Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భవిష్యత్తులో విశ్వానికి నేతృత్వం వహించేది భారత్

$
0
0

మంగళగిరి, జనవరి 17: భవిష్యత్తులో భారతదేశం విశ్వానికి నేతృత్వం వహించే శక్తిని పొందుతుందని, హిందూ చైతన్య శిబిర ప్రాంగణంలో భారతీయ ప్రజ్ఞ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆత్మవిశ్వాసం కలిగించడానికి ప్రేరణ అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ సురేష్‌జోషి (్భయ్యాజీ) అన్నారు. గుంటూరు - విజయవాడ నగరాల మధ్య మూడురోజుల పాటు జరుప తలపెట్టిన హిందూ చైతన్యశిబిరంలో భాగంగా గురువారం సా యంత్రం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. భారతీయ ప్రజ్ఞ ప్రదర్శన చూస్తే ప్రాచీన కాలానికి వెళ్ళినట్లుందని, కానీ ఇది పరిపూర్ణ జీవనానికి సం బంధించిందన్నారు. ఇతరుల వలన మనం అభివృద్ధిని సాధించామని అనేవారికి ఇది తప్పని తెలియ జేస్తోందన్నారు. ఈ ప్రదర్శన నేర్పటం కాదు ఒక ఆలోచన, అధ్యయనానికి మార్గం అవుతుందని సురేష్‌జోషి అన్నారు. రాక్షసత్వంపై పోరాటం చేయాలనే ఆలోచన దీని వలన వస్తుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా మన మనసులో ఏర్పడిన విత్తనం వృక్షం అవుతుందన్నారు. చాలా ఏళ్లుగా పతనమైన సంస్కృతి నిలబడటం మొదలయిందన్నారు. స్వాతంత్య్రానంతరం పాలనలో ఎవరున్నా అభివృద్ధిని సాధించామని, విద్య, సురక్ష, శాస్త్ర, సామాజిక రంగాల్లో ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. ప్రొఖ్రాన్‌లో అణుపరీక్షలు జరిపినప్పుడు అమెరికా లాంటి దేశాలకు కోపం వచ్చిందని మనపై గూఢచర్యం చేయడానికి అమెరికాలాంటి దేశాలు పంపినవి అణు పరీక్షలను కనిపెట్టలేక పోయాయని, దీంతో తమ బలహీనత బయటపడిందని అయన అన్నారు. భారతదేశంలో యువశక్తి అధికంగా ఉందని, యువతకు ప్రేరణ, శక్తి, వెలుగు ఇవ్వాల్సిన అవసరం ఉందని, 2020 నాటికి భారత్ సూపర్ పవర్ కంట్రీగా ఎదిగి అన్ని సవాళ్లను స్వీకరించే దేశంగా నిలుస్తుందని సురేష్‌జోషి అన్నారు. భారతీయుల ప్రతిభా పాటవాలకు నిదర్శనగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. కురుక్షేత్ర యుద్ధ్భూమి, పద్మవ్యూహం, అర్ధచంద్ర వ్యూహం, మకరవ్యూహం మొదలైన ప్రదర్శనలు ఆలోచింప చేసేవిగా ఉన్నాయని తిలకించిన పలువురు పేర్కొన్నారు. దత్తావధూత రామదూత స్వామీజీ చేవూరు (కావలి) శిబిర జ్యోతి ప్రజ్వలన గావించారు.
