశాస్ర్తీ జీవితం అందరికీ ఆదర్శమని జ్ఞప్తి చేసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో వేదాంతం సంగమేశ్వరశాస్ర్తీ తన జీవితాన్ని గడిపారన్నారు. భారతమాత విగ్రహాలను ప్రతిచోటా ప్రతిష్ఠించాలని, దేశాన్ని ప్రేమించే విధానాన్ని చిన్నతనం నుంచే పిల్లల్లో అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని శాస్ర్తీ అనునిత్యం ప్రబోధించేవారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు వెళ్లాలని కోరారు. వెంకయ్యనాయుడు తన పరిధిలో వచ్చే ఎంపీ ల్యాడ్స్ పది లక్షల రూపాయలతో నిర్మించదలచిన సోంపల్లి సోమయ్య వృత్తివిద్యాకేంద్రానికి ఈ సందర్భంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహేశానందస్వామి, కైలాసనందస్వామి, వాత్సల్య గౌరవాధ్యక్షులు సామంతు గోపాలరెడ్డి, అధ్యక్షుడు బసిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్యదర్శి ఎన్ ప్రసాద్, కోశాధికారి పేర్నాటి ఆదిశేషారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జివి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సొసైటీ రికార్డులు తీసుకెళ్లిన
అధ్యక్షునిపై కేసు నమోదు
మర్రిపాడు, జనవరి 16: బూదవాడ సహకార సంఘ అధ్యక్షుడు బిజివేముల రవీంద్రారెడ్డి సొసైటీ రికార్డుల్ని బుధవారం బలవంతంగా పట్టుకెళ్లినట్లు ఆ సొసైటీ ఎన్నికల అధికారి ఎస్‌కె జహీర్, సిఇఓ సివి కృష్ణారెడ్డిలు మర్రిపాడు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఎన్నికల అధికారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బూదవాడ సొసైటీలో పది రూపాయల సభ్యత్వం ఉన్న వారి ఓట్లు రద్దు కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల పునరుద్ధరణ నిమిత్తం ఈనెల 16వ తేదీ వరకు గడువు పొడిగించారు. దీంతో ఓటర్ల నమోదులో భాగంగా విధుల్లో ఉండగా సొసైటీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి కార్యాలయానికి వచ్చారు. ఇటీవల ఓటర్ల చేర్పుల్లో పలు అవకతవకలు జరిగాయని, ఆ దరఖాస్తులు తమకు ఇవ్వాలని ఎన్నికల అధికారిని, సొసైటీ సిఇఓను కోరారు. అధ్యక్షుని తీర్మానంతోనే ఓటర్ల జాబితా రూపొందించినట్లు, ఇప్పుడు ఇవ్వడం వీలుకాదనే అభ్యంతరం వెలిబుచ్చారు. ఈ విషయమై సహకార అధికారి అంజిరెడ్డితో మాట్లాడుతుండగా, ఆలోగానే రవీంద్రారెడ్డి తనతో వచ్చిన పదుగురితో బలవంతంగా రికార్డుల్ని గోనె సంచిలో వేసుకుని తన వాహనంలో తీసుకెళ్లారు. సొసైటీ సిబ్బంది బందోబస్తుగా ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ అడ్డగించినా వారిని ప్రతిఘటించి తీసుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బూదవాడకు చేరుకున్నారు. స్థానిక ఎస్సై రవినాయక్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సొసైటీ సిఇఓ సివి కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
షార్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్
సూళ్లూరుపేట, జనవరి 16: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ (షార్)కు బుధవారం ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ చేరుకున్నారు. గురువారం ఆయన షార్‌లో ఏప్రిల్ నెలలో ప్రయోగించే జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగానికి సంబంధించి ఎంఆర్‌ఆర్ సమావేశంలో శాస్తవ్రేత్తలతో కలిసి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అనంతరం మిషన్ డైరెక్టర్, శాస్తవ్రేత్తలతో కలిసి ఫిబ్రవరి నెలలో ప్రయోగించనున్న పిఎస్‌ఎల్‌వి-సి20 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించి శాస్తవ్రేత్తలతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఇస్రో శాస్తవ్రేత్తలు, డైరెక్టర్లు కూడా పాల్గొననున్నారు.

