Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నంది నాటక ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం

$
0
0

పార్వతీపురం, జనవరి 17: సబ్ ప్లాన్ మండలాల్లో నందినాటక ఉత్సవాలకు సంబంధించిన విస్తృత ప్రచార కోసం గురువారం ప్రచార రథాన్ని పీవో అంబేద్కర్ ప్రారంభించారు. గురువారం కొమరాడ, పార్వతీపురం, పార్వతీపురం మండలాల్లో ప్రచారం చేశారు. శుక్రవారం కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోను, శనివారం జయ్యమ్మవలస ,గరుగుబిల్లి మండలాల్లో ప్రచారం చేస్తారని పీవో అంబేద్కర్ తెలిపారు. ఈనెల 20నుండి 27 తేదీ వరకు విజయనగరం లోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజూ ఉదయం 8.30గంటల నుండి రాత్రి 10.30గంటలకు నాటకోత్సవాలు జరుగుతున్నాయన్నారు.

‘మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు’
బొబ్బిలి(రూరల్), జనవరి 17: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని ఆర్.డబ్ల్యు.ఎస్. డి.ఇ రామస్వామి అన్నారు. ఈ మేరకు మెట్టవలస గ్రామంలో మరమ్మతులకు గురైన మోటారును గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన మోటార్లు మరమ్మతులకు గురైతే తక్షణమే బాగు చేసి మంచినీటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందిస్తామన్నారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపడతామన్నారు. ఏ గ్రామంలోనైన రక్షిత మంచినీటి పథకాలు, మంచినీటి బోర్లు పనిచేయనిపక్షంలో తెలియజేయాలని కోరారు. తక్షణమై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అపారిశుద్ధ్యం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలన్నారు. కాలువలు, రోడ్లుపై చెత్తాచెదారాలను వేయరాదన్నారు. గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈయనతోపాటు ఆర్.డబ్ల్యు.ఎస్. ఏ.ఇ. పి.శంకరరావుతోపాటు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి సిబ్బందిపై
పీవో ఆగ్రహం
పార్వతీపురం, జనవరి 17: సమావేశానికి గైర్హాజరైన ఉపాధి పథకం సిబ్బంది పై గురువారం పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక గిరిమిత్ర సమావేశం హాలులో సబ్‌ప్లాన్ పరిధిలోని ఉపాధి హామీ పథకం ఎపివోలు, ఇసిలు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి పూర్తిస్థాయిలో ఈ ఉద్యోగులు హాజరుకపోవడంతో పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా నిర్వహించని ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుండి పీవో బయటకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఎపిడితో పాటు వ్యవసాయశాఖ ఎడి అన్నపూర్ణలు పాల్గొన్నారు.
వుడా విసిగా యువరాజ్ బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 17: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఉపాధ్యక్షునిగా డాక్టర్ ఎన్.యువరాజ్ బాధ్యతలను స్వీకరించారు. 35 ఏళ్ళ చరిత్ర కలిగిన వుడాకు ఈయన 35వ విసిగా రావడం కూడా విశేషం. గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు బదిలీపై వుడాకు నియమించిన సంగతి తెలిసిందే. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన విసి యువరాజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరువాత అంతటి ప్రాముఖ్యం కలిగిన విశాఖనగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్య భూమిక వహించాల్సి ఉంటుందని అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలుంటాయని విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్‌లలో ఇది మరింత జటిలంగా ఉంటాయన్నారు. పూర్వ ఉపాధ్యక్షుడు కోన శశిధర్ ద్వారా పలు అంశాలకు వుడాకు సంబంధించి తాను తెలుసుకున్నానని చెబుతూ హరిత ప్రాజెక్టు, తదితర నగరాభివృద్ధి విశేషాలపై పూర్తిస్థాయిలో ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.

