Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చంద్రబాబు ఝలక్!

$
0
0

(ఆంధ్రభూమి బ్యూరో- శ్రీకాకుళం)
సిక్కోలు తెలుగు తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. పార్టీలో ఆధిపత్య పోరు, కుమ్మలాటలు వీడకుంటే గుర్తింపు నిచ్చేది లేదని అధినేత నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రకటించిన పార్టీ ముఖ్య పదవులను రాష్ట్ర వ్యాప్తంగా కొందరు నాయకులకు కట్టబెడితే, జిల్లాకు చెందిన నేతలకు అందులో స్థానం లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇంతవరకు పార్టీ పొలిట్‌బ్యూరోలో ఎర్రన్నాయుడు కొనసాగగా ఆయన హఠాన్మరణం తర్వాత ఆ పదవిని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలతో భర్తీ చేస్తారని భావించారు. అయితే అనూహ్యంగా విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడును పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడంతో జిల్లా నేతలకు కంగుతినిపించినట్లయింది. దీనికి జిల్లాలోని పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, కుమ్మలాట, పార్టీకి అంకితభావంతో పనిచేయకపోవడం వంటి కారణాలుగా రాజకీయ విశే్లషకులు పరిగణిస్తున్నారు. మరో వైపు ఎర్రన్న మరణం తర్వాత నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం కల్పించేలా పార్టీ అధినేత చర్యలు తీసుకోలేదని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి జిల్లా నేతలకు అధిష్టానంలో సముచిత స్థానం లభించింది. దివంగత ఎన్టీరామారావు అనంతరం చంద్రబాబు కొలువులో కూడా జిల్లాకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా, కీలక నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పోలిట్‌బ్యూరో వంటి ఉన్నత పదవులు దక్కించుకున్నారు. దీనికనుగుణంగానే టిడిపిని జిల్లా వాసులు ఆదరించారు. అయితే గడిచిన రెండు ఎన్నికల్లో టిడిపిని సిక్కోలు ఓటర్లు తిరస్కరిస్తూ వస్తున్నారు. దీనికి రెండు కారణాలుగా చెప్పవచ్చు. పార్టీ సీనియర్ నేతల మధ్య అనైక్యత, వెన్నుపోటు రాజకీయాలు, వై.ఎస్. ప్రభంజనం మరోకారణం. అనంతరం కూడా పార్టీని గాడిలో పెట్టడానికి స్థానిక నేతలు కృషి చేయకుండా వేర్వేరు అజెండాలు నెరిపి అధినేత బాబును కూడా అనేక సందర్భాల్లో ఇరకాటంలో నెట్టేశారు. అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించి సిక్కోలువాణిని అనునిత్యం వినిపించే దివంగత నేత ఎర్రన్న పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగినప్పటికీ రెండు పర్యాయములు రాజ్యసభ చేజారడంతో సిక్కోలు నేతలకు తగిన గుర్తింపు దక్కడం లేదన్న బాధ తమ్ముళ్లను తీవ్రనిరాశకు గురిచేసింది. ఇంతలోనే రాజకీయ దిగ్గజంగా భాసిల్లిన ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కోల్పోయాయి. అయితే ఆ పోలిట్‌బ్యూరో బాధ్యతలను జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కిమిడి కళావెంకట్రావు, కావలి ప్రతిభాభారతిల్లో ఒకరికైనా దక్కే అవకాశం ఉందని ఇక్కడ నేతలు ఆశలు పెంచుకున్నారు. ఈ పదవి కోసం ఎవరికి వారే పావులు కదిపినప్పటికీ అధినేత చంద్రబాబు మాత్రం విశాఖ జిల్లాకు చెందిన నేతకు అవకాశం కల్పించి ఇక్కడ నేతలకు ఝలక్ ఇచ్చారు. అయితే దివంగత ఎర్రన్నాయుడు మద్దతుదారులంతా పోలిట్‌బ్యూరో అవకాశాన్ని మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుబట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎర్రన్నాయుడు స్థానంలో పొలిట్‌బ్యూరో పదవి తమకు దక్కుతుందని కళావెంకట్రావు, ప్రతిభాభారతిలు ఆశించినా ఆ అవకాశం లేకుండాపోయింది. సామాజిక వర్గసమీకరణాలు అనుకూలంగా నిలుస్తాయని కళా భావించినప్పటికీ అధినేత బాబు మాత్రం సీనియర్లకు మొండిచేయి చూపడం పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ప్రతిభాభారతి పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా పనిచేసి నేడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ పార్టీ బలోపేతానికి ఆమె సేవలు సంతృప్తికరంగా లేవని హైకమాండ్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. పొలిట్‌బ్యూరో కోసం తీవ్రంగా యత్నించిన అచ్చెన్నాయుడు అధినేత నిర్ణయంతో అయోమయంలో పడ్డారు. నిన్నటికి నిన్న ఎర్రన్న వారసుడు రామ్మోహన్‌నాయుడిని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించడంతో జిల్లాలో తమదే పైచేయి అని ఆ వర్గం చంకలుగుద్దుకున్నా.. పోలిట్‌బ్యూరో అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
సందిగ్ధంలో తమ్ముళ్లు
ఆదినుంచి అధిష్టానంలో సముచిత స్థానం దక్కించుకున్న నేతలను అధినేత చంద్రబాబు విస్మరించి పొలిట్‌బ్యూరో బాధ్యతలను అప్పగించకపోవడం పట్ల తమ్ముళ్లు సందిగ్ధంలో పడ్డారు. రానున్న సహకార, మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపై ముందుకు నడిపించాల్సిన సరైన నాయకత్వం లేదన్న ఆందోళన పార్టీ శ్రేణులను వెంటాడుతోంది. అధికార పార్టీ దూకుడు, జగన్‌పార్టీకి ఉన్న జనం ఇమేజ్‌ను తిప్పికొట్టేలా ఇక్కడ నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన హైకమాండ్ ఆశావహులపై నీళ్లుచల్లడాన్ని నందమూరి అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. బాబు పునరాలోచించి జిల్లా సీనియర్లకు తగిన ప్రాధాన్యత కల్పించకుంటే పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని అనేక మంది హెచ్చరిస్తున్నారు.

