
రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ కంపెనీల ఆగడాలను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అమలులో విఫలమైంది. సంస్థల బ్రోకర్లు ఆకర్షణీయమైన వడ్డీలు, బహుమతులు ఎరగాచూపి నిరక్ష్యరాస్యులైన గ్రామీణులకు బలవంతంగా ఋణాలు అంటగడుతున్నారు. నిబంధనలను వివరించకుండానే పత్రాలపై సంతకాలను చేయించుకొని తర్వాత గూండాలను పంపి నిర్బంధ వసూళ్లకు ఒడిగడుతున్నారు. ఆర్డినెన్స్‌ను జారీచేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈ సంస్థలు స్థానిక రాజకీయ నాయకుల ఆశీస్సులతో, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతితో లోబరుచుకొని విజృంభిస్తున్నాయి. అవగాహన లేమి వలన ఈ సంస్థల కబంధ హస్తాలలో చిక్కిన పేద ప్రజలకు భగవంతుడే శరణ్యంఅన్న చందాన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి జిల్లా యంత్రాంగం సహాయంతో మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టేందుకు తత్సంబంధిత ఆర్డినెన్స్ ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి!!
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
విదేశీ సంస్కృతి అనుకరణ తగదు
ప్రపంచమంతటికీ జీవించటమెలాగో భారతీయులైన మనం నేర్పాం. వస్త్రం అందించి మాన సంరక్షణ చేశాము. సంస్కృతీ విలువలు నింపి సదాలోచనలు కల్గించాము. మంచి ఎక్కడున్నా స్వీకరించాల్సిందే! కానీ నేడు అధికంగా యువత గుడ్డిగా విష సంస్కృతికి బలికావడం దురదృష్టకరం. ఇతర దేశాలను అనుకరిస్తేనే మనకు గౌరవం, అభివృద్ధి అన్నట్లుగా మన ఆలోచనలు. ఏ శాస్ర్తియతలేని జనవరిని నూతన సంవత్సరం అంటూ జరుపుకోవడం ఈ విద్యావంతుల తెలివికి నిదర్శనం. సైన్స్‌ను మెప్పిస్తూ కాల వాతావరవణ, ఆలోచనలలో సైతం కొత్తదనం నింపే ఉగాది ఎక్కడ? పనికిరాని ఈ జనవరి ఒకటి ఎక్కడ? పైగా అర్ధరాత్రివరకు అరుపులతో, గావుకేకలతో, పిచ్చిగా ప్రవర్తించడమేనా వేడుకలు జరుపుకోవడం? ప్రపంచమంతా ఆకర్షింపబడుతున్న భారతీయ సంస్కృతీ విలువలు యువత తెలుసుకోవాలి. ఆ ఆదర్శమార్గంలో జీవించాలి. రాబోయే తరాలకు విశిష్టమైన సంస్కృతిని అందించాల్సిన బాధ్యత నేటి యువతరానిదే!
- సామల కిరణ్, జూలపల్లి
రేషన్ షాపులను మూసేస్తారా?
నగదు బదిలీ పేరిట దేశంలో ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ బ్యాంక్‌లో బదిలీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూ ప్రక్కన రేషన్ షాపులను క్రమంగా మూసివేయాలనే దురాలోచనతో సతమతవౌతూ రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాలని ఈ పథకంతో ఎత్తువేస్తోంది. అసలు నగదు బదిలీ పథకం ఎన్నికలవరకు తాత్కాలికంగా అమలు చేస్తారా!? మరి ఈ పథకాన్ని చట్టం చేస్తారా!? చట్టం చేస్తే ప్రతి నెల నగదు బదిలీకి ఆ బ్యాంకులలో లబ్దిదారుల అకౌంట్లలోకి నగదును జమచేస్తారా!? అనే విషయాలపై స్పష్టత కోసం ప్రతిపక్ష నాయకులు ఈ విషయపై కేంద్రంపై వత్తిడి తేవాలి. కేంద్రం యొక్క నక్కజిత్తుల పన్నాగాలను కంటితో చూడాలి! లేదా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను గద్దెదించాలి.
- బి.పద్మ, సికింద్రాబాద్
ముందు మనం మారాలి
పిరమిడ్ స్వామి వ్యవహారంపై ఒక చానల్‌లో జరిగిన చర్చలో విద్యావతి అయిన ఒక యువతి దోషమంతా చూసే కళ్లలోనే ఉంది అంటూ స్వామిని వెనకేసుకు రావడం దిగ్భ్రాంతి కలిగించింది. గట్టిగా మరొకరు ప్రశ్నించగా ఆమె సమాధానం దాట వేసింది. విచారణ జరుగుతున్నది కదా. నిజాలు బయటపడతాయి. అప్పుడు విమర్శించిన వాళ్లే నమ్ముతారని మరొక సమర్ధకుడు అన్నారు. కాని విచారణ ఎదుర్కోకుండా స్వామి బెంగుళూరుకి ఉడాయించారు. ఇప్పుడేమంటారో సమర్ధకులు?
- శాండీ, కాకినాడ