నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో పల్స్ పోలియోను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ ఆదేశించారు. సోమవారం పల్స్‌పోలియోపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఈనెల 19వ తేదీ నుండి 21 వరకు జరిగే పల్స్ పోలియో నిర్వహణలో లోపాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి చెందిన అధికారి తన పర్యవేక్షక సిబ్బంది ద్వారా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. హై రిస్క్ గ్రూపులకు చెందిన వారి కుటుంబాలకు సైతం పోలియో చుక్కలు వేసేలా మొబైల్ టీంలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార, అనధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. వ్యాధిగ్రస్తులైన పిల్లలకు డాక్టర్ల సలహాపై పోలీయో చుక్కలు వేయాలని, నూటికి నూరుశాతం ఈకార్యక్రమం విజయవంతమయ్యేలా జిల్లా యంత్రాంగం శ్రమించాలన్నారు.
పటిష్ఠంగా అమలు చేయాలి: కలెక్టర్
జిల్లాలో 0 - 5 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలని వైద్య అధికారులు, సంబంధిత సిబ్బందిని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 2,48,176మంది, పట్టణ ప్రాంతాల్లో 79,569మంది మొత్తం 3,27,745మంది చిన్నపిల్లలను గుర్తించామన్నారు. పల్స్‌పోలియో వ్యాక్సిన్లను జిల్లాలోని 12 ముఖ్య కేంద్రాలైన కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, పొదలకూరు, గూడూరు, నాయుడుపేట, కోట, వెంకటగిరి, సూళ్లూరుపేట, బుచ్చి, కొడవలూరులో సిద్ధంగా ఉంచామన్నారు. 3034 పోలియోబూత్‌లు ఎర్పాటుచేశామని, అందులో 2548 గ్రామీణ ప్రాంతాల్లో 486 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 మొబైల్‌బూత్‌లను ఏర్పాటుచేశామని, పల్స్‌పోలియో నిర్వహణకు 440 వాహనాలు సిద్ధంగా ఉంచామని చెప్పారు. కార్యక్రమాన్ని 300 మంది సూపర్‌వైజర్లు 20మంది ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాధమిక పాఠశాలలపై దృష్టిసారించి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలుతీసుకోవాలని డిఇఓను ఆదేశించారు. పల్స్‌పోలియోపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలని, ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు పల్స్‌పోలియో నిర్వహించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో ఇందుకోసం ప్రచారం నిర్వహించాలన్నారు. ఆశా వాలంటీర్లు, పారామెడికల్, ఐకెపిల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు, మురికి వాడలు, గిరిజనులు నివశించే ప్రాంతాలు గుర్తించి పోలియోచుక్కలు వేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని, బూత్‌లకు రానివారిని గుర్తించి ఈనెల 20,21 తేదీల్లో వారింటికి వెళ్లి వాక్సిన్ వేయాలన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, దేవాలయాలు, ముఖ్య కూడళ్లలో పోలియో బూత్‌లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాశిలామణి, అదనపు వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ దశరథరామయ్య, కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు, డిఇఓ రామలింగం, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ ఆదేశం
english title:
pulse polio
Date:
Tuesday, February 7, 2012