హైదరాబాద్, జనవరి 18: ‘నారా లోకేశ్ నాయకత్వం వర్ధిల్లాలి... నారా లోకేశ్ జిందాబాద్ ...’ శుక్రవారం ఉదయం రసూల్‌పురాలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మిన్నంటిన నినాదాలు ఇవి. ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభించేందుకు బాలకృష్ణ, నారా లోకేశ్ రాగా పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున లోకేశ్ నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేశారు. మరి కొందరు బాలకృష్ణ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మామా అల్లుళ్లు బాలకృష్ణ, నారా లోకేశ్ అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ప్రతి ఏటా సికింద్రాబాద్ రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అమర జ్యోతి ర్యాలీని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. బాబు పాదయాత్రలో ఉండడం వల్ల అమర జ్యోతి ర్యాలీని నారా లోకేశ్ ప్రారంభిస్తారని పార్టీ అధికారికంగా వెల్లడించింది.
చంద్రబాబు లేని సమయంలో ఆయన పోషించిన పాత్రను లోకేశ్‌కు అప్పగిస్తున్నారనే విమర్శలు వస్తాయనే అభిప్రాయాన్ని కొందరు నాయకులు వ్యక్తం చేశారు. దీంతో ఉదయం కార్యక్రమాన్ని మార్చారు. బాలకృష్ణ, లోకేశ్ ఇద్దరూ అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు. నారా లోకేశ్‌తో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించగా, నాన్న పాదయాత్ర ముగిసిన తరువాత మీడియాతో అన్ని విషయాలు పంచుకుంటానని తెలిపారు.
పాదయాత్రకు మంచి స్పందన: జూనియర్
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ మామయ్య (చంద్రబాబు) పాదయాత్రకు జనంలో మంచి స్పందన వస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రచారం చేస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా, తన అవసరం పడినప్పుడు ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. మామయ్య అధికారంలోకి వస్తారని అన్నారు. పోటీ చేస్తారా? అని ప్రశ్నించినప్పుడు తనకు ఇంకా బాధ్యతలు ఉన్నాయని, సినిమాల్లో నటిస్తున్నానని, తనకు రాజకీయ అనుభవం లేదని అన్నారు. ఎన్టీఆర్ అవినీతిని దరి చేరనివ్వలేదని, ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడ్డాయని బాలకృష్ణ, హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, నారా లోకేశ్ ఒకేసారి వచ్చి ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.
నందమూరి హరికృష్ణ, రామకృష్ణ, మోహనకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని, తెలుగు వారు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తెలిపారు. దగ్గుబాటి పురంధ్రీశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. నందమూరి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ లేని తెలుగుదేశం పార్టీ ఆరిపోయిన దీపం లాంటిదని లక్ష్మీపార్వతి అన్నారు.
అమర జ్యోతి ర్యాలీని రసూల్‌పురా నుంచి ఎన్టీఆర్ ఘాట్‌వరకు నిర్వహించారు. ఎన్టీఆర్ అఖిలభారత అభిమాన సంఘాల అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.
ఎన్టీఆర్ భవన్‌లో నివాళి
తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన వర్థంతి కార్యక్రమంలో టిడిపి నాయకులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ 17వ వర్థంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించారు. టిడిపి ఉపాధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు టిడి జనార్దన్, ఇ పెద్దిరెడ్డి, లాల్‌జాన్‌బాషా, పి సాయిబాబా, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఎన్టీఆర్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నేతల అరెస్టు
సమావేశానికి అనుమతి నిరాకరణ * పబ్లిక్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కిన దశలో పలువురు సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి నాయకులు హైదరాబాద్ వచ్చి సమావేశం నిర్వహించేందుకు అనుమతి కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. పబ్లిక్ గార్డెన్‌లో ఈ సమావేశం జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వచ్చి వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థి జెఏసి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుతూ రాష్ట్ర రాజధానిలో సమావేశం నిర్వహించుకోవడం తప్పేంటని ప్రశ్నించారు. అయినప్పటికీ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో అరెస్టు చేసి అక్కడి నుంచి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారిని పబ్లిక్‌గార్డెన్ నుంచి తరలించారు.
మంత్రి దానంపై కేసు నమోదు చేయాలి
తెలంగాణ వాదులపై దాడి చేసిన మంత్రి దానం నాగేందర్‌పై కేసు నమోదు చేయాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంత్రి దానం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వారిపై మంత్రి దాడి చేశారని న్యాయవాదులు బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో వారు వినతిపత్రం ఇచ్చి మంత్రిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి దాడికి నిరసనగా నాంపల్లి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా పోలీసు కమిషనర్ కార్యాలయానికి బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
పాలలో విషపూరిత పదార్థాలపై
బాలల హక్కుల సంఘం ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: ప్రముఖ ప్రైవేటు డెయిరీలు, హెరిటేజ్, రవిలీల, మదర్‌డైరీ, మస్కతి తదితర అనేక కంపెనీలు అందించే హోల్‌మిల్క్, ప్యాకెట్ల పాలలో విషపూరిత యూనియా, ఈకోలి బ్యాక్టీరియా, సాల్‌మెనెల్లాతో పాటు కరిగే ఘన పదార్ధాలు ఉండటంతో పాటు పిల్లలకు జీర్ణకోశ సంబంధ వ్యాధులు, తరచూ జబ్బు చేయడం, మెదడుపై పడుతున్న కారణంగా విషపూరిత పదార్ధాలు కలిగిన పాలను అమ్మకుండా కట్టడి చేయాలని , ఈ అమ్మకాలు ఇలాగే సాగితే పసిపిల్లల ప్రాణాలకు, వారి ఎదుగుదలకు ప్రమాదం ఉందని బాలల హక్కుల సంఘం , రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. కమిషన్ సభ్యుడు పెదపేరిరెడ్డి వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని హైదరాబాద్ మహానగర మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 20లోగా తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు డెయిరీలు ఇటువంటి విషపూరిత పాలు అమ్ముతుంటే అధికారులు వారిని నియంత్రించకుండా కళ్లు అప్పగించి చూస్తూ కూర్చోవడం, అధికారుల అలసత్వానికి, ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతుందని ఇకనైనా పాలను నిషేధించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.
ఎపిఐ, సిఎంఎస్‌లను ప్రారంభించిన డెసిబెల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: వెబ్ ఆధారిత సమాచార యాజమాన్య వ్యవస్థ (సిఎంఎస్)తో పాటు బహిర్గత ఎపిఐ (అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేస్)ని ప్రారంభించినట్టు లండన్ టెక్ సిటీలోని డెసిబెల్ సిఇఓ బెన్ హారిస్ తెలిపారు. తాజా చొరవతో దాదాపు వంద మంది ఐటి నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. నోకియో, లారెల్, మిస్‌వరల్డ్ సంస్థలు క్లయింట్‌లుగా తమకు ఉన్నారని, వీరంతా 10లక్షల పౌండ్లను ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌కు వెచ్చించారని చెప్పారు. ప్రపంచంలో ప్రస్తుతం సిఎంఎస్ పరిష్కారాల్లో డెసిబెల్ ఓపెన్ ఎపిఐ అత్యంత సమగ్రమైనదిగా విశే్లషకులు చెబుతున్నారని హారిస్ పేర్కొన్నారు.
కమలానంద భారతికి
వాయిస్ పరీక్ష చేసిన పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన హిందు ధర్మప్రచారకులు కమలానంద భారతి స్వామికి శుక్రవారం సిట్ పోలీసులు వాయిస్ రికార్డు చేశారు. ఆయన ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న స్వామిని సిట్ అధికారులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. దీనిలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రికార్డు చేసిన వాయిస్‌కీ, స్వయంగా స్వామీజీచే మాట్లాడిస్తే వచ్చే వాయిస్‌తో పోల్చి చూసి నిర్ధారణకు వచ్చేందుకు పోలీసులు ఈ పరీక్ష నిర్వహించారు. సిట్ అధికారులు, ఇద్దరు న్యాయవాదులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించారు.
ఒఎంసి కేసు నిందితుడు
రాజగోపాల్‌కు బెయిల్ మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ (ఒఎంసి) అక్రమ గనుల తవ్వకం కేసులో నిందితుడు, గనుల శాఖ మాజీ డైరక్టర్ రాజగోపాల్‌కు సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు 2011 నవంబర్ 12న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. రూ.50 వేల పూచీకత్తు చెల్లించాలని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో సిబిఐ అధికారుల ముందు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది. దీంతో పాటు పాస్‌పోర్టును అప్పగించాలని, కేసు విచారణకు సహకరించాలని, ఎలాంటి ప్రభావం చూపించకూడదని కూడా కోర్టు షరతులు విధించింది.
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల నెత్తిన వేయడం నేరం: దత్తాత్రేయ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ అంశాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన జటిలసమస్యగా మార్చిందని, గృహ వినియోగదారులపై సర్‌ఛార్జీలను విధించి ప్రభుత్వం తన వైఫల్యాన్ని ప్రజల నెత్తిమీద నెట్టివేసి 14వేల కోట్ల రూపాయిల భారాన్ని విధించడం ఘోరమైన నేరమని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బిజెపి నగర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సౌధను ముట్టడించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పరిశ్రమలకు 60 శాతం కరెంట్ ఇచ్చి ఎక్కువ వాడితే ఐదు రెట్లు పెనాల్టీ వేస్తామని ఉత్తర్వులు జారీ చేయడం, పరిశ్రమలు మూతపడే పరిస్థితితో పాటు అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితిని సృష్టించిందని అన్నారు. ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబించి ప్రైవేటు రంగంపై ఆధారపడేలా చేశారని విమర్శించారు.
22న కలెక్టరేట్ల ముట్టడి
విద్యుత్, సర్‌ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 22వ తేదీన 10 వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాల నాయకులతో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు సిపిఐ రాష్టక్రార్యదర్శి కె. నారాయణ తెలిపారు. రాష్ట్రంలో పిచ్చితుగ్లక్ పాలన కొనసాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
విభజనపై కాంగ్రెస్‌లో ఆగని ‘వార్’
* విభజిస్తే కలిగే పరిణామాలపై సోనియాకు సీమాంధ్ర నేతల లేఖ
* విభజన ఆగితే పరిస్థితులు చేయి దాటుతాయని టి.నేతల హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీలో ఇరు ప్రాంతాల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎదురయ్యే విపత్కర పరిస్థితులను వివరిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. కాగా విభజన మళ్లీ ఆగితే పరిస్థితులు చేయి దాటి పోతాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీమాంధ్ర నేతల్ని హెచ్చరించారు. మరోవైపు అఖిలపక్ష సమావేశానికి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధిగా వెళ్ళిన గాదె వెంకటరెడ్డి శుక్రవారం తన గళాన్ని పెంచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరారు.
వివరాల్లోకి వెళితే..
గురువారం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశమైనప్పుడు సోనియా గాంధీకి లేఖ రాయాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి శుక్రవారం సోనియా గాంధీకి లేఖ పంపించారు. విభజన చేస్తే ఎదురయ్యే పరిణామాల గురించి వివరించారు. విభజనతో నీటి పంపిణీ వివాదం, విద్యుత్ ఉత్పాదన, హైదరాబాద్ సమస్య వంటి ఎన్నో అంశాలు తెరపైకి వస్తాయని వారు అందులో పేర్కొన్నారని తెలిసింది. టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కెఆర్ ఆమోస్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్న సంకేతాలు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఉన్నందుకే హడావుడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సీమాంధ్ర వారి వల్లే తెలంగాణ ఏర్పాటు ఆగిపోతే పరిస్థితులు చేయి దాటి పోతాయని హెచ్చరించారు. సమైక్యవాదం గురించి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చెప్పలేదని, అలా చెప్పినట్లు రుజువు చేస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి నారాయణ అన్నారని వారు గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యానించి రెచ్చగొట్టవద్దని వారు సీమాంధ్ర నాయకులను కోరారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ప్రకటన గురించి ప్రశ్నించగా, పార్టీ ఫిరాయించాలనుకున్న రమేష్ కుంటి సాకు వెతుక్కున్నారని వారు విమర్శించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, ఆ మంత్రితో ఎవరు చెప్పించారోనని వారన్నారు.
సమైక్యవాదాన్ని బలంగా వినిపించా: గాదె
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలో తాను సమైక్యవాదం గట్టిగా వినిపించలేదని, తాను చేసిన వ్యాఖ్యలు రికార్డు కాలేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపించానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని కెఆర్ సురేష్‌రెడ్డి చెప్పగా, సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని తాను చెప్పానని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి, టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి చెప్పగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పిందే గట్టిగా వాదించలేదని ఆయన తెలిపారు. కాగా మజ్లిస్, సిపిఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాయని, తమ పార్టీ కూడా భిన్న వాదనలు వినిపించిందని ఆయన వివరించారు. కాంగ్రెస్ ఏకాభిప్రాయం చెప్పాలనుకుంటే అధిష్ఠానం నుంచి తనకు ముందుగానే ఆదేశాలు వచ్చి ఉండేవని ఆయన తెలిపారు. కాబట్టి అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదని గ్రహించాలని అన్నారు.
మీటింగ్ పెడితే తప్పేంటీ?: శివరామిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించుకున్నప్పడు, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించుకుంటే తప్పేమిటీ? అని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రభుత్వ విప్ వై శివరామిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంపై మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలనా సౌభల్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అవసరమని అన్నారు. విభజిస్తే రాజీనామా చేస్తానని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ప్రకటన గురించి ప్రశ్నించగా, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి
కట్టుబడి ఉంటా: పురంధ్రీశ్వరి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆమె ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఈనెల 28 వరకు గడువు ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై తన అభిప్రాయాన్ని అధిష్ఠానవర్గానికి ఎప్పుడో చెప్పానని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరంజీవిగా ఉంటారని పురంధ్రీశ్వరి అన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా జన్మించడం తన అదృష్టమన్నారు.
తెలంగాణ ఇస్తామని
ఎవరు చెప్పారు: డిఎల్
ఆంద్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: జైపూర్‌లో జరుగుతున్న ఎఐసిసి సమావేశాల్లో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశాలు లేవని ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అసలు తెలంగాణ ఇస్తామని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాచారం చెప్పలేదని ఆయన చెప్పారు. కేవలం మీడియాలో వస్తున్న కథనాలతో గందరగోళం నెలకొందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. పుట్టిన బిడ్డ మొదలు 5సంవత్సరాల పిల్లలకు తప్పని సరిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని, అలాగే రెండవ విడత ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 98 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేయించుకుంటున్నారని చెప్పారు. పల్స్‌పోలియో కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాలతో పాటు గిరిజన తండాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. అన్ని శాఖల సిబ్బంది విధిగా పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజప్తి చేశారు.
ఉన్నత, సాంకేతిక విద్యకు
రూ.5445 కోట్లు
పొంతన లేని అవసరాలు, అంచనాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: ఉన్నత విద్యకు, సాంకేతిక విద్యకు రానున్న ఏడాదికి వ్యయం అంచనాలు మూడు రెట్లు పెరిగి దాదాపు ఏడు వేల కోట్లకు చేరుకుంటుండగా, అధికారులు మాత్రం దాదాపు 5445.73 కోట్లకు ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రతిపాదనలు అందజేశారు. యూనివర్శిటీల్లో బకాయిలే 599.10 కోట్ల మేర ఉండగా, 2013-14 ఆర్ధిక సంవత్సరానికి 1431.84 కోట్లు కేటాయించాలని కోరుతున్నాయి. బకాయిల మాటదేవుడెరుగు, నాన్ ప్లాన్‌లో 1367 కోట్ల రూపాయిల మేరకే ప్రతిపాదనలు చేశారు. నాన్‌ప్లాన్ కింద 7వేల కోట్ల రూపాయిలు ఇచ్చినా చాలవనే పరిస్థితిలో ఉన్నత విద్య ఉండగా, 5445.73 కోట్ల రూపాయిల ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రణాళికేతర వ్యయం 3952 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయంగా 1493 కోట్ల రూపాయిలు కేటాయించాలని కోరారు. గత ఏడాది బడ్జెట్ అంచనా ప్రణాళికేతర వ్యయం 2085 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం 853.15 కోట్లు మాత్రమే.
తాజా అంచనాలు చూస్తే గత ఏడాది ప్రతిపాదించిన దానికంటే ఈ ఏడాది 2507 కోట్లు అదనంగా సూచించారు. రాబోయే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ కొత్త విధానంలో ఆమోదించడం జరుగుతుందని మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించి , మే నెలలో మరోమారు సుదీర్ఘంగా చర్చించిన మీదట బడ్జెట్‌ను ఆమోదించడం జరుగుతుందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నట్టు దామోదర్ రాజనర్సింహ తెలిపారు. 20 విశ్వవిద్యాలయాలకు నాన్‌ప్లాన్ కింద 1367.6652 కోట్లు, ప్లాన్ కింద 70 కోట్ల రూపాయిలు కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌కు నాన్‌ప్లాన్ కింద 1581.9725 కోట్లు, ప్లాన్ కింద 409.8886 కోట్లు, ఒఎంఎల్‌కు నాన్ ప్లాన్ కింద 2.0609 కోట్లు, ఎపి ఆర్కివ్స్‌కు నాన్ ప్లాన్ కింద 5.5877కోట్లు, ప్లాన్ కింద 2.9800 కోట్లు కలిపి మొత్తం నాన్‌ప్లాన్ కింద 2961 కోట్లు, ప్లాన్ కింద 483.1244 కోట్లు ప్రతిపాదించారు. సాంకేతిక విద్యకు ప్రత్యేకించి ప్రణాళికా వ్యయం కింద 1010.5181కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద 990.38 కోట్లు ప్రతిపాదించారు. ఇవన్నీ కలిపితే నాన్‌ప్లాన్ కింద 3952.097 కోట్లు, ప్లాన్ కింద 1493.6425 కోట్లుకు ప్రతిపాదనలను ఇచ్చారు.