రెవెన్యూ రికార్డులు దగ్ధం
ఆత్మకూరు, జనవరి 16: దుత్తలూరు మండల తహశీల్దార్ కార్యాలయంలోని వివిధ రికార్డులు దగ్ధమయ్యాయి. గత మూడురోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఎవరూ కార్యాలయం దిశగా రాలేదు. ఇదే అదనుగా భావించిన అగంతకులు కార్యాలయంలోకి జొరబడి బీరువాలో ఉన్న వివిధ రికార్డుల్ని తీసుకెళ్లి దగ్ధం చేశారు. కార్యాలయానికి సమీపంలోనే రికార్డులు దగ్ధం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ రికార్డులు భూ వివాదాలు, కోర్టు కేసులతో ముడిపడి ఉన్నాయని సమాచారం. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇలా జరిగినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
కాకీల కక్కుర్తి!
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 16: సంక్రాంతి పండుగ రోజుల్లో కోడి పందాలు జూదమనేది అనాదిగా వస్తున్న దురాచారం. పల్లెల్లో ఈ జూదక్రీడల్ని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలు జుళిపిస్తుండటం విదితమే. ఈదఫా సంక్రాంతి పండుగల్లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడి పందాల రాయళ్లను అరెస్ట్ చేశారు. వారితోపాటు ప్రతి జూద శిబిరం నుంచి రెండుకు తక్కువ గాకుండా కోడి పుంజుల్ని కూడా స్వాధీనపరచుకున్నారు. తీరా నిందితులతోపాటు కోడి పుంజుల్ని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో తేడాలు చోటుచేసుకుంటున్నాయి. పందెం కోళ్లంటే కనీసం నాలుగైదు కిలోల బరువుకలిగి ఉండటం పరిపాటి. అయితే చాలా స్టేషన్ల నుంచి కోర్టుకు హాజరైన కోళ్లను చూసి నిందితులతో సహా ఇతరులు అవాక్కవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా కోర్టుల్లో న్యాయమూర్తి నిందితులకు జరిమానా విధించిన అనంతరం కోళ్లను వేలం పాట వేస్తుంటారు. అప్పటికప్పుడు అక్కడ హాజరై ఉన్న ఔత్సాహికులంతా చాలా తక్కువ ధరకే నాలుగైదు కిలోల బరువున్న కోడి పుంజుల్ని కైవసం చేసుకునే అవకాశాలుంటాయి. ఇలా కోడి పందాలపై పోలీసుల దాడులు, నిందితుల అరెస్ట్ వంటి వార్తలు పత్రికల్లో ప్రచురించగానే ఔత్సాహికుల్లో ఉబలాటం ఏర్పడింది. బుధవారం కోర్టుల వద్దకు సదరు ఔత్సాహికులు చేరుకున్నారు. ఏ క్షణంలో న్యాయమూర్తి నుంచి ఈ కేసుకు సంబంధించి పిలుపు ఉంటుందా అని గంటల తరబడి వేచి చూశారు. తీరా స్టేషన్ నుంచి పోలీసులు తీసుకొచ్చిన కోళ్లను వేలం వేస్తుంటే అందరిలోనూ నిరుత్సాహమే ఏర్పడింది. పట్టుమని రెండు కిలోలు కూడా ఉండని కోళ్లను వేలం వేయడం ఆరంభించారు. ఈ పుంజులు పందాలకు ఉపయోగపడేవి కాదంటూ సర్వత్రా చర్చించుకోవడం కనపడింది. ‘ కొన్ని కోళ్లు చనిపోయినట్లు, వాటి కళేబరాలను విసర్జించినట్లుగా కూడా రికార్డుల్లో నమోదు చేశారు.
’అయినాసరే కోళ్ల విషయమై కాకీలను ఆరా తీసే పరిస్థితి ఎవరిలోనూ లేదు. అలాగే నిందితులు కూడా పట్టుబడ్డ ఈ కేసు నుంచి ఉపశమనం పొందడంపైనే దృష్టి సారించారు తప్ప ఇక ఆ కోళ్లు, వాటిని మార్చిన వైనం తమకెందుకంటూ మిన్నకుండిపోయారు. మొత్తమీద సంక్రాంతి వేళలో ఈ కక్కుర్తి వ్యవహారం కొన్ని చోట్ల దాడుల్లో పాల్గొన్న కానిస్టేబుళ్లదైతే వివిధ స్టేషన్లలో అధికార్ల వరకు కూడా చేరుకుందని సమాచారం.

‘మన బియ్యం’ స్థానిక వినియోగానికి దూరం
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>