‘హస్తకళలను ప్రోత్సహించాలి’
విజయనగరం (్ఫర్టు), జనవరి 17: ప్రజాదరణ కోల్పోతూ కనుమరుగవుతున్న హస్తకళలకు ప్రాణం పోయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొంగలి పోతన్న తెలిపారు. పట్టణంలో గురజాడ కళాభారతి ప్రాంగణంలో ఆలిండియా క్రాఫ్ట్ బజార్-2013 పేరిట నిర్వహించనున్న హస్తకళల ప్రదర్శన, విక్రయాన్ని గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతన్న మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉండేదన్నారు. అయితే నేటికాలంలో ప్రజాదరణ కోల్పోతుయన్నారు. కనుమరుగవుతున్న హస్తకళలకు ప్రాణం పోసి, సంబంధిత కళాకారులకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా ఆదరిస్తే సమాజంలో వారి జీవనానికి ఊతం దొరుకుతుందన్నారు. విశాఖ ఆర్టీజాన్స్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ నసీమ్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ మంచి ముత్యాలు, కలంకారి వంటి ఎన్నోరకాల వస్తువులను విక్రయిస్తామన్నారు.
రెండు ఆటోలు ఢీ..
ఎనిమిది మందికి గాయాలు
గజపతినగరం, జనవరి 17 : స్థానిక చంపావతి నది వంతెనపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందిగాయపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎదురెదురుగా వస్తున్న వస్తున్న ఆటోలు ఢీ కొనడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఆకుండి శ్రీనిసరావు, అతని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వారిద్దరికి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘సబ్ డిపోల్లో సరకుల పంపిణీకి
చర్యలు తీసుకోవాలి’
పార్వతీపురం, జనవరి 17: ఐటిడిఎ సబ్ ప్లాన్ మండలాల్లో నూతనంగా మంజూరు చేసిన 27 డి ఆర్ డి ఎ సబ్ డిపోల్లో వచ్చే నెల 1తేదీ నుండి నిత్యావసర సరకులు తప్పనిసరిగా అందజేయాలని ఐటిడిఎ పీవో బి ఆర్ అంబేద్కర్ తహశీల్దార్లను, జిసిసి డి ఎం ను ఆదేశించారు. గురువారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలోని పీవో చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీవో మాట్లాడుతూ ప్రతి నెల 3, 4 రోజులు పాటు సరకులు అమ్మేటట్టుప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసిన సరకులు ఏయే తేదీల్లో కొనగొలరని తెలుసుకోవాలన్నారు. అక్కడ స్థానిక పరిస్థితులు బట్టి సంత జరిగే రోజుల్లోను, ఖాళీ సమయాల్లోను, వారి వద్ద డబ్బులు ఉండే పరిస్థితులు తెలుసుకుని తేదీలు నిర్ణయించుకోవాలన్నారు. మిగతా ప్రధాన డిపోల్లో అమ్మకాలు చేయాలన్నారు. ఏయే అమ్మకాలు జరుగుతాయో విస్తృతంగా టాంటాం చేయించాలన్నారు. అమ్మే స్థలాల వివరాలు కూడా తెలియజేయాలన్నారు. తాను ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినపుడు సరకులు అందలేదని ఫిర్యాదు అందుతున్నాయని అలాకాకుండా సరుకులు కచ్చితంగా అందించాలన్నారు. సబ్ డిపోలు మంజూరు చేసి ఏడాది కావస్తున్నా సరిగా అమ్మకాలు చేయడం లేదని పీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ డిపోలకు ట్రాన్స్‌పోర్టేషన్ లేనందున రోడ్డు సదుపాయాలు లేని గ్రామాలు గురించి తెలపాలన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని బీరుపాడు, పాచిపెంట మండలంలోని కేరంగి, జీడివలస, మక్కువ మండలంలోని మెండంగి, పట్టుచెన్నూరు తదితర డిపోలకు ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధిత ప్రతిపాదనలు అందించాలని గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ నాగేశ్వరరావును ఆదేశించారు. కొత్త డిపోల ఏర్పాటు విషయంలో కూడా ప్రతిపాదనలు అందించాలన్నారు.
‘వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకోవాలి’
పార్వతీపురం, జనవరి 17: స్వామి వివేకానందుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జయమణి అన్నారు. గురువారం స్థానిక ఐఆర్‌పిడబ్ల్యుఎ కార్యాలయం ఆవరణలో జిల్లా యువజన సర్వీసుల శాఖ (సెట్విజ్) సౌజన్యంతో ఐ ఆర్ పి డబ్ల్యు ఎ సంస్థ నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగాపాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద యువకులలో దేశ భక్తిని పెంపొందింప చేసిన మహనీయుడన్నారు. నిబ్బరం,మనోధైర్యం గల యువతనిస్తే దేశానికి వెన్నుదన్ను అయిన రక్షకులుగా మారుస్తానని స్వామివివేనంద అన్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. పాఠశాలల్లో,కళాశాలల్లో మహనీయ చరిత్రలు సిలబస్‌లో పొందుపరచి విద్యార్థులకు బోధన జరిగేవిధంగా చూడాలని అభిప్రాయపడ్డారు. వివేకానందుని బోధనలు స్పూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమవరపుకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవించేలా నడవడిక మార్చుకోవాలన్నారు. ఐఆర్‌పిడబ్ల్యుఎ సంస్థ డైరక్టర్ పికె ప్రకాష్ మాట్లాడుతూ సినిమా,టివి, ప్రభావం వల్ల యువత చెడు మార్గం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయులు, దేశ నాయకుల ఆత్మకథలు చదివి ఆకలింపుచేసుకోవడం ద్వారా సన్మార్గంలో నడవాలని యువతను కోరారు. సెట్విజ్ సంస్థ ప్రతినిధి ఈశ్వరరావు, రావివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చుక్క పారినాయుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్టక్రార్యదర్శి సామల సింహాచలం, డిబికె కళాశాల అధినేత డి.సాయి పార్థసారధి, పెదబొండపల్లి ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.గంగరాజు, ప్రముఖ కరాటే శిక్షణ సంస్థ అధినేత జి.గోపాల్, పాల్గొన్నారు.

పల్స్‌పోలియో విజయవంతానికి కలెక్టర్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 17: జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం (పల్స్‌పోలియో) అందరూ సమన్వయం, సహకారంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఈనెల 20 నుంచి 22 వరకూ జరిగే ఈకార్యక్రమంపై పలు శాఖల అధికారులతో గురువారం ఆయన సమావేశాన్ని నిర్విహించారు. పోలియో వ్యాధిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, తద్వారా పోలియో చుక్కలు అందరూ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయిదేళ్ళ లోపు పిల్లలందరికీ పోలియో చుక్కల వేయించాల్సిన అవసరంపై అవగాహనకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1999 డిసెంబర్‌లో ఒక పోలియో కేసు నమోదైందని, తర్వాత కాలంలో పోలియో కేసులు నమోదు కాలేదన్నారు. భవిష్యత్‌లో కూడా ఈ మహమ్మారి సోకకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల,గ్రామ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. కొండ శిఖర గ్రామాలు, మత్సకార గ్రామాలు, మురికివాడలు, వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఫైలేరియా నివారణకు సంబంధించి ఈనెల 29న జాతీయ ఫైలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్‌డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో పాల్గొనేలా అధికారులు అంతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రెండేళ్ళు పైబడి గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు తప్పనిసరిగా ఈ మందును తీసుకోవాలని అన్నారు. డిఇసి మాత్రల ద్వారా మైక్రో ఫైలేరియా క్రిములను 90 శాతం వరకూ నాశనం చేయోచ్చన్నారు. ఒకప్పుడు అధికంగా ఫైలేరియా కేసులు నమోదయ్యేవని, ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ అయిదేళ్ళు లోపున్న బాలలు జిల్లా వ్యాప్తంగా 24 లక్షల మంది ఉన్నారని, 1600 పోలియో చుక్కల బూత్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అలాగే 1600 వైద్య బృందాలు, 66 సంచార బృందాలు, మరో 37 ట్రాన్సిట్ బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 239 కొండ శిఖర గ్రామాల్లోను, 21 మత్స్యకార గ్రామాల్లోను పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంబేద్కర్, డిఆర్‌ఓ బిహెచ్‌ఎస్.వెంకటరావు, పాల్గొన్నారు.
వల్లరిగుడబలో ప్రబలిన అతిసార

గరుగుబిల్లి, జనవరి 17: మండల పరిధిలోని వల్లరిగుడబ గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో గ్రామానికి చెందిన దాదాపు 40మంది వరకు డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. గడిచిన రెండు రోజుల క్రితం అతిసార వ్యాధి ప్రబలిందని పలువురు తెలిపారు. ప్రస్తుతం ఎస్. సురేష్, పి.సంధ్య, పి.అరుణ, ఎన్.మురళీ, పి.రాంబాబు, తదితరులు డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో అతిసార ప్రబలడంతో గరుగుబిల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్.ఎం.కె. తిరుమలప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యసహాయం అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు. జి.అమ్మడమ్మ, సి.హెచ్. స్పందన, బి.సతీష్, జి.స్వాతి, ఎ. ఎల్లయ్య, తదితరులకు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో అతిసార అదుపులోకి వచ్చేంతవరకు వైద్య శిబిరాన్ని కొనసాగించనున్నామన్నారు. గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలడంతో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తగు చర్యలు చేపడుతున్నామని పంచాయతీ కార్యదర్శి రావుపల్లి మురళీధర్ పట్నాయక్ తెలిపారు. పలువీధుల్లోని కాలువల్లో పూడికలను తొలగించామన్నారు.

సమన్వయంతో నిర్వహించండి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 17: ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన నంది నాటకోత్సవాలను సమర్ధవంతంగాను, సమన్వయంతోనూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 20 నుంచి 27 వరకూ జరుగుతున్న నంది నాటకోత్సవాల ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు వేదికలను గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ నంది నాటకోత్సవాల నిర్వహణకు గాను ఎనిమిది కమిటీలను నియమించామని, వారు తమకు కేటాయించిన విధులను ఏవిధంగా నిర్వహిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఏఏ కమిటీలు బాధ్యతలు నిర్వహిస్తున్నది కరప్రతాలపై ముద్రించి వచ్చిన అతిధులు, కళాకారులకు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా వస్తున్న అతిధులు, కళాకారులకు వసతి సదుపాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వసతి, భోజన సదుపాయం అందుబాటులో ఉంచాలని, బయట ప్రాంతాల నుంచి వస్తున్న కళాకారులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆనందగజపతి ఆడిటోరియం వద్దకు వాహనాలను అనుమతించవద్దని, పక్కనే ఉన్న అయోధ్య మైదానంలో వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని, అందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామికి సూచించారు. కళాకారుల గుర్తింపు రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డులు, భోజన, వసతి కూపన్లను వారు బసచేసే ప్రాంతంలోనే అందజేయాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసుల కోసం 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని, వేదికల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాదికారిని ఆదేశించారు. 27న రాజీవ్ మైదానంలో ముగింపు వేడుకలు జరుగుతున్నాయని, ఈకార్యక్రమానికి రాష్ట్రం నుంచి ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నంది నాటకోత్సవాల ప్రత్యేకాధికారి మోహనరావు, డిఆర్‌ఓ హేమసుందర్, పిడిలు జ్యోతి, శ్రీరాములునాయుడు, రాబర్ట్స్ తదితరులు పాల్గొన్నారు.
వేదికలను పరిశీలించిన కలెక్టర్
నంది నాటకోత్సవాలు జరుగుతున్న వేదికలను జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య సందర్శించారు. ప్రధాన వేదికైన ఆనందగజపతి ఆడిటోరియంను సందర్శించిన ఆయన సెట్టింగులు, తెరలు, విద్యుదీకరణ వంటి పనులను పరిశీలించారు. ఆడిటోరియం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలపించేలా ఉండాలని సూచించారు. అనంతరం ముగింపు వేడుకలు జరిగే రాజీవ్‌గాంధీ క్రీడామైదానాన్ని సందర్శించారు. వేదిక, బారికేడ్లు, తదితర అంశాలను పరిశీలించారు.

నాలుగు ఇళ్ళల్లో చోరీ.. ప్రజల బెంబేలు
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 17: దొంగలు మరోసారి విజృంభించారు. శుక్రవారం పూల్‌భాగ్ కాలనీలో ఒకేసారి నాలుగు ఇళ్లలో చొరబడి బంగారు, వెండి వస్తువులతోపాటు నగదును అపహరించికుపోయారు. తాళం వేసి ఇళ్ళనే లక్ష్యం చేసుకుని దొంగలు విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. స్థానిక పూల్‌బాగ్ కాలనీకి చెందిన అల్లెప్పనాయుడు వేపాడ మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని గురువారం అల్లెప్పనాయుడు కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళారు. దీంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న నాలు తులాల బంగారు నగలతోపాటు కిలో వెండి వస్తువులు 68 వేల రూపాయల నగదును అపహరించారు. అదేవిధంగా పక్కింట్లో నివాసం ఉంటున్న ఇరిగేషన్ జెఇ పి.శ్రీనివాసరావు కుటుంబం కూడా సంక్రాంతి పండక్కి వెళ్లడంతో ఆ ఇంటి తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు నగలను అపహరించికుపోయారు. అదే ప్రాంతంలో మరో వీధిలో గజపతినగరంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కళ్యాణపు సత్యారావు కుటుంబం కూడా సంక్రాంతి పండక్కి వెళ్లడంతో ఇంటి తాళాలను విరగ్గొట్టి ఇంట్లో ఉన్న ఆరువేల నగదును, స్థానిక పాల్‌టెక్ని కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు పావుతులం బంగారం, రెండు వేల రూపాయల నగదును అపహరించికుపోయారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో అవసరమైన ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

‘కష్టజీవి చెమటబొట్లే
చా.సో కథలు’
విజయనగరం(కల్చరల్), జనవరి 17 : కష్టజీవి నుదుట చెమటబొట్లే చాగంటి సోమయాజుల (చాసో) కథలని కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన సుప్రసిద్ధ కధారచయిత పెద్దింటి అశోక్‌కుమార్ కొనియాడారు. స్థానిక మహారాజా లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో గురువారం ప్రముఖ కథారచయిత చా.సో స్ఫూర్తి సాహిత్యపురస్కారాన్ని ఆయన అందుకున్నారు. సాహితీ వేత్త ఓలేటి పార్వతీశం అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చా.సో పురస్కారం అందుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. కవులకు రచయితలకు మార్గదర్శి చా.సోఅని అన్నారు. చా.సో తన కధలతో అద్బుతమైన ప్రపంచాన్ని సృష్టిచాడని, అద్బుతమైన శిల్పిచెక్కిన బొమ్మల్లా ఆయన కధలు ఉంటాయని అశోక్‌కుమార్ తెలిపారు. కధకి వెలుగునిచ్చి దారి చూపి కవులకు రచయితలకు మార్గదర్శిగా పేరుపొందారన్నారు. అశోక్‌కుమార్‌ను పాలపిట్ట మాసపత్రిక సంపాదకుడు గుడిపాటి పరిచయం చేస్తూ తెలంగాణా సంస్కృతి,మాండలికంతో కథారచన చేస్తున్న వారిలో అశోక్ గొప్పప్రతిభాసాలన్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో కులవృత్తులు నమ్ముకున్న వారి జీవితాలు ఎలాసాగుతున్నాయో ఆయన తన కథల్లో వివరించారన్నారు. ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ చా.సో తనచుట్టూతిరిగే జీవన చిత్రాలను గొప్ప సన్నివేసంగా మలిచి కధలు రచించారన్నారు. తెలుగులో చిన్న కథకు పెద్దదిక్కు చా.సో మార్క్సిజాన్ని సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఘనత చా.సోదే చా.సో రావిశాస్ర్తీ, కాళీపట్నం రామారావు ముగ్గురూ ఉత్తరాంధ్ర కవిత్రయంగా ఖ్యాతి పొందారన్నారు. రాసిన కధలు తక్కువైనా వాసిరీత్యాఅవి అణిముత్యాలే అని కొనియాడారు. ముందుగా చా.సో కుమార్తె డా. చాగంటి తులసి 12 మంది ప్రముఖుల కథలను హిందీ నుంచి తెలుగులోనికి అనువాదం చేసిన కధల సంపుటిని ఆయన ఆవిష్కరించారు. అలాగే డా.చాగంటి కృష్ణకుమారి, రచించిన రసాయన జగత్తు పుస్తకాన్ని ప్రవాసభారతీయుడు వంగూరి చిట్టేంరాజు ఆవిష్కరించారు. చా.సో కథా సాహిత్యాన్ని ముందుతరంవారికి అందజేసే కృషి చేయాలని ఆయన కోరారు. డా.కృష్ణ కుమారి చా.సో కథ పెంకుపురుగును చదివి వినిపించారు. కార్యక్రమానికి సాహితీవేత్తలు డా. యుఎ నర్సింహమూర్తి, డా. ఎ.గోపాలరావు, మానాప్రగడ శేషసాయి, వెలుగు రామినాయుడు, ద్వారం దుర్గా ప్రసాదరావు, తదితరులు హాజరయ్యారు.

