ఆదిలాబాద్, జనవరి 18: హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ విద్వేషాలను రెచ్చగొట్టారన్న కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి గొంతు నమూనా పరీక్షలు చేసేందుకు నిర్మల్ మున్సిఫ్ కోర్టు శుక్రవారం అనుమతించింది. అక్బరుద్దీన్ ప్రసంగించిన వీడియో సీడీలను అక్బర్ ముందు పోలీసులు ప్రదర్శించి వాంగ్మూలం సేకరించగా, అసలు తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, ఆ గొంతు తనది కాదని అక్బర్ చెబుతున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లా జైలులో విచారణ ఖైదీగా వున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ శుక్రవారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడగా, వెంటనే చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
దీంతో రిమ్స్ వద్ద అసాధారణ రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని లోనికి అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. మరోపక్క అక్బర్ గొంతును సరిపోల్చేందుకు స్వర నిర్థారణ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని 11న నిర్మల్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం విచారించిన న్యాయస్థానం ప్రసంగం సీడీల పిటిషన్‌పై ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు విధిస్తూ విచారణకు అనుమతించింది. విచారణ ఖైదీగా వున్న అక్బర్‌కు పోలీసులు ఒక రోజు మాత్రమే కస్టడీలోకి తీసుకొని విచారించాలని మెజిస్ట్రేట్ కె అజేష్‌కుమార్ తీర్పునిచ్చారు. సంగారెడ్డి కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28 వరకు జిల్లా జైలులోనే రిమాండ్‌లో వుంటున్న అక్బర్‌ను పోలీసులు విచారించి స్వర నమూనా పరీక్షలను వీడియో టేప్ ద్వారా రికార్డు చేసి శాస్ర్తియ పద్దతిలో నిర్థారించేందుకు గాను చంఢీఘడ్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపనున్నారు. అక్బర్ గొంతు వాదనలపై పోలీసులకు నిర్మల్ కోర్టు తీర్పు ఊరటనిచ్చింది. అయితే ఇదే కేసులో ఎ-2 నిందితుడైన ఎంఐఎం నేత అజీంబీన్ యాహీయాను వారం రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌పై తీర్పును శనివారానికి వాయిదా వేశారు. అక్బరుద్దీన్‌ను శుక్రవారం ఆయన సతీమణి షబానా ఓవైసీ, కూతురు ఫతిమా ఓవైసీ, కుమారుడు నూరోద్ధీన్‌లు ములాఖత్‌లో కలుసుకొన్నారు. నిజామాబాద్ టూటౌన్‌లో 3 సెక్షన్ల కింద సుమోటో కేసులో కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది.
సంగారెడ్డిలో మరో కేసు
మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై శుక్రవారం కేసు నమోదైంది.బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రైవేట్ ఫిర్యాదు మేరకు జ్యుడిషల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఐపిసి 120-బి, 121,153- ఏ మరియు 295 - ఏ కింద కేసులను నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. శనివారం నిజామాబాద్ కోర్టుకు హాజరుకావాల్సిన అక్బర్ హఠాత్తుగా రిమ్స్ ఆసుపత్రిలో చేరడం గమనార్హం.
కోర్టు అనుమతి.. అస్వస్థత రిమ్స్‌కు తరలింపు
english title:
a
Date:
Saturday, January 19, 2013