ఏలూరు, జనవరి 17 : వీరిచ్చే మాత్రలు పరలోక యాత్రకు సన్నాహాలా... అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. రానురాను మందుల దుకాణాల వ్యవహార శైలి శృతిమించుతూ రాగాన పడుతుందనడానికి ఇటీవల కాలంలో జరిగిన దాడులు ఆ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తాయి. కేవలం మూడు నెలల కాలంలో 27 మందుల దుకాణాలకు సంబంధించి లైసెన్సులను సస్పెండ్ చేసే పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఏ విధంగా మారుతుందో అర్ధం చేసుకోవచ్చు. అది కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఔషధ నియంత్రణ శాఖ బృందాల తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఇటీవల జరిగిన ఈ తనిఖీల్లో ఏలూరు, భీమవరం పరిధుల్లో పలు దుకాణాల లైసెన్సులను సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెన్షన్ కేవలం తాత్కాలిక చర్యగానే నిలుస్తుండగా, తిరిగి ఆ దుకాణాలన్నీ యధాప్రకారం వ్యాపార లావాదేవీలను నిర్వహించుకుంటూ వస్తున్నాయి. ఏలూరులో పరిస్థితి చూసినా ఆశాజనకంగా ఏ దశలోనూ కనిపించడం లేదనే చెప్పుకోవాలి. అత్యధిక శాతం దుకాణాల్లో ఓవర్ ది కౌంటర్ మందులే విపరీతంగా అమ్ముడవుతున్నాయని చెప్పుకోవాలి. ఒక రకంగా చూస్తే చాలా వరకు మందుల దుకాణాలు చాలా వరకు వైద్యశాలల మాదిరిగానే తమ లావాదేవీలను నిర్వహిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక్క శస్తచ్రికిత్సలకు మినహాయించి మిగిలిన అన్ని రకాల వైద్యాలు మందుల షాపుల్లోనే అందుబాటులో వుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. దెబ్బలు తగిలితే డ్రస్సింగ్ చేయడం దగ్గర నుంచి అవసరమైన ఇంజక్షన్లు అందించడం వరకు మందుల షాపుల్లోనే సాగిపోతున్నాయి. మరోవైపు వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మందుల దుకాణంలోనే ప్రిస్క్రిప్షన్ కూడా తయారు చేసేసి మందులు ఇచ్చే సంస్కృతి దాదాపు అన్ని దుకాణాల్లోనూ వుందంటే ఆశ్చర్యం కాదు. వీటి వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయన్న విషయంలో నిపుణులు, వాటిని ఎదుర్కొన్న వారికి స్పష్టంగానే తెలుస్తుంది. ఇవన్నీ దాదాపు నగరంలోని దుకాణాల్లో కూడా యధావిధిగా సాగిపోతుండగా వీటిపై నియంత్రణ సాధించి నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన యంత్రాంగం మాత్రం ఇటీవలి కాలంలో కొంత నెమ్మదించిందనే చెప్పుకోవాలి. దీనికి తోడు ఇటీవల దాడులు జరిగిన దుకాణాల పరిధిలో బయటపడిన లోపాలను చూస్తే కొంత ఆందోళన కలగకమానదు. చాలా వరకు దుకాణాల్లో ఫార్మసిస్టుల ప్రమేయం లేకుండానే మందుల విక్రయాలు జరిగిపోతున్నాయి. అంతేకాకుండా కొన్ని దుకాణాలకు సంబంధించి ఫార్మసిస్టులు దుకాణంలోనే వున్నారని చెబుతున్నప్పటికీ కనీసం ఆ సబ్జెక్టులు చదివిన వారెవరూ ఆ దుకాణంలో కనిపించరంటే అతిశయోక్తి కాదు. అటువంటి వారే మందులను అందించడం, ఇంజక్షన్లు చేయడం, డ్రస్సింగ్ నిర్వహించడం వంటివి యధాలాపంగా పూర్తి చేసేస్తుంటారు. వీటితోపాటు కొన్ని రకాల మందులను తక్కువ ఉష్ణోగ్రతలోనే నిల్వ ఉంచాల్సి వుంటుంది. ఈ ఉష్ణోగ్రత విషయంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ మందులు విషపూరితంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అయినప్పటికీ కొన్ని దుకాణాల్లో మందులను నిల్వ ఉంచే అవకాశం లేకపోవడం, మరికొన్ని చోట్ల మందులను నిల్వ చేసే అలమారాలు దుర్గంధభూయిష్టంగా మారడం కూడా ఆందోళనకరంగా మారుతోంది. ఈ పరిస్థితుల పట్ల ఇటీవల దాడులు నిర్వహించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులే విస్తుపోయారంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మెడికల్ రిప్రజంటేటివ్‌లు, మందుల దుకాణాల మధ్య సాగుతున్న లావాదేవీలు కూడా అభ్యంతరకరంగానే కనిపిస్తున్నాయి. ఫిజీషియన్ శాంపిల్స్ విక్రయాలు అన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధమైన చాలా చోట్ల వాటిని యధేచ్ఛగా విక్రయిస్తుండటం గమనార్హం. శాంపిల్స్ ద్వారా ఆయా కంపెనీలు తమ మందులను ప్రచారం చేసుకునేందుకు నిర్ధేశించుకుంటే వాటిని దుకాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారు మరికొంతమంది. అయితే ఇటువంటి శాంపిల్స్‌ను దుకాణదారులు అనుమతించకూడదని స్పష్టమైన నిబంధనలువున్నా వాటిని అమలు చేస్తున్న వారి సంఖ్య తక్కువగానే వుందని చెప్పుకోవాలి. ఏది ఏమైనా గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో మందుల దుకాణాలలో నిబంధనల అమలుపై నియంత్రణ కొంత తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి.
మూలస్థాన అగ్రహారం వద్ద హత్య
మృతుడు పాలకొల్లు ఎమ్మెల్యే కుమారుడు - స్నేహితుడే నిందితుడు
ఆలమూరు, జనవరి 17: పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి కుమారుడు శ్రీజీవన్ (35) దారుణ హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లాఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపక్కన శ్రీజీవన్‌ను పథకం ప్రకారం నిందితుడు హతమార్చాడు. వివరాలిలావున్నాయి. పాలకొల్లు ఎమ్మెల్యే ఉషారాణికి ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన శ్రీజీవన్‌ను రాజమండ్రిలో నివాసం ఉంటున్న తన సోదరికి ఉషారాణి గతంలోనే దత్తత ఇచ్చేశారు. రాజమండ్రిలో నివాసం ఉంటున్న శ్రీజీవన్ తన స్నేహితుడైన నల్లంశెట్టి వీరబాబుతో కలిసి పలు వ్యాపారాలు ప్రారంభించారు. అయితే గత కొంతకాలంగా వీరిమధ్య వ్యాపార లావాదేవీల్లో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి శ్రీజీవన్, వీరబాబు రావులపాలెం కారులోబయలుదేరారు. అయితే మార్గమధ్యంలో మూలస్థానం వద్ద కాలకృత్యాలకు శ్రీజీవన్ దిగగా వెనుకగా వచ్చిన వీరబాబు కత్తితో విచక్షణారహితంగా పొడిచి, హతమార్చాడు. అనంతరం నిందితుడు రావులపాలెం పోలీసులకు లొంగిపోయాడు. దీనిపై మండపేట, రావులపాలెం సిఐలు పివి రమణ, చిలకా వెంకట్రామారావు, స్థానిక ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
హోరా హోరీగా కబడ్డీ పోటీలు
నిరాశపరచిన ఆంధ్రా జట్లు - నేడు సెమీస్, ఫైనల్స్
నరసాపురం, జనవరి 17: రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో శ్రీ గోగులమ్మ తల్లి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఫైనల్స్‌లో బెర్త్ సంపాదించేందుకు క్రీడాకారులు చెమటోడుస్తున్నారు. గాయాలను సైతం తట్టుకుని తమ జట్టు విజయానికి పాటు పడుతున్నారు. క్రీడాకారులు ప్రదర్శిస్తున్న పోరాట పటిమకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఫైనల్స్ శుక్రవారం జరగనున్నాయి. గురువారం రాత్రి వరకు జరిగిన పోటీల వివరాలిలా ఉన్నాయి. పురుషుల విభాగంలో ఎస్‌టిసి హైదరాబాద్, పూణె పోలీసు జట్టుపై 29-16 పాయింట్ల ఆధిక్యతతో గెలిచింది. బిఎస్‌ఎఫ్ ఢిల్లీ, కలకత్తా పోలీసు జట్ల మధ్య పోటీ ఏకపక్షంగా సాగింది. ఈ పోటీలో బిఎస్‌ఎఫ్ ఢిల్లీ 14-4 పాయింట్లతో విజయం సాధించింది. సిఆర్‌పిఎఫ్ ఢిల్లీ, బెస్ట ముంబాయి జట్ల మధ్య జరిగిన పోరులో సిఆర్‌ఎఫ్ ఢిల్లీ జట్టు 27-7 పాయింట్లతో గెలుపొందింది. అలాగే సౌత్ ఈస్ట్రన్ రైల్యే కలకత్తా, ఎస్‌టిసి హైదరాబాద్ మధ్య జరిగిన పోటీలో సౌత్ ఈస్ట్రన్ రైల్యే కలకత్తా జట్టు 26-9 పాయింట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. ఆంధ్రా, బిఎస్‌ఎఫ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బిఎస్‌ఎఫ్ జట్టు గెలిచింది. అలాగే మహిళల విభాగంలో ఢిల్లీ సెంట్రల్, ఠాణే మధ్య జరిగిన పోటీలో ఢిల్లీ సెంట్రల్ జట్టు 14 పాయింట్లతో విజేతగా నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్, పూణె జట్ల మధ్య జరిగిన పోరులో హిమాచల్‌ప్రదేశ్ జట్టు 21-7 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పాలెం స్పోర్ట్స్ క్లబ్ ఢిల్లీ, ఆంధ్రా జట్ల మధ్య జరిగిన పోటీలో పాలెం స్పోర్ట్స్ క్లబ్ ఢిల్లీ 17-11 పాయింట్ల ఆధిక్యతతో విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు తదితరులు పోటీలను వీక్షించారు.
ఇక సమైక్య ఉప్పెనే
22న మహాధర్నా:రైతాంగ సమాఖ్య
ఏలూరు, జనవరి 17 : సమైక్యాంధ్రను కాపాడటం కోసం ఇక ఉప్పెనలాంటి ఉద్యమాన్ని నిర్వహించక తప్పదని వివిధ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సమైక్యాంధ్రను కాపాడతారనుకుని నమ్మిన పార్టీలన్నీ ఈ ప్రాంతాన్ని నట్టేట ముంచాయని తెలంగాణకే పార్టీలన్నీ జై కొట్టడం దారుణమని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో దీనికి తగిన మూల్యాన్ని వారు చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా దేశ రాజధానిలో రాష్ట్ర విభజన విషయంలో సానుకూల సంకేతాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారిపోక తప్పదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్రను కొనసాగించి తీరాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక రైతాంగ సమాఖ్య జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు మాగంటి సీతారామస్వామి, అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాధ్, వివిధ సంఘాల నాయకులు ఆర్ ఎస్ హరినాధ్, నేరెళ్ల రాజేంద్ర, వంకాయల రామకృష్ణారావు, ఎల్ వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, కెబి రావు తదితరులు మాట్లాడారు. ఎటువంటి రక్షణలు లేకుండా విభజన దిశగా ఆలోచిస్తే ఈ ప్రాంతాన్ని నరకప్రాయంగా మార్చేసినట్లేనని వారు చెప్పారు. తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్ర రాజధానిగా భావించి హైదరాబాద్‌ను అంతా అభివృద్ధి చేస్తే ఇప్పుడు మాసొంతమని తెలంగాణ ప్రాంత నాయకులు చెప్పడం దారుణమన్నారు. జల వనరులతోపాటు విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలు ఉభయ ప్రాంతాల మధ్య వున్నాయని, వాటిని పట్టించుకోకుండా విభజన దిశగా ఆలోచిస్తే కోస్తాంధ్ర నాశనం కాక తప్పదని పేర్కొన్నారు. కేవలం రాజకీయం ప్రాతిపదికనే విభజన అంశాన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయని, ఇంతకన్నా శోఛనీయమైన వ్యవహారం మరొకటి వుండదన్నారు. తక్షణం విభజన ఆలోచనను విరమించుకుని సమైక్యాంధ్రను కొనసాగించాలని వారు కోరారు. విభజన దిశగా కేంద్రం ఆలోచన సాగితే ఈ ప్రాంతానికి ఏకైక ఆధారంగా నిలవాల్సిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా గందరగోళంలో పడిపోతుందన్నారు.
రాష్టమ్రంతటా అంధకారమే
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యుడు మెంటే
భీమవరం, జనవరి 17: రాష్ట్రం సమైక్యంగా లేకపోతే రాష్ట్రం అంధకారమవుతుందని, తాగునీటికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యుడు మెంటే పద్మనాభం అన్నారు. గురువారం స్థానిక టౌన్ రైల్వేస్టేషన్ వద్ద రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో సమైఖ్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని తీర్మానించారు. ఈ నెల 22న స్థానిక ప్రకాశం చౌక్‌లో ప్రజలు, నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యార్థులతో మహా ధర్నా, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వారు ఉద్యమాలు ఎక్కువగా చేస్తున్నారని, సీమాంధ్ర వారు ఏమిచేయడం లేదని, తెలంగాణ ఇస్తే సహించేది లేదన్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించేలా ఉద్యమాలు సాగిస్తున్నారన్నారు. తెలంగాణా విభజిస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని, తద్వారా కోస్తాంధ్ర ఏడారిగా మారుతుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు, నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యార్థులు సమైక్యాంధ్ర కోసం పోరాడాలన్నారు. ఈ సమావేశంలో రైతు కార్యాచరణ సమితి సభ్యుడు ఎంవి సూర్యనారాయణ, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, టిడిపి నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) , డెల్టా ప్రాజెక్టు డైరెక్టర్ రుద్రరాజు సత్యనారాయణరాజు(పండురాజు), కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ళ నాగేశ్వరరావు, జివి సత్యనారాయణరాజు, మంతెన కృష్ణంరాజు, పిఎఆర్‌కె రాజు, ఇందుకూరి శివాజీవర్మ, నౌవుడు నాయుడు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పథకాలపై ప్రజల అజమాయిషీ ఉండాలి
సమాచార హక్కు చట్టం ఆయుధం కావాలి:ఉండవల్లి
నల్లజర్ల, జనవరి 17: ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ప్రజల అజమాయిషీ తప్పనిసరిగా ఉండాలని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో గురువారం నిర్వహించిన గోపాలపురం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు హర్షద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపి ఉండవల్లి మాట్లాడుతూ ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకుని పథకాలు అమల్లో లోపాలను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలు చెల్లించిన పన్నులతోనే అమలవుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మన ఇంటిలో పనులను స్వయంగా నాణ్యతతో ఎలా చేయించుకుంటామో అదేవిధంగా ప్రజల సొమ్ముతో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల విషయంలోను అటువంటి శ్రద్ధే వహించాలన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించాలన్నారు. గ్రామాల్లో అవినీతిపై కేవలం పోస్టుకార్డు రాస్తే విచారణ జరిపి తక్షణం సమస్య పరిష్కరిస్తానని ఎంపి అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. అనంతరం మండలాల వారీగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. వారికి ఉండవల్లి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పెదిరెడ్డి సుబ్బారావు, ఉపాధ్యక్షుడుగా కోలా రవికిరణ్, శెట్టిపల్లి శివనాగరాజు, ఎఎంసి ఛైర్మన్ కెవికె దుర్గారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెల్లు వీరవెంకట్రావు, మాజీ ఎంపిపి చేబ్రోలు కొండ తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మొదలైన దేహదారుఢ్య పరీక్షలు
ఏలూరు, జనవరి 17 : ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీలో భాగంగా గురువారం ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన నాలుగు కిలోమీటర్ల పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎక్సైజ్ అధికారులు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. అభ్యర్ధుల ఒరిజినల్ సర్ట్ఫికెట్లను పరిశీలించి ఎత్తు, ఛాతీ కొలతలను నమోదు చేశారు. అనంతరం అభ్యర్ధులకు వంద మీటర్లు, 800 మీటర్లు పరుగుపందెంతోపాటు షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్‌లలో పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు పరీక్షలకు 504 మందికి గాను 410 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఎస్ ఎం రాజేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీ వరకు అభ్యర్ధుల ఒరిజినల్ సర్ట్ఫికెట్లు పరిశీలించి దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించి పారదర్శకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అయిదు అంశాలలో నిర్వహించే ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులను రాత పరీక్షకు అనుమతిస్తామన్నారు. అభ్యర్ధులు ఒరిజినల్ సర్ట్ఫికెట్లను తీసుకురాకపోతే దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించేది లేదని అన్నారు. ఎ ఆర్ డి ఎస్‌పి అశోక్‌బాబు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ వి మధుసూధన్‌రెడ్డి, ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాసరి శ్రీహరి, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదనరావు, భీమవరం ఎ ఇ ఎస్ ఎస్ సుఖేష్, ఎక్సైజ్ అధికారులు కె రామారావు, జి పాండురంగారావు, ఎస్‌కెడివి ప్రసాదరావు, డి ప్రభాకర్, జి నాగేశ్వరరావు, కె రామారావు, అబ్దుల్ ఖలీల్, కె కిరణ్‌కుమార్, కె రాజేంద్రప్రసాద్, పి సత్యనారాయణ తదితరులు దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. పలువురు పి ఇటిలు వీరికి సహకరించారు.
ఇక మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా ప్రజావాణి వినతుల స్వీకరణ
ఏలూరు, జనవరి 17 : జిల్లాలోని మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ తెలిపారు. జిల్లా నలుమూలల నుండి ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఏలూరుకు వచ్చి ఇకపై ఫిర్యాదులు అందజేయాల్సిన అవసరం లేదని సమీపంలోని మీ-సేవ కేంద్రం ద్వారా ప్రజావాణి దరఖాస్తులను అందిస్తే వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలివ్వడం జరుగుతుందని చెప్పారు. దీనివల్ల ఛార్జీలు కలిసిరావడమే కాకుండా ఒక రోజు సమయం వృధా కాకుండా వుంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్‌లైన్ ద్వారానే సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పిస్తున్నామని, పరిష్కరించిన సమస్యపై సంబంధిత ఫిర్యాదుదారునికి తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు పొందిన పట్టాదారు పాస్‌పుస్తకాలు నకలు కావాలన్నా మీ-సేవ కేంద్రాల ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. మున్సిపల్ పట్టణాలలో పుట్టిన బిడ్డ పేరును నమోదు చేయడానికి జనన, మరణ ధృవపత్రాలలో తప్పులను సరిదిద్దడానికి కూడా మీ-సేవ కేంద్రాలలో పౌరులకు సత్వర సేవలు అందిస్తామని చెప్పారు. రేషన్‌కార్డు నకలు కావాలన్నా, రేషన్‌కార్డులో పుట్టిన తేది, పేర్లలో ఉన్న తప్పులను సరిదిద్దడానికి కూడా మీ-సేవ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలోనే పోలీస్ సేవలను కూడా మీ-సేవ కేంద్రాల ద్వారా అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రజలకు సంబంధించిన ఏమైనా వస్తువులు గానీ, డాక్యుమెంట్స్, బ్యాంకు కార్డ్స్ పోయినట్లయితే పోలీసులకు దరఖాస్తు చేసుకోవడానికి మీ-సేవ కేంద్రాల ద్వారా వీలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. రాజకీయ పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన బందోబస్తు, పోలీస్ అనుమతులు కావాలన్నా మీ-సేవ కేంద్రాల ద్వారా సత్వరమే అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఏదైనా వ్యాపారం గానీ, సంస్థగానీ ఏర్పాటు చేయాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేయించుటకు మీ-సేవ కేంద్రాల ద్వారా అవకాశం కల్పించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
అభిలాషలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు మరమ్మతులు
జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నారాయణ వెల్లడి
బుట్టాయగూడెం, జనవరి 17: అభిలాష పథకం కింద రూ.1.55 కోట్ల వ్యయంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతిగృహాలకు మరమ్మతులు పూర్తిచేసినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి నారాయణ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సిఇఒ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో వసతి గృహ విద్యార్థులకు రూ.21 లక్షలతో సోలార్ దీపాలు, హీటర్లను అందించినట్లు చెప్పారు. ఒక్కొక్క వసతి గృహంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు యూనిట్‌కు రూ.1600 వంతున రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో ఆరు వసతి గృహాల మరమ్మతులకు రూ 11.03 లక్షలను వ్యయం చేసినట్లు ఆయన తెలిపారు. ఎంపిడివో వెంకటలక్ష్మి మాట్లాడుతూ మండలంలో గుంజవరం కాలనీ, సూరపవారిగూడెం కాలనీ, వేరుమద్దిగూడెం, బెడదనూరు, పండుగూడెం గ్రామాల్లో తాగునీటి వనరుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు. మంచినీటి సమస్యలు తలెత్తకుండా రెండు ప్రత్యామ్నాయ మోటార్లను కొనుగోలు చేస్తామని, చేతి పంపుల మరమ్మతులకు రూ.4 లక్షలను, రూ.3 లక్షలను చేతిపంపుల విడి భాగాల కొనుగోలుకు కోరినట్లు చెప్పారు.
పోలవరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్
పోలవరం, జనవరి 17: కొత్త రామయ్యపేట పునరావాస కేంద్రంలో నిర్మించిన డ్రెయిన్లు, సిమెంటు రోడ్లను జాయింట్ కలెక్టర్ టి. బాబూరావునాయుడు గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. కాలనీవాసులు జెసితో మాట్లాడుతూ మంచినీటికి ఇబ్బంది పడుతున్నామని, బోరు వేయించమని కోరగా ఆర్డీవో ఎన్‌వివి సత్యనారాయణతో మాట్లాడుతూ పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. జెసి విలేఖరులతో మాట్లాడుతూ కొత్తరామయ్యపేట పునరావాస కాలనీలో సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి గతంలో 26 లక్షల అంచనాలను 35 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదనలు రావడంతో అంచనాల పెంపు అవసరమా, కాదా అన్నది పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. అలాగే గతంలోని అంచనాలను కూడా పరిశీలిస్తామన్నారు. మామిడిగొంది నిర్వాసితులకు 17 మందికి ఇవ్వాల్సిన చెట్ల నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. జెసి వెంట పోలవరం తహసీల్దార్ ఐ. నాగేశ్వరరావు, ఎంపిడిఒ ఆర్ శ్రీదేవి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ టి. లోకేష్, పంచాయతీరాజ్ ఎఇ పి. పూర్ణచంద్రరావు వున్నారు.
ఆధార్ వేగవంతం కావాలి
గోపాలపురం: ఆధార్ కార్డుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బాబూరావు నాయుడు రెవెన్యూ అధికారులకు సూచించారు. మండలంలోని వేళ్ళచింతలగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని జెసి గురువారం సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి బాబూరావు నాయుడు రెవెన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పనుల్లో జాప్యం లేకుండా, ఎటువంటి తప్పులు దొర్లకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జెసి వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎన్‌వివి సత్యనారాయణ, తహసీల్దార్ కె గీతాంజలి పాల్గొన్నారు.
భూములు పరిశీలించిన జెసి
ఉంగుటూరు: కైకరం గ్రామంలో ఇళ్లస్థలాలకోసం కేటాయించిన 12 ఎకరాల 29 సెంట్లు భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ బాబూరావు నాయుడు గురువారం పరిశీలించారు. గ్రామకంఠం కింద ఉన్న 6 ఎకరాల 29 సెంట్ల భూమిని మెరక చేయించమని ఎంపిడిఒ రామును ఆదేశించారు. మిగిలిన రైతువారీలో ఉన్న 6 ఎకరాల భూమిని త్వరితగతిన స్వాధీనం చేసుకునే చర్యలు చేపడతామని జెసి చెప్పారు. అనంతరం ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ పరిధిలో విస్తరించి ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్న 40 ఎకరాల అటవీ భూమిని జెసి పరిశీలించారు. యూనివర్సిటీ వారు అభివృద్ధికోసం భూమి కావాలని కోరడంతో జెసి పరిశీలించారు. ఆ భూమికి సంబంధించిన రికార్డులను తీసుకురమ్మని రెవెన్యూ అధికారులను జెసి ఆదేశించారు. జెసి వెంట ఆర్డీవో నాగేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ బి ప్రసాద్, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం మండల సర్వేయర్లు మెహర్‌బాబా, రామకృష్ణ ఉన్నారు.
నేడు ఆంధ్రా బ్యాంకు రుణ మేళా
ఏలూరు, జనవరి 17 : ఏలూరు పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు అన్ని శాఖల ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్తు కార్యాలయం సమీపంలో శుక్రవారం రుణ మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రాబ్యాంకు ఏలూరు చీఫ్ మేనేజర్లు గిరికుమార్, సుదర్శన్‌లు తెలిపారు. రుణమేళా కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహిస్తారన్నారు. తక్కువ వడ్డీతో ఆకర్షణీయమైన గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు ఈ రుణమేళా కార్యక్రమంలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
దేవరపల్లి, జనవరి 17: గౌరీపట్నం గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామానికి చెందిన యువజ్యోతి యువజన సంఘ సభ్యులు పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావుకు గురువారం వినతిపత్రం అందజేశారు. గౌరీపట్నం ఇటీవల కొంతకాలంగా నిరాదరణకు గురవుతోందని, డ్రైనేజీలు, రోడ్లు పాడైపోవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. యువజ్యోతి యువజన సంఘ అధ్యక్షుడు కె. విజయ్ తదితరులు వినతిపత్రంపై సంతకాలు చేశారు.
హిందూచైతన్య శిబిరానికి స్వయం సేవకులు
భీమడోలు : ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగనున్న హిందూ చైతన్య శిబిరానికి భీమడోలు మండలం నుంచి స్వయం సేవకులు అధిక సంఖ్యలో బయలుదేరారు. గురువారం రాత్రి భీమడోలు జంక్షన్ నుంచి వీరు బయలుదేరారు. శుక్ర, శని, ఆదివారాలు గుంటూరులో జరగనున్న శిబిరాలకు హాజరుకానున్నారు.