సూళ్లూరుపేట, జనవరి 16: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) 96వ జయంతి వేడుకలను గుమ్మడిపూడి మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ ఆధ్వర్యంలో ఎడిఎంకె నాయకులు గురువారం సూళ్లూరుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసి బస్టాండు వద్ద ఆయన చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంకె రాష్ట్ర కార్యదర్శి జి రత్నం,నాయకులు షాహుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యలక్ష్మి సమక్షంలో
కాంగ్రెస్‌లో చేరిన టిడిపి నేతలు
వెంకటగిరి, జనవరి 17: మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వెంకటగిరిలోని తన నివాసంలో మండలంలోని పెట్లూరు గ్రామానికి చెందిన పలువురు టిడిపి నాయకులు గురువారం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి ఖండువా కప్పి రాజ్యలక్ష్మి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులతో మాట్లాడుతూ సొసైటీ ఎన్నికల్లో గట్టిగా కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో సరైన ఆదరణ లేకపోవడంతో మరలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని పార్టీలో చేరిన నాయకులు రాజ్యలక్ష్మి తెలిపారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలాయపల్లి మండలం మాజీ ఎంపిపి వెందోటి సౌజన్యరెడ్డి మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ ఆ మండలో మంచి నాయకురాల్ని కోల్పోయిందని మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. గురువారం బాలాయపల్లి మండల జయంపులో జరిగిన సౌజన్య కర్మక్రియల్లో ఆమె పాల్గొని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పార్టీకే కుండా మండలంలోని ప్రజలకు తనదైన శైలిలో సవలందించారని కొనియాడారు.
స్టాపులు తగ్గించాలంటూ అద్దెబస్సు డ్రైవర్లు నిరసన
వెంకటగిరి, జనవరి 17: వెంకటగిరి డిపో మేనేజర్ వైఖరిని నిరసిస్తూ డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు డిపో ఎదుట గురువారం తెల్లవారి విధులకు హజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. వెంకటగిరి-నెల్లూరు మధ్యలో ఇప్పటికే ఎక్కువ స్టాపింగ్‌లు ఉన్నాయని డిఎం మరలా రెండు స్టేజీలు పెంచారని దీంతో వెంకటగిరి నుంచి నెల్లూరుకు వెళ్లాలంటే ఇచ్చిన సమయం సరిపోవడం లేదని చెప్పారు. కొత్త స్టాపుల్లో బస్సులు అపకపోవడంతో ప్రయాణికులు డైవర్ల పై దాడి చేస్తున్నారని తెలిపారు. పెంచిన స్టాపులను ఎత్తివేయాలని, డ్రైవర్ల పట్ల డిఎం మొండి వైఖరి మానుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలసుకున్న డిఎం రామ్మోహన్‌రావు డ్రైవర్లకు నచ్చజెప్పారు. విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు నిరసన విరమించుకున్నారు.
పామాయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
ముత్తుకూరు, జనవరి 17: ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఉన్న సరయువల పామాయిల్ కంపెనీలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు యాజమాన్యం పేర్కొంది. ప్రమాదంలో 35వేల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెనుప్రమాదం నుంచి తప్పిందన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ సర్ చార్జీలపై ప్రజా బ్యాలెట్ ఓటింగ్
నెల్లూరుసిటీ, జనవరి 17: విద్యుత్ సర్‌చార్జీలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు బస్టాండ్ వద్ద ప్రజాబ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహించారు. విద్యుత్ సర్‌చార్జీలు రద్దుకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్చందంగా ప్రజాబ్యాలెట్ ఓటింగ్‌ను ఉపయోగించుకున్నారు. తొలి ఓటును సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు జక్కా వెంకయ్య ఉపయోగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా బ్యాలెట్ ఓటింగ్ చూసి అయిన ప్రభుత్వం స్పందించి సర్‌చార్జీలు, విద్యుత్ చార్జీలు పెరుగుదలను ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యుత్ సర్‌చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. అసలే పెరిగిన ధరలతో ప్రజలు విలవిలాడుతుంటే విద్యుత్ సర్‌చార్జీల పేరుతోపేద ప్రజల దగ్గర వేల రూపాయాలను వసూలు చేస్తున్నారు. పేద వాడు సంపాదించిన డబ్బులు విద్యుత్ బిల్లులకు కూడా చాలడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ పతన ఖాయం అన్నారు. మిద్దె, గుడిసె ఇళ్ళు అని తేడా లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ఇష్టం వచ్చినట్లు బిల్లులను వేస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ చార్జీలు కట్టలేక చీకటి ఇంటిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వం పాత బకాయిల పేరుతో పేద ప్రజల దగ్గర సర్‌చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులను వసూలు చేయడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన విద్యుత్ సర్‌చార్జ్‌లను రద్దు చేయకపోతే దశల వారిగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సొసైటీ ఎన్నికల్లో
అక్రమాలు అరికట్టండి
ఇన్‌చార్జి అదనపు జాయింట్ కలెక్టర్‌కు ఎమ్మెల్యే మేకపాటి విజ్ఞప్తి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 17: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రెవెన్యూ యంత్రాంగం కూడా వివిధ చోట్ల అక్రమాలకు ఊతమిస్తోందని జిల్లా ఇన్‌చార్జి అదనపుజాయింట్ కలెక్టర్, డిఆర్‌ఓ బి రామిరెడ్డి వద్ద ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. గురువారం మేకపాటి డిఆర్‌ఓను సంప్రదించి సొసైటీ ఎన్నికల్లో జరుగుతున్న అవకతల్ని వివరించారు. ఇప్పటికైనా అక్రమాలను అదుపుచేయడం ద్వారా సహకార సంఘాల పటిష్ఠతకు కృషి చేయాలంటూ కోరారు. ఏదేమైనా రైతుల హృదయాంతరాల్లో కొలువై ఉన్న మహానేత వైఎస్ అభిమానులుగా పోటీ చేస్తున్న తమ పార్టీ మద్దతుదారులే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తధ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు.
విద్యుత్‌కోతకు నిరసనగా
రైతులు ఆందోళన
వెంకటగిరి, జనవరి 17: విద్యుత్ కోతకు నిరసనగా మండలంలోని వల్లివేడు గ్రామానికి చెందిన రైతులు గురువారం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. వల్లివేడు సబ్‌స్టేషన్ ముట్టడి, వెంకటగిరి- తిరుపతి రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం ఇస్తామన్న ఇస్తామన్నా కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో పెట్టిన వరి పైరు ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి వివరణ కోరగా సరైన సమాధానం లేకపోవడంతో రైతులు వల్లివేడు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం వెంకటగిరి- తిరుపతి రోడ్డు గంటపాటు బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు అవస్ధలు పడ్డారు. విషయం తెలసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతుల ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు.
దుకాణాలపై
మున్సిపల్ అధికారుల దాడులు
సూళ్లూరుపేట, జనవరి 17: సూళ్లూరుపేట పట్టణంలోని అన్ని దుకాణాలపై గురువారం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించారు. ప్రభుత్వం గుట్కా, పాన్ పరాక్ వంటి మత్తు పదార్థాలను నిషేధం విధించడంతో వాటిని విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు దుకాణాల్లో విక్రయిస్తున్న మత్తు పదార్థాలను వారు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాదారులెవరైన మత్తు పదర్ధాలు విక్రయిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్ఛరించారు.
ఇంధన సర్దుబాటు
చార్జీలకు సహకరించాలి
నెల్లూరుసిటీ, జనవరి 17: ఇంధన సర్దుబాటు చార్జీలకు విద్యుత్‌శాఖకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఇ నందకుమార్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. వినియోగదారులకు ఎఫ్‌ఎస్‌ఎకు సంబంధించి ఉన్న సందేహలు, అపోహలు తొలగించుకుని సంస్థకు సహకరించాలన్నారు. ప్రధాన జలాశయాల్లో నీటి కొరత కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. అందువల్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయుటకు బొగ్గు, గ్యాస్, ఫర్నేస్ ఆయిల్ వాటిపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందన్నారు. దానికి తోడు గ్యాస్ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిందన్నారు. గనులు, క్షేత్రములు నుండి ఉత్పత్తి చేసి రవాణా చేసి మన విద్యుత్‌ను జనరేటర్‌ల్లో ఉంచుతున్నామన్నారు. అవసరమైనప్పుడు విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఎపిఎస్‌పిడిసిఎల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ కొనుగోలు ధరలలో వచ్చు మార్పులకు అనుగుణంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందన్నారు. విద్యుత్ వినియోగదారులు కూడా విద్యుత్ పంపిణీ సంస్థలకు వారి విద్యుత్ వాడకం చార్జీలలోని వ్యత్యాసములు చెల్లించాలని కోరారు.
