Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎమ్మెల్యేల క్వారీలపై దాడులు అర్ధరహితం

$
0
0

ఒంగోలు, జనవరి 17: అద్దంకి, దర్శి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారంతో వారిని కట్టడి చేసేందుకే గ్రానైట్ క్వారీలపై ప్రభుత్వం విజిలెన్స్ అధికారులచే దాడులు చేయించడం అర్ధరహితమని మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం గ్రానైట్ క్వారీలపై దాడులు నిర్వహించలేదని, పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగడంతో దాడులు జరిగాయన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేసినా పార్టీలో చేరే ఎమ్మెల్యేలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. పార్టీలో ఉంటే మంచివాళ్లని, పార్టీ మారితే చెడ్డవాళ్ళుగా అభివర్ణించే కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రశాంతంగా సాగిపోతున్న క్వారీలపై విజిలెన్స్ దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన అధికార పార్టీ నాయకులు, అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించే అధికారులు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సహకార సంఘాల ఓటర్ల చేర్పుల్లో అధికారపార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యదర్శులు, జిల్లా అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. సహకార సంఘాల ఓటర్ల చేర్పుల్లో ఎన్ని అక్రమాలు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణా అంశంపై గతంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో స్పష్టంగా చెప్పామని, ఆ మాటకే తమపార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే తమ చేతుల్లో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము అడ్డుకోలేమని ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

‘ప్రభుత్వాలను కూల్చకపోతే భవిష్యత్ ప్రశ్నార్ధకం’
ఒంగోలు అర్బన్, జనవరి 17: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే కూల్చకపోతే భావితరాల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లాపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పని చేశారన్నారు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా కోట్లాదిమంది గుండెల్లో చిరంజీవిగా నిలిచారన్నారు. వైఎస్ అమలు చేసిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవని, సోనియాగాంధీ సూచించినవేనని కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ హయాంలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీ పెంచలేదని, 2014 వరకు పెంచనని వైఎస్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటలపాటు నిరంతరాయంగా వైఎస్ విద్యుత్ సరఫరా చేశారన్నారు. ఇప్పటి వరకు 7 వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ భారాలను ప్రజలపై మోపారని మండిపడ్డారు. ఈ సంవత్సరానికి 12,700 కోట్ల రూపాయలు పెంచబోతున్నారని, సర్దుబాటు చార్జీలరూపంలో 10,200 కోట్ల రూపాయల భారాన్ని మోపారన్నారు. డీజిల్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వలన ఆర్‌టిసి, సర్వీస్ ట్యాక్స్, రసాయనిక ఎరువుల ధరలు అధికమయ్యాయన్నారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం క్వింటా పత్తి ఉత్పత్తికి 5,742 రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వం క్వింటాకు 3900 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నీలం తుపాను కారణంగా తడిసిన పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేయిస్తామన్న మాటలు నీటిమూటలుగానే మిగిలాయన్నారు. వైఎస్ ప్రమాణస్వీకారం చేసేనాటికి రాష్ట్రంలోని 22 కేంద్ర సహకార బ్యాంకులు ఉండగా 18 బ్యాంకులు దివాళా స్థితిలో ఉన్నాయన్నారు. వైద్యనాథన్ కమిటీ చేసిన సిఫారస్సుల మేరకు 1800 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి సహకార సంఘాలను వైఎస్ కాపాడారన్నారు. నేటి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఓటర్ల నమోదు కాలంచెల్లిన పాలకవర్గాల చేతులమీదగానే సాగించారన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు, సర్దుబాటు చార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుకు క్వింటా పత్తికి 1500 రూపాయలు బోనస్‌గా ఇవ్వాలని, రైతుల వద్ద ఉన్న పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, నాయకులు ముదవర్తి బాబూరావు, వి మురళి, కావూరి సుశీల తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకే మద్దతు
సీమాంధ్ర సదస్సుకు హాజరైన
మంత్రి, ఆరుగురు ఎమ్మెల్యేలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 17: సమైక్యాంధ్రనే కొనసాగించాలని సీమాంధ్ర నేతలు హైదరాబాదులో జరిగిన సదస్సులో తీర్మానం చేశారు. ఈ సదస్సుకు జిల్లాకు చెందిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, చీరాల, సంతనూతలపాడు శాసనసభ్యులు జివి శేషు, అన్నా రాంబాబు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఆదిమూలం సురేష్, బిఎన్ విజయకుమార్, ఎంఎల్‌సి పోతుల రామారావులు హాజరయ్యారు. సమైకాంధ్రనే కొనసాగించాలని, దేనికీ అంగీకరించేది లేదని తేల్చిచెప్పినట్లు కొండెపి శాసనసభ్యుడు జివి శేషు ఆంధ్రభూమి ప్రతినిధికి హైదరాబాదు నుండి చెప్పారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా సమైక్యాంధ్రకే కట్టుబడినట్లు గుర్తుచేశారు. ఇదిలాఉండగా తెలంగాణా ఇస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర విద్యార్థి జెఎసి సమావేశం ఒంగోలులో జరిగింది. ఈసమావేశానికి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావులు పాల్గొని సమైక్యాంధ్ర వాణిని గట్టిగా వినిపించారు. విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో పలురకాలుగా జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధుల గృహాలను విద్యార్థి జెఏసి నేతలు దిగ్బంధించి నిరసనలు తెలియచేశారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమంటూ విద్యార్థి జెఏసి నేతలు ప్రకటించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాగా ఈనెల 26వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కోకన్వీనర్ రాయపాటి జగదీష్ వెల్లడించారు. మొత్తంమీద కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు వేచిచూస్తున్నారు.