హద్దులు మీరి
మాట్లాడకు..
* కలిశెట్టిపై కళా ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 17: టిడిపి నేతల మధ్య అంతర్గత విభేదాలు మరో మారు బయటపడ్డాయి. దీనికి గురువారం లావేరు మండలం బుడుమూరు వేదికైంది. సాక్షాత్తు పార్టీ సీనియర్ నేత, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో స్థానిక టిడిపి నేతలు నివ్వెర పోయారు. నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ శాశ్వతంగా మూసివేయాలని వ్యతిరేకపోరాట కమిటీ సారథ్యంలో జరుపతలపెట్టిన ప్రజాచైతన్యయాత్ర బుడుమూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిసర గ్రామాల ప్రజల తరపున పోరాడలేదు సరికదా.. ప్రతిపక్ష నేతలు కూడా పట్టించుకోకుండా నేడు వేదికలెక్కి మాట్లాడటం సరికాదన్నారు. ఇకనుంచి మా నాయకుడు కళావెంకట్రావు అగ్రికెమ్ ప్రత్యక్ష పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో కలిశెట్టి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కళావెంకట్రావు మైక్‌లో మాట్లాడేటప్పుడు హద్దులు మీరి మాట్లాడటం నేర్చుకో అని ఒకింత అసహనంతో మండిపడ్డారు. పరిస్థితి హద్దులు దాటే ప్రమాదమని గమనించిన పోరాట కమిటీ అధ్యక్షులు ఎం.మురళీధర్‌బాబా, టిడిపి జిల్లా అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తిలు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కళా, కలిశెట్టి మధ్య మాటలయుద్ధానికి పార్టీలో గ్రూపులగోలే ప్రధాన కారణమని గుసగుసలు వినిపించాయి. అక్కడే ఉన్న సీతారాం వౌనం దాల్చడం విశేషం.

