సూళ్లూరుపేట, ఫిబ్రవరి 6: షార్ అడవుల్లో అడవి పందువుల వేటకు వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకొని మృతి చెందింది. సోమవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో హుటాహుటిన అటవీశాఖ అధికారులు,పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. షార్ అడవిలోని సిఎల్‌వి కాలనీ వద్ద అడవి పందులను వేటాడేందుకు నేలపై ఉచ్చులు వేశారు. ఆవైపు సంచరిస్తున్న చిరుత ఉచ్చులో చిక్కుకుని, అలాగే చెట్టెక్కి, దూకే ప్రయత్నంలో ఉచ్చు నడుముకు గట్టిగా బిగుసుకోవడంతో మృతి చెందింది. ఉదయం అటుగా వచ్చిన స్థానికులు గమనించి షార్ అధికారులకు సమాచారం అందించారు. వారు శ్రీహరికోట పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే డిఎఫ్‌ఓ పార్థనంద ప్రసాద్, శ్రీహరికోట ఎస్‌ఐ వెంకటరమణ తన సిబ్బందితో అక్కడకు చేరుకొన్నారు. మృతిచెందిన చిరుత వయస్సు సుమారు ఏడు సవంత్సరాలు ఉంటుందని డిఎఫ్‌వో తెలిపారు. పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల షార్‌లో జనారణ్య ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండటంతో ఆ ప్రాంతంలో అటవీ అధికారులు రాత్రి వేళల్లో సంచరించిన ప్రదేశాల్లో మంటలు,శబ్ధాలు తదితర వాటిని చేసి చిరుతను అడవులోకి తరిమేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి
ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
గూడూరుటౌన్, ఫిబ్రవరి 6: ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ గూడూరు బజారువీధిలో ఉన్న ఆసుపత్రి ఎదుట సోమవారం బాలుడి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. మృతుని బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నరసగుంట ప్రాంతానికి చెందిన పాదర్తి వెంకటసత్యనారాయణ, లక్ష్మికుమారిల కుమారుడు వినోద్‌కుమార్ (15)కు గత నెలలో జ్వరం రావడంతో స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడి డాక్టర్లు టైఫాయిడ్‌గా నిర్ధారించి చికిత్స చేశారు. బాలుడికి జ్వరం తగ్గకుండా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు బాలుడికి డెంగ్యూ సోకినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు జనవరి 12వ తేదీన మృతి చెందాడు. దీంతో తమ కుమారుడికి గూడూరు ఆసుపత్రి వైద్యులు సరైన చికిత్స అందించలేదని, డెంగ్యూ వ్యాధిని గుర్తించలేకపోవడం వలనే మృతి చెందాడంటూ డాక్టర్‌తో తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతుని బంధువులతో చర్చించారు. దీంతో మృతుని బంధువులు ఆసుపత్రి వైద్యుల పనితీరుపై, వైఎస్‌ఆర్‌సిపి నేత మాటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.