వేటపాలెం, ఫిబ్రవరి 6: కుందేరు ఆధునికీకరణ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తిచేసి ఆక్వా రైతుల సమస్యలు తీరుస్తామని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హామీ ఇచ్చారు. సోమవారం మోటుపల్లి బ్రిడ్జి వద్ద అధికారులు, రైతులతో చర్చలు జరిపారు. వర్షాకాలం కారణంగా డిసెంబర్ మొదటి వారంలో చేపట్టిన పనులు ఆగిపోయాయని, తిరిగి నేటినుంచి పనులు ప్రారంభించి మార్చిలోగా మొదటి విడత పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కుందేరుకు పడమర కట్టపై రోడ్డు నిర్మాణానికి 80లక్షలు మంజూరయ్యాయని, ఈ నిధులతో మెటల్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. బచ్చులవారిపాలెం బ్రిడ్జినుండి మోటుపల్లి రేవువరకు పూడికతీత పనులు జరుగుతున్నాయని, దానితోపాటు రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని వెల్లడించారు. పొట్టిసుబ్బయ్యపాలెం నుంచి రామాపురం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 70లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ఆక్వా రైతుల తాగునీటి సరఫరా కోసం 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అదనంగా అయ్యే ఖర్చును ఆక్వా రైతులు భరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిఇ డివి సుబ్బారావు, డ్రైనేజి ఇఇ భాస్కరరెడ్డి, పంచాయతీరాజ్ డిఇ సురేష్‌కుమార్, తహశీల్దారు జి విజయలక్ష్మి, ఎంపిడివో పి ఝాన్సీరాణి, ఆక్వా రైతు సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తేళ్ళ రామయ్య, ఆమంచి స్వాములు, ఎఇలు శరత్‌చంద్ర, పురుషోత్తం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై ఉద్యమిస్తాం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతల హెచ్చరిక
పెద్దారవీడు, ఫిబ్రవరి 6: పెద్దారవీడు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేపడతామని మార్కాపురం మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఎస్‌ఎన్ పాడు మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు హెచ్చరించారు. సోమవారం మండలంలోని సానికవరం గ్రామం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాలకు సాగర్ జలాల తాగునీటి సాధనకై పాదయాత్ర ప్రారంభించారు. మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కన్వీనర్ గొట్టం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాదయాత్రను చేపట్టారు. ఈసందర్భంగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చేందుకు సుమారు 25కోట్ల రూపాయలతో 56 గ్రామాల పరిధిలో 80లక్షల మందికి సాగర్ జలాలు తరలించే పథకానికి దూపాడు వద్ద సమ్మర్ స్టోరేజ్ నిర్మించినప్పటికీ ఈ మండలాల పరిధిలో నామమాత్రంగా ప్రజలకు తాగునీరు అందుతోందని, అయినప్పటికీ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించిన దాఖలాలు లేవని ఆయన ఆరోపించారు. ప్రధానంగా మెట్టప్రాంతమైన పెద్దారవీడు మండలంలో పలుగ్రామాలకు నీరు నామమాత్రంగా సరఫరా అవుతున్నప్పటికీ పెద్దదోర్నాల మండలానికి నేటికీ సాగర్ జలాలు అందిన దాఖలాలు లేవని జంకె ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరో 10కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పూర్తిస్థాయిలో సాగర్ జలాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పి డేవిడ్‌రాజు మాట్లాడుతూ సాగర్ జలాల సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అనేక పర్యాయాలు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కరవు పరిస్థితుల కారణంగా వైపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో తీవ్రస్థాయిలో మంచినీటి సమస్య ఏర్పడిందని, వెంటనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. వైఎస్‌ఆర్ అకాల మరణంతో సమస్యలు అధికమయ్యాయని, ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈకార్యక్రమంలో పెద్దదోర్నాల, పుల్లలచెరువు, వైపాలెం వైఎస్‌ఆర్ సిపి కన్వినర్లు జంకె ఆవులరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కె శ్రీనివాసులరెడ్డి, జిల్లాకమిటీ సభ్యులు ఉమామహేశ్వరరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు వై వెంకటేశ్వరరెడ్డి, వైఎస్‌ఆర్ సిపి నాయకులు జి సుబ్బారెడ్డి, సిహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, గాలి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్‌లు అల్లూ పెద్దఅంకిరెడ్డి, వెన్నా సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.