Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్యమా.. ప్రత్యేకవాదమా!

$
0
0

కర్నూలు, జనవరి 17: రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులు సమైక్య రాగమాలపించాలా.. లేదంటే ప్రత్యేక రాయలసీమ వాదాన్ని ముందుకు తీసుకుపోవాలా.. అన్న సందిగ్ధంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని దాదాపు ఖరారైనందున ఇక సమైక్య రాగమాలపించడంలో అర్థం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ శాతం ప్రజలు సమైక్య రాష్ట్రంగా ఉంటే మేలన్న అభిప్రాయంతో ఉన్నారన్న వాదన రాయలసీమలో వినిపిస్తోంది. సమైక్య వాదనతో ఫలితం ఉండదన్న అభిప్రాయం నేతల్లో కూడా వినిపిస్తోంది. అయితే ఇంత కాలం సమైక్య రాష్టమ్రంటూ మాట్లాడి ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ అంటే వచ్చే లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్షం సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోయినా తెలంగాణ ఏర్పాటును ఒక్క సిపిఎం మినహా మరే పార్టీ వ్యతిరేకించకపోవడం గమనార్హం. తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన లేఖలో స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర విభజన సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయం వినిపించింది. అయితే తెలంగాణ ఎంపిల ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, యుపిఎ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందన్న వార్తల నేపథ్యంలో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించింది. ఈ చర్చల్లో తెలంగాణ ఏర్పాటు చేయకపోతే వచ్చే కష్టాల గురించి కాంగ్రెస్ పెద్దలు వివరించగా ప్రత్యామ్నాయం చూపాలని ఎదురు ప్రశ్నించినట్లు నేతలు పేర్కొన్నారు. దాంతో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమైక్య రాష్ట్ర డిమాండ్ వల్ల ఫలితం ఉండదని, ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమం చేయాలని ఇప్పటికే పలువురు నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు టజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి సైతం సమైక్యత సాధ్యం కాకపోతే జల వివాదాలు పరిష్కరిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి విధితమే. కడప జిల్లాకు చెందిన కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి విభజన అనివార్యమైతే శాస్ర్తియ పద్ధతిలో జరగాలని లేదంటే సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని కోరారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్ సమైక్య రాష్టమ్రే మేలని వాదిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి గల్లా అరుణ కుమారి సమైక్య రాష్ట్రం వైపే ఆలోచిస్తున్నా ఆమె ఆలోచన మారే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోరడం ద్వారా తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠాన నిర్ణయాన్ని శిరసావహించినట్లు ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తద్వారా రాష్ట్రంలో సమైక్య నినాదానికి గండికొట్టవచ్చని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి రావచ్చని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజిస్తే ఉత్తరాంధ్ర డిమాండ్ కూడా తెరపైకి వస్తుందని మరి కొందరు అంటున్నారు. అయితే రాయలసీమ నాయకులు ఒక్కటిగా పార్టీలకతీతంగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ముందుకెళ్తే తెలంగాణ ఏర్పాటుతో పాటు రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తం మీద ఢిల్లీ, హైదరాబాద్‌లలో నెలకొన్న పరిణామాలను పరిశీలిస్తూ ఒకటి, రెండు రోజుల్లో సీమ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చి ఆ మేరకు భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకునే అవకాశం ఉందని రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు.