షట్టర్ల అవినీతిలో
ఊరట
* ఏడుగురు డిఇ, ఎఇలకు పోస్టింగ్‌లు
నరసన్నపేట, జనవరి 17: గతంలో వంశధార సబ్‌డివిజన్ పరిధిలో జరిగిన షట్టర్ల అవినీతి జిల్లాలో సంచలనం రేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా 2009, ఆగస్టు 6వ తేదీన 33 మంది వంశధార ఇంజనీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ప్రభుత్వం విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో గురువారం ఏడుగురు డి.ఇ, ఎ.ఇ.లకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. డి.ఇ. జి.బి.సుందరరావు, ఎఇలు గజపతిరావు, జి.ఎస్.ఎన్.మూర్తి, నర్సింగరావు, ఎం.విజయగోపాల్, బి.ఎస్.ఎన్.పాత్రో, హెచ్.డి. రామదాసులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశాలు కల్పించింది. గతంలో 11 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా అందులో డి.ఇ.లు రాజశేఖర్, జగదీశ్వరరావు, కృష్ణారావు, శేఖరరరావు, ఎ.ఇ.లు పురుషోత్తందొర, సాయికిరణ్, ఎం.వి.సురేష్‌కుమార్, గౌరీప్రసాద్, ఎం.రాంబాబు, నాయుడు, చంద్రవౌళీ ఉన్నారు. మిగిలిన 22 మందిలో ఏడుగురికి పోస్టింగ్‌లు రాగా ఎ.ఇ.లు శేషసాయి, విశ్వనాధం మృతిచెందారు. మిగిలిన వారికి పదవీ విరమణ అయింది.
‘రథసప్తమి’కి సన్నాహాలు

* బ్యాంకుల ద్వారా రెండువేల క్షీరాభిషేకం టిక్కెట్లు
* అదనంగా లక్ష లడ్డూల తయారీ * పాలకమండలి తీర్మానం

శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 17: ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 17వ తేదీకి అవసరమైన ఏర్పాట్లపై అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ట్రస్టు బోర్డు చైర్మన్ జోగిసన్యాసిరావు అధ్యక్షతన గురువారం సాయంత్రం పాలకమండలి సభ్యులు సమావేశమందిరంలో రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం ఇన్‌చార్జి కార్యనిర్వాహక అధికారి, దేవాదాయ సహాయ కమిషనర్ ఎ.వి.సత్యనారాయణమూర్తి మండలి ఆమోదించిన తీర్మానాలను విలేఖరులకు తెలిపారు. గోడపత్రికలు, కరపత్రాలు, భక్తుల నీడ కోసం సామియానాలు, ఆలయానికి రంగులు వేసేందుకు టెండర్ల ఆహ్వానిస్తూ ప్రకటనలు ఇవ్వనున్నామన్నారు. బ్యాంకుల ద్వారా రెండువేల క్షీరాభిషేకం టిక్కెట్లను అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా లక్ష లడ్డూలను తయారు చేయించనున్నామని తెలిపారు. ఇటీవల మృతిచెందిన పాలకమండలి సభ్యులు పోలయ్య ఆత్మశాంతించాలని కోరుతూ తొలుత ఒక నిమిషం వౌనం పాటించారు. విశాఖ కేర్ ఆసుపత్రిలో అనారోగ్యపరిస్థితిలో ఉన్న సభ్యులు పేర్ల ప్రభాకరరావు ఆరోగ్యానికి పూజలుచేయాలని ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మను కోరారు. సమీక్ష జరుగుతున్న మధ్యలోనుంచి సభ్యులు పట్నాల(కోణార్క్) సూరిబాబు వెళ్లిపోవడం కనిపించింది. సమావేశంలో సభ్యులు తెలుగు సూర్యనారాయణ, పసగాడ రామకృష్ణ, పేరు ఎర్రయ్య, నిక్కు జానకి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సన్నబియ్యానికి రెక్కలు
అమాంతం పెరిగిన ధర
తవుడు ధరదీ అదే దారి..
శ్రీకాకుళం(రూరల్), జనవరి 17: సన్నబియ్యం ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత వారం రోజుల కిందట 25 కిలోల బస్తా 830 రూపాయల నుంచి 850 రూపాయలు ఉండగా ప్రస్తుతం 900 నుంచి 950 రూపాయలకు చేరుకుంది. రెండోరకం బియ్యాన్ని 900 రూపాయలకే విక్రయిస్తున్నప్పటికీ అందులో 20 శాతం మేర ముతకబియ్యం కలుస్తున్నాయి. ధర పెరుగుదలకు కొందరు మిల్లర్లే కారణమని వినియోగదారులు పేర్కొంటున్నారు. నీలం తుఫాన్ వర్షాల దెబ్బకు పంటదిగుబడి తగ్గినందున ధర పెరుగుతుందని వారు ప్రచారం చేస్తున్నారు. ఈ సాకుతో నెలాఖరుకు మరింత పెంచాలని మిల్లర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు 1280 రూపాయలు మాత్రమే ప్రకటించినా రైతుకు ఆమేర అందడం లేదు. మిల్లర్ల పేరు చెప్పి రిటైల్ వ్యాపారులు బియ్యం ధరను మరింత పెంచి విక్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి బియ్యం విక్రయించాల్సి ఉన్నా జిల్లాలో అమలుకావడం లేదు. గతంలో ఆ శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్‌లలో నాణ్యత లేని బియ్యం విక్రయించడంతో వినియోగదారులు ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు తవుడు ధర ధాన్యం రేట్లతో పోటీపడుతున్నది. వంద కిలోల ధాన్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు వెయ్యి రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటా తవుడును 1050 రూపాయలకు విక్రయిస్తున్నారు. స్థానికంగా ధాన్యం ఆడించి వచ్చిన తవుడును సొంత పశువులకు వినియోగించేవారమని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తవుడు, గడ్డి కొనలేక పశుసంపదను పోగొట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితి చక్కదిద్దకుంటే మరిన్ని కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