విభజనపై సోనియాదే నిర్ణయం
* ఆర్థిక మంత్రి ఆనం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 17: రాష్ట్ర విభజనా లేక సమైక్యంగా కొనసాగడమా అనేది తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయానుసారంగానే ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం బాలాయపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వెందోటి సౌజన్య ఉత్తరక్రియల్లో ఆయన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తెలంగాణా అంశంపై సోనియా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నారు. రేపోమాపో ఈ నిర్ణయం వెల్లడి కానుందన్నారు. అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని మంత్రి ఆనం వెల్లడించారు. దివంగత సౌజన్య భర్త మధుసూదనరెడ్డి కుటుంబీకుల్ని అమాత్యులు పరామర్శించారు.
సొసైటీ ఓటర్ల చేర్పుల్లో అక్రమాలు అరికట్టండి
ముత్తుకూరు, జనవరి 17: కృష్ణపట్నం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఓటర్ల చేర్పుల్లో అన్యాయం జరిగిందని సొసైటీ డైరెక్టర్, వైఎస్‌ఆర్‌సి నాయకులు దువ్వూరు విజయభాస్కరరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సొసైటీలో పది రూపాయల రుసుము చెల్లించి ఉన్న సభ్యులను మరో 290 రూపాయలు చెల్లిస్తే ఓటర్లగా గుర్తిస్తామని ప్రత్యేక అధికారి ప్రకటించారని చెప్పారు. అయితే 16వ తేదీ బుధవారం ఆఖరు తేదీగా ప్రకటించారన్నారు. సొసైటీ సిఇఓగాని, అధ్యక్షులుగాని లేకుండా చివరిరోజున కార్యాలయం బోసిపోయిన సంగతి గుర్తు చేశారు. రెండుగంటలకు వెళ్లిన రైతులను ఓటర్లగా చేర్చుకునేందుకు ఫోటో ఒకటి, భూమి కలిగిన ఆధారం, తదితర వివరాలను వెంట తేవాలని, దీంతోపాటు అధ్యక్షుని సంతకం కావాలని, అక్కడ ఉన్న వెంకటాద్రి అనే అధికారి ఆఖరు నిమిషంలో చెప్పడం రైతులను అయోమయానికి గురిచేసిందని చెప్పారు. సుమారు ఏభై మంది ఓటర్లు చేరేందుకు వచ్చిన వారిలో వైఎస్‌ఆర్‌సి అభిమానులు ఉన్నారని గుర్తించి నిరాకరణ ధోరణితో వ్యవహరించారన్నారు. ఓటర్ల చేర్పుల్లో అడ్డంకిలా వ్యవహరించిన సిఇఓ, అధ్యక్షుడిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బకాయిలున్నాయన్న నెపంతో మరికొందరి ఓట్లను తొలగించడం అన్యాయమన్నారు. గతంలో బకాయి ఉంటే ఓటింగ్ హక్కు ఉండేదన్నారు. కాని పోటీ చేసే అర్హత మాత్రం ఉండేది కాదన్నారు. అనంతరం తహశీల్దార్ జి సుశీలకు ఈ విషయమై వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ కోటేశ్వరరెడ్డి, ఎర్రంరెడ్డి వేణుయాదవ్, సూరి, పి వెంకటసుబ్బయ్య, పద్మనాభరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పామాయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
ముత్తుకూరు, జనవరి 17: ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఉన్న సరయువల పామాయిల్ కంపెనీలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు యాజమాన్యం పేర్కొంది. ప్రమాదంలో 35వేల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెనుప్రమాదం నుంచి తప్పిందన్నారు.
కమలానందస్వామిని విడుదల చేయాలి
ముత్తుకూరు, జనవరి 17: కమలానందస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు గంగపుత్ర సేవా ట్రస్టు ధార్మిక సేవాసంస్థ నిర్వాహకులు అలారి మునిరత్నం డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ హిందూ సమాజంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను ఖండించారు. కమలానందభారతి స్వామిపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని కోరారు.