జలప్రభ కింద 5,484 మందికి భూ పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 17: ఇందిర జలప్రభ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకూ 14,440 ఎకరాల భూమిని 5,484 మంది లబ్ధిదారులకు అందజేసినట్లు కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం ఇందిర జలప్రభ అమలుపై తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాల కాల పరిమితి గల ఈ పథకం కింద 16 వేల ఎకరాల భూమిని అర్హత గల లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి క్లష్టర్లలోని 16 మండలాలు 66 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోందన్నారు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 1,313 మంది, ఎస్టీలు 4004 మంది, ఇతరులు 167 మంది ఉన్నారని చెప్పారు. ఇందుకోసం 16,73,72,000 రూపాయలు ఖర్చు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇచ్చిన భూములను సాగు చేసుకునేందుకు అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని త్వరితగతిన కల్పించాలన్నారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఇ జయభారతరావు, డిబ్ల్యుఎంఎ ప్రాజెక్టు డైరెక్టర్ టి అనిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విజిలెన్స్ దాడుల్లో 55.68 లక్షల విలువైన
580 బస్తాల గుట్కా ప్యాకెట్లు సీజ్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 17: ఇటీవల రాష్ట్రప్రభుత్వం గుట్కా ప్యాకెట్ల వినియోగంపై నిషేధం విధించడంతో వాటిని పెద్దఎత్తున అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా విజిలెన్స్ ఎస్‌పి అమ్మిరెడ్డికి అందిన సమచారం మేరకు బైపాస్ రోడ్డులోని మానస సరోవరం సమీపంలో ఓ గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. దాడుల్లో 55,68,000 రూపాయల విలువైన 580 బస్తాల గుట్కా ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఒక్కో బస్తాలో 4,800 గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. మానస సరోవరం సమీపంలోని గుంటూరుకు చెందిన వ్యాపారి ఎం శ్రీనివాసరావుకు గల గోడౌన్‌లో గుట్కా బస్తాలు పెద్దఎత్తున నిల్వచేశారు. గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ డిసిటిఒ శ్రీనివాసబాబు, డిసిటిఒ ఎల్లా చంద్రుడు, విజిలెన్స్ సిఐ రాజశేఖర్, ఎసిటిఒ ఎం శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి బి శ్రీనివాసరావు సిబ్బంది ఉన్నారు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
మేడికొండూరు, జనవరి 17: గుం టూరు- మాచర్ల ప్రధాన రహదారిలోని మేడికొండూరు బస్టాండ్ వద్ద గురువారం 4 గ్రామాలకు చెందిన రైతులు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీని కారణంగా నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండవ సారి ఆరుతడి పంటలకు అవసరమైన నీటిని మైనర్ కాల్వలకు ప్రభుత్వం సాగర్ నుండి విడుదల చేయకపోవడంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మేడికొండూరు రక్షిత చెరువును నింపేందుకు వీలులేకుండా అధికారులు తూములు బిగించడంతో తాగునీరు కూడా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్‌పి జోసఫ్‌కుమార్, సిఐ సుధాకరరావు రాస్తారోకో వద్దకు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా సాగర్ నుండి సాగునీరు అందించాలని, హామీ ఇచ్చిన మేరకు అధికారులు నేటికీ నీరు విడుదల చేయక పోవడంతో ఆందోళన చేస్తున్నామని, నీరు అందే వరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. రైతులు, అధికారులు కలిసి తహశీల్దార్ కార్యాలయంలో చర్చలు జరుపుదాం.. అధికారులను పిలిపిస్తామని డిఎస్‌పి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ రాస్తారోకోతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేడికొండూరు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ రాస్తారోకోలో సిపిఎం నాయకులు బొట్ల రామకృష్ణ, బోందలపాటి శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, కుర్రా బ్రహ్మం, విశదల, గుళ్లపాలెం, మేడికొండూరు, మంగళగిరిపాడు గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.
రైతులతో అధికారుల చర్చలు..
రాస్తారోకో అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రైతులతో జరిగిన సమావేశంలో తహశీల్దార్ పద్మావతి, సిఐ సుధాకరరావు, కెనాల్స్ జెఇ శ్రీలత, చర్చలు జరిపారు. జిల్లా కలెక్టర్, ఆర్‌డిఒ, కెనాల్స్ డిఇఇలకు సమాచారం అందించారు. గురువారం నుండి రెండు రోజుల పాటు తప్పక నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనైనా నీరు విడుదల చేయకుంటే గండ్లు కొట్టైనా పొలాలను తడుపుకుంటామని రైతులు స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

గుంటూరు (కొత్తపేట), జనవరి 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో అర్బన్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాలతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని పరిపాలన గాడి తప్పిందన్నారు. కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి చంద్రబాబు గుంటూరు జిల్లాలో పాదయాత్రకు వస్తున్న సందర్భంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజవర్గాల్లో పాదయాత్ర ఖరారైందన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి యాగంటి దుర్గారావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు తమ పదవులు కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. నగరంలో గత 7 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని, అధికారులు ఇష్టానుసారంగా ప్రజలు భరించలేనంతగా పన్నులు విధిస్తున్నారన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, మురుగునీటి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయన్నారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌ఎం జియావుద్ధీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వేర్పాటు వాద శక్తులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో వెన్నా సాంబశివారెడ్డి, కందుకూరి వీరయ్య, మనె్నం శివనాగమల్లేశ్వరరావు, ముత్తినేని రాజేష్, మద్దిరాల మ్యాని, అడపా బాబు, వేముల శ్రీరాం ప్రసాద్, ఎలుకా వీరాంజనేయులు, గోళ్ల ప్రభాకర్, నల్లపనేని విజయలక్ష్మి, ఈర్ల గురవయ్య, కేశవులు, చంద్రగిరి ఏడుకొండలు, దామచర్ల శ్రీనివాసరావు, బొంతలసాయి, మాదల వెంకటేశ్వర్లు, ముప్పాళ్ల మరళి పాల్గొన్నారు.

