గూడూరు, జనవరి 17: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపాలని సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం విజయరామ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని తరకటూరులో గో-ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆవుతో 30ఎకరాల భూమి సాగు చేయవచ్చని చెప్పిన సుభాష్ పాలేకర్ విధానాన్ని రైతులు పాటించాలన్నారు. విష రసాయనాల అవశేషాల వల్ల క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులు వస్తాయన్నారు. సేంద్రీయ వ్యవసాయంతో వాటిని నివారించవచ్చన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు జరిగాయని తెలిపారు. అలాగే ఏప్రిల్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో, ఏప్రిల్ 30, మే 1న నిజామాబాద్, మే 4, 5 తేదీల్లో నల్గొండ, 22, 23 తేదీల్లో కడప, 25, 26 విజయవాడ, 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఆసక్తి కలిగిన రైతులు పాల్గొనాలని విజయరామ్ కోరారు. కార్యక్రమంలో డా. బాబూరావు, రైతు నేస్తం సంపాదకులు వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే
క్రిమినల్ కేసులు
* కలెక్టర్ హెచ్చరిక
ఎ.కొండూరు, జనవరి 17: ప్రభుత్వానికి చెందిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం బుద్దప్రకాష్ జ్యోతి హెచ్చరించారు. గురువారం మండలంలోని పాతరేపూడి గ్రామాన్ని సందర్శించారు. ఉపాధి హామీ పథకం, నిర్మల్ భారత్ పథకం కింద నిరుపేద కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 31వేల మందిని గుర్తించి 24వేల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామని, ప్రతి మండలానికి తొలివిడతగా అయిదు గ్రామాలు ఎంపిక చేశామన్నారు. ఎ కొండూరు మండలంలో 362 మరుగుదొడ్లు మంజూరు చేశామని చెప్పారు. లబ్ధిదారులు పనులను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామంలో లోపించిన పారిశుద్ధ్యాన్ని పరిశీలించి, ప్రత్యేక అధికారులు మెరుగుపర్చాలని ఆదేశించారు. గొల్లమందల ఆర్‌ఎస్ నెంబరు 395 జెండా గట్టు భూమిని, ఆర్‌ఎస్ నెంబరు 402 బంగారు గుట్టలను కొందరు ఆక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదికను పంపించాలని తహశీల్దార్ శారదను ఆదేశించారు. ఎంపిడిఒ అనురాధ, డ్వామా పిడి హనుమానాయక్, డిపిఆర్‌ఓ రామారావు, ఎపిఒ వి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కోనేరులో మునిగి
ఇద్దరి మృతి
ఆగిరిపల్లి, జనవరి 17: స్థానిక మెట్ల కోనేరుకు స్నానానికని వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఆగిరిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ బాజీ (32) కరెంట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితుడైన షేక్ వలీ (26)తో కలసి వరాహ పుష్కరిణిలో సాయంత్రం స్నానానికని దిగా డు. వారిద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యుల రోదనలు చూపరులకు కంటతడి పెట్టించాయి. ఇద్దరు స్నేహితుల ఆకస్మిక మృతితో ఆగిరిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.
బాబు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు
జగ్గయ్యపేట రూరల్, జనవరి 17: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం..’ పాదయాత్రను పురస్కరించుకొని పార్టీ నేతలు, పోలీస్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 21న సోమవారం చంద్రబాబు జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ యం త్రాంగం సన్నద్ధమైంది. రాయలసీమ, తెలంగాణలో పాదయాత్ర ముగించుకొని ఆంధ్రాలోకి బాబు పర్యటన సాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాల నుండి క్యాడర్, పార్టీ నేతలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మండల, పట్టణ పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు పాదయాత్ర చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే వాహనాలను అనుమంచిపల్లి శివారు కోల్డ్‌స్టోరేజ్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించి ఆ ప్రాంతంలో విశాలంగా చదును చేస్తున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బి డిఇ కృష్ణమోహన్, చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లు నెట్టెం, ఎమ్మెల్యే రాజగోపాల్‌తో సమీక్ష నిర్వహించారు. ప్రధాన హవే కాకుండా అనుమంచిపల్లి, షేర్‌మహమ్మద్‌పేట సర్వీస్ రోడ్లలో చంద్రబాబు పాదయాత్ర సాగుతున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలి
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 17: నిరక్షరాస్యత నిర్మూలనకు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు కృషి చేయాలని వయోజన విద్య జిల్లా ఉప సంచాలకులు పి సరోజాదేవి అన్నారు. స్థానిక జగన్నాథస్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన లేడి యాంప్తిల్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ సేవాశిబిరం ముగింపు సభలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మదర్ థెరిస్సా స్ఫూర్తితో అంకిత భావంతో నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పొరుగువారిని ఆదరించడంలో తృప్తి కలుగుతుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు నిరక్షరాస్యత, జనాభా పెరుగుదల, పేదరికం వంటి కీలక సమస్యలపై దృష్టి కేంద్రీకరించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో సేవా కార్యక్రమాలను ఒక పండుగగా నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు అభినందనీయులని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యురాలు పి అనూరాధ అన్నారు.
సేవలతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసే నూతన విధానానికి లేడి యాంప్తిల్ కళాశాల విద్యార్థులు నాంది పలకడం ముదావహమని కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి కుసుమ హరనాథ్ బాబు, మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారి ఎ నరసింహారావు, అధ్యాపకులు మున్వర్, రాంబాబు, జాషువా పాల్గొన్నారు.
ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన
కూచిపూడి, జనవరి 17: ప్రజలిచ్చిన ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకునే విధంగా పోలీస్ సిబ్బందిని సమాయత్తపరిచామని అవనిగడ్డ డిఎస్పీ కె చాముండేశ్వరి పేర్కొన్నారు. గురువారం కూచిపూడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రజలు ఫిర్యాదులను స్వీకరించే విధంగా బాక్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై ఎటువంటి సమాచారాన్ని బయటకు అందకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టామన్నారు. అవనిగడ్డ సబ్ డివిజన్‌లో ఆరు పోలీస్ స్టేషన్‌లలో ఈ బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. తామిచ్చిన సమాచారంపై న్యాయం జరగలేదని భావించిన ఫిర్యాదుదారులకు సహాయపడే విధంగా జిల్లా ఎస్పీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారన్నారు. ఫిర్యాదుదారులు 9491063910 నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే సమస్య పరిష్కారానికి సిబ్బంది సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తారని చాముండేశ్వరి వివరించారు.
ప్రజావాణి అర్జీలకు
గడువులోగా పరిష్కారం
* డిఆర్‌వో విజయచందర్
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 17: ప్రజావాణి అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ విజయచందర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ హాల్‌లో వివిధ కార్యాలయాల సిబ్బందితో ప్రజావాణి అర్జీల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ప్రజల నుండి 62,891 అర్జీలు రాగా వీటిలో 62,080 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. 811 అర్జీలు వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. పెండింగ్ అర్జీలకు సంబంధించి ఎక్కువగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్యాలయంలో 84, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో 67, బందరు ఆర్‌డివో కార్యాలయంలో 33 అర్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. ప్రజలు వివిధ సమస్యలతో వచ్చి అర్జీలు సమర్పిస్తారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సాధారణంగా ప్రజావాణి అర్జీ పరిష్కారానికి 15రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ వాటిపై సమీక్షిస్తారని, ఈలోగా పెండింగ్ అర్జీలు పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు పరిష్కార సమాచారం తెలియజేస్తూ ఆన్‌లైన్‌లో అర్జీల పరిష్కారం నమోదు చేసి అప్‌డేట్ చేయాలని విజయచందర్ సూచించారు. సమావేశంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగరాజారావు, డిపివో కార్యాలయ ఎవో ఎస్ నరసరాజు, ఎస్‌ఎస్‌వో సరోజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భార్యని హింసించిన కేసులో
కానిస్టేబుల్‌కు రిమాండ్
తోట్లవల్లూరు, జనవరి 17: పెళ్ళయి ఏడాది కూడా కాకుండానే భార్యని హింస్తున్న ఓ కానిస్టేబుల్‌ను తోట్లవల్లూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకి తరలించగా రిమాండ్ విధించారు. పోలీసుల కథనం ప్రకారం... కైకలూరుకి చెందిన ఎం అజయ్‌కుమార్ తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ (1942)గా పని చేస్తున్నాడు. సుమారు ఏడు నెలల క్రితం ఏలూరు ప్రాంతానికి చెందిన ఇంద్రజను వివాహం చేసుకున్నాడు. మండలంలోని యాకమూరులో భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. భార్య ఇంద్రజను పెళ్ళయిన కొద్ది రోజుల నుంచి తీవ్ర హింసలకు గురిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే భార్యను హింసిస్తున్న విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా కానిస్టేబుల్ అజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేయలేదు. అయితే మంగళారం భార్య ఇంద్రజను తీవ్రంగా కొట్టటంతో గాయపడింది. గాయపడిన ఇంద్రజ ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్య ఫిర్యాదు మేరకు అజయ్‌కుమార్, అతని తల్లి మరియమ్మపై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్‌చేసి కోర్టుకి హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించారని ఎస్‌ఐ కె రమేష్ గురువారం వివరించారు.
ఎన్‌ఎస్‌ఎస్ యువజనోత్సవాల్లో
ఎల్బీఆర్సీఇకి పతకాలు
మైలవరం, జనవరి 17: కంచికచర్లలోని డీవీఆర్ అండ్ మిక్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన యువజనోత్సవాల్లో స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జనరల్ క్విజ్‌లో సీఎస్‌ఈ విద్యార్థులు పి చైతన్యసాయిరెడ్డి, సీహెచ్ వంశీకృష్ణ, జి షణ్ముక్ సుదర్శన్‌లకు ప్రథమ బహుమతి, రాత పరీక్షలు, సుడోకులో సీఎస్ విద్యార్థి పి చైతన్యసాయిరెడ్డి ప్రథమ స్థానం, చెస్‌లో బీవిఎస్‌బి కృష్ణారావు ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. సీఎస్‌ఈ విద్యార్థి పి చైతన్యసాయిరెడ్డి పాల్గొన్న మూడు విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించినట్లు వివరించారు. పతకాలు సాధించిన విజేతలను ఇందుకు కారణమైన ప్రోగ్రాం ఆఫీసర్ పి అశోక్‌రెడ్డిని ఆయన అభినందించారు. అదేవిధంగా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కూడా విజేతలను అభినందించిన వారిలో ఉన్నారు.
మినుము పొలాల పరిశీలన
కలిదిండి, జనవరి 17: మండలంలోని కోరుకొల్లు గ్రామంలో మినుము పొలాలను మండల వ్యవసాయ అధికారి సురేష్‌బాబు నాయక్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం మినుము పంట పూత దశలో ఉందని, పంటకు లద్దెపురుగు ఉద్ధృతంగా సోకిందని, రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని ఆయన సూచించారు. అలాగే బూడిద తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5గ్రాముల మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కె మురళీకృష్ణ, ఆదర్శ రైతులు బివిఎస్ ఆర్‌కె ప్రసాద్, టి రాము, సిహెచ్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.