శంబర జాతరకు 265 ప్రత్యేక బస్సులు
బొబ్బిలి, జనవరి 17: శంబర పోలమాంబ జాతరకు 265 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజరు జి.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్.అండ్.బి. బంగ్లాలో రెండు జిల్లాల డిపోమేనేజర్లతో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం డిపో నుంచి 64 బస్సులు, సాలూరు డిపో నుంచి 56, విజయనగరం డిపో నుంచి 25, పాలకొండ డిపో నుంచి 27, శ్రీకాకుళం-1 డిపో నుంచి 37, శ్రీకాకుళం -2 డిపో నుంచి 45 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. గత ఏడాది 255 బస్సులను నడిపినట్లు తెలిపారు. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అదనంగా మరో 10 బస్సులను నడపనున్నట్లు స్పష్టం చేశారు. రాజాం నుంచి శంబరకు 55 రూపాయలు, విజయనగరం నుంచి శంబరకు 60 రూపాయలు, పార్వతీపురం నుంచి తాళ్లబురిడి మీదుగా శంబరకు 32 రూపాయలు, సాలూరు నుంచి శంబరకు 15 రూపాయలు, పార్వతీపురం నుంచి చినబోగిలి మీదుగా శంబరకు 30 రూపాయలు, బొబ్బిలి నుంచి దిబ్బగుడివలస మీదుగా శంబరకు 25 రూపాయలను వసూళ్లు చేయనున్నట్లు తెలిపారు. భక్తులంతా ఆర్టీసి బస్సులలోనే ప్రయాణాలు చేయాలన్నారు. అలాగే శంబర జాతరకు 25మంది సెక్యూర్టీ సిబ్బందిని నియమించామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతీ బస్టాపు వద్ద ఆర్టీసి డిపో మేనేజర్లను నియమించామన్నారు. ఈ సమావేశంలో పార్వతీపురం, సాలూరు, విజయనగరం, పాలకొండ, శ్రీకాకుళం-1 డిపో మేనేజర్లు వేణుగోపాలరావు, కవిత, మల్లీశ్వరరావు, మల్లిఖార్జునరావు, ముకుంధరావులు పాల్గొన్నారు.విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అదనంగా 23 నూతన బస్సు సర్వీసుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని ఆర్. ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. విజయనగరానికి 14 బస్సులు, శ్రీకాకుళంకు 9బస్సులను కేటాయించాలన్నారు. మరో మూడు నెలలో ఈ బస్సులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.

సబ్ ప్లాన్
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>