రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ఇప్పుడు అన్ని శాఖల్లోను ఉద్యమాలకు తెరతీస్తోంది. రాజీవ్ యువకిరణాల ద్వారా ప్రైవేటు ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోను ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఒకటొకటిగా నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. మొన్నటి వరకూ ఉద్యోగాల భర్తీచేస్తే సంతోషించే సంగతి పక్కనెపెడితే ఆందోళన చెందే వారి శాతమే అధికంగా ఉంటోంది. ఇదేమిటంటారా. ప్రభుత్వోద్యోగాల భర్తీ జరగని కాలంలో అప్పటి పాలకులు ఎడాపెడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల ద్వారా పోస్టులను భర్తీ చేశారు. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తే వారికి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పించాలని, అదే ఔట్‌సోర్సింగ్ విధానంలో అయితే అటువంటి తలనొప్పులుండవన్నది ప్రభుత్వ ఉద్దేశం. తుమ్మితే ఊడే ముక్కులాంటి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు సైతం నిరుద్యోగులు ఎగబడ్డారు. ఉత్తత, దక్షిణాలను సమర్పించుకుని మరీ వీటి నియామకానికి పోటీ పడ్డారు. ప్రస్తుత విపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఈకాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానం మొదలైంది. ప్రభుత్వ విభాగాల్లో పదవీ విరమణ, ఉద్యోగన్నతి ద్వారా ఖాళీ అయిద పోస్టులన్నింటా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించేశారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా కొలువుల సంతర్పణకు తెరతీయడంతో కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. గత పుష్కరకాలంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వయసు మీరిన వీరంతా మరి మామాటేమిటంటూ ఉద్యమాలకు సిద్ధ పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా అన్ని శాఖల్లోను కంప్యూటర్, డేటాఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందే. వైద్య ఆరోగ్య విభాగం, పంచాయితీరాజ్, హౌసింగ్ వంటి శాఖల్లో సైతం ఈ విధానంలో కొనసాగుతున్న వారి సంఖ్యకు కొదవలేదు. తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో భోధనా సిబ్బంది (జూనియర్ లెక్చరర్లు) వీరికి జతకలిశారు. గత దశాబ్ధ కాలంగా జూ.లె కాంట్రాక్టు సిబ్బంది సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం తాజాగా ఎ.పి.పి.ఎస్.సి ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేష్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించడంతో వీరి ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఉద్యోగ మేళాతో అందరినీ ఆకట్టుకుని, ఓటు బ్యాంకును నింపుకునేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ ఇప్పుడు తన మెడకే చుట్టుకునేట్టు కన్పిస్తోంది. ఇప్పటికే రాజీవ్ యువకిరణాలు, ఉద్యోగ పందేరాలపై ప్రభుత్వ పెద్దపై అధిష్ఠానం వద్ద ఫిర్యాదుల పరంపరం కొనసాగుతుండగా, రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమాలు ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టనున్నాయి.
- బ్యూరో, విజయనగరం
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ఇప్పుడు అన్ని శాఖల్లోను
english title:
udyamala sega
Date:
Monday, February 6, 2012