బౌద్ధ స్థూపాల చరిత్రను వెలుగులోకి తేవాలి
* కలెక్టర్ అనిత రాజేంద్ర పిలుపు
దొనకొండ, జనవరి 17: మండలంలోని చందవరం బౌద్ధ స్థూపాల చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అనిత రాజేంద్ర అన్నారు. గురువారం ఆమె చందవరం బౌద్ధ స్థూపాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆమెను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చందవరం బౌద్ధ స్థూపాలను సందర్శించాలని అనుకున్నప్పటికీ కుదరలేదని అన్నారు. బౌద్ధ స్థూపంపైకి ఎక్కి అక్కడ నిర్మించిన బౌద్ధుల పాఠశాలలను, సమాధులను, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మ్యూజియం, రిసార్ట్ భవనాన్ని పరిశీలించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ బౌద్ధ స్థూపం చరిత్రను వెలుగులోకి తెచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 7వేల సంవత్సరాల చరిత్రను పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చి అందరికీ తెలియచేయాలన్నారు. మండల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు షేక్ నవాబ్ మండల సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. బౌద్ధ స్థూపాల అభివృద్ధితోపాటు దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై వినతిపత్రం అందచేశారు. ఆమెతోపాటు తహశీల్దార్ కె వెంకటేశ్వరరావు, కురిచేడు తహశీల్దార్ వెంకటేశ్వర్లు, విఆర్‌ఓ శాస్ర్తీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

గిట్టుబాటు ధర కరవు
మిర్చి రైతు కంట కన్నీరు
క్వింటాలు 4 వేల రూపాయలే..
మార్కాపురంరూరల్, జనవరి 17: ఈ ఏడాది మిర్చి పంటకు రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటా ధర ఇదే సమయంలో 9వేల రూపాయలు పలకగా ప్రస్తుతం గుంటూరు మార్కెట్‌యార్డులో 4వేల రూపాయల నుంచి 4500 రూపాయల మధ్య మాత్రమే ఉండటం వలన తాము పెట్టిన పెట్టుబడులు కూడా రావనే ఆందోళన రైతుల్లో నెలకొంది. మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఈఏడాది మిర్చిని దాదాపు 16వేల హెక్టార్లలో సాగు చేయగా, మార్కాపురం మండలంలోనే 6వేల హెక్టార్లలో రైతులు సాగుచేశారు. ఎకరాకు దాదాపు 40వేల రూపాయల వరకు పెట్టుబడుల రూపంలో మిర్చిపంట కోసం రైతులు ఇప్పటివరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు దిగుబడులు రావచ్చునని రైతులు ఆశతో ఉన్నారు. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, కంభం మండలాల్లో అధిక విస్తీర్ణంలో మిర్చిని సాగుచేశారు. మార్కాపురం మండలంలో ఎల్‌బిఎస్ నగర్, కోలభీమునిపాడు, జమ్మనపల్లి, వేములకోట, తిప్పాయపాలెం, చింతగుంట్ల, మాల్యవంతునిపాడు తదితర గ్రామాల్లో గత ఏడాది కంటే ఈఏడాది మ్చిర్చి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. కొంతమంది రైతులు మిర్చిపంటకు నీటితడులు ఇచ్చేందుకు రాత్రిపూట పొలాల్లోనే నివాసం ఉంటున్నారు. మరోవైపు అడవి పందుల బెడద కూడా ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కాపాలా ఉంటున్నారు. ఇప్పటికే ఒక్కో ఎకరాకు రైతు దాదాపు 3 క్వింటాళ్ళ వరకు దిగుబడులు సాధించారు. ప్రస్తుతం మిర్చికోతలు ప్రారంభమైనా కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో రోజుకు 100 నుంచి 120రూపాయలు చెల్లించి మిర్చికోతలు చేస్తున్నారు. ఈ ఏడాది అనూహ్యంగా ఎరువుల ధరలు పెరగడంతో రైతులకు పెట్టుబడి వ్యయం కూడా పెరిగింది. గిట్టుబాటు ధర మాత్రం లభించలేదు. క్వింటాకు 7 నుంచి 8వేల రూపాయల వరకు కొనుగోలు చేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
మార్కాపురం డివిజన్‌లోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో 50వేల హెక్టార్లలో మిర్చిపంటను రైతులు ఈఏడాది సాగు చేశారు. అయితే ఈప్రాంతంలో మిర్చి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో అధిక వ్యయ ప్రయాసలకోర్చి లారీల్లో గుంటూరు మార్కెట్‌యార్డుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మిర్చిసాగు ఎక్కువగా ఉన్న దృష్ట్యా డివిజన్‌లోని ముగ్గురు ఎమ్మెల్యేలైన కందుల నారాయణరెడ్డి, డాక్టర్ ఎ సురేష్, అన్నా రాంబాబులు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రులతో మాట్లాడి మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముగిసిన సహకార ఓటర్ల నమోదు
చైర్మన్ రేసులో మేదరమెట్ల, కట్టా