పోలియో ఇమ్యూనైజేషన్ విజయవంతం చేయండి
ముత్తుకూరు, జనవరి 17: పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముత్తుకూరు క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ పురుషోత్తం పేర్కొన్నారు. ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలకు, ఆశా వర్కర్లకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. 20 నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఐదేళ్లలోపుపిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు.
=========
వైఎస్‌ఆర్‌సిలో ఆధిపత్య పోరు
ముత్తుకూరు, జనవరి 17: ముత్తుకూరు మండలంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల్లో ఆధిపత్య పోరు నెలకొంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి నాయకులు వాకాటి విజయకుమార్‌రెడ్డి పార్టీ పటిష్ఠం కోసం విశేష కృషి చేస్తున్నారు. అనేక ప్రజా సమస్యలపై నిరంతరం పరిష్కారం కోరుతూ, అధికార్ల దృష్టికి తీసుకెళ్తూ మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించారు. రెండు పర్యాయాలు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డిని కూడా తీసుకొచ్చి భారీ బహిరంగసభలే ఏర్పాటు చేశారు. ఇటీవలకాలంలో మాజీ మండలాధ్యక్షులు మెట్టా చంద్రశేఖరరెడ్డి తనయుడు విష్ణువర్ధనరెడ్డి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్దనరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వాకాటి విజయకుమారరెడ్డి మేకపాటి గ్రూప్‌గా, కాకాణి వర్గీయునిగా మెట్టా విష్ణువర్ధనరెడ్డి ప్రత్యేక బాణీ ప్రదర్శిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే ముద్ర వేయించుకుంటున్నారు. ముందు నుంచి సభ్యత్వాలు చేర్పించడంతోపాటు వివిధ ఇతర పార్టీల నుంచి కార్యకర్తల్ని వైఎస్‌ఆర్‌సి ఎదుగుదలకు వాకాటి అవిరళంగా కృషి చేస్తున్నారు. అయితే కార్యాలయ ప్రారంభంతోపాటు అక్కడికి వచ్చిపోవడంలో కాకాణి ఉత్సాహం చూపుతున్నారు. అయితే వాకాటిపై జిల్లా అధ్యక్షుడు కాకాణి ఎందుకో కినుకు వహిస్తున్నారని భోగట్టా. ముత్తుకూరు మండల పార్టీ కన్వీనర్‌గా కూడా ఉన్న వాకాటి తమ పరిధిలోకి రాకున్నా నెల్లూరు ఎంపి, కోవూరు ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో తనవంతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ విడుదల కోరుతూ కూడా ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రత్యేక నమాజ్ కార్యక్రమాల్ని చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా మెట్టా వర్గీయులు పాల్గొనలేదు. అయితే మెట్టా చంద్రశేఖరరెడ్డికి ఉన్న పరిచయ నేపథ్యంతో ఆయన తనయుడు విష్ణు వివిధ గ్రామాల్లో తరచూ పర్యటిస్తున్నారు. కేడర్‌తో మంతనాలు నిర్వహిస్తున్నారు. ఒక పర్యాయం బహిరంగసభ కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు అటు మేకపాటి సోదరులుగాని, ఇటు వాకాటి వర్గీయులు హాజరు కానేలేదు. ముత్తుకూరు పార్టీ కార్యాలయాన్ని విష్ణు తన సొంత ఖర్చు లతో నిర్వహిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలంటూ కాకాణి సూచిస్తున్నా మండలంలో ఇంతవరకు ఆ ఊసే లేదు. ప్రస్తుతం మండలంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కన్వీనర్ హోదాలో ఉన్న వాకాటి దూరం పాటిస్తున్నారు. ఇలా ఏర్పడుతున్న ఆధిపత్య పోరు మొత్తమీద పార్టీ పురోగతికి చాలా వరకు విఘాతంగా మారుతోంది. స్థానికంగా ఉన్న వివిధ సమస్యలపై వివిధ విపక్ష పార్టీలు విస్తృతంగా ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నా వైఎస్‌ఆర్‌సి నుంచి మాత్రం స్పందన కరవు. నాయకులుగా ఆధిపత్య పోరు సాగించడంలో మాత్రం ముందుంటున్నారు. ఏదేమైనా మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా జిల్లా పార్టీ పెద్దలు ముత్తుకూరు మండలంలో ఏర్పడుతున్న అంతర్గత పోరును అదుపుచేయాల్సిన అవసరం ఉందని కేడర్ విన్నవించుకుంటున్నారు.
గోగుల పల్లి ఉప్పు భూముల వద్ద ఉద్రిక్తత
* భూముల కోసం దేనికైనా సిద్ధమేనన్న దళితులు
* అరెస్టుకు రంగం సిద్ధం చేసి వెనక్కితగ్గిన పోలీసులు
* ఏకమైన దళితులు
అల్లూరు, జనవరి 17: మండలంలోని తూర్పుగోగులపల్లి తీరంలోగల ఉప్పు భూముల వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఉదయం ఆరుగంటలకే తహశీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి, కోవూరు సిఐ రామారావు, అల్లూరు, కొడవలూరు, విడవలూరు ఎస్‌ఐలు విజయ్‌కుమార్ కుమార్, జగన్నాథరావు, ఆలీసాహెబ్, పోలీసు సిబ్బంది ఉప్పు భూముల వద్దకు చేరుకొని దళితులు సాగుచేసుకుంటున్న భూములలో దిగవద్దని హెచ్చరించారు. ఈ కోణంలో అధికారులకు దళితులకు తీవ్రంగా వాగ్వివాదం జరిగింది. తహశీల్దార్ మాట్లాడుతూ ఈ భూములు రెవెన్యూకు సంబంధించినవని వీటిలో దిగి సాగుచేయరాదని దళితులను హెచ్చరించారు. దళితులు మాట్లాడుతూ ఈ భూములు మాతాత ముత్తాతలకు పంపిణీ చేసారని రెవెన్యూ అధికారులు కొంత మంది అమ్ముడుపోయినందున పాత రికార్డులను తారుమారు చేసి బినామీ సొసైటీదారులకు ఈ భూములు అప్పనంగా అప్పచెప్పారన్నారు. తాము భూముల కోసం జైలుకెళ్ళేందుకు సిద్ధంగా వున్నామన్నారు. ఒకదశలో పోలీసులందరు ఏకమై దళితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేయడంతో సుమారు గ్రామంలో వున్న 800మంది దళితులు భూముల వద్దకు చేరుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సిఐ రామారావు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన పది మంది అల్లూరుకు వచ్చినట్లయితే డిఎస్‌పి తదితరులు వస్తారని సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దామన్నారు. దీనికి దళితులు ససేమేరా అంటూ అల్లూరుకి వచ్చేది లేదని అధికారులకు చెప్పారు. దళితులు దాదాపు ఈ భూముల్లో దిగి నెల రోజుల నుండి సాగు చేసుకుంటున్న విషయం విధితమే. 461 సర్వేనెంబర్‌లో అప్పటి జాయింట్ కలెక్టర్ సౌరబ్‌గౌర్ సొసైటీలను బోగస్ సొసైటీలుగా తేల్చిచెప్పి సంతకాలు చేసి వెళ్ళారని దళితులు ఆరోపించారు. గ్రామ సభ తమ గ్రామంలో ఏర్పాటు చేయగా అర్హులైన వారికి పట్టాలుమంజూరు చేస్తానని హామీ ఇచ్చి వెళ్ళారని దళితులు తెలిపారు. కొంత మంది అధికారులు, నేతలు తమకు భూములు దక్కనీయకుండా తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కాగా ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికి తాము ఈభూములను వదలమన్నారు. నిరుపేదలమైన తాము జీవనోపాధి లేక సెంట్‌భూమి కూడా లేనందున తమకుటుంబాలు దుర్భర స్థితిలో వున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి అల్లూరుకు చెందిన కొంత మంది పెద్దలు వేల ఎకరాలను ఆక్రమించుకొని అనుభవించారని వారిపై అధికారులు, పోలీసులు ఎప్పుడూ ఇలా వచ్చిన దాఖలాలులేవన్నారు. తమకు చెందిన భూములలో తాము సాగు చేసుకుంటే పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించడం సబబు కాదన్నారు. పోటో
అర్హత లేని వారిని ఓటర్లుగా చేర్చడం చాలా అన్యాయం
అల్లూరు, జనవరి 17: అర్హతలేని వారిని సొసైటీలో ఓటర్లుగా చేర్చడం చాలా అన్యాయమని రిటైడ్ ఆర్‌ఐ రాంబాబు అన్నారు. గురువారం మండలంలోని పురిణి సొసైటీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ 40మందిని ఓటర్లుగా నమోదుచేసిన అధికారులు వారికి సెంటుభూమికూడాలేదన్నారు. పైగా ఈ40మంది కౌలు భూములు కూడా చేసిన దాఖలాలు లేవన్నారు. వృద్ధాప్య పింఛన్‌లు తీసుకొనే 21మందిని ఓటర్లుగా చేర్చినందున తాము జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఈవిషయం విన్నవించామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఇ పురుషోత్తం ఎన్నికల అధికారిగా గ్రామానికి విచ్చేసారన్నారు. ఈ అవకతవకలపై విచారణ చేపట్టమని ఎన్నికల అధికారిని తహశీల్దార్‌కు పలు మార్లు విన్నవించినప్పటికి ఈనెల 16వ తేదీవిచారిస్తామన్నారు. కాని ఇప్పటికి ఈసొసైటీలో సిఇఓ లేకపోవడం చాలా విచారకరమన్నారు. తాము ఎప్పుడు సొసైటీకి వచ్చినా తాళాలువేసి వుంటుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో పెంచలయ్య, వెంకటేశ్వర్లు, మధు, వెంకయ్య, సుబ్బారావు, పోలయ్య, రాధయ్య, గోపాల్ తదితరులు వున్నారు.
వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి కుటుంబానికి అవసరం
అల్లూరు, జనవరి 17: వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి కుటుంబానికి చాలా అవసరమని తహశీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సింగపేట పంచాయితీ వెలిచర్ల, శ్రీరాంనగర్ కాలనీలను ఆయన సందద్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నిర్మల్‌భారత్ అభియన్ అనే పథకం ద్వారా మరుగుదొడ్లకు పదివేల రూపాయిలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. కాగా ప్రతి ఒక్కరు ఈమరుగుదొడ్లను నిర్మించుకోవాలని ఆయన కోరారు. రెండు గ్రామాలకు సంబంధించి 117 మరుగుదొడ్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ రఘనాథ్, ఓంకార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలియోరహిత ప్రాంతంగా గుర్తింపు దక్కాలి
కావలి రూరల్, జనవరి 17: పోలియో రహిత ప్రాంతంగా కావలి ప్రాంతానికి గుర్తింపు దక్కాలని సీనియర్ పబ్లిక్ అండ్ హెల్త్ అధికారి, క్లస్టర్ వైద్యఅధికారిణి సెలినాకుమారి అధికారులను, ప్రజానీకాన్ని ఆకాంక్షించారు. పల్స్‌పోలియోపై స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం తుమ్మలపెంట, సర్వాయపాలెం, ప్రాధమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో వైద్య ఆరోగ్యసిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాను ప్రత్యేకంగా పోలియో రహిత జిల్లాగా దక్కేందుకు ఇప్పటికే ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకంగా సూచించడం జరిగిందని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి ఈమేరకు జిల్లాలో ఎలాంటి పోలియో కేసునమోదు కాకపోతే ఇందుకోసం ప్రభుత్వ పరంగా పోలియోకు సంబంధించి నిధులు వెచ్చించకుండా వుండేందకు అవకాశం దక్కుతుందని అన్నారు. ఇందుకోసం సంబంధిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాల్సిందిగా సిబ్బందిని సూచించారు. వైద్య అరోగ్య అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 0నుండి 5సంవత్సరాల వయస్సు కలిగిన పోలియో అర్హత కలిగిన చిన్నారులుగా సర్వాయపాలెంలో 29868, తుమ్మలపెంట పిహెచ్‌సి 6987మంది అర్హత కలిగిన చిన్నారులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. ఇందుకోసం 70బూత్‌లు, 280మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. ప్రధానంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే క్రమాన్ని తాముసూచించిన మేరకు వేయాల్సిందిగా సిబ్బందిని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిడి ఓ వసుంధర, ఆయా మండలాల్లోని సిబ్బంది హాజరైన వారిలో వున్నారు.