ఉస్మానియాకు 360.25 కోట్లు, ఆంధ్రా యూనివర్శిటీకి 275.45 కోట్లు, శ్రీ వేంకటేశ్వరకు 231.96 కోట్లు, కాకతీయ వర్శిటీకి 142.81 కోట్లు, నాగార్జున వర్శిటీకి 83.92 కోట్లు, కృష్ణదేవరాయకు 52.81 కోట్లు, అంబేద్కర్ ఓపెన్ వర్శిటీకి 29.80 కోట్లు, మహిళా వర్శిటీకి 55.01 కోట్లు, తెలుగు వర్శిటీకి 31.23 కోట్లు, ద్రావిడకు 23.70 కోట్లు, ఆది కవి నన్నయ్య వర్శిటీకి 11.83 కోట్లు, తెలంగాణకు 14.44, యోగివేమనకు 39.85, మహాత్మాగాంధీ వర్శిటీకి 16.30 కోట్లు, శ్రీకాకుళం అంబేద్కర్ వర్శిటీకి 10.07 కోట్లు, కృష్ణా వర్శిటీకి 7.49 కోట్లు, శాతవాహన వర్శిటీకి 12.16 కోట్లు, రాయలసీమ వర్శిటీకి 15.51 కోట్లు, పాలమూరుకు 9.77 కోట్లు, విక్రంసింహపురికి 14.53 కోట్లుతో ప్రతిపాదనలను రూపొందించారు.
తెలంగాణ ఇస్తే తీసుకుంటాం..
ఇవ్వకపోతే లాక్కుంటాం
టిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్రాన్ని 2013లోనే ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే 2014లో తామే లాక్కుంటామని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి హరీష్‌రావు అన్నారు. కేంద్రం 2009లో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుకున్నారు, ఈ సారి కూడా అడ్డుకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐకాస (టిఇఇజెఎసి) కన్వీనర్ జి రఘు నేతృత్వంలో శుక్రవారం మింట్ కంపౌండ్‌లో తెలంగాణ స్మృతి దీక్ష జరిగింది. ఈ దీక్షకు టిఆర్‌ఎస్ నాయకులు టి హరీష్‌రావు, కాంగ్రెస్ ఎంపీలు మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చన్న ఆశతో మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తండ్లాడుతూ, ఆంధ్ర ప్రజల మెప్పు పొందేందుకు తంటాలు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేంత శక్తి గంటా శ్రీనివాస్‌రావుకు ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ పోరాటం అయితే, సమైక్యాంధ్ర ఉద్యమం అక్కడి పెట్టుబడిదారుల దోపిడి పోరాటమని ఆయన విమర్శించారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమమే లేదు, ఉన్నట్టు అయితే అక్కడ కూడా బలిదానాలు ఉండేవని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన బలిదానాలను స్మృతి దీక్షలో విద్యుత్ ఉద్యోగులు కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారని ఆయన కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఆత్మబలిదానాలను సమైక్యవాదలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలిసివచ్చేలా ప్రదర్శించారని ఆయన అభినందించారు. రాష్ట్ర విభజన వల్ల సాగునీటి సమస్యలు ఏవైనా తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చని హరీష్‌రావు సూచించారు. కాంగ్రెస్ ఎంపి మధుయాష్కి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరిస్తే సహజీవనం, లేకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఇవ్వబోతుందని తెలిసే హైదరాబాద్ పేరుతో కొంత మంది ఇంటి దొంగలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మంత్రులు దానం, ముఖేష్‌లపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారునిపే దాడికి పాల్పడిన మంత్రి దానం నాగేందర్‌పై కేసు ఎందుకు పెట్టలేదని మధుయాష్కి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ సారి కూడా అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టిజెఎసి చైర్మన్ కోదండరామ్, కాంగ్రెస్ నేతలు కేశవరావు, పొన్నం ప్రభాకర్ తమ ప్రసంగాల్లో హెచ్చరించారు.
రాష్ట్ర విభజనకు సహకరించకుండా అడ్డుకోవడమంటే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుందని వారన్నారు. సామరస్య పూర్వకంగా రాష్ట్ర విభజన జరిగేందుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని వారు సూచించారు. హైదరాబాద్ గురించి మాట్లాడుతున్న వారి వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని వారు ఆరోపించారు. తెలంగాణకు అడ్డుపడాలని చూస్తోన్న మంత్రులు దానం, ముఖేష్‌ల నియోజకవర్గాల్లో టిజెఎసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడుతామని కోదండరామ్ హెచ్చరించారు. బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లు పెడుతామని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసం చేయాలని చూస్తే ఆ పార్టీకి ఈ ప్రాంతంలో పుట్టగతులు లేకుండా చేస్తారని ఆయన హెచ్చరించారు.