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 17: జిల్లాలో సహకార సంఘాల ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసింది. జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షల 33వేల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల వర్గాల సమాచారం. త్వరలోనే ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తమ ఓట్లు ఉన్నాయా లేవా అన్న అంశంపైనే చర్చ సాగుతోంది. జిల్లాలో 173 సహకార సంఘాలు ఉండగా వాటిలో తొలివిడతగా ఈనెల 31వ తేదీన 80 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెల నాల్గవ తేదీన రెండవ విడతగా మిగిలిన సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల చేర్పింపులో అధికార పార్టీకి చెందిన నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆరోపించారు. గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలను జిల్లా జాయింట్ కలెక్టర్ పి లక్ష్మీనృశింహం, జిల్లా సహకార శాఖాధికారి కొండయ్యల దృష్టికి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఎంఎల్‌సి శిద్దా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు తీసుకువచ్చారు. అయినప్పటికీ అధికారపార్టీకి చెందిన నేతలు భారీగా ఓటర్లను చేర్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుత సిట్టింగ్ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈపాటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మెజార్టీ సహకార సంఘ అధ్యక్షులు ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆయన రేసులో ఉన్నారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ చైర్మన్ అభ్యర్ధిగా కట్టా శివయ్య పేరును ఆ పార్టీ ప్రకటించింది. ప్రధానంగా ఈ ఎన్నికలను ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్‌గా తీసుకుని నియోజకవర్గ ఇన్‌చార్జులతోపాటు ముఖ్యనాయకులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా తెలుగుదేశంపార్టీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నియోజకవర్గ ఇన్‌చార్జులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలను తమపార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని దామచర్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ
సిపిఐ సంతకాల సేకరణ
ఒంగోలు అర్బన్, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, విద్యుత్ సర్‌చార్జీలను రద్దు చేయాలని సిపిఐ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టిసి డిపో సెంటర్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం సామాన్య ప్రజల నడ్డివిరచడమేనన్నారు. దీనివల్ల లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని ధ్వజమెత్తారు. మరొకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు మూలిగేనక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి పివిఆర్ చౌదరి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. అసలే బ్యాంకింగ్ విధానాలతో సతమతమవుతున్న పరిశ్రమలు కుదేలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లూరి మురళి, గోగినేని వసంత్, ఎం మోహన్‌రావు, నాగరాజు, బాబు, నాగేశ్వరరావు, రాయుడు, వెంకట్రావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీనివాస కల్యాణం
మద్దిపాడు, జనవరి 17: మద్దిపాడు వేంకటేశ్వర ఆలయంలో గురువారం శ్రీనివాస కల్యాణం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై స్వామివారు, దేవేరుల ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు ఎం దీక్షితులు, గోపయ్య, ప్రసాద్ వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. భక్తుల సమక్షంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీనివాస కల్యాణాన్ని వేదపండితులు వేదాంతం వేణుగోపాల కృష్ణమాచార్యులు, పెద్దింటి రామచంద్రవరప్రసాద్ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ఘనంగా కల్యాణం నిర్వహించారు. కన్యాదాతలుగా డాక్టర్ దివి చిన్మయ, పద్మప్రియ దంపతులు పీటల మీద కూర్చుని వివాహం జరిపించారు. భక్తులు కల్యాణాన్ని కనులారా భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈసందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సృష్టికి మూలమైన పరమాత్మని ఆరాధించడం హిందువుల సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రధానమన్నారు. హిందువులందరు ఐక్యతతో దేవాలయాల పరిరక్షణకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ అంజనాదేవి, అర్చకులు, గ్రామపెద్దలు, కార్యనిర్వాహకులు, దాతలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను ఇఓ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఒంగోలు జాతి కోడెలను పెంచాలి
ఎమ్మెల్యే గొట్టిపాటి పిలుపు
పర్చూరు, జనవరి 17: అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశు సంపదను ప్రోత్సహించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్లబండ లాగుడు పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి అన్నంబొట్లవారిపాలెంలో నిర్వహిస్తున్న ఎడ్ల పోటీలలో పెద్దసైజు ఎడ్ల పోటీలకు బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు జాతి పశుసంపద దేశంలో మన జిల్లాకు గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపారు. పశుసంపద పరిరక్షణకు రైతులు , పశుపోషకులు కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజులలో గ్రామ గ్రామాన ఎడ్ల పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. పెద్దసైజు ఎడ్లపోటీలను గొట్టిపాటి రవికుమార్, నరసయ్యలు ప్రారంభించారు. నిర్వాహకులు గొట్టిపాటి బ్రదర్స్‌ను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ పోటీలలో మొత్తం 7 జతలు పాల్గొనగా, గుంటూరు జిల్లా సీతారాంపురానికి చెందిన దాసరి నారాయణరావు ఎడ్ల జత నిర్ణీత సమయంలో 1001.5 అడుగుల దూరం లాగగా, గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన నల్లబోతు వీరయ్య చౌదరి ఎడ్లు 1390.4 అడుగుల దూరం లాగాయి. నెల్లూరు జిల్లా జడదేవి గ్రామానికి చెందిన ఏనుగుంట నాగయ్య ఎడ్లు 1677 అడుగుల దూరం లాగాయి. ఈ కార్యక్రమంలో గోరంట్ల భాస్కరరావు, ఎం వెంకటరత్నం, తోకల కృష్ణమోహన్, కారుమంచి పాపారావు, దండా నారాయణ, పి వెంకటరావు, మధుబాబులు, భారీ సంఖ్యలో రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
ఎమ్మెల్యే బాలినేని ధ్వజం
కొనకనమిట్ల, జనవరి 17: కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలేందుకు సిద్ధంగా ఉందని, వైఎస్ జగన్మోహర్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేయించారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాయుడుపేట ఎస్సీకాలనీలో వైఎస్‌ఆర్ సిపి జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని, జనాదరణను ఎవరూ అడ్డుకోలేరన్నారు. సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బడుగు, బలహీన వర్గాలతోపాటు రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో మండలంలోని మట్టిరోడ్లను తారురోడ్లుగా మార్చానని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండుకోట్ల మంది జనం జగన్‌ను విడుదల చేయాలని సంతకాలు చేశారన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ సహకార సంఘం ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకు శాంతి కలిగించాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి, వైఎస్‌ఆర్ సిపి నాయకులు ఎం అశోక్‌రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, ఎం వెంకటరెడ్డి, కె వెంకటేశ్వరరెడ్డి, పి నారాయణరెడ్డి, కె శివయ్య, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, వినోద్, జి శ్రీను, మండల కన్వీనర్ రాచమల్ల వెంకటరామిరెడ్డి, యు శ్రీను, వి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టిడిపి నుంచి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిక
నాయుడుపేటలోని ఎస్సీ కాలనీవాసులు పలువురు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి సమక్షంలో చేరారు. మాజీ సర్పంచ్ పి తిరుపతయ్య, కె ఏలియా, ఆనందరావు, యేసుబాబు, సుందరరావు, సురేష్, నవనీతమ్మ, అబ్రహం తదితరులు ఉడుముల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

అనర్హుల ఓటర్లను తొలగించాలి
ఎమ్మెల్యే బూచేపల్లి డిమాండ్
ఎమ్మెల్యే, టిడిపి వర్గీయుల మధ్య వాగ్వివాదం
ముండ్లమూరు, జనవరి 17: సహకార సంఘాల ఎన్నికల్లో అనర్హులకు ఓటుహక్కు కల్పించరాదని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి డిమాండ్ చేశారు. ముండ్లమూరు వ్యవసాయ పరపతి సంఘంలో టిడిపి వర్గీయులు బోగస్ ఓటర్లను చేర్పించారని, విచారణ సక్రమంగా జరిపించి అనర్హులను జాబితా నుండి తొలగించాలని ఎమ్మెల్యే బూచేపల్లి గురువారం తన వర్గీయులతో కలిసి సొసైటీ కార్యాలయం వద్దకు వచ్చి ఎన్నికల అధికారి విజయ్ కుమార్‌రెడ్డికి, సొసైటీ కార్యదర్శి సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి వర్గీయులు కార్యాలయం వద్దకు వచ్చి బోగస్ ఓట్లను చేర్చే అవసరం తమకు లేదని వారితో వాగ్వాదానికి దిగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడి బోగస్ ఓట్లను మీరే చేర్చారని టిడిపి వర్గీయులు ఎమ్మెల్యేను అనడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరు వర్గీయులను బయటకు వెళ్ళాలని స్థానిక పోలీసులు సూచించడంతో ఎమ్మెల్యే బయటకు వస్తేనే తాము వస్తామని టిడిపి వర్గీయులు భీష్మించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముండ్లమూరు ఎస్సై సిహెచ్ శేషు ఇరువర్గీయులకు నచ్చజెప్పారు. అనంతరం సొసైటీ కార్యదర్శి కె సుబ్బారావు విలేఖర్లతో మాట్లాడుతూ సొసైటీలో 748 ఓట్లు ఉన్నాయని తెలిపారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ శిద్ధా రాఘవరావు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అనుచరులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మండలంలో మొత్తం ఆరు సొసైటీలు ఉన్నాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు తలపడుతున్నాయి.

సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ
26న కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు
ఒంగోలు, జనవరి 17: సమైకాంధ్రపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26వ తేదిన ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కోకన్వీనర్ రాయపాటి జగదీష్ తెలిపారు. స్థానిక శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జగదీష్ మాట్లాడుతూ ఈనెల 28వ తేదిన తెలంగాణా ఏర్పాటు విషయంలో ఏదోఒక ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందన్నారు. అయితే తాము 28వ తేదిన కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 25వ తేదిన జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని ఒంగోలులో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 26న రిలే నిరాహార దీక్షల అనంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 27 నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులందరు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని, అవసరమైతే ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. సమైక్యాధ్రకు అనుకూలంగా వ్యవహరించని ప్రజాప్రతినిధులను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రలోని ప్రజల మనోభావాలకు అనుకూలంగా సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, షిండేలు సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా ఉద్యమం బలంగా ఉందని అందువల్ల తెలంగాణా ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేయవచ్చన్న వదంతులు వస్తున్నాయన్నారు. తెలంగాణాను ఒకవేళ ప్రకటిస్తే సీమాంధ్రలో ఉద్యమం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద రాష్టమ్రని అన్నారు. అటువంటి రాష్ట్రాన్ని విడగొడితే సీమాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో సమైక్యాంధ్ర జెఎసి జిల్లా అధ్యక్షులు గోరంట్ల రవికుమార్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు చెన్నుపాటి అశోక్ యాదవ్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
ఒంగోలు, జనవరి 17: ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సమీపంలో గల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎస్ శ్రీనివాసరావు (31) అక్కడికక్కడే మృతి చెందాడు. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఒంగోలులోని కమ్మపాలెంలో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు గురువారం తెల్లవారుజామున ఒంగోలులోని మంగమూరురోడ్డులో ఆలూరుకు చెందినవారి సరుకులతోపాటు ఐదుగురు ప్రయాణికులను ఎక్కించుకొని ఆలూరుకు వెళ్ళాడు. అక్కడ సరుకులను, ప్రయాణికులను దించి తిరిగి ఒంగోలుకు వస్తుండగా ఒంగోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఫుట్‌పాత్‌ను ఆటో ఢీకొనడంతో ఆటో తిరగబడి ఆటోలో ఉన్న డ్రైవర్ శ్రీనివాసరావు కింద పడటంతో తలకు బలమైన గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు భార్య ఎస్ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపారు.

మాజీ మంత్రి బాలినేని ధ్వజం
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>