అర్పిత సేవలు ప్రశంసనీయం
కావలి రూరల్, జనవరి 17: ఎయిడ్స్ బారిన పడిన వ్యాధిగ్రస్తులకు సేవచేయడంలో అర్పిత సేవలు ప్రశంసనీయమని కావలి మున్సిపల్ మాజీ చైర్మన్ నగళ్ళ శ్రీనివాసకిరణ్ చెప్పారు. గురువారం మండల పరిధిలోని తాళ్ళపాలెం ఆ కేంద్రాన్ని సందర్శించి పలుసూచనలు సలహాలు ఇచ్చారు. ఈకేంద్రం ద్వారా వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారంతోపాటు యోగా, ధ్యానం నిర్వహించడం ద్వారా వారి మనోధైర్యానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈయనతోపాటు సంస్థ అధ్యక్షులు కమల్ బాలాజీ, మాధవరావు, ఖాజరహంతుల్లా, కొండలరావు పాల్గొన్నారు.
ఆధార్‌కార్డుల కేంద్రాన్ని పునఃప్రారంభించాలి
కావలి రూరల్, జనవరి 17: ఆధార్‌కార్డుల కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా వైఎస్‌ఆర్ రైతుకూలీ సంఘం అధ్యక్షులు, బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మెట్టు మాల్యాద్రి యాదవ్ తహశీల్దార్ వెంకటేశ్వర్లును కోరారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఆధార్‌కార్డులకు అనుసంధానం చేయడంతో దీని ప్రాధాన్యత వున్నదని చెప్పారు. ఇందుకోసం ఈకేంద్రం ద్వారా గతంలో కొంత మంది దరఖాస్తుదారులకు కార్డులు తీసే ప్రక్రియ చేపట్టగా మిగిలిన వారు ఆధార్‌కార్డులు పొందేందుకు ఇటీవల కాలంలో ఈకార్డులు తీసే కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పార్టీప్రతినిధులు రావి కోటిరెడ్డి, ఫణీంద్ర, రైతుకూలి సంఘం ప్రతినిధులు హాజరైన వారిలో వున్నారు.
మొదలైన పారిశుద్ధ్య వారోత్సవాలు
కొడవలూరు, జనవరి 17: మండలంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య వారోత్సవాలు గురువారం నుండి మొదలైనట్లు ఎంపిడిఓ ప్రభాకర్ తెలిపారు. ఈవారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు గ్రామాలలో మురుగుకాలువలు శుభ్రం చేయడం దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, వ్యక్తి గత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు గ్రామస్తులను చైతన్య పరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దీనికి అందరు సహకరించాలని కోరారు. స్థానిక వైద్యసిబ్బంది గ్రామాలలో ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పల్స్‌పోలియో సమావేశం
కొడవలూరు, జనవరి 17: మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం పల్స్‌పోలియో సమావేశాన్ని వైద్యఅధికారి రాజశేఖర్ నిర్వహించారు. ఈసందర్భంగా 0నుండి 5సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి 20,21, 22 తేదీలలో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈసమావేశంలో ఎంపిడిఓ ప్రభాకర్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావాలంటీర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
భూసార పరీక్షలు తప్పనిసరి
కొడవలూరు, జనవరి 17: మండలంలో రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయుంచుకోవాలని వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం తలమంచి, దామేగుంట గ్రామాలలో రైతులకు ఎలుకల నివారణపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయుంచుకుంటే భూమిలోవుండే లోపాలు గుర్తించి సరైన మోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడుకోవచ్చని దీని ఫలితంగా అధిక ఉత్పత్తి సాధించవచ్చనిరైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో ఏఏఓ రమేష్, ఆదర్శరైతులు పాల్గొన్నారు.
ఇష్టపడి చదవాలి
కొడవలూరు, జనవరి 17: మండలంలోని దామేగుంట గ్రామంలో తిరుపతికి చెందిన ఎస్‌వి యూనివర్శిటీ సైకాలజీ విద్యార్థి కృష్ణయ్య విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులకు సైకాలజీపై పలు విషయాలను వివరించారు. వారినుండి చదువు పట్ల వున్న విజ్ఞానాన్ని, విశిష్టతనువెలికి తీసారు. పలు ప్రశ్నలువేసి వారి మనసుతత్వాలను విద్యకు దోహదపడే విధంగా ఎలా ప్రవర్తించాలో, ఎలా చదవాలో సులవైన మార్గాలను విద్యార్థులకు చెప్పారు. ఈసందర్భంగా గ్రామంలో పదోతరగతి, ఇంటర్ ఉన్నత విద్యనుచదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.