నరసరావుపేట డిఎస్పీని విచారించాలి
తెనాలి, జనవరి 17: శాసనసభ్యుల పట్ల కూడా దురుసుగా వ్యవహరించిన నరసరావుపేట డిఎస్పీ వెంకట్రామిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీలో విచారించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
గురువారం పట్టణంలోని స్పీకర్ నాదెండ్ల మనోహర్ నివాసానికి వచ్చిన నూజివీడు ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్రావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్, పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, వినుకొండ ఎమ్మెల్యే జివి అంజనేయులు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి బృందం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నరసరావుపేట డిఎస్పీ వెంకట్రామిరెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ మెమొరాండం సమర్పించారు. అంనంతరం తమను కలిసిన విలేఖర్లతో వారు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్‌లో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో ఆయనను పరామర్శించేందుకు వెళ్ళిన తమపై కూడా డిఎస్పీ దూకుడుగా వ్యవహరించాడని, శాసనసభ్యులన్న గౌరవం లేకుండా వ్యవహరించిన డిఎస్పీ వెంకట్రామిరెడ్డిని సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీకి పిలిపించి విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉందని, ఈ కేసు విషయంలో స్పష్టమైన వైఖరి ఉండేలా చూడాలని కోరినట్లు వివరించారు. ఇదే క్రమంలో అనారోగ్యంతో వైద్య సేవలు పొంది ఇటీవలే వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి నివాసానికి వెళ్ళిన ఆయన్ని పరామర్శించారు. వీరివెంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ కుద్దూస్, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి చంద్రమోహన్, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు బీమవరపు కోటిరెడ్డి, సుంకర హరికృష్ణ, వీరవల్లి మురళి తదితరులున్నారు.

పారదర్శకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, జనవరి 17: జిల్లాలో ఖాళీగా ఉన్న 82 ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక బిఆర్ స్టేడియంలో కానిస్టేబుల్ ఫోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ పోస్టుల నియామకం కోసం దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. గత నెలలో జరిగిన పరుగు పోటీల్లో విజేతలైన 8,147 మందికి గురువారం నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకూ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి కుళ్ళాయప్ప మాట్లాడుతూ అభ్యర్థులంతా తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసిన నకలు ధృవపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. కళాశాలల్లో విద్యార్హతల ధృవపత్రాలు ఉన్నట్లయితే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ వద్ద నుంచి లేఖను పొంది అటెస్ట్ చేసిన నకలు ధృవపత్రాలను తీసుకురావాలని కోరారు. 17వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకూ ప్రతిరోజూ ఉదయం ఐదున్నర గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఎం ఆదిశేషు, ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ బాబ్జీరావు, టి డేవిడ్ రవికాంత్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్మీ నియామకపు ర్యాలీకి విస్తృత ఏర్పాట్లు
* కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్
గుంటూరు, జనవరి 17: గుంటూరులో ఏప్రిల్ 3వ తేదీ నుండి జరగనున్న ఆర్మీ నియామకపు ర్యాలీ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్మీ ర్యాలీ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుండి 10వ తేదీ వరకూ బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగే ఈ ర్యాలీలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతారన్నారు. వారికి అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని కార్పొరేషన్ అధికారులు కల్పించాలని, ర్యాలీ జరుగుతున్న రోజుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ జనరేటర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్మీ అధికారులకు మున్సిపల్ అతిథి గృహంలోనూ, అభ్యర్థులకు స్టేడియంలోనూ వసతి కల్పించాలని తెలిపారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు, వైద్య సదుపాయాలతో పాటు ఆహార పొట్లాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఏడు జిల్లాల అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ఒక తహశీల్దార్‌ను పర్యవేక్షణాధికారిగా నియమించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయపు డైరెక్టర్ కల్నల్ ఎఎ జఫ్రీ మాట్లాడుతూ, ఏప్రిల్ 3వ తేదీ నుండి జరగనున్న రిక్రూట్‌మెంట్ ర్యాలీలో రోజుకు మూడు నుండి 5 వేల వరకు అభ్యర్థులు హాజరుకావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. విద్యార్హతల ధృవపత్రాల పరిశీలనకు విద్యా శాఖ నుండి, కుల, ఆదాయ ధృవపత్రాల పరిశీలనకు రెవెన్యూ శాఖ నుండి అధికారులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఆర్మీలో ప్రతి ఏడాది రెండు వేల పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుందన్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చే అధికారులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. బయోమెట్రిక్ విధానంలో నియామకం మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, అభ్యర్థులు మధ్యదళారీలను నమ్మవద్దని కల్నల్ జఫ్రీ స్పష్టం చేశారు. సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్ కేటగిరీలలో అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు ఏప్రిల్ 3, 4 తేదీల్లోనూ, ఇవే కేటగిరీలలో గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల వారికి 4,5 తేదీల్లో, సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరీకి సంబంధించి అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 5,6 తేదీల్లో రిక్రూట్‌మెంట్ ఉంటుందన్నారు. సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, డిఎస్‌సికి దరఖాస్తు చేసుకునే ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప జిల్లాలకు 8,9 తేదీల్లో, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం వారికి 9,10 తేదీల్లో ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జెసి కె శారదాదేవి, డిఆర్‌ఒ కె నాగబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
’రాష్ట్ర విభజన జరిగితే టిడిపియే బాధ్యత వహించాలి‘
నరసరావుపేట, జనవరి 17: రాష్ట్ర విభజన జరిగితే, దానికి కారణం తెలుగుదేశంపార్టీయేనని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు ఆరోపించారు. గురువారం స్థానిక మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణాకు హైదరాబాదును అప్పగిస్తే, సీమాంధ్ర ప్రజలకు అపార నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు. సమైక్యం కోసం తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరిని తెలపాల్సి ఉందన్నారు. నేలటూరి మురళి మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో తెలంగాణ విషయంపై చంద్రబాబునాయుడు సుముఖత వ్యక్తం చేశారని, అనంతరం ప్రణబ్‌ముఖర్జికి లేఖ రాశారని తెలిపారు. చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నినాదం, ఆంధ్రా ప్రాంతంలో ఆంధ్రా నినాదం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ సమావేశంలో షేక్ హుస్సేన్, బోయిన సుబ్బారావు, దుర్గాబాబు, వెంకటేశ్వర్లు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గోదా కల్యాణం
నరసరావుపేట, జనవరి 17: ధనుర్మాసం ముగింపు సందర్భంగా స్థానిక బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో బుధవారం రాత్రి గోదా కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి, అమ్మవారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, మహాసంకల్ప తదితర కార్యక్రమాలను నారాయణం సత్యనారాయణప్రసాద్, డాక్టర్ నారాయణం వెంకటరాంబాబు ఆధ్వర్యంలో నారాయణం మనోజ్‌కుమార్, నారాయణం జితేంద్రకుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాసమాజం అధ్యక్షుడు రాఘవరపు ఆంజనేయులు, చేబ్రోలు పుల్లారావు, అనుమోలు శ్రీనివాసరావు, అద్దెపల్లి రాముడు, నాగేంద్రమ్మ, మండా లక్ష్మణరావు, చిలకల జగన్నాధం, బాలాజీ, గోపాలరావుపాల్గొన్నారు. అనంతరం గోదాదేవికి మంగళా శాసనం, మంత్రపుష్పం జరిపారు. కల్యాణంలో పాల్గొన్న దంపతులకు మహదాశీర్వచనాలు అందజేశారు.
పల్స్‌పోలియో విజయవంతం చేయండి
తెనాలి రూరల్, జనవరి 17: పల్స్‌పోలియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృషి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొర్రా శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం మండలంలోని సంగంజాగర్లమూడి, కొలకలూరు పిహెచ్‌సిల పరిధిలో ఆదివారం జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంపై ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తుదముట్టించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. అనంతరం పిహెచ్‌సిల వైద్యులు డాక్టర్ ప్రేమ్‌చంద్, డాక్టల్ భాస్కరరావు మాట్లాడుతూ పల్స్‌పోలియో చుక్కలు వేసే విధానం, మందు వినియోగం, మోతాదు, ఫలితాలు, మందు నాణ్యతపై వారికి అవగాహన కల్పించారు. మండల పరిధిలో 5010 మంది చిన్నారులను పోలియో చుక్కలు వేసేందుకు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు మండల స్థాయిలో 40 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఆయా కేంద్రాల నిర్వహణకు ప్రత్యేక అధికారులను, వాహనాలను సిద్ధం చేశామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు గురువారం నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సిడిపిఓ సులోచనాదేవి మాట్లాడుతూ 0-5 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారికి తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు.
