కాకినాడ, జనవరి 17: జిల్లాలో వచ్చే ఫిబ్రవరి 1 నుండి 28వ తేదీ వరకు నిర్వహించే 6వ ఆర్ధిక గణాంక సేకరణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించి, వాస్తవికతను ప్రతిబింబించే విధంగా గణాంకాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అధికార్లను ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ హాలులో గురువారం 6వ ఆర్ధిక గణాంక సేకరణ కార్యక్రమంపై సంబంధిత అధికార్లకు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ దేశ ఆర్ధిక ప్రగతికి ప్రణాళికలను రూపొందించేందుకు గాను కచ్చితమైన గణాంకాలను రూపొందించాల్సి ఉందన్నారు. 1977 సంవత్సరంలో తొలి ఆర్ధిక గణాంక సేకరణను దేశంలో నిర్వహించారని, తర్వాత 1980, 1990, 1998, 2005 సంవత్సరాల్లో మరో నాలుగు విడతలుగా సెనె్సస్ కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం 6వ విడత గణాంకాల సేకరణ ప్రక్రియ క్రింద 2011 అక్టోబర్ నుండి 2013 జూన్ వరకు క్షేత్రస్థాయి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా 2013 ఫిబ్రవరి 1 నుండి 28వ తేదీ వరకు జిల్లాలోని 58 మండలాలు, 2 నగర పాలక సంస్థలు, 7 పురపాలక సంఘాల్లో ఈ క్షేత్రస్థాయి గణన నిర్వహించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు గాను 3,620 ఎన్యుమరేటర్లను నియమించామని, అంగన్వాడి వర్కర్లు, విద్యా వాలంటీర్లు, స్వయం సహాయ సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్ ప్రైమరీ వర్కర్లు, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతను నియమిస్తున్నామని, వీరిపై 1,810 మంది పర్యవేక్షకులను నియమించినట్టు కలెక్టర్ నీతూప్రసాద్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక, గణాంక విభాగం జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ ఆర్ధిక గణాంక సేకరణపై స్క్రీన్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వి మహిపాల్, ప్రణాళిక విభాగం డిడి కెవికె రత్నాబాయి తదితరులు పాల్గొన్నారు.
ధేవాదాయ శాఖలో బదిలీలు
*గుంటూరు డిసిగా త్రినాథరావు
*కాకినాడ డిసిగా హనుమంతరావు
*దుర్గగుడి ఇఒగా ప్రభాకర శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 17: దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ (డిసి-కాకినాడ)గా సిహెచ్ హనుమంతరావును నియమించినట్టు తెలిసింది. దేవాదాయ శాఖలో సీనియర్ అధికారిగా గుర్తింపు పొందిన హనుమంతరావును డిసిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ప్రస్తుత డిసిగా ఉన్న వేండ్ర త్రినాథరావును గుంటూరు డిసిగా నియమించినట్టు సమాచారం. త్రినాథరావు ప్రస్తుతం ద్వారకాతిరుమల ఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుంటూరు డిసిగా నియమితులైనా ద్వారకాతిరుమల ఇఒగా పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతారని సమాచారం. కాగా దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (కాకినాడ) కె ప్రభాకర శ్రీనివాస్‌ను విజయవాడ కనకదుర్గ ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఐతే ఈయన దుర్గగుడి ఇ ఒ బాధ్యతలతో పాటు ల్యాండ్‌ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తారని సమాచారం! ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం వీరు అందుకునే అవకాశం ఉంది.
రీజియన్ పరిధిలో రూ.240.65 కోట్ల
ఆడిట్ అభ్యంతరాలు
- రాష్ట్ర ఆడిట్ ఆర్డీ వెంకటేశ్వరరావు
సామర్లకోట, జనవరి 17: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల రీజియన్ పరిధిలో అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఇప్పటివరకూ రూ.240.65 కోట్లు ఆడిట్ అభ్యంతరాలు పరిష్కరించాల్సి ఉందని రాష్ట్ర ఆడిట్ రీజినల్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలోని ఆడిట్ అభ్యంతరాల పరిష్కారంలో నిర్వహించిన తనిఖీల అనంతరం ఆర్‌డి విలేఖరులతో మాట్లాడారు. రీజియన్ పరిధిలో తూర్పుగోదావరిలో 10,666 ఆడిట్ అభ్యంతరాల విలువ సుమారు రూ.83 కోట్లు ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడిట్ అభ్యంతరాలు 5,703 విలువ రూ.కోటి ఉంటుందన్నారు. కృష్ణా జిల్లాలో ఆడిట్ అభ్యంతరాలు 5,152 విలువ రూ.58 కోట్లు వెరశి రూ.240.65 కోట్లు విలువ చేసే అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించడానికి, వివిధ నిధులు కేటాయించడానికి ముందుగా మున్సిపాల్టీల్లో ఆడిట్ అభ్యంతరాలు, ఉద్యోగులు తీసుకున్న అడ్వాన్సులు పెండింగ్ సొమ్ములు సమస్యలు పరిష్కరించాలని నిర్దిష్టంగా ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలు పరిష్కరించడానికి గడువుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఆడిట్ విషయంలో, అభ్యంతరాల పరిష్కారం విషయంలో రీజియన్‌లో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఒక్క సామర్లకోటలోనే 2010-11, 2011-12 ఆడిట్ పూర్తిచేసుకున్నట్లు చెప్పారు. ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికి మున్సిపాల్టీల వారీగా త్వరలో కొత్తగా అకౌంటెంట్ పోస్టులు భర్తీచేసేందుకు ప్రభుత్వం, మున్సిపల్ డైరెక్టర్ కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్రప్రసాద్, మేనేజర్ బోళ్ళ శ్రీ్ధర్, అకౌంటెంట్ ఎం నాగేశ్వరరావు, కాకినాడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ రాజా రామ్ మనోహర్, మురళీకృష్ణ, సీనియర్ ఆడిటర్లు పాల్గొన్నారు.
60 గ్రాముల బంగారం, 38 వేల నగదు చోరీ
ముమ్మిడివరం, జనవరి 17: మండలంలోని అనాతవరంలో ఒక ఇంట్లో దొంగలు చొరబడి రూ 2.50 లక్షలు విలువైన బంగారం, రూ 38 వేల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనాతవరం హైస్కూల్ సమీపంలోని మెయిన్ రోడ్డులో ఎరువుల దుకాణం ఏర్పాటుచేసుకుని అందులోనే కాపురం ఉంటున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో అత్తవారింటికి వెళ్ళాడు. దీంతో ఇంట్లో పరుపులో దాచిపెట్టిన 48 గ్రాముల బరువు గల నాలుగు గాజులు, 22 గ్రాముల నక్లెస్‌తో పాటు, 38 వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు. దీనిపై శ్రీనివాసరావు గురువారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సంఘటన స్థలాన్ని సిఐ మహమ్మద్ ఆలీ, ఎస్సై కూర్మారెడ్డిలు పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎక్సైజ్ కానిస్టేబుళ్ళ దేహ ధారుఢ్య పరీక్షలు ప్రారంభం
కాకినాడ సిటీ, జనవరి 17: ఎక్సైజ్ కానిస్టేబుళ్ళ దేహ ధారుడ్య పరీక్షలు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండులో గురువారం ప్రారంభమయ్యాయి. ఎక్సైజ్ డిసి జోసఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో 90 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా 22వేల 840 దరఖాస్తులు ఎక్సైజ్ శాఖకు అందాయి. వీరికి గత నెలలో 4 కిలోమీటర్ల పరుగుపందెం పరీక్షను నిర్వహించగా 10వేల 492 మంది దేహధారుఢ్య పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 961 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరికి రోజుకి 500 మందికి చొప్పున ఫిబ్రవరి 13తేదీ వరకు దేహధారుఢ్య పరీక్షలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మహిళా అభ్యర్థులకు ఫిబ్రవరి 2న దేహధారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిసి జోసఫ్ పేర్కొన్నారు.
ఎన్‌టిఆర్ సైకత శిల్పానికి నివాళులు
కాకినాడ, జనవరి 17: తెలుగుజాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత రాష్ట్ర మాజీముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు 18వ వర్థంతి సందర్భంగా టిడిపి కాకినాడ నగర శాఖ మాజీ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఎన్టీఆర్ సైకత శిల్పాన్ని నిర్మించారు. కాకినాడ బీచ్‌లో ఆయన ఏర్పాటుచేసిన ఈ శిల్పాన్ని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి, ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగుజాతి, భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారంటూ ఈ సందర్భంగా కొనియాడారు.
రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ పోటీల ఛాంపియన్‌గా తమిళనాడు
రామచంద్రపురం, జనవరి 17: రామచంద్రపురం పట్టణంలోని శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో ఈ నెల 13 నుండి 16వ తేదీ అర్ధరాత్రి వరకు జరిగిన 7వ రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ పోటీలు ఘనంగా ముగిసాయి. మహిళలు, పురుషుల ఛాంపియన్‌షిప్ రోలింగ్ షీల్డ్‌లను తమిళనాడు క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో రాష్టస్థ్రాయి పోటీలలో రాష్ట్రేతరానికి చెందిన సత్యభామ యూనివర్శిటి చెన్నై టీమ్ ప్రథమ స్థానాన్ని గెలుచుకుని, రోలింగ్ షీల్డ్‌ను అందుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయవాడకు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే క్రీడాకారులు సాధించి, కప్‌ను అందుకున్నారు. మహిళా విభాగంలో తమిళనాడు క్రీడాకారిణులు ప్రథమ స్థానాన్ని సాధించి, రోలింగ్ షీల్డ్‌ను అందుకున్నారు. రాష్టస్థ్రాయి పోటీలలో తమిళనాడుకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం విశేషం. కాగా మరో రాష్టమ్రైన చత్తీస్‌ఘడ్‌కు చెందిన బాస్కెట్‌బాల్ క్రీడాకారిణులు ద్వితీయ స్థానం సాధించి, కప్‌ను కైవసం చేసుకున్నారు. బహుమతి ప్రదానోత్సవ సభలో రామచంద్రపురం డియస్‌పి సైబేవార్ శ్రీనివాస్, పారిశ్రామికవేత్త గజ్జరపు సూరిబాబు, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఛైర్మన్ చింతా రామ్మోహనరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మునగాల మణ్యం, రామచంద్రపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ గన్నమని చక్రవర్తి, గెడా శ్రీనివాస్, పిల్లా వీరవెంకట సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ ఎంట్రీ విధానంతో మున్సిపాల్టీల సమగ్ర సమాచారం
సామర్లకోట, జనవరి 17: రాష్టవ్య్రాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో ప్రవేశపెట్టిన డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ విధానం వల్ల ఆయా మున్సిపాల్టీల సమగ్ర సమాచారం తక్షణమే తెలుస్తుందని స్టేట్ ఆడిట్ రీజినల్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సామర్లకోట మున్సిపాల్టీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలను ఆర్‌డి బృందం పరిశీలించింది. కమిషనర్ ఛాంబర్‌లో ఆయన రికార్డుల తనిఖీలు నిర్వహించారు. డబుల్ ఎంట్రీ విధానం రాష్ట్ర వ్యాప్తంగా 2009 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిందన్నారు. ఆయా మున్సిపాల్టీల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు వెనువెంటనే లభిస్తాయన్నారు. ప్రభుత్వాలు నిధుల విడుదలకు కూడా ఈ విధానం అవసరమన్నారు. మున్సిపాల్టీల వారీగా ఆడిట్ అభ్యంతరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. జిల్లాలో కాకినాడలో 1475 ఆడిట్ అభ్యంతరాలు, రాజమండ్రిలో 1959, మండపేటలో 396, రామచంద్రపురంలో 1291, తునిలో 709, పెద్దాపురంలో 1520, అమలాపురంలో 1205, పిఠాపురంలో 756 చొప్పున ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్డీ వివరించారు. ఆడిటింగ్ విషయంలో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. వచ్చిన జవాబులు మున్సిపాల్టీల వారీగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ రాజారామ్‌మోహన్, మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్ర ప్రసాద్, మేనేజర్ బోళ్ళ శ్రీ్ధర్, అకౌంటెంట్ ఎం నాగేశ్వరరావు, సీనియర్ ఆడిటర్లు పాల్గొన్నారు.
జిల్లాలో లక్ష వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం:కలెక్టర్
ఏలేశ్వరం, జనవరి 17: స్వబ అభిమాన్ ఉద్యమంలో భాగంగా జిల్లాలో లక్ష వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో కృషిచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలేశ్వరం మండలంలో రమణయ్యపేట గ్రామంలో ఆమెతో పాటు పెద్దాపురం ఆర్డీవో డా. శివశంకర వరప్రసాద్, స్వబ అభిమాన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం. జ్యోతి, డ్వామా ఎపిడి నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామసభ ఏర్పాటుచేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం 49 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి అనుమతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ పివి థామస్, తహసీల్దార్ కె.జె. ప్రకాష్‌బాబు, మండల ఇంజనీరింగ్ అధికారి సూర్యనారాయణ, గృహనిర్మాణ సంస్థ ఎఇ ముద్రగడ నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు అలమండ చలమయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరెడ్డి గోపి, వైభోగుల సుబ్బారావు, అనంతారపు రాజు పాల్గొన్నారు.
పిహెచ్‌సి ఆకస్మిక తనిఖీ
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను గురువారం జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఆమె రికార్డులను పరిశీలించి వార్డుల్లో పర్యటించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డుల తనిఖీ అనంతరం ఆసుపత్రిలో అయిదుగురు వైద్యులు పనిచేస్తున్నట్టు గుర్తించి, రోజుకు వందమందికి వైద్యసహాయం అందించాలని సూచించారు. అనంతరం ఆమె ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి చెత్తాచెదారం వుండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వాటిని నిర్మూలించాలని ఆదేశించారు.
అయితే ఆసుపత్రి అభివృద్ధి నిధులు లేనందున తాము ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని వైద్యులు ఆమె దృష్టికి తెచ్చారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోనులో సంప్రదించి ఏలేశ్వరం సిహెచ్‌సికి నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శివశంకర వరప్రసాద్, తహసీల్దార్ కెజె ప్రకాష్‌బాబు, ఎంపిడిఒ థామస్ పాల్గొన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. గోపి జిల్లా కలెక్టర్‌కు ఆసుపత్రిని వివరించారు. ఏలేశ్వరం ఆసుపత్రికి సివిల్ సర్జన్‌ను నియమించాలని కోరగా ఆమె స్పందిస్తూ వారం రోజుల్లోగా సివిల్ సర్జన్‌ను నియమించనున్నట్టు ప్రకటించారు.
హిందూధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
తుని, జనవరి 17: హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి అన్నారు. మండలంలో కుమ్మరిలోవ సమీపాన గల తపోవనంలో స్వామీజీ గురువారం భక్తులకు హిందూధర్మ విశిష్ఠతను వివరించారు. తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీమఠ అర్చకులు శ్రీ శారదా చంద్రవౌళీశ్వర పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాస్వామి వారికి భక్తులు పాదపూజ, భిక్షావందనం, వస్త్ర సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. తపోవనంలో ఇటీవల ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను జగద్గురువు దర్శించారు. రెండు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు తపోవనంలో జరగడంతో పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఆశ్రమానికి అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పంచె, కండువా ధరించి సాంప్రదాయ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు స్వామివారిని దర్శించుకుని, ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో శంకరానంద సరస్వతి, విద్యానంద స్వామీజీ, కృష్ణ్భట్, సిఎస్‌కె శర్మ, సోమశేఖర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుసుమంచి శోభారాణి దంపతులు, మున్సిపల్ కమిషనర్ యు శారదాదేవి, తోట నగేష్, మూర్తి, శ్రీ్ధర్, శర్మ, శివాజీ, పుల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీ తీర్థ మహాస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు.