ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 6: నగరంలో ఇళ్ళ స్థలాలు లేని పేదలు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ తక్షణమే ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జివి కొండారెడ్డి మాట్లాడుతూ నగరంలో ఇళ్ళ స్థలాలు లేని పేదలు అనేక సంవత్సరాల నుండి ఇళ్ళ స్థలాల కోసం మండల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. అయినప్పటికీ ఇంతవరకు వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గత పది నెలల నుండి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత తహశీల్దార్ పేదల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదన్నారు. నగరంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 2009 సంవత్సరంలో రెండవ విడత ఇందిరమ్మ పథకంలో కొప్పోలు, అల్లూరు భూముల్లో పట్టాలు ఇచ్చిన 2905 మందికి తక్షణమే పొజిషన్ చూపించాలన్నారు. వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో సంవత్సరాల తరబడి కాపురం ఉంటున్న గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని, చైతన్య కాలనీ, అశోక్‌నగర్, దారావారికుంట, మున్సిపల్ వర్కర్స్ కాలనీ, గాంధీనగర్ గుడారాల కాలనీ, బాలాజీరావుపేట రోడ్డు మార్జిన్, బాలాజీనగర్ రోడ్డు మార్జిన్, దత్తాత్రేయ కాలనీ, గుర్రం జాషువా కాలనీ, కేశవరాజుకుంట, మోటూరి ఉదయం కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, బత్తులవారికుంట తూర్పుభాగం, నేతాజీనగర్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. మూడవ విడత ఇందిరమ్మ పథకంలో ఇళ్ళ స్థలాలకు ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నారు. నగరంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు పొజిషన్ సర్ట్ఫికెట్లు ఇవ్వాలని, 2009 సంవత్సరంలో ఇళ్ళ స్థలాల లబ్ధిదారులుగా ఎంపికైన 7260 మందికి నిర్ధిష్ట కాలపరిమితిలో ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని ఆయన కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి రమేష్, ఎస్‌డి హుస్సేన్, రాపూరి శ్రీనివాసరావు, టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌ఎన్‌లో ఐక్యం సినిమా షూటింగ్
సంతనూతలపాడు, ఫిబ్రవరి 6: మండలంలోని ఎండ్లూరుడొంక వద్దగల ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఐక్యం సినిమా షూటింగ్ నిర్వహించారు. రచయిత, దర్శక, నిర్మాత టి కులదీప్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌లుగా శివదీప్, ఆశాలపై సోమవారం పాటలు చిత్రీకరించారు. సమైక్యవాద నినాదంతో సమైక్యాంధ్ర కోసం కాలేజీ కుర్రాళ్లు ఆత్మాహుతికైనా వెనుకాడకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే కథాంశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. శింగరాయకొండలోని మల్లినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల, కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల, ఒంగోలులో రైజ్ కళాశాలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. ఆదివారం నుండి స్థానిక ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు ఒక పాట చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో 12 పాటలు ఉన్నాయని, హైదరాబాదులో క్లైమ్యాక్స్ చిత్రీకరించి ఒంగోలులో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కో డైరెక్టర్‌గా చీమకుర్తి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన వై కిరణ్, కొరియోగ్రాఫర్‌గా రాజు, కెమేరామెన్‌గా బిఎస్ కుమార్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు.