విశాఖపట్నం, జనవరి 18: రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ గజల్ శ్రీనివాస్ రూపొందించిన సిడిలను సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షలు జిఏ నారాయణరావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఈ సిడిల్లో పాటలు ఉంటాయన్నారు. రాష్ట్రం విడిపోతే ఎదుర్కొవాల్సిన నష్టం గురించి పాటల ద్వారా గజల్ శ్రీనివాస్ తెలియజేశారన్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున ఈ లోపు ప్రజలను సమైక్యపరిచి కదిలించేందుకు వీలుగా పది వేల సిడిలను తయారు చేశామన్నారు. తెలంగాణ వాదులు రోడ్డెక్కి ఏ విధంగా ఉద్యమిస్తున్నారో, సమైక్యాంధ్ర కోసం కూడా జనం కదిలి వచ్చేలా సిడిల ద్వారా సమైక్య నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం దీని ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. పలువురు గాయకులు పాడిన తెలుగు ఉద్యమ పాటలు, గజల్ శ్రీనివాస్ పాడిన పాటలను ఈ సిడిలో పొందుపర్చామన్నారు.
స్వార్థ రాజకీయ లబ్ధికోసం ప్రత్యేక తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి అనుకూల వైఖరిని నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలోని ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం జరిపారు. అనంతరం వినతిపత్రం సమర్పించి నిరసన తెలియజేశారు.
సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సమైక్యాంధ్ర దళిత, గిరిజన జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
28 లోపు తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాదు: టిజి
కల్లూరు, జనవరి 18: కేంద్ర ప్రభుత్వం ఈనెల 28లోగా తెలంగాణపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వబోదని మంత్రి టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. అయితే ఏదో ఒకరోజు తెలంగాణ ఇవ్వాలన్న అభిప్రాయంతో కేంద్రం ఉందన్నారు. అయితే ఎప్పుడు ఇస్తుంది అనేది చెప్పలేమని అన్నారు. శుక్రవారం కర్నూలులో విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కేంద్రం ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరాం ప్రజలను రెచ్చగొట్టేలా, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన సమైక్యాంధ్ర సదస్సుకు ప్రజాప్రతినిథులు అధిక సంఖ్యలో హజరుకాలేదని తెలంగాణ నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. నాయకుల సంఖ్య ముఖ్యం కాదని, తీసుకున్న నిర్ణయం ప్రధానమని వెంకటేష్ అన్నారు. గతంలో తెలంగాణపై కేంద్రం చేసిన ప్రకటన అనంతరం సమైక్యవాదులు స్పందించిన తీరును గుర్తుంచుకోవాలన్నారు. ఈ నెల 21,22 తేదీల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతం ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా కలిసి భవిష్యత్ కార్యక్రమంపై చర్చిస్తామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అది సాథ్యం కాని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడమని పేర్కొన్నారు.
విభజిస్తే రాజీనామా : ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరి, జనవరి 18: రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తే రాజీనామ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని క్రాస్‌రోడ్డు వద్ద విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సిద్ధమైందని చెప్పారు. విభజన జరిగితే ఇప్పుడు కూడా రాజీనామా జాబితాలో మొదట తానే ఉంటానని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని ముక్కలుగా చేయడమే సోనియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. విభజనే జరిగితే చాలా ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
సమైక్యంగానే రాష్ట్రం
డెడ్‌లైన్‌లు వస్తుంటాయి, పోతుంటారు: లగడపాటి