గిరిజన విద్యార్థులకు
‘విద్యాజ్యోతి’ వెలుగులు
పాఠశాలల్లో ఇన్వర్టర్ల ఏర్పాట్లు * 50 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి చర్యలు
* ఐటిడిఎ పివో సునీల్‌రాజ్‌కుమార్ వెల్లడి

సీతంపేట,జనవరి 17: ఐటిడిఎ పరిధిలో నిర్వహిస్తున్న 41గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, 6వసతిగృహలు, 22 పోస్టుమెట్రిక్ హస్టల్స్‌కు విద్యాజ్యోతి పథకం ద్వారా ఇన్వర్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐటిడిఎ పివో కె సునీల్‌రాజ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.విద్యాజ్యోతి పథకంలో భాగంగా రూ.1.25కోట్లతో అన్ని పాఠశాలలకు ఇన్వర్టర్ల సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.దీనికి సంబంధించి టెండర్లు పిలవనున్నామని,్ఫబ్రవరి నెలాఖరు నాటికి వీటి ఏర్పాటు అన్ని పాఠశాలల్లో పూర్తి చేస్తామన్నారు.అలాగే ఐటిడిఎ పరిధిలో ఖాళీగా ఉన్న 50అంగన్‌వాడీ పోస్టులను కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వీటిలో 50్ల మినీ అంగన్‌వాడీ, హెల్పర్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నట్లు పివో వెల్లడించారు.అదే విధంగా భామిని మండల కేంద్రంలో ఏపిజివిబి బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత బ్యాంక్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

‘ఎక్సైజ్’ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

ఎచ్చెర్ల, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ల పోస్టుల నియామకానికి ఇటీవల నాలుగు కిలోమీటర్లు పరుగుపందాన్ని నిర్వహించారు. దీనిలో అర్హత సాధించిన రెండువేల మంది అభ్యర్థులకు దేహదారుఢ్యపరీక్షలు గురువారం నుంచి స్థానిక ఎ.ఆర్.గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు రోజుకు ఐదువందల మంది అభ్యర్థుల చొప్పున దేహదారుఢ్యపరీక్షలతోపాటు 800, వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్ వంటి ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు రాతపరీక్షకు అర్హత సాధిస్తారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అధికారి ప్రసాద్, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ అరుణరావు స్పష్టం చేశారు. వీరి పర్యవేక్షణలో ఎ.ఆర్.సిబ్బంది ఆధ్వర్యంలో దేహదారుడ్యపరీక్షలు కొనసాగుతున్నాయి. రాతపరీక్ష తేదీని ఇంకా ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది.
దళారీలను ఆశ్రయించొద్దు
అభ్యర్థులు దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ కోరారు. దేహదారుఢ్యపరీక్షలు పర్యవేక్షణకు విచ్చేసి స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామని అభ్యర్థులకు ఆశ చూపినట్లయితే అటువంటి వారి సమాచారం తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అభ్యర్థులంతా దేహదారుఢ్యపరీక్షలు, ఈవెంట్స్‌లో అర్హత సాధించి రాతపరీక్ష వైపు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని సూచించారు.

