ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘టెట్’ (టీచర్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఇటీవల ప్రకటించిన డిఎస్సీ ఎస్‌జిటి పోస్టులకు బిఇడి వారికి కూడా అవకాశం కల్పించాలని, నిరుద్యోగ యువకులకు వయో పరిమితిని 39 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు, పివైఎల్, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, బిసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బిఇడి విద్యార్థులు కలెక్టరేట్ గేట్లను మూసివేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌సెల్ జరుగుతుండగా అర్జీదారులు పెద్దఎత్తున పాల్గొంటున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థులు గేట్లు మూసివేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. తక్షణమే ధర్నాను విరమించాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కకపోవటంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ బిఇడి విద్యార్థులను ఉద్యోగాలకు దూరం చేసే చర్యలో భాగంగానే టెట్ ప్రవేశపెట్టారన్నారు. కేవలం బిఇడి విద్యార్థులు ఉపాధ్యా వృత్తి చేపట్టకూడదని, వారి సంఖ్యను తగ్గించే చర్యలో భాగమేనన్నారు. బిఇడి పూర్తి అయిన వెంటనే డిఎస్సీకి దరఖాస్తు చేసేకునే విధంగా చేయాలన్నారు. ఎస్‌జిటి పోస్టులు 11 వేలు విడుదల చేసినా బిఇడి వారికి అర్హత లేదనడం అన్యాయమన్నారు. నిరుద్యోగులకు 39 సంవత్సరాలు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పూసపాటి వెంకట్రావు, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జి వసంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి రఘురాం, పిడిఎస్‌యు నాయకులు ఎల్ రాజశేఖర్, చంద్ర, పవన్, నరేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుబ్బారెడ్డి, కెఎఫ్ బాబు, కిరణ్, డైఫీ జిల్లా అధ్యక్షుడు జి బాలకృష్ణ, నాయకులు వి బాలకోటయ్య, పి సునీల్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు నరేష్, మహేష్, బిసి విద్యార్థి సంఘం నాయకులు రమేష్, బిఇడి అభ్యర్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు.
‘క్షయ వ్యాధిగ్రస్థులకు సకాలంలో మందులు అందించాలి’
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 6: క్షయ వ్యాధిగ్రస్థునిగా గుర్తించిన వారికి సత్వరమే మందులు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ టి రమేష్ సిబ్బందిని ఆదేశించారు. సవరించబడిన జాతీయ క్షయ నివారణా కార్యక్రమం జిల్లాలో అమలు జరుగుతున్న విధానంపై జిల్లా కార్యాలయంలో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ టి రమేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న కేటగిరి 1, 2 మందులకు క్షయవ్యాధి తగ్గనివారిని ఎండిఆర్ టిబిగా పరిగణించి వారి వివరాలతో కూడిన జాబితాలు కార్యాలయానికి పంపించాలన్నారు. మరింత శ్రద్ధ వహించి ఎండిఆర్‌టిబి అనుమానితులగా గుర్తించి వారి కళ్ళెను హైదరాబాదులోని పరీక్షా కేంద్రానికి పంపించాలన్నారు. పంపించిన కళ్ళె పాజిటివ్‌గా ఉంటే రోగిని నెల్లూరు వైద్యశాలకు పంపించాలన్నారు. ఆ తరువాత ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న తరువాత జిల్లాలో మందులు అందించడంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలోని ఏడు చికిత్సా కేంద్రాల పరిధిలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష చేయబడిన స్లైడ్స్‌ను ప్రతినెల 15వ తేదిలోపు జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. ఈ స్లైడ్స్‌ను సీనియర్ ల్యాబ్ సూపర్‌వైజర్‌లు మరోసారి పరిశీలించి కిందిస్థాయి కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్‌లు సక్రమంగా కళ్ళె పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా తెలుకొని పనిలో అలసత్వం వహించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీరాల ఏరియా టిబి వైద్యాధికారి డాక్టర్ కెఎఫ్‌ఆర్ పాల్ మాట్లాడుతూ క్షయతోపాటు షుగర్‌వ్యాధి ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అందిస్తున్న మందులు రోగులు సక్రమంగా వాడకుండా అశ్రద్ధ చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కందుకూరు, ఒంగోలు, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు ఏరియా వైద్యాధికారులు డాక్టర్ ఎంవి సతీష్‌బాబు, డాక్టర్ ఆనంద్ మెహన్‌రావు, డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ డి వాసు, డాక్టర్ కె వేణుగోపాల్‌రెడ్డి, జిల్లాలోని వివిధ టిబి యూనిట్లలో పనిచేస్తున్న పర్యవేక్షకులు పాల్గొన్నారు.