ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్ణయం వచ్చేసేటట్టుంది. నాన్చుడుకు స్వస్తి చెప్పి తేల్చుడుకే అధిష్ఠానం నిర్ణయించినట్లు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం విడిపోతుందా లేక సమైక్యంగానే ఉంటుందా అన్నది త్వరలోనే తేలిపోనుంది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో క్రమంగా ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి పయనమవుతున్నాయి. మరి ఆ బలగాలు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చేరుకుంటాయన్నదాన్ని బట్టి అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది కొంతమేరకు అర్ధం చేసుకోవచ్చు. అదనపు పోలీసు బలగాలను పంపించేది దేనికి? శాంతిభద్రతలను కాపాడటానికి. శాంతిభద్రతలకు భంగం ఎక్కడ వాటిల్లుతుంది. తమ వాదనకు అధిష్ఠానం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో ఆందోళనలు మొదలవుతాయి. అదే సమైక్యాంధ్రకే నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో గొడవలు కొనసాగుతాయి. దీన్ని బట్టి చూస్తే, అదనపు పోలీసు బలగాలను సీమాంధ్రకు తరలిస్తే తెలంగాణకు అనుకూలంగాను, తెలంగాణ జిల్లాల్లో మోహరిస్తే సమైక్యాంధ్రకు సానుకూలంగాను అధిష్ఠానం నిర్ణయం ఉండవచ్చునని అంచనా. ఇంతకాలం నాన్చుతూ వచ్చిన తెలంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలన్న అభిప్రాయానికి అధిష్ఠానం రావడం సంతోషకరం. అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయ నాయకులు పార్టీనా, ప్రజలా అన్నది తేల్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలా లేక తమను ఆదరించి పదవులు కట్టబెడుతున్న ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలా అన్నది తేల్చుకోవలసి ఉంటుంది. అయితే ఒక విషయం ఇక్కడ సుస్పష్టం. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించినట్లయితే దాని ప్రభావం సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయంగా కాంగ్రెస్ మీద పడుతుంది. అసలు ఇప్పటికీ అధిష్ఠానం ఈ విషయంలో అయోమయంగానే ఉందన్నది అధిష్ఠానం పెద్దల్ని కలిసి వచ్చిన కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అలా అని చెప్పి తెలంగాణ ఇచ్చేది లేదని సుస్పష్టంగా ప్రకటించే స్థితిలోను అధిష్ఠానం లేదు. ఈ పరిస్థితిలో కర్ర విరగా కూడదు, పాము చావనూ కూడదు అన్న చందంగా మధ్యే మార్గంగా అధిష్ఠానం నిర్ణయం ఉండవచ్చునన్నది కొందరి భావన. దీనికి 2004 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధానానే్న ఆదర్శంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ‘తెలంగాణ విషయంలో మొదటి ఎస్సార్సీని గౌరవిస్తున్నాం, రాష్ట్ర విభజన విషయంలో రెండో ఎస్సార్సీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న వారిని సంతృప్తి పరచేందుకు మొదటి ఎస్సార్సీని గౌరవిస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచేందుకు రెండో ఎస్సార్సీ ఏర్పాటును ప్రస్తావించింది. దీని అర్థం ఏమిటి? తెలంగాణ ఇచ్చినట్టూ కాదు, అలా అని వ్యతిరేకించినట్టూ కాదు. అదే విధంగా సమైక్యాంధ్రను కొనసాగించేందుకు కట్టుబడినట్టూ కాదు,అలా అని రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టూ కాదు. ఫలితంగా రెండు ప్రాంతాల ప్రజల్లో ఆశనిరాశలతో పాటు అయోమయం కూడా నెలకొంది. తాము కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అన్న ఆందోళన తెలంగాణ వాదుల్లో, తాము ఆశిస్తున్నట్లు సమైక్య రాష్ట్రం కొనసాగుతుందా లేదా అన్న భయం సీమాంధ్ర ప్రజల్లోను ఏర్పడింది. తెలంగాణ సమస్య విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక రకంగా, తీరా నిర్ణయం తీసుకున్న తర్వాత మరో విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కచ్చితమైన ఒక నిర్ణయానికి రాజకీయ పార్టీలు అన్నీ కట్టుబడి ఉండి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. సమైక్యం అంటే తెలంగాణలోను, తెలంగాణ అంటే సీమాంధ్రలోను రాజకీయంగా దెబ్బ తింటామన్న భయంతో ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ రాజకీయ క్రీడకు స్వస్తి చెప్పాలి. తమ రాజకీయ భవిష్యత్తు కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇవ్వాలి.కష్టమైనా, నష్టమైనా తెలంగాణ విషయంలో కేంద్రం ఇప్పటికైనా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలి. దానికి అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉండాలి. అసలు ఇంతకీ తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించేది కాంగ్రెస్ అధిష్ఠానమా లేక కేంద్ర ప్రభుత్వమా? కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించే నిర్ణయమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమా? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోందే తప్ప కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. కసరత్తు చేస్తున్నది కాంగ్రెస్ కోర్ కమిటి, కేంద్రంలో ఉన్నది యుపిఏ ప్రభుత్వం. యుపిఎలో పెద్దన్న పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ తీసుకునే నిర్ణయానికి యుపిఎ భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరిస్తాయని లేదు అంగీకరించాలనీ లేదు. యుపిఎ భాగస్వామ్య పక్షాలు అంగీకరించనంత మాత్రాన కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవచ్చుననీ లేదు. తెలంగాణ విషయంలో రాష్ట్ర పార్టీల్లో నెలకొన్న అయోమయమే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం లోను, యుపిఎ భాగస్వామ్య పక్షాల్లోను నెలకొంది. ఏది ఏమైనా అయోమయానికి స్వస్తి చెప్పి ఇప్పటికైనా ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి కనీసం కాంగ్రెస్ అధిష్ఠానమైనా వస్తుందని ఆశించవచ్చు. సంవత్సరాలు, నెలలు ఎదురు చూసిన అంశం ఇక రోజుల్లోకి వచ్చేసింది.
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్ణయం వచ్చేసేటట్టుంది.
english title:
i
Date:
Saturday, January 19, 2013