ఇప్పుడున్న పరిస్థిల్లో తెలంగాణ కష్టం: మంత్రి గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ/ విశాఖపట్నం , జనవరి 18: రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేనేలేదని 28వ తేదీ వంటి డెడ్‌లైన్‌లు వస్తుంటాయి, పోతుంటాయి... దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు... అంతకుమించి ఆశ పడాల్సిన అవసరం అంతకంటే లేదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేసారు. మరోపక్క సీట్లు రావన్న సాకుతో విడదీయాలని అనుకోవడం న్యాయమా? అని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటూ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాదన్నారు. శుక్రవారం రాత్రి లగడపాటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌కు దమ్ముంటే మరో ఏడాది కాలంలో జరుగబోయే ఎన్నికల్లో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్‌లలో ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. కొన్ని పరిస్థితుల ప్రభావంతో అత్యధిక రాజకీయ పక్షాలు రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపినంత మాత్రాన శాసనసభలో మెజార్టీ సభ్యుల బలం తమకు ఉందనుకోటం భ్రమేనని ఆయన అన్నారు. సమైక్యవాదం గ్రామ గ్రామాన బలంగా ఉంది, అయితే సమైక్యాంధ్రలో కొనసాగుతున్నందున ఆ ప్రభావం బైటకు కన్పించదని చెప్పారు. వేర్పాటువాదులు కొద్దిమంది అయినా వారి గొంతు బాగా విన్పిస్తోందని అంటూ తెలంగాణ రాష్ట్రం అనేది ఓ బూచి.. చందమామ వంటిదేనని తేల్చశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ కాని, కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, జితేంద్రసింగ్, అజాద్ తదితరులు ఎప్పుడు మాట్లాడినా ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణ అంటూ ప్రకటన చేసిన విషయాన్ని మరువరాదన్నారు. జాతీయ పార్టీల వైఖరులు క్షణం క్షణం మారుతుంటాయన్న లగడపాటి కొన్ని ఉదాహరణలు చూపారు. ‘మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ల బిల్లుల విషయంలో చూసాం కదా?’ అన్నారాయన. తెలుగుజాతి సమైక్యత కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని తెలంగాణ వాదులకు తాకట్టుపెట్టి, ఈ నెల 21వ తేదీన కృష్ణాజిల్లాలో అడుగిడుతున్న చంద్రబాబులో మార్పు కోసం తాను నడుం కడుతున్నానని ఆయన వెల్లడించారు. ఎలాంటి నిరసన లేకుండా పూలు జల్లుతూ అడుగడుగునా స్వాగతం పలుకుతూనే ఎన్టీఆర్ నాడు చేసిన ప్రసంగాల సిడిలను ప్రదర్శిస్తూ తాను కూడా ముందుకు సాగుతానన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో పర్యటిస్తూ ఉండటం వల్ల పొరబడినా.. సీమాంధ్ర పర్యటనలో అయినా బాబులో మార్పు కోసం తనవంతు కృషి చేస్తానన్నారు.
రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సాగునీటి సమస్య, అత్యధిక రాబడినిచ్చే హైదరాబాదే చేజారితే సీమాంధ్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ అభివృద్ధి పథకాల భవితవ్యం గురించి తాను ప్రస్తావిస్తానన్నారు. రాష్ట్ర విభజన విషయమై గతంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అలాగే తెలుగుదేశం పొలిట్ బ్యూరో చేసిన తీర్మానాలకు నేటివరకు ఎలాంటి సవరణలు జరుగకుండా ఆయా పార్టీలు విభజనకు ఎలా అంగీకారం తెలుపుతాయని ప్రశ్నించారు. ఇలా ఉండగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థానాలు రాష్ట్రం నుంచి రావన్న భయంతో రాష్ట్రాన్ని విడగొడుతారా? అని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. శుక్రవారం విశాఖలో ఆయన విలేఖఠులతో మాట్లాడుతూ సీట్లు వస్తే రాష్ట్రాన్ని సమగ్రంగా ఉంచుతారా? అని అడిగారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయన్నారు. సీమాంధ్ర నేతలకు ఉద్యమం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా.. అని వాయిలార్ రవి ప్రశ్నించడం సరికాదని మంత్రి గంటా అన్నారు. అవసరం వచ్చినప్పుడు ఉద్యమం చేస్తామని, గతంలో జరిగిన ఉద్యమాలు వాయిలార్ రవికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియనవి కావని మంత్రి అన్నారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత సీమాంధ్రలో 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి వారికి గుర్తులేదా? అన్నారు. కొందరు వత్తిళ్ళకు తలొగ్గి రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే, తొలి రాజీనామా తనదే అవుతుందని గంటా పునరుద్ఘాటించారు. డిజిపి, చీఫ్ సెక్రటరీ ఢిల్లీ పర్యటన తెలంగాణపై చర్చించడానికి కాదని గంటా అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాకుండా కుట్రలు
సీమాంధ్ర నేతలపై హరిష్‌రావు ధ్వజం
గజ్వేల్, జనవరి 18: సీమాంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం బక్కచిక్కిపోగా, ఇక్కడి వనరులు, ఉద్యోగాలు, భూములు దోచుకున్న సీమాంధ్ర పాలకులు, పెట్టుబడి దారులు ఇంకా ఈ ప్రాంతంపై మమ కారం వీడకపోవడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్ రాష్టన్రేత, శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం యువనేత పండరి రవీందర్‌రావునేతృత్వంలో పెద్దఎత్తున యువకులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన దూందాం, బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కుట్రలోభాగంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా, అప్పటి నుండి ఇక్కడి ప్రజలకు సంక్షేమం కరువై పెద్దల ఒప్పందం, 610జీఓ ఆమలులో పక్షపాతం చూపించినట్లు విమర్శించారు. అయితే 6దశాబ్దాలు గా జరుగుతున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ నీరుగార్చుతూ రాగా, చివరకు ఇచ్చిన తెలంగాణాను సైతం వెనక్కి తీసుకున్న ఘనత వారికే దక్కుతుందని ఎద్దేవాచేశారు. అయితే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ ఏర్పడనుందని గ్రహించిన టిడిపి అధినేత చంద్రబాబు తిరిగి రాజీనామాల డ్రామాకు తెర లేపుతుండగా, నేతలు వైఎస్ జగన్, కావూరి, లగడపాటి, రాయపాటిలు మద్దతు పలుకుతున్నట్లు ఆరోపించారు.
ముఖ్యంగా టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా దిగివచ్చిన కేంద్రం డిసెంబర్ 9ప్రకటన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించ గా, సీమాంధ్ర నేతలు, పెట్టుబడి దారులు పార్టీలకతీతంగా ఒక్కటై ఢిల్లీ లో లాబియింగ్ చేసి అడ్డుకోగా, ప్రస్తుతం సైతం అవే పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడి ఉద్యమకారులు, మేధావులు, యువకులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తు తరాలు క్షమించవని, ప్రజల ఆకాంక్షకనుగుణంగా కేంద్రంపై వత్తడి పెంచేక్రమంలో శాంతియుత ఆందోళనలు తీవ్రతరం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే సీమాంధ్ర నేతలు రాద్దాంతం చేయకుండా సంయమనం పాటించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఇక్కడి ప్రజల మనస్సులో విష బీజాలు పడక తప్పదని తద్వారా జరగబోయే పరిణామాలకు భాద్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
నల్లమల అడవుల్లో
మావోల డంప్ స్వాధీనం
మార్కాపురం, జనవరి 18: గతంలో మావోయిస్టులు నల్లమల అడవుల్లో దాచిపెట్టిన డంప్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల సమీపంలో నల్లమల అడవుల్లో ఈ డంప్ లభ్యమైనట్టు తెలిసింది. ఈ డంప్‌లో పేలుడు పదార్థాలు, గ్రైనేడ్లు , తపంచా లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ డంప్‌లో బంగారం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నా అలాంటిదేమీలేదని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. 2007లో పోలీసులు మావోయిస్టునేత సాగర్‌ను చెన్నైలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్నారు. కాగా గత రెండురోజుల కిందట ఓ వ్యక్తిని పోలీసులు అనుమానంతో అదుపులోనికి తీసుకొని విచారించగా ఆయన డంప్ విషయాన్ని బయటపెట్టడంతో పోలీసులు కోర్టు అనుమతితో సాగర్‌ను అదుపులోనికి తీసుకొని విచారించి శుక్రవారం సాయంత్రం మార్కాపురం కోర్టులో హాజరుపరిచారు.
జగన్, ఎమ్మార్ ఆస్తుల
అటాచ్‌మెంట్ బాధ్యత ఈడీదే
* సీబీఐ జెడి లక్ష్మీనారాయణ
కదిరిటౌన్, జనవరి 18: జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసుకు సంబంధించి ఆస్తుల అటాచ్‌మెంట్ బాధ్యత ఈడీ చూసుకుంటుందని సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం శుక్రవారం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసుకు సంబంధించిన ఆస్తుల అటాచ్‌మెంట్ తమ పరిధిలో రాదన్నారు. జగన్ కేసు విచారణ కొనసాగుతోందన్నారు. మాజీ మంత్రి ధర్మానను అరెస్టు చేస్తారా అని విలేఖరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఆ విషయం మీకే ముందుగా తెలుస్తుందంటూ దాటవేశారు.
జైలు వార్డరే
ముఠా నాయకుడు
ఖైదీతో కలిసి చోరీలు * భారీగా బంగారం, వెండి స్వాధీనం
కడప (క్రైం), జనవరి 18: ఆయన పేరు వి.నిరంజన్‌కుమార్. ఖమ్మం జిల్లా జైలు హెడ్ వార్డర్. ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోదనుకున్నారో లేక సరదా కోసమో దొంగ అవతారం ఎత్తారు. అదే జైలులో ఖైదీగా ఉన్న షేక్ఫ్రీతో జతకట్టాడు. అతని స్నేహితులు మరో ముగ్గురిని ముఠాలో చేర్చుకున్నారు. ఈ ఐదుగురు కలిసి కడప జిల్లాలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఏకంగా 11 చోట్ల చోరీ చేశారు. కడప జిల్లా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ముఠా నుంచి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడి వివరాలు తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఎస్‌పి మనీష్‌కుమార్ సిన్హా కథనం ప్రకార గత కొంతకాలంగా ఇళ్లకు కన్నం వేసి చోరీకి పాల్పడుతున్న ముఠాపై డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప సిసిఎస్ సిఐ పురుషోత్తంరాజు సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. అందులో భాగంగా శుక్రవారం పోలీసు వాహనాన్ని చూసి పారిపోతున్న ఐదుగురిని పట్టుకుని విచారించారు. ఖమ్మం జిల్లా జైలు హెడ్ వార్డర్ వి.నిరంజన్‌కుమార్, అదే జైలు ఖైదీ షేక్ఫ్రీ, ఖమ్మం నగరానికి చెందిన డి.వినోద్, కడప జిల్లా సంబేపల్లికి చెందిన జె.మురళి, అనంతపురం జిల్లా కదిరికి చెందిన పి.శంకర్ ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. నిరంజన్‌కుమార్, ఖైదీ షేక్ రఫీతో జతకట్టి అతని స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి కడప నగరంలోని బాలాజీ నగర్, చిన్నచౌకు, వైవి. స్ట్రీట్, జిల్లాలోని చిన్నమండెం, గాలివీడు, రాయచోటి, యర్రగుంట్ల, దువ్వూరు తదితర ప్రాంతాల్లో చోరీ చేసినట్లు విచారణలో అంగీకరించారు. వీరినుంచి రూ. 13,25,000 విలువ చేసే 400 గ్రాముల బంగారు నగలు, కిలో వెండి ఆభరణాలు, యమహా స్వాధీనం చేసుకున్నారు.
ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి
చర్ల, జనవరి 18: చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పోలంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య శుక్రవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. వీరిని తీసుకువెళ్లేందుకు వచ్చిన ఆర్మీ హెలికాప్టర్‌పై కూడా మావోలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవానుకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సుకుమా జిల్లా పోలంపల్లి వద్ద సిఆర్‌పిఎఫ్, డిస్ట్రిక్ట్ ఫోర్స్ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. జవాన్ల రాకను గమనించిన మావోలు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు మావోలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారు. జవాన్ల దేహాలను తీసుకువెళ్లేందుకు ఎంఐ 17 ఆర్మీ హెలికాప్టర్ ఘటనా స్థలానికి వచ్చి జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌లో ఎక్కిస్తుండగా అకస్మాత్తుగా మావోలు హెలికాప్టర్‌పై కూడా కాల్పులు జరిపారు.