కెసికి ఫిబ్రవరి ఆఖరి వరకూ నీరివ్వాలి
* మాజీ మంత్రి బైరెడ్డి శేషశయణారెడ్డి
నందికొట్కూరు, జనవరి 17: కెసి కాలువ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు ఫిబ్రవరి ఆఖరు వరకూ నీరు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి బైరెడ్డి శేషశయణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం వేలాది మంది రైతులతో స్థానిక పటేల్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కెసి కాలువకు నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిదులు కెసి కాలువ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కెసి కాలువకు నీరు విడుదల చేయడంలో విఫలమైందన్నారు. ఎల్‌ఎల్‌సి ఆయకట్టు రైతులకు కర్నాటక వాటా కింద 550 క్యూసెక్కులు, ఆంధ్ర వాటా కింద 500 క్యూసెక్కుల నీటిని ఎల్‌ఎల్‌సి అధికారులు విడుదల చేశారు. ఎల్‌ఎల్‌సికి ఒక్క పద్ధతి, కెసి కాలువకు మరో పద్ధతి పాటించి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. నీటి పారుదల అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ధర్నా కొనసాగిస్తామన్నారు. ధర్నా చేపట్టడంతో వాహనాలు రాకపోకలు స్తంభించాయి. దీంతో స్పందించిన నీటి పారుదల శాఖ ఎస్‌ఇ కెసి కాలువకు ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని, ఫిబ్రవరి ఆఖరు వరకూ నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కెసి కాలువ కింద సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందేంత వరకూ ఉద్యమిస్తామని, లేనిపక్షంలో ఈనెల 21న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి నాగిరెడ్డి, హాజి మహబూబ్ సాహేబ్, జాకీర్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.
మహానందిలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ
మండల దీక్షలు
మహానంది, జనవరి 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ, మండల దీక్ష పూజలను గురువారం వైభవంగా నిర్వహించారు. పునః ప్రతిష్ఠ పూజల్లో భాగంగా ఉదయం ప్రత్యేక యాగశాలలో ఇఓ దివాకర్‌బాబుచే వేదపండితులు నాగేశ్వర్‌శర్మ, జ్వాలా చక్రవర్తి, అర్చకులు శేషయ్యశర్మ, బిఎల్‌ఎన్ శాస్ర్తి, శంకరయ్యశర్మ, జనార్ధన్‌శర్మలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యహావచనం, కంకణధారణ, కలశస్థాపన ఆవాహన హావనం, రుద్రఅవనం, ధ్వజస్థస్నపనం, కలశస్నపనం గావించారు. అనంతరం నూతన ధ్వజస్తంభం వద్ద మండల పూజలు నిర్వహించారు.
నగర ప్రజలకు
మెరుగైన సేవలు అందించండి
* అధికారులను ఆదేశించిన కలెక్టర్
కల్లూరు, జనవరి 17: నగర పాలక పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి నగర పాలక అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు, కల్లూరు ప్రాంతాల్లోని వివిధ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం కలెక్టర్ పర్యవేక్షించారు. నంద్యాల చెక్‌పోస్టు దగ్గర జరుగుతున్న ప్రధాన కాలువ నిర్మాణం పనులు, సిసి రోడ్డు, కాలువలు, బయో టాయిలెట్ నిర్మాణం, తదితర పనులను పరిశీలించారు. అలాగే కల్లూరులోని దర్వాజ మోడరన్ టాయిలెట్స్, హంద్రీ బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకున్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో జరుగుతున్న టాయిలెట్, రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించినా, పర్యవేక్షణ లోపం వున్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ పివి ఎస్ ఎన్ మూర్తి, ఎస్ ఇ విజయ్‌కుమార్, డిఇ భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, ఎఇ గోపాలకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం
పోరాటాలకు సిద్ధం కండి
* వైకాపా నేత ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపు
కల్లూరు, జనవరి 17: రాష్ట్ర విభజనపై పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధు లు, ప్రజలు కేంద్రంపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఎస్వీ కాన్ఫరెన్సు హాల్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మా ట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలవంచడమే కారణం అన్నారు. తెలంగా ణ మంత్రులు దానం, ముఖేష్ సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపుతుంటే వెనుకబడిన సీమాంధ్ర గురించి కేం ద్రం వద్ద ఇక్కడి నాయకులు ఎందుకు తమ వాదనలు వినిపించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం రాష్ట్రా న్ని బలిపీఠం ఎక్కిస్తున్న ప్రజాప్రతినిధులు, సోనియాగాంధీకి రాబోయే ఎన్నికల్లో సమైక్యాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇకపోతే తమిళనాడును బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌ను బలహీన పరచడానికి కేంద్ర మంత్రి చిదంబరం ఆడుతున్న రాష్ట్ర విభజన ఆటలో సీమాంధ్ర మంత్రులు కూడా పాలు పంచుకోవ డం క్షమించరాని నేరమన్నారు. రాష్ట్రా న్ని ముక్కలు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంటే ముందుగా సీమ అభివృద్ధి గురించి ఆలోచించాలని డిమాం డ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ నేతలకు భయపడి రాష్ట్ర విభజనకు ముందుకు రావడం సిగ్గుచేటని, రాబో యే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు. బళ్ళారి, రాయచూర్, ప్రకాశం జిల్లాలతో కలిసిన రాయలసీమ రాష్ట్రం కోసమై ఇక్క డి ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పోరాడుతామన్నారు. సమావేశంలో నేతలు బాల్‌రాజు, రాజవిష్ణువర్ధన్‌రెడ్డి, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా
సిపిఐ నిరసన
కర్నూలు, జనవరి 17: పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం తెల్లవారున 4 నుంచి 8 గంటల వరకూ పలు కాలనీల్లో ప్రభాత భేరి నిర్వహించారు. నగరంలోని వీకర్ సెక్షన్‌కాలనీ నుంచి ప్రారంభమై రేడియోస్టేషన్, పుల్లారెడ్డి నగర్, వాసవీ నగర్, గీతా నగర్, నిర్మల్‌నగర్, బళ్ళారి చౌరస్తా, బ్యాంకు కాలనీ, రాజీవ్ నగర్ మీదుగా పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, సర్‌చార్జీలను ప్రభుత్వమే భరించేలా పోరాడుతాం అని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, డబ్బులు వాయిద్యాలతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యద ర్శి కె.రామాంజనేయులు మాట్లాడు తూ ప్రభుత్వం ప్రజలపై అన్నిరకాలు గా భారం మోపడం దారుణమన్నారు. కిరణ్ సర్కారుకు గతంలో వున్న ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందన్నారు. ఇకపోతే ఈ నెల 22న చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రసూల్, జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్నాథం, శేఖర్, నగర కార్యవర్గ సభ్యులు మహేంద్ర, శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శులు అన్వర్, సురేష్, నాయకులు రహిమాన్, కల్లూరు సుంకన్న, వెంకట్రాముడు, హుస్సేన్, రంగన్న పాల్గొన్నారు.
భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం..
* డిప్యూటీ కలెక్టర్ సత్యం
మిడుతూరు, జనవరి 17: మండల పరిధిలోని అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ సత్యం తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు పరిహారం అందలేందంటూ రైతులు విన్నపం మేరకు డిప్యూటీ కలెక్టర్ గురువారం మిడుతూరు తహశీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలువురు రైతులు తమకు పరిహారం ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని వాపోయారు. చాలా వరకూ పరిహారం తీసుకున్న వారికే మళ్లి ఇచ్చారని దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి బాధిత రైతులకు న్యాయం చేస్తామని డిప్యూటీ కలెక్టర్ హామీ ఇచ్చారు.
నేటి నుంచి ఇంటింటికీ
ఆయుష్ వైద్యసేవలు
* జిల్లా కో ఆర్డినేటర్ డా. ఎం.వెంకటయ్య
కర్నూలు, జనవరి 17: కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేదం, హోమియో, యునాని, ప్రకృతి వైద్య సేవలను ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్ డా. ఎం.వెంకటయ్య గురువారం తెలిపారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివిన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటిస్, కార్డియో, అంటువ్యాధుల గురించి అవగాహన, నివారణ విధానాలు వైద్య సిబ్బంది ద్వారా గుర్తించి ఆయుష్ వైద్యశాలలో వైద్య సేవలు పొందేలా ప్రేరణ కల్పిస్తామన్నారు. వైద్య సిబ్బంది ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి 30 ఏళ్లు పై బడిని వారందరికీ బిపి చూస్తారన్నారు. జిల్లాలో 44 ఆయుర్వేద, 25 హోమియో, 17 యునాని, 3 ప్రకృతి వైద్యం యోగా వైద్య శాలలు, 10 పడకల ఆయుర్వేద ఆసుపత్రి, బనగానపల్లెలో 10 పడకల యునాని హాస్పిటల్, కర్నూలు, ఆదోనిలో వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.
ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపవద్దు
బేతంచెర్ల, జనవరి 17: ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల పట్ల వివక్షత చూపవద్దని, ఎయిడ్స్ అంటుకుంటే వచ్చే వ్యాధి కాదని, అంటించుకుంటే వచ్చే వ్యాధి అని లక్ష్మీనారాయణ కళా బృం దం నాటక రూపంలో వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం పాతబస్టాండు కూడలిలో కళా బృం దం సభ్యులు ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి సురక్షితం లేని లైంగిక సంబంధాల వల్ల, రక్త మార్పిడి వల్ల, ఎయిడ్స్ వ్యాధి ఉన్న తల్లి నుంచి బిడ్డకు, ఒకరికి వాడిన సిరంజిలు మరొకరికి వాడటం వల్ల మాత్రమే వస్తుందని వివరించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులతో కలిసి భోజనం చేసినా, వారిని ఆళింగనం చేసుకున్నా, వారు వాడిన వస్తువులు వాడినా, దోమకాటు వల్ల కాని, మూత్రశాలలు వినియోగించినా ఎయిడ్స్ ఒకరి నుండి మరొకరికి సోకదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ వైద్యశాలలోని ఐసిటిసి కేంద్రాల్లో రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారి పేర్లను రహస్యంగా ఉంచి నివారణ కోసం కావలసిన మందులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని నాటిక రూపంలో తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను దూరంగా ఉంచకుండా ఆప్యాయతానురాగలతో పలుకరిస్తే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుదన్నారు. అనంతరం రక్తదానం దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కళాబృందం హ్యాండ్స్ కో ఆర్డినేటర్ మధు సమక్షంలో నాటిక ప్రదర్శించారు. కళాకారులు లక్ష్మీనారాయణ, ఈశ్వరయ్య, శ్రీనివాసాచారి, సాయిరాం, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
ఇంధన పొదుపు పాటించండి
బనగానపల్లె, జనవరి 17: ఆర్టీసీ నష్టాల్లో ఉందని, కావున కార్మికులు ఇంధన పొదుపు చర్యలు పాటించి సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆర్టీసీ కడప ఇడి శేషగిరి రావు సూచించారు. గురువారం ఆయన బనగానపల్లె ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఆయన వెంట కర్నూలు ఆర్‌ఎం కృష్ణమోహన్, శ్రీనివాసులు, ఐషర్ ఇంజినీర్ సురేంద్ర తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డిపోలో జరిగిన కార్యక్రమంలో ఇడి, ఆర్‌ఎం మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల బాటలో వుండడంతో ఆస్తులను తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయిందన్నారు. కావున కార్మికులు ఇంధన పొదుపు చర్యలు పాటించాలని, డ్రైవర్లు జాగ్రత్తగా బస్సులు నడపాలని, ప్రమాదాలు జరగకుండా, కెపాసిటీలు తగ్గకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు పాటించిన డ్రైవర్లు శివయ్య, మరో ముగ్గురిని ఇడి సత్కరించారు. వీరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
బేతంచెర్లను
కరవు మండలంగా ప్రకటించాలి
* రైతు సంఘం డిమాండ్
బేతంచెర్ల, జనవరి 17: వర్షాభావం కారణంగా నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా బేతంచెర్ల మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం డివిజన్ నాయకులు సుబ్బరాయుడు, ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం మండల నాయకుడు వేణుగోపాల్ అధ్యక్షతన రైతులు, వ్యవసాయ కూలీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అంతా కరవుతో విలవిలలాడుతుంటే ప్రభుత్వం కేవలం 36 మండలాలను మాత్రమే కరవు ప్రాంతాలుగా ప్రకటించడం సబబుకాదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదైన విషయం తెలిసి కూడా అధికారులు చొరవచూపకపోవడం తగదన్నారు. సాగు చేసిన పంట చేతికందక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అయినా పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం, నామమాత్రపు సహాయం ప్రకటించడం రైతుల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఇప్పటికైనా బేతంచెర్ల మండలంలో నెలకొన్న పరిస్థితులను గుర్తించి కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శివరాముడికి వినతి పత్రం అందించారు. ర్యాలీలో సిఐటియు నాయకులు సాధిక్, రాముడు, సుబ్బారెడ్డి, వెంకట్, దాసు, మద్దిలేటి, లాలప్ప, సుబ్రమణ్యం, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, రుక్మిణీదేవి, బాలయ్య, చంద్ర, బాలసుబ్బయ్య పాల్గొన్నారు.
కొండంపల్లె చేరుకున్న అహుబిలేశుని ఉత్సవ పల్లకి
ఆళ్లగడ్డ, జనవరి 17: పార్వేట ఉత్సవాల్లో భాగంగా అహోబిలేశుని ఉత్సవ పల్లకి గురువారం ఉదయం కొండంపల్లెకు చేరుకుంది. ఈ సందర్భంగా బాచేపల్లె నుంచి కొండంపల్లె గ్రామ శివారులోకి చేరుకున్న పల్లకికి గ్రామస్థులు మేళ తాళాలతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం కొండంపల్లె ప్రజలు ఉత్సవ పల్లకిలో కొలువుదీరిన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాద వరదస్వామిలకు పూ జలు నిర్వహించారు. రాత్రి ఉత్సవ పల్లకి ఆర్.కృష్ణాపురం గ్రామం చేరుకుంది.
ఇంధనాన్ని పొదుపు చేయాలి
కోవెలకుంట్ల, జనవరి 17: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు డ్రైవర్లు ఇంధనాన్ని పొదుపు చేయాలని ఎపిఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడి శేషగిరిరావు సూచించారు. ఇంధన పొదుపు పక్షోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప డివజన్‌లో కేవలం డీజిల్‌కే రూ. 30 కోట్లు ఖర్చు అవుతోందని, హైదరాబాద్, వికారాబాద్, తిరుమలతో పాటు 15 డిపోలు మాత్రమే లాభాల బాటలో ఉన్నాయని, మిగిలిన 71 డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. ఇకపోతే కోవెలకుంట్ల డిపో రూ. 29 లక్షలు నష్టంలో ఉందని, కావున డ్రైవర్లు ఇంధనం పొదుపు పాటించాలన్నారు. ఇటీవల డిపోలో ఇంధనం, టైర్ల ఖర్చు అధికమవుతోందని, ఖర్చులను తగ్గించేందుకు డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ నవీన్‌కుమార్, డ్రైవర్లు, వర్కర్లు పాల్గొన్నారు
అశ్వవాహనంపై
ఊరేగిన ఆది దంపతులు
శ్రీశైలం, జనవరి 17: సంక్రాంత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో గురువారం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణములో ప్రాకార ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపం వద్ద స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం నిర్వహించారు. పుష్పోత్సవంలో స్వామి అమ్మవార్లకు 16 రకాల పుష్పాలతో విశేషంగా అర్చనలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ, శయనోత్సవ కార్యక్రమాలు, పూజలను అర్చకులు, వేదపండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
పోలీసు బందోబస్తు మధ్య
ఆక్రమణల తొలగింపు
ఆదోని, జనవరి 17: ఆదోని పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న మున్సిపల్ స్థలాలను ఆక్రమించి పెట్టుకున్న బంకులను, షాపులవద్ద కాలువలపై కట్టుకున్న అక్రమ కట్టడాలను గురువారం కమిషనర్ కన్యకుమారి ఉత్తర్వుల మేరకు పురపాలక సంఘం టిపిఓ మురళీకృష్ణగౌడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అక్రమ కట్టడాలను తొలగించే సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐలు శ్రీ్ధర్, రమణ, సురేంద్ర, ఎస్సైలు రామయ్య, తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ప్రధాన రహదారిలోని అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించేశారు. అంబేద్కర్ విగ్రహంవద్ద ఉన్న దుకాణాలను, ఇతర నిర్మాణాలను కూడ తొలగించారు. పాతబస్టాండు కాలువపై ఉన్న బంకులను, ఓవర్‌బ్రిడ్జి కింద ఉన్న బంకులను కూడ తొలగించారు. పెద్దఎత్తున పోలీసులు మోహారించి ఆక్రమణలను తొలగించే కార్యక్రమం జరిగింది. కొత్తబస్టాండు వద్ద చాలామంది ప్రజలు తమ బంకులను స్వచ్చందంగానే తొలగించారు. పాతబస్టాండువద్ద ఉన్న శ్రీనివాస్ భవన్ యజమాని తన స్థలం ఉందని తొలగించడానికి వచ్చిన సిబ్బందితో, అధికారులతో కొంతసేపు వాగ్వివాదం చేశారు. ఇంతకుమినహా అక్రమణల కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు కేవలం చిన్న చిన్న వ్యాపారస్థుల బంకులను, దుకాణాలవద్ద ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారని, పెద్ద పెద్ద లాడ్జీల యజమానులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు అక్రమంగా పెద్దఎత్తున కట్టడాలను నిర్మించారని, వారి జోలికి ఎందుకెళ్లడం లేదన్న విమర్శలు మున్సిపల్ అధికారులకు ప్రజలనుంచి ఎదురవుతున్నాయి. త్వరలోనే మున్సిపాలిటీలో ఉన్న అక్రమాలన్నింటిని తొలగించే కార్యక్రమం ఇంకా పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలాప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను, బడా రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించి దుకాణాలను నిర్మించుకుంటున్నారు. లీజుకు తీసుకున్న కొందరు ఇతరులకు మున్సిపల్ స్థలాలను లీజుకిచ్చి అక్రమ కట్టడాలను నిర్మించి రూ. లక్షల బాడుగలను తీసుకుంటున్నారు. మరికొంతమంది పాఠశాలల యజమానులు కూడ తమ పాఠశాలలవద్ద ఉన్న మున్సిపల్‌స్థలాన్ని ఆక్రమించి వినియోగించుకుంటున్నారు. హనుమాన్‌నగర్, మొదలగు ప్రాంతాల్లో మున్సిపల్ పార్కులకోసం వదిలిన స్థలాలను ఆక్రమించి రాజకీయ నాయకుల అండదండలతో ఇళ్లు కూడ నిర్మించుకున్నారు. శ్రీనివాస్‌భవన్ హోటల్ యజమాని ఏకంగా మున్సిపాలిటీ బావిపైనే అక్రమ కట్టడాలను నిర్మించుకున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్రమ కట్టడాలన్నింటిని కూడ కూల్చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది లాడ్జీల యజమానులు అక్రమ కట్టడాలు నిర్మించడంతో రోడ్లు కుంచించుకుపోయాయి. బంగారు దుకాణాల వీధి ప్రాంతంలో ఆక్రమించి కట్టడాలు నిర్మించారు. కాబట్టి వీటన్నింటిపైన చర్యలు తీసుకొని మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైభవంగా ప్రహ్లాదరాయలకు
కనకాభిషేకం
మంత్రాలయం, జనవరి 17: రాఘవేంద్రస్వామి మఠంలో గురువారం ప్రహ్లాదరాయలకు కనకాభిషేకాన్ని మఠం పీఠాధిపతులు సుయతీంద్రతీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గురువారం రాఘవేంద్రస్వామి సజీవ సమాధి స్థికికి వెళ్లిన రోజు కావడంతో ఉదయం నుంచి రాఘవరాయుడి బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రహ్లాదరాయలకు కనకాభిషేకం, పాదపూజలు చేశారు. పూర్ణబోద పూజమందిరంలో మూలరాములకు పీఠాధిపతులు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వర్ణ, గజవాహనాలపై అదీష్టించి ఆలయ ఫ్రాంగణం చుట్టు ఊరేగించారు.

* తేల్చుకోలేకపోతున్న నేతలు.. * నేడో, రేపో తుది నిర్ణయం..
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>