కాంగ్రెస్ హయాంలోనే

ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత

- కేంద్ర మంత్రి కృపారాణి
కోటబొమ్మాళి, జనవరి 17: కాంగ్రెస్ హయాంలోనే జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటి నిర్మాణాలకు కృషి చేసామని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. మండలంలోని పొడుగు పాడులో రూ. 8.40 కోట్ల వ్యయంతో నిర్మించిన కొర్ల రేవతీపతి ఎత్తి పోతల పథకాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004కు ముందు జిల్లాలో 22 ఎత్తిపోతల పథకాలు ఉంటే ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 పథకాలను మంజూరు చేసిందని అందులో టెక్కలి నియోజక వర్గంలో 5పథకాలు మంజూరు అయ్యాయని వివరించారు. రాష్ట్రంలో 570 ఎత్తిపొతల పథకాలు మూలన పడ్డాయని అందులో 125 పథకాల మరమ్మతులకు 2004 తరువాతే నిధులు మంజూరయ్యాయని ఆమె చెప్పారు. మండలంలోని నారాయణపురం, చిన్నసాన గ్రామాలకు ఎత్తి పోతల పథకాలకు ప్రతి పాదనలు చేసామన్నారు. అలాగే దంత ప్రాంతానికి తాగునీరు అందించాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ జనార్ధనరావు విజ్ఞప్తి మేరకు కృషి చేస్తామన్నారు. ఎత్తి పోతల పథకాల నిర్వహణ బాధ్యత రైతులదేనని వీటిని విజయ వంతంగా నడిపించి రైతులు లబ్ధి పొందాలని ఆమె సూచించారు. పొడుగుపాడు పథకం ద్వారా 5 పంచాయితీల్లోని వెయ్యి ఎకరాలకు అదనంగా సాగునీరు పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమస్యలపై, కొన్ని రైళ్లు నిలుపుదలపై వినతి పత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో టెక్కలి ఎమ్మెల్యే కొర్ల బారతి, ఎమ్మెల్సీ పీరు కట్ల విశ్వప్రసాద్, పిసిసి అధ్యక్షడు నర్తు నరేంద్ర యాదవ్, ఎపి ఎస్ ఐడిసి ఎస్ సి షేక్ మల్లీకావల్లి , ఈ ఈ లక్ష్మిపతిరావు, డి ఈ సింహాచలం, ఎఇ త్రిమూర్తులు , ఆర్డీవో విశే్వశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జి ప్రభాకరరావు, ఏ రామారావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాస్తుల
పరిరక్షణే ధ్యేయం
*జెసి భాస్కర్
పొందూరు, జనవరి 17: ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణపాలు కాకుండా పరిరక్షణ దిశగా ప్రభుత్వం పయనిస్తోందని జెసి పోలా భాస్కర్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో గురువారం మీసేవ కేంద్రం పనితీరును పరిశీలించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ఈనెల మొదటివారంలో రాజధానిలో హైదరాబాద్‌లో జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో, కంఠంలోగల భూముల స్వభావాన్నితెలుసుకుని రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయా, కాలేదా అన్నది ప్రజల సమక్షంలో గుర్తించనున్నామన్నారు. ఈ విధంగా జరుగడం వల్ల ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు బయటపడతాయన్నారు. జిల్లాలో తాజాగా రైతుల వద్దకే పట్టాదారు పాసుపుస్తకాల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ప్రతీ డివిజన్‌లో అన్ని మండలాలు సర్వేయర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు గ్రామాలకు పంపి రైతులసమక్షంలో వారి భూముల వివరాలు రెవెన్యూ రికార్డులో చేరినట్లయితే వాటిని తెరిచి పట్టాదారుపాసుపుస్తకాలను జారీ చేస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి
* కేంద్రమంత్రిని కోరిన సమైక్యాంధ్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్
శ్రీకాకుళం (టౌన్), జనవరి 17: తెలుగు ప్రజల విహిత క్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యాంధ్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలగ ప్రకాశ్ కోరారు. గురువారం ఈ మేరకు ఆయన ఫోరం సభ్యులతో కలసి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఆమె క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అన్నదమ్ముల్లా విడిపోదాం... ఆత్మీయుల్లా కలిసుందాం అంటూ పిలుపునిస్తున్న తెలంగాణా నాయకుల నిజాయితీ ఇటీవల టాంక్‌బండ్‌పై తెలుగు మూర్తుల విగ్రహాల ధ్వంసంతోనే వెల్లడైందని స్పష్టంచేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే లేని ఆత్మీయతానురాగాలు విడిపోతే వస్తాయని పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగు జాతి కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేసిన రాజనీతిజ్ఞులు, మహాపురుషులు, క్రీడాకుసుమాలను ప్రాంతాల వారిగా విడదీసి వారి ప్రతిభను గుర్తుంచుకోగలమా అన్నారు. కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్ధులను రెచ్చగొడుతూ, అపోహలు సృష్టిస్తూ రగడ చేస్తున్నారని ఆరోపించారు. విభజనకు ప్రాతిపదిక ఏదీ లేదని, తెలంగాణ ప్రజలకు నిజమైన ఆత్మగౌరవం విశాల ఆంధ్ర ప్రదేశ్‌లోనే దక్కిందన్నారు. సమైక్యతే సోపానంగా అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు.

సంక్షేమం కోసమే పథకాలు
టెక్కలి, జనవరి 17: దేశ ఆర్థిక పరిస్థితి అంతర్జాతీయ సమస్యలు, ముడిచమురు ధరల పెరుగుదల వెరసి ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని కేంద్ర ఐటి,కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డా. కిల్లి కృపారాణి అన్నారు. మండలం పోలవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధరల పెరుగుదల సామాన్య పౌరునికి ఇబ్బందికరము అయినప్పటీకీ కొనుగోలు శక్తిని పెంచేందుకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసామన్నారు. మేథావి వర్గానికి చెందిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విదేశి పెట్టుబడులను ఆహ్వానించడంలో రైతాంగానికి నష్టంలేదన్నారు. ఎఫ్‌డిఐ లకు అనుమతులు ఇచ్చేముందు మూడు నిబంధనలు విధించామన్నారు. ఇందులో భాగంగా 30 శాతం రైతు పండించుకునే పంట కొనుగొలు చేస్తారని గిడ్డంగులు కోల్డ్ స్టోరేజిల నిర్మాణం జరుగుతాయాన్నారు. డీజలు ధరలు 17 రూపాయిలు పెంచాల్సి ఉన్నప్పటీకీ సబ్సీడీలు భరిస్తూ రూ. 5 మాత్రమే పెంచిందన్నారు.సభాధక్షులు టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, డిసిసి అధ్యక్షులు నర్తు నరేంద్ర యాదవ్, పిసిసి సెల్ డాక్టర్స్ కన్వీనర్ రామ్మోహనరావులు ప్రసంగించారు. అంతకు ముందు పోలవరం గ్రామానికి సంభందించి 800 ఎకరాల ఆయకట్టుకు సింహాగిరి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకు స్థాపన చేసారు. సమావేశం అనంతరం కృపారాణి దంపతులను గ్రామస్థులు పౌర సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతాడ మంజు, గణపతి, పొట్నూరు ఆనందరావు, ధవళ కృష్ణరావు, నారయణరావు, గురుబెల్లి కృష్ణారావు, ఆర్డీవో విశే్వశ్వరరావు, తహశీల్దార్ జల్లేపల్లి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

* జిల్లా నేతలకు చేజారిన పొలిట్‌బ్యూరో * కళా, ప్రతిభాలకు దక్కని స్థానం * అచ్చెన్న ఆశలపై నీళ్లు * పార్టీలో కుమ్ములాటలపై అధినేత దృష్టి
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>