25న మలివిడత తులాభార కార్యక్రమం
అమరావతి, జనవరి 17: పంచారామక్షేత్రాల్లో అగ్రగామి అయిన అమరావతి దివ్యక్షేత్రంలో ఈనెల 25వ తేదీన శ్రీ అమర లింగేశ్వర సేవాసమితి గుంటూరు వారి ఆధ్వర్యంలో మలివిడత తులాభార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సేవా సమితి ప్రధాన కార్యదర్శి రాచమల్లు సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ 2006లో జిల్లా కేంద్రమైన గుంటూరులో అమర లింగేశ్వర సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆ నాటి నుండి ఇప్పటివరకు అనేక హోమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2011 నవంబర్‌లో కార్తీకమాసం సందర్భంగా బాల చాముండికా అమ్మవారికి నాలుగు లక్షల రూపాయల వ్యయంతో వెండి శ్రీ చక్ర మహామేరును సమర్పించడం జరిగిందన్నారు. స్వామివారికి రజతపూర్ణ కవచం, 36 కిలోల వెండితో సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా 11 కిలోల వెండిని దేవస్థానం ద్వారా తెనాలికి చెందిన ఫణీంద్రసాయి శిల్పశాలకు అందించినట్లు తెలిపారు. భక్తులు తులాభారాన్ని బియ్యంతో గానీ, ధనంతో గానీ తూగేందుకు వీలుగా ఇటీవల త్రాసును కూడా బహూకరించినట్లు తెలిపారు. ఈనెల 25వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరుద్రా నక్షత్రం రోజున స్వామివారికి రజతపూర్ణ కవచంపై మరో 11 కిలోల వెండిని సమర్పించడానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. అమరావతి క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తమ సేవా సంస్థ చేస్తున్న కృషిలో భక్తులు భాగస్వాములు కావాలని సురేష్‌కుమార్ కోరారు.

నెలాఖరులోగా 30 శాతం పన్నులు వసూలు
చేయకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళతా
నరసరావుపేట, జనవరి 17: ఈ నెలాఖరులోగా 30 శాతం ఇంటి పన్నులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శుల జాబితాను జిల్లా కలెక్టర్‌కి పంపుతానని జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌ఎంజీ బాషా హెచ్చరించారు. గురువారం స్థానిక ఎన్‌బీటీ అండ్ ఎన్‌వీసీ కళాశాలలో ఇంటిపన్నుల వసూళ్ళపై జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
వసూళ్ళకు చెందిన చలానా జిరాక్స్ కాపీలను నరసరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారికి అందజేయాలన్నారు. నూతనంగా నిర్మించిన ఇళ్ళకు ఆమోదించిన ప్లాన్ ప్రకారం ఇంటి పన్నులను వేసి, సమాచారాన్ని ఇవోపిఆర్‌డికు తెలపాలన్నారు. ఇప్పటివరకు ఆడిట్ చేయించని గ్రామ పంచాయతీలు త్వరితగతిన ఆడిట్ పూర్తి చేసి, నివేదికను తమవద్ద ఉంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న మంచినీటి రక్షిత పథకాల వివరాలను తెలియజేయాలన్నారు. పంచాయతీల్లో ఉన్న ఫంక్షన్ హాల్స్ నిర్మాణాలపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో పల్స్‌పోలియోను విజయవంతం చేయడానికి పంచాయతీ కార్యదర్శులు ఆరోగ్య సిబ్బందికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సెల్‌టవర్స్ ఫీజు వసూళ్ళ వివరాలను తెలపాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామసభలు నిర్వహించి, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. కోటప్పకొండ తిరునాళ్ళ నిమిత్తం మేజర్ గ్రామ పంచాయతీకి పది వేలు, మైనర్ గ్రామ పంచాయతీలు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్డీవో పేరుతో డిడిలు తీసి, డివిజనల్ పంచాయతీ అధికారికి అందజేయాలన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ళల్లో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుకు పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాలని డిపివో బాషా ఆదేశించారు. రావిపాడు పంచాయతీ రికార్డులను ఇన్‌చార్జి పంచాయతీ సెక్రటరీకి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ సర్‌చార్జీలను
తక్షణమే విరమించుకోవాలి
వినుకొండ, జనవరి 17: పెంచిన విద్యుత్ సర్‌చార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక శివయ్య స్థూపం సెంటర్‌లో సంకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏరియా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ సర్‌చార్జీల పేరుతో పేదలను దోచుకుంటున్నారని, ఇది సరైంది కాదన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ సర్‌చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి పెంచాలనుకుంటున్న విద్యుత్ చార్జీలను వెంటనే విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

భవిష